88 ఏళ్ళ యువకులు

ఇటీవల హైదరాబాద్ వెళ్ళినప్పుడు నేను బాలాంత్రపు రజనీకాంతరావుగారినీ, పట్రాయని సంగీతరావుగారినీ కలుసుకోగలిగాను. సమవయస్కులైన వీరిద్దరూ 88 ఏళ్ళకు కూడా ఉత్సాహంగా సంగీతచర్చ జరపడం ఎంతో ఆశ్చర్యాన్నీ, ఆనందాన్నీ కలిగించింది.


బాలాంత్రపు రజనీకాంతరావు
బాలాంత్రపు రజనీకాంతరావు
© యామిని కొడవటిగంటి

“నేను మేఘరంజని రాగంలో ఒక కాంపొజిషన్ చేసి బాలమురళి చేతా వోలేటి వెంకటేశ్వర్లు చేతా పాడించాను” 2008లో ఈ ధోరణిలో మాట్లాడగలిగినది ఒక్క డా. బాలాంత్రపు రజనీకాంతరావు గారే. అవును; ఆయన 1943లో ఘంటసాలను గాయకుడుగా రేడియోకు ఆడిషన్ చేసి ఎంపిక చేసిన వ్యక్తి. ప్రస్తుతం 88 ఏళ్ళ వయసులో కూడా ఎస్.డి.బర్మన్‌లాగా గొంతెత్తి పాడుతూ, పాడుకుంటూ హాయిగా జీవిస్తున్న ఈ జీనియస్ ఒక లివింగ్ లెజెండ్ అనడంలో సందేహం లేదు. ఇటీవల ఆయనను హైదరాబాద్‌లో కలుసుకున్నప్పుడు ఎన్నెన్నో విషయాలు ముచ్చటించడం వీలయింది.

రజనీకాంతరావుగారి ప్రత్యేకతల్లో ఒకటి ఆయన తన చిన్నతనంలోనే సాంస్కృతిక జీవితాన్ని మొదలుపెట్టడం. అందుచేత 1940 దశకం మొదలవకముందే ఆయన ‘పరిమళించ’సాగాడు. తనకన్నా వయసులో పెద్దవారందరితోనూ కలిసి పనిచెయ్యడానికీ, వారి సంస్కారాన్ని అందిపుచ్చుకోవడానికీ ఆయనకు అపూర్వమైన అవకాశాలు లభించాయి. వాటన్నిటినీ ఆకళించుకుని స్వంతం చేసుకోగలిగిన ప్రతిభ కూడా ఆయనకు ఉండేది. సాహిత్యం, శాస్త్రీయ సంగీతం మాత్రమే కాకుండా వాటి మధ్యనుండే సరిహద్దు వంటి లలితసంగీతానికి కూడా ఆయన ఆద్యులలో ఒకడు కాగలిగాడు. అప్పట్లో ఉత్తమ సంస్కారం ఉండడం సినీరంగంలో ఇప్పటిలాగా ప్రతిబంధకం కాదు గనక సినీసంగీతం మీద కూడా ఆయన ప్రభావం ఉండింది. ఆయన సంగీతం సమకూర్చిన పాత సినిమా పాటలెన్నో ఉన్నాయి.

ఎచ్.ఎం.రెడ్డి, బి.ఎన్., ఎల్.వి.ప్రసాద్ తదితరులతో ఆయనకు సన్నిహితపరిచయం ఉండేది. సూర్యకుమారి, వక్కలంక సరళ తదితరులెందరో ఆయన సంగీత దర్శకత్వంలో పాడారు. (మద్రాసు రేడియో స్టేషన్ తొలి రోజుల్లో మా అమ్మ (కొడవటిగంటి వరూధుని) కూడా పాడేదట. అంతా ప్రత్యక్ష ప్రసారమే కనక పాటలు అనుకున్నదానికన్నా తొందరగా పూర్తయితే రజనీగారు అక్కడికక్కడే అదనపు పంక్తులు రాసిచ్చి అదే శైలిలో పాట కొనసాగించమని సైగ చేసేవారట. మనకు వింతగా, అదేదో సత్యకాలంలా అనిపిస్తుంది.)

