చిలక జోస్యం

సందేహం ఇక వద్దండీ
మంచి రోజు వస్తుంది,
తప్పక త్వరగా వస్తుంది
మీకు చెప్పకనే వస్తుంది,
మించిన అదృష్టం మీ-
రెంచిన కార్యం నిజంగా
విజయవంత మవుతుంది,
రేపటి మీ భవిష్యత్తు
ఈ రోజే నే చెబుతా,
అద్దంలో ప్రతిబింబంలా
భవిష్యత్తు చూపిస్తా,
అబద్ధమిది కాదండీ
ముమ్మాటికి నిజమండీ!

ఎన్ని మార్లు విన్నానో
పాటలాటి ఈ మాటల
నెన్ని మార్లు చూచానో
రసవత్తర దృశ్యాన్ని,
చిలక జోస్యం చెప్పే
చిన్నయ్యకు ఆఫీస్ మా
ఆఫీస్ ముందున్న చెట్టు!
పంజర మొక చిన్న పెట్టె,
పచపచ్చని చిల కొకటి
తీయని పలుకులు పలుకుతూ
రెక్కలు టపటప లాడించేది,
పేర్చబడిన అట్ట ముక్క
లా పెట్టెకు బయటున్నాయి,
సంగ్రహ రామాయణమే
అందులోని చిత్ర కథలు.

రోగిష్టి, నిరుద్యోగి,
తాగుబోతు, తల్లి, భార్య,
గొడ్రాలు, విద్యార్థి,
ఎన్నెన్నో సమస్యలతో
సతమతమయ్యేవారు –
కష్టపడే వీళ్లందరు
కస్టమర్స్ చిన్నయ్యకు!
చిలక ముక్కుతో అట్టను
చిన్నయ్యకు ఇస్తుంది,
బహుమానపు గింజలు తిని
పెట్టెలోకి పోతుంది,
అట్టలోని కథను చదివి
పుట్టబోవు కాలంలో
ముందుముందు జరిగేది
అందంగా చెప్పగా వా-
రందరు ఏకాగ్రతతో
విని చివరకు నవ్వుతారు,
కళ్లు తుడుచుకొంటారు,
ఆధి మరచి కొద్దిసేపు
ఆనందిస్తా రాశతో.

సీతమ్మను తలచి చూస్తే
మనవి కూడా కష్టాలా?
కష్టాలు మనుషులకు కాక
మానులకా వస్తాయి?
చూడండీ చిలకిక్కడ
మీకోసమె ఏరింది,
మీ ఆశల చిత్రాన్ని
భవిష్యత్తు నేత్రాన్ని,
అశోకవనంలో సీతను
హనుమంతుడు చూశాడు,
ఉన్నాడా రాఘవుడని
అన్నాడానందంతో,
విన్నాడా అమ్మ పలుకు,
ఉంగరాన్ని ఇచ్చాడు,
చూడామణి తెచ్చాడు,
ఆ తల్లికి వచ్చినట్లే
మీకు కూడా వస్తాయి
మంచి రోజు లొస్తాయి!

ఊహాగానంతో తన
అనుభవనాదాన్ని కలిపి,
ఆశావాదంతో తన
అవకాశవాదాన్ని కలిపి,
దుఃఖాన్ని, బాధలను
దూరం చేసేస్తాడు,
గుండెబలం నిండి పోగా
వెండి కలలు తలచుకొంటూ
కన్నీళ్ళని దిగమింగి
నవ్వులతో వెళ్తారు!

పంచవన్నెల రామచిలక
పంచప్రాణా లతనికి,
జడివానలో, వడగాలిలో,
ఎముకలు కొరికే చలిలో,
ప్రతి దిన మెనిమిది గంటలు
చెట్టుకింద చిన్నయ్య
అరచేతిలో సురలోకం
అందరికీ చూపుతాడు,
స్వర్గానికి నిచ్చెనొకటి
సర్రున అందిస్తాడు,
భావి అనే కొత్త పూవు
తావిని ప్రసరిస్తాడు,
చీకటిలో కాగడాను
చిటికెలో వెలిగిస్తాడు!

అవకాశం ఉండుంటే,
చిన్నయ్యయి ఉండొచ్చో
మనస్తత్వ శాస్త్రవేత్త,
డాక్టర్ చిన్నయ్యంటూ
బయటుండే బోర్డు ఒకటి
లోపల వడిగా ప్రాక్టీస్
ఎండలలో మాడి పోక
ఏసీ గదిలో చల్లగ!

అందరి అదృష్టం చెప్పే
చిన్నయ్యకు అదృష్టం
అంతంతే, అది కొంతే,
చివరకు మిగిలిం దింతే!
ఎందుకంటే అందుకే
విన్నా నేనిప్పుడే
చిలక ఎగిరిపోయిందని,
ఇక్కడికిక రాడని
చిన్నయ్య ఇంక లేడని.

(నా చిన్నతనంలో ఏ రోడ్డులో చూసినా, ఏ చెట్టుకింద చూసినా చిలక జోస్యం సర్వ సాధారణంగా ఉండేది. సామాన్య జనాలు ఈ జోస్యులముందు మూగేవాళ్లు. ఇప్పుడు కూడా ఇది మాసిపోలేదు. ఈ వృత్తి ఎలా కొనసాగుతుందో అన్న విషయం ఇక్కడ యూట్యూబ్‌లో చూడగలరు.)