తడి

కొత్తపాళీ బ్లాగులో ఇచ్చిన ఇతివృత్తానికి కథ రాయండి అనే సవాలుకి జవాబుగా వచ్చిన కథ ఇది.


మూడు రోజుల్నించి ఒకటే ముసురు. మబ్బులు కమ్మి, కొద్ది కొద్దిగా అలా కురుస్తూనే వుంది. ఇంజనీరింగు చదివి నా మొదటి వుద్యోగం కోసం ఈ నగరం వచ్చి మూడేళ్లు పైనే అయ్యింది.ఎండయినా, వానయినా ఈ ముంబయి నగరానికి విరామం వుండదు, అలా, ఆగకుండా పరుగులు తీస్తూనేవుంటుంది. గడచిన రెండు మూడు రోజుల కంటే, ఈ ఉదయం మబ్బులు దట్టంగా కమ్ముకున్నాయి, చినుకులూ కొంచెం ఎక్కువగానే కురుస్తున్నాయి. ఆఫీసుకు వెళ్లకపోతే బావుండునేమో అనుకున్నాను, కాని, ట్రైనింగు వుండడం వల్ల వెళ్లడం అనివార్యం అయ్యింది. చర్చిగేటు స్టేషనులో లోకలు దిగి, బయటకి వచ్చి, పార్కు పక్కన 138 నంబరు బస్సు పట్టుకుని కఫ్ పరేడు (కొత్త పేరు కెప్టెన్ ప్రకాష్ మార్గ్) వరకూ వెళ్లడం నా దినచర్యలో భాగం. పార్కు ప్రహరీ చుట్టూ వున్న అనేకానేక దుకాణాల్లో “గుప్తా ఏజెన్సీ” ఒకటి. ఎవరో, రాజస్థానీ సేటు నడిపే ఈ కొట్లో సమస్త దిన, వార, మాస పత్రికలూ దొరుకుతాయి. మొదట్లో, బస్సు కోసం ఎదురుచూస్తూ, కాలహరణం కోసం తెలుగు పేపరు కొనడం అలవాటయిన నాకు, క్రమంగా అది నిత్యకృత్యం అయ్యింది.

ఈ రోజు, గొడుగు విప్పుకుని, వచ్చే పోయే బళ్ల వాళ్లు నా బట్టల మీద నీళ్లు జల్లకుండా జాగ్రత్త పడుతూ, గుప్తా ఏజెన్సీ దగ్గరకి నడిచేను. నీటి జల్లుకి తడిసిపోకుండా పేపర్లూ, పత్రికలూ అన్నింటి మీదా ప్లాస్టిక్ పేపరు కప్పి బరువులుంచేరు. కొట్టులో పని చేసే తెలుగు కుర్రాడు, నన్ను చూసి పలకరింపుగా నవ్వి, నేను రోజూ కొనే తెలుగు దిన పత్రికని నాకందించేడు. “ఏరా, బాగున్నావా?” అని ఆ కుర్రాణ్ణి పలకరించేను. దానికి వాడు “మంచిగనే వున్న, సారూ” అని చెప్పి వేరెవరికో పత్రికలందించడానికి పక్కకు తప్పుకుని, తిరిగి వచ్చేడు. ఒకసారి చేతి గడియారం కేసి చూసుకుని, “ఇంకేమిటిరా?” అన్నాను. వాడు నా వంక తేరిపార చూసి ” నీ లెక్కన గానీకి నేనేం జెయ్యాల సారూ” అని అడిగేడు. ఆ మాట కి ఎందుకో, నా గుండె చివుక్కుమంది. జవాబు చెప్పలేదు. నా బస్సు రాగానే ఎక్కేసేను.

ఈ కుర్రవాడితో, నా పరిచయం, ఓ మూడు నెలల క్రితం తమాషాగా జరిగింది. ఆరోజు, పేపరు కొని, పెద్ద నోటిచ్చి, చిల్లర తీసుకోడం మరచి వెళిపోతున్న నన్ను, ఈ కుర్రవాడు “చిల్లర మర్చిపోయిండ్రు, సార్” అని కేక పేట్టేడు. అంతకు మునుపెప్పుడూ ఆ పిల్లవాణ్ణి గమనించని నేను, చేతిలో తెలుగు పేపరుందని గుర్తు లేక “నాకు తెలుగొచ్చని నీకెలా తెలుసు?” అని అడిగి నవ్వుకున్నాను. ఆ రోజు నుంచీ, వాణ్ణి బస్సు స్టాపు దగ్గర పలకరించడమూ, వీలయితే ఓ రెండు కబుర్లాడడమూ రివాజయ్యింది.