ఆనాటి పరిస్థితులనుబట్టి నాగయ్య మొదలైన ఇతర సంగీతదర్శకులలాగే రజనీగారుకూడా కొంతవరకూ బెంగాలీ సంగీత ధోరణులవల్ల ప్రభావితుడయాడు. అయితే సాలూరు రాజేశ్వరరావుగారి కొన్ని పాత పాటల్లాగాఆయన సంగీతం పూర్తిగా ‘తెలుగేతరం’ అయిపోలేదంటే అది ఆయనకు సంక్రమించిన బలమైన సంస్కారంవల్లనే అనిపిస్తుంది. 1950ల తరవాత బొంబాయి సినీపరిశ్రమలోని ఉద్దండులు ఖేమ్‌చంద్ ప్రకాశ్, అనిల్‌బిశ్వాస్, నౌషాద్, శంకర్ జైకిషన్ తదితరుల సంగీతపు బలమైన ప్రభావం దక్షిణాదిలోకూడా బాగా పెరగడంతో తెలుగు సినీసంగీతపు తీరుతెన్నులు మారిపోతూ వచ్చాయనేది వేరే సంగతి.

సినిమాలనుంచి తప్పుకున్న తరవాత రజనీగారు తన సంగీత సాహిత్య అభిరుచులతో ఆలిండియా రేడియోని వెలిగించారు. 1993లో బొంబాయిలో జరిగిన కూచిపూడి మహోత్సవంలో ఆయన సమక్షంలో ఉపన్యసించిన బాలమురళీకృష్ణ తన విజయవాడ రేడియో కేంద్రపు అనుభవాలను గుర్తుచేసుకుంటూ ‘ఇవాళ నా సంగీతంలో లిరిసిజం ఏదైనా ఉందంటే దానికి కారణం రజనీకాంతరావుగారే’ అని స్పష్టంగా చెప్పారు. భక్తిసంగీతం, భావగీతాలు, రేడియో సంగీతరూపకాలు, పిల్లలపాటలు, జానపదగీతాలు, కూచిపూడి సంగీతరచనలు ఇలా ఎన్నెన్నో ప్రక్రియల్లో విజయం సాధించారు రజనీగారు. రామప్రియ రాగంలోని కొలువైతివా రంగశాయీ అనే పాటకు తరుచుగా నాట్యం చేసే చాలామందికీ, చూసేవారికీ అది రజనీగారి రచనేనని తెలియకపోవచ్చు. అలాగే రాజేశ్వరరావు, బాలసరస్వతి పాడిన ప్రసిద్ధ యుగళగీతం ‘కోపమేల రాధా‘ తనదేనని రజనీగారు చెప్పారు. లోగడ తన రచనలకు కొన్ని సందర్భాల్లో ఇతరుల పేర్లు పెట్టవలసిరావడం, కొందరు మరికొన్నిటిని తమవిగా పేర్కొనడం మొదలైన కారణాలవల్ల అటువంటివాటిని తన ‘కుంతీసంతానం’ అని రజనీగారు ఛలోక్తిగా అంటూఉంటారు. వాటన్నిటిని గురించిన ఒక వ్యాసం కూడా రాశారట.

మానసికమైన వృద్ధాప్యం సోకకుండా కాలం గడిపేవారిలో ఒక లక్షణం కనబడుతుంది; వారు బాహ్యప్రేరణలకు పాజిటివ్‌గా స్పందిస్తూ ఉంటారు. ఎప్పుడో పంకజ్ మల్లిక్ తదితరుల ప్రభావంతో మొదలైన రజనీగారి సంగీతప్రస్థానం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ప్రొఫెషనల్ గాయకుడుగా స్థిరపడకపోవడం కూడా ఆయనకు లాభించింది. ఒకవంక భారతీయ సంగీతంలోని 22 శ్రుతుల వివరాలనుంచి టర్కీ, ఇరాన్ తదితర మధ్యప్రాచ్యదేశాల సంగీతందాకా అన్నిటినీ ఆయన అభిమానంతో, ఆసక్తితో అధ్యయనం చేశాడు. ఇటువంటివాటిని గురించి చెప్పేటప్పుడు ఆయన బోధిస్తున్నట్టు కాకుండా తన ఉత్సాహాన్ని పంచుకుంటున్నట్టుగా మాట్లాడతారు. ఇది చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. అందుకే ఆయనతో కూచుని మాట్లాడడమే నాబోటివారికి ఎడ్యుకేషన్; ఒక చక్కని అనుభవం కూడా.

రజనీకాంతరావుగారు ఎన్నో అప్రచలితమైన కర్ణాటకరాగాల్లో స్వీయరచనలు చేశారు. ఆయనొక కవి, వాగ్గేయకారుడు కనక పాటలు కట్టటం ఆయనకు కరతలామలకం. తన కవితా భావనకు సరిపోతుందనుకున్న పద్ధతిలో స్వరరచన సాగుతుంది. ఆయన రచనల్లో చాలామటుకు మనకు తెలిసిన మూసల్లో ఏదీ సరిపోదు. అపరిచితం అనిపించే రాగాన్ని కాని, స్వరప్రయోగాన్ని కాని అవసరమనుకున్నప్పుడు ఉపయోగించడానికి ఆయన వెనకాడలేదు. అన్నమాచార్య తదితరుల రచనలనుకూడా ఆయన సమర్థవంతంగా స్వరపరిచాడు. పదకవితాపితామహుడు సూచించిన రాగాలనూ, తాళాలనూ గురించి అవసరమైతే రీసెర్చ్ చేసి మరీ స్వరం చేకూర్చాడు. ఆయన మాటల్లో చెప్పాలంటే ‘సాహిత్యంలోని భావమే ఆయన మనసుకు వెల్లవేస్తుంది’. ‘రాళ్ళపల్లివారినుంచీ అనేకులు అన్నమయ్య పదాలకు సంగీతం కట్టారుగదా వీటిలో ఏది ప్రామాణికం? ఎటువంటి ట్యూన్ చెయ్యాలి?’ అని నా మిత్రుడొకాయన అడిగితే దానికి రజనీగారు ‘ట్యూన్ ఎలా ఉండాలో అన్నమయ్య రచనను చదివినప్పుడే తెలిసిపోతుంది’ అన్నారు. అది ఆయన విషయంలో నిజమే కావచ్చుగాని అందరివల్లా అయేపని కాదు.

రజనీకాంతరావుగారికి హిందూస్తానీ సంగీతమన్నా అభిమానమే. “బైజూబావ్రా” సినిమాలో అమీర్‌ఖాన్, పలూస్కర్ కలిసి పాడిన పోటీ పాట విని ఆయన ముగ్ధుడై ‘ఆశా నా ప్రాణసఖీ’ అనే రచనను చేశారు. ఆ రాగం పేరు దేసీ అనికూడా ఆయనకు తెలియకపోయినప్పటికీ దాని పోకడలను అద్భుతంగా ఉపయోగించుకున్నారు. అలాగే మేఘ్‌మల్హార్‌లోనూ ‘నీలి నింగి గాలి తరగల తేలిపోయే మేఘరాజా’ అనే రచన చేశారు. అది ఉస్తాద్ అమీర్‌ఖాన్ తదితరులు పాడిన శైలిలో ఉంది. రాగం సాహిత్యానికి సరిగ్గా సరిపోయిందని వేరే చెప్పక్కర్లేదు. ఆయనకు హిందూస్తానీ రచనలేవీ రావుకనక స్వయంగా ఒక పాట రాసేసి, ఆ రాగంలో ట్యూన్ చేసేసుకుంటారన్నమాట. కొందరు ప్రసిద్ధ కర్ణాటక విద్వాంసులు హిందూస్తానీ రాగాల్లో చేసిన రచనల్లో దక్షిణాది పోకడలు పూర్తిగా పోవు. రజనీగారి రచనల్లో అటువంటిది ఎన్నడూ కానరాదు.

ఇంత గొప్ప అక్షరశిల్పి, స్వరశిల్పి తన లోకంలో ఆనందంగా విహరిస్తూ, పేరుప్రఖ్యాతుల కోసం పాకులాడకుండా జీవించడం చూస్తే అదే ఆయన ఆరోగ్యరహస్యం అనిపిస్తుంది. పోటీప్రపంచం ఎంత అనారోగ్యకరమో అర్థమవుతుంది. ఇప్పటికీ ఆయన గొంతులో అపస్వరం వినబడదు. పాటలతోబాటు ఆయన చెప్పే సరదా కబుర్లూ, నేర్చుకోదగిన విశేషాలూ అన్నీ శ్రోతలకు ఆనందాన్నిస్తాయి. 1993లో బొంబాయిలోనూ, 1996లో విజయవాడలోనూ ఆయనతో గడిపిన సమయం ఎంత బావుందో 2008లో కూడా అటువంటి అనుభవమే కలిగింది.

లలితసంగీతానికీ, తెలుగు సాహిత్యానికీ ఎటువంటి సంబంధం ఉండాలో నిర్దేశించిన గొప్పవారి జాబితాలో ఘంటసాల, రాజేశ్వరరావు తదితరులతో రజనీకాంతరావుగారి పేరు నిలబడుతుంది. ఎటొచ్చీ వారిలాగా వ్యాపారపరమైన ఒత్తిడులకు లోనవని కారణంగా రజనీగారికి ఎక్కువ స్వేచ్ఛ లభించినట్టయింది.

1963 ప్రాంతాల్లో ఉద్యోగమండల్ (కేరళ)లో ఆలిండియా రచయితల కాన్ఫరెన్సుకు మా నాన్న కుటుంబరావుగారితో బాటు రజనీకాంతరావుగారు కూడా పాల్గొన్నారట. ప్రతిరోజూ ఆయన పాటలు విని ఆనందించే అవకాశం దొరికిందని మా నాన్న మాతో అన్నారు. రజనీగారి సంగీతాన్ని విని సంతోషించినవారు ఆ రోజుల్లో చాలామంది ఉండేవారు.

తెలుగువారి ఆధునిక సంగీతంలో రజనీకాంతరావుగారి సాహిత్య, సంగీత సంస్కారానికి వారసులు తక్కువే. ఆయన ఆఖరి కుమారుడు వెంకోబరావు ఆయన రచనలను ఆయన శైలిలోనే పాడడం సంతోషకరం. శ్రీ పాలగుమ్మి విశ్వనాథం తదితరులను మినహాయిస్తే తక్కినదంతా శాస్త్రీయ, సినిమా సంగీత విభాగాలకే పరిమితం అయినట్టుగా కనిపిస్తుంది. భావకవిత్వానికీ, దేశభక్తి, జానపద గీతాలకూ రేడియోలో తప్ప స్థానం లేకపోవడంతో వీటికి ఆదరణ తగ్గిందేమో.


పట్రాయని సంగీతరావు (చెన్నై, డిసెంబర్‌ 2004)
పట్రాయని సంగీతరావు
(చెన్నై, డిసెంబర్‌ 2004)

సంగీతరావుగారు చెన్నైనుంచి హైదరాబాదుకి మకాం మార్చడంతో ఆయనను కూడా కలుసుకోవడం వీలయింది. ఘంటసాలకు గురుపుత్రుడుగా, సన్నిహితుడుగా, వెంపటి చినసత్యంగారి అనేక నృత్యనాటకాలకు సంగీతదర్శకుడుగా, విశేష అనుభవం కలిగిన సంగీతవేత్తగా ఆయనకొక ప్రత్యేకత ఉంది. అనేక దశాబ్దాలుగా శాస్త్రీయసంగీతంలోని మార్పులను గమనిస్తూ, వాటికి సాధికారంగా స్పందించగలిగిన విద్వత్తు ఆయనది. ఆయన పితామహుడూ, తండ్రీ కర్ణాటక సంగీతంలో విశేషకృషి చేసినవారు. తండ్రి సీతారామశాస్త్రిగారు ఘంటసాలగారి సంగీతవ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన గురువు.

సంగీతరావుగారి ప్రతిభకు గుర్తింపు లభించడం సంతోషకరమైన విషయం. తనకున్న చిరకాల పరిచయం ఆధారంగా సంగీతరావుగారు ‘నేనెరిగిన ఘంటసాల ‘ అనే ఆడియో వ్యాఖ్యానం ఒకటి రికార్డు చేశారు. అది ఇంటర్నెట్‌లో లభ్యమౌతోంది. అందులో ఆయన చెప్పిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మనం విని తెలుసుకోవచ్చు.

సంగీతరావుగారిని కలుసుకున్నప్పుడు ఘంటసాల గానం చేసిన భగవద్గీత గురించి ప్రస్తావించారు. ఇటీవల ఆయన ఆ భగవద్గీతకొక సంగీతపరమైన చక్కని వ్యాఖ్యానం సీడీ రూపంలో రికార్డు చేశారు. ఘంటసాల సం’గీతామృతం’ అనే పేరు గల ఆ ఆడియో సీడీని వినే అవకాశం నాకు కలిగింది. ప్రస్తుతానికి లిమిటెడ్ సర్క్యులేషన్‌లో ఉన్న ఈ రికార్డింగ్ త్వరలోనే రిలీజ్ కావచ్చు.

ఈ సీడీలో ఘంటసాలగారి శ్లోకాలన్నిటికీ వరసగా రాగాలు పేర్కొనబడ్డాయి. వీటిని మించి ఆయా రాగాల గురించీ, వాటి లక్షణాలను గురించీ సంగీతరావుగారి కామెంట్లు ఆసక్తికరంగా ఉంటాయి. విజ్ఞానదాయకంగా, బోధనాత్మకంగా అనిపించే ఈ వివరాలు మనకు శాస్త్రీయసంగీతపు నేపథ్యాన్ని తెలియజేస్తాయి. సంగీతదర్శకుడనేవాడు శాస్త్రీయరాగాలను లలితసంగీతానికి ఉపయోగించు కుంటున్నప్పుడూ, సాహిత్యపరంగా సమర్థవంతంగా మలుచుకున్నప్పుడూ ఎదురయే సాధక బాధకాలన్నీ మనకు తేలిక భాషలో అర్థమవుతాయి. ఈ చర్చలో ఒక్క సంగీతమే కాక ఎంతో విశిష్టమూ, ఉన్నతమూ అనిపించే ఘంటసాల వ్యక్తిత్వం కూడా మనకు సాక్షాత్కరిస్తుంది. ఘంటసాల కేవలం మంచి గాయకుడు మాత్రమేననీ, అగ్రహీరోలకు నప్పేలాగా పాడేవాడనీ అనుకునేవారి ధోరణి సంకుచితమైనది. ఆయన స్వరకర్త; నటుడు; కళాస్రష్ట; సహజగాంభీర్యం కలిగిన గొప్ప గాత్రపటిమ వీటికి తోడయింది కనకనే దశాబ్దాలు గడుస్తున్న కొద్దీ ఆయనకు ఆదరణ పెరుగుతోంది. ఈ విషయాలన్నిటికీ గల నేపథ్యాన్నీ, కారణాలనూ సంగీతరావుగారు వివరించారు.

నిజం చెప్పాలంటే ఘంటసాల ప్రతిభకు