ఉజ్జాయింపుగా తొమ్మిదేళ్లుండే వాడి పేరు హరి. మూడు నెలల క్రితం ఇంట్లోంచి పారిపోయి ముంబయి చేరుకున్నాడు. వాళ్లది రంగారెడ్డి జిల్లా – తాండూరు. తండ్రి క్వారీలో కూలీ. వీడి చిన్నప్పుడే తల్లి పోయింది. హరికి చదువు మీద ఆసక్తి మెండు. తండ్రి ఆదాయం తాగుడుకే సరిపోకపోవడంతో, సవతి తల్లి సంపాదనే కుటుంబానికి ఆధారం అయ్యింది. దాంతో, సవతి తల్లి హరిని బడి మానిపించి, పనిలోకి వెళ్లమని పోరు పెట్టింది. తండ్రి కూడా వంత పాడాడు. అప్పుడప్పుడూ, బడి మాని పన్లోకి వెళ్లినాకూడా, సవతి తల్లి రాసి రంపాన పెట్టడం మాత్రం మానలేదు. ఫీజులు కట్టి, పుస్తకాలు కొనిచ్చి, హరి క్రమం తప్పకుండా బళ్లోకి రావడానికి, అయ్యవార్లూ సాయపడకపోవడంతో – వాడి చదువు మీది మమకారం, ఎవరూ సాకారం చెయ్యలేకపోయారు. పట్నం చేరుకుంటే, డబ్బుగల పెద్దలెవరైనా ఆశ్రయమిచ్చి, చదివిస్తారన్న నమ్మకంతో, ఎవరికీ చెప్పకుండా, చేతిలో చిల్లి గవ్వ లేకుండా, ఒంటి మీది బట్టలతో, ఓ రోజు ముంబయి రైలెక్కేసేడు.

వచ్చిన చోటు ముంబయ్యా, మజాకా! రైలు దిగి, నకనక లాడుతున్న కడుపుతో, తిరుగుతున్న హరిని ఈ సేటు చేరదీసేడు. కొట్టులోనే హరి కాపురం. పొద్దున ఏ ఏడింటికో పనిలో దిగితే, రాత్రి తొమ్మిదింటి వరకూ, పేపర్లూ, పత్రికలూ, వుద్యోగాల దరఖాస్తులూ, ఇత్యాదులు అందివ్వడమూ; ఆ తరువాత సేటు తాళం వేసుకెళ్లిపోతే, చూరు కింద, చిన్న కటకటాల వంటి దాని వెనక పడక. నీటి పనులకి పక్కనున్న పార్కూ. మొత్తం మీద, పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది వాడి బతుకు. నేను, ఆప్యాయంగా ఒకటి, రెండు మాటలు మాట్లాడేసరికి, తన గోడు నా దగ్గర వెళ్లబోసుకునే వాడు. “టిక్కెట్టు కొనిచ్చి, మీఊరు పంపిస్తానురా” అని నేను ఎప్పుడైనా అంటే, ససేమిరా ఒప్పుకునేవాడు కాదు. కానీ, “నన్ను బళ్లో ఏపించు, సారూ, పొద్దుగూకినాక, దుకాణలో వచ్చి పని చేస్కుంట” అని నాతో ఎన్నో సార్లనేవాడు. వాడు తనని చదివింపమన్నప్పుడల్లా, నాకు ముల్లు గుచ్చుకున్నట్టుండేది. “అందరికీ అందుబాటులో విద్య” అని వట్టి మాటల డప్పులు కొట్టే ప్రభుత్వం మీదా, ఇలాంటి వీధి పిల్లలని, అనాధలనీ తయారు చేసే ఈ వ్యవస్థ మీద పట్టరాని కోపం వచ్చేది.

ఉండబట్టలేక, వీడి చదువు విషయం, నేను ఒకసారి, గుప్తా సేటు దగ్గర యధాలాపంగా ప్రస్తావించేను. దానికి అతడు నుదురు చిట్లించి, “వీడిని పన్లో పెట్టుకోవడమే నాకు పెద్ద తలనొప్పి. పోలీసులతోనూ, లేబరు ఆఫీసర్లతోనూ గొడవ . అంతగా మీరు మనసు పడితే, మీ దేశం వాడే కడా, నాకు ఒక పదివేలిచ్చి, మీరే తీసుకెళ్లి చదివించుకోండి, జై రాం జీ కీ.” అని హిందీ, మరాఠీ కలిపిన ముంబయి భాషలో నిష్కర్షగా, తెగేసి చెప్పేడు. నాకు నోట మాట రాలేదు. నేల మీద పోయేది నెత్తి మీద రాసుకుంటున్నానా అనిపించింది.

తెరచిన కళ్లతో, బస్సులో కూర్చుని, దీర్ఘాలోచనలో మునిగిన నా మీద, ఎవరిదో మూసిన గొడుగు కాడ మీదనుంచి రెండు నీటి చుక్కలు పడేసరికి – మళ్లీ ఈ లోకంలోకి వచ్చేను. బయటకు చూస్తే, ప్రెసిడెంటు హోటలు స్టాపు వచ్చేసింది. నేను, గబగబా దిగి గొడుగు విప్పుకుని, ఆకాశ హర్మ్యం లాంటి మా ఆఫీసు భవనం కేసి నడిచేను. ప్రపంచంలోకెల్లా, అత్యంత ఖరీదైన ప్రాంతం ఈ కఫ్ పరేడు అని చెప్తూ వుంటారు. చుట్టు పక్కల అన్నీ ఆకాశాన్ని తాకుతున్నట్టుండే భవనాలే. కఫ్ పరేడులో ప్రతీ భవనపు యజమానీ, ఒక్క అంతస్తు చొప్పున తక్కువ నిర్మించి, మిగిలిన ఆ డబ్బుతో ముంబయి నగరం లో వున్న హరిలాంటి పిల్లలందరికీ, చదువూ, ఆశ్రయమూ కల్పించవచ్చు కదా అనిపించింది. వర్షం ఇంకా పడుతూనేవుంది. మూడు రోజులుగా చూడని సూర్యుణ్ణి, ఒక్క సారి చూస్తే బావుండుననిపించింది. రోడ్డు మీది రణగొణ ధ్వని చికాకు పెడుతోంది.

ఆఫీసులోనూ, ఎందుకో ఈ రోజు పని మీద దృష్టి లగ్నం కావట్లేదు. మనసంతా, ఏవో ఆలోచనలు, బుర్రలో ఎవరో చెయ్యి పెట్టి కెలికినట్టుగావుంది. మా ప్రాజెక్టు మేనేజరు ఖోర్షెద్ – ఒక పార్సీ వనిత. “ఒంట్లో ఏమైనా నలతగా వుందా” అని మధ్యలోఒకసారి, దగ్గరకొచ్చి, పరామర్శించింది కూడానూ, నిస్తారంగా నవ్వి, లేదని కృతజ్ఞతాపూర్వకంగా చెప్పేను. కాసేపయ్యాక లేచి, ఒకసారి ఫ్లోరంతా కలియతిరిగి, బాల్కనీలో కొచ్చి నిలబడ్డాను. నలభై అయిదవ అంతస్తునుంచి, కింద ఆందరూ చీమల్లా కనిపిస్తున్నారు. నేను, చాలా ఎత్తులో వున్నాననిపించింది. జల్లు ఇంకా కొడుతొంది. ఎదురుగా అరేబియా సముద్రం, దూరంగా నారిమన్ పాయింటూ ముసురు వల్ల అస్పష్టంగా కనిపిస్తున్నాయి. లోలోపల, ఏదో తెలియని అలజడి. లంచ్ బ్రేక్ తరువాత ట్రైనింగు సెషన్ వుంది. లంచ్ చెయ్యాలనిపించలేదు. మనసు కుదుట పడుతుందేమోనని, రిక్రియేషన్ రూము కి వెళ్లి కళ్లు మూసుకుని కూచున్నాను. ఎంత ఒద్దన్నా, ఆగని మనసు, మూలాల్లోకి పరుగు తీసింది.


మా అయ్యకీ, అమ్మకీ నేను, మా చెల్లి. అయ్య వ్యవసాయ కూలీ. మాకు సొంతంగా పొలం వుండేది కాదు. నేను పుట్టి, బాల్యం గడిపినదంతా – పొదలకూరులో. చెల్లిని కన్నప్పుడు, అమ్మకి వాతం కమ్మి పెద్ద సుస్తీ చేసింది. నెల్లూరు తీసుకెళ్లి, పెద్దాసుపత్రిలో నయం చెయ్యించడానికి, మా నాయనకి బోలెడు ఖర్చయ్యింది. దాంతో, వున్న గుడిసే, స్థలం, తాకట్టు పెట్టి, విడిపించుకోలేక ఆశ వదులుకున్నాడు. కానుపు తరువాత అమ్మ నీరసించిపోయింది.

నాకు ఇంకా జ్ఞాపకం. అప్పటికి నేను అయిదో తరగతి చదువుతున్నాను. ఆ రోజు, మా నాయన “ఒరే, అబ్బయ్యా, ఈ పొద్దు నుంచీ, నువ్వు బల్లోకి పోబన్లేదుగానీ, నాతో పొలం పోదువులే పా” అన్నాడు. అమ్మా, నేనూ ఎంత చెప్పినా, నాయన మాట వినలేదు. ఏమైనా అంటే, “చెల్లిని కూడా సాకాలి, అమ్మకి సుస్తీ చేసి, పని ఏమీ చెయ్యటంలేదు” అని – మా అయ్య వాదన. బడిలో అయ్యవార్లు కూడా నచ్చచెప్పడానికి ప్రయత్నించి విరమించుకున్నారు. కొన్ని నెలలు గడిచిపోయాయి. మధ్య మధ్యలో, పొలం పని లేనప్పుడు, బడికెళ్లి మాతరగతిలో కూచునేవాణ్ణి. కానీ, కొన్ని పాఠాలు వినకపోవడంవల్లా, అభ్యాసపు లేమి వల్లా, అయ్యవారు చెప్పేది బుర్రకెక్కేది కాదు. దానికి తోడు, బడికి వేసుకు వెళ్లే చొక్కా చిరిగిపోతే, మా అయ్య ఇంకోటి కుట్టించలేదు. తెల్ల చొక్కా లేకపోతే బడికి రానిచ్చేవారుకాదు. క్రమంగా, నేను చదువుకి దూరం అవుతున్నానని తెలుసుకోగలిగాను. నా నోటి దగ్గరి కూడు మా అయ్య లాగేసుకున్నాడని, బాగా చదువుకుని మా అయ్యకి చూపించాలని నాకు గట్టి కోరిక వుండేది. పట్నంలో చదివి, మా బడిలో అయ్యవారిలాగ పేంటూ, చొక్కా వేసుకుని, సైకిలు మీద పోవాలని ఒకటే అనిపించేది. బడికి పంపమని మా అమ్మ ఎంత పోరు పెట్టినా, మా అయ్య మనసు కరగలేదు. ఎప్పుడూ “పని నేర్చుకోరా అబ్బయ్యా, మీసమొచ్చేపాలికి మేస్త్రీవి అవుతావురా” అని నన్ను ఊరుకోబెట్టడానికి ప్రయత్నించేవాడు. నన్ను బడికిపోనీలేదని, ఎప్పుడైనా ఏడిస్తే అమ్మ కూడా కళ్లనీళ్లు పెట్టుకునేది.

ఆ ఏడు గట్టిగా కురిసిన వానలకి, మా బడి ఆవరణలో మోడువారిన ఓ పెద్ద చెట్టు కూలి దారికి అడ్డంగా పడిపోయింది. దాన్ని అడ్డు తీసేసి, వంటచెరకుగా కొట్టడానికి బడివాళ్లు మా అయ్యకి కబురు పెట్టేరు. కూలిడబ్బులు మిగులుతాయని, మా నాయన వేరే కూలీలెవరినీ సాయం తీసుకోలేదు. మా నాయన ముక్కలు కొడితే, నేను చిన్న చిన్న మోపులు కట్టేవాణ్ణి. రెండు రోజులకి దారి చానామటుకు బాగయ్యింది. మూడో రోజొక పొద్దు, పిల్లకాయలంతా ఉతికిన బట్టలేసుకుని, బడి కొచ్చారు. బడి గుమ్మానికి రంగు కాగితాలు కట్టేరు. ఒక అబ్బాయిని కదిపితే తెలిసింది – జిల్లా విద్యా శాఖాధికారి (డీ ఈ ఓ) గారి తనిఖీ వుందని. ఇంతలో ఒక జీపు వచ్చి బడి ముందు ఆగింది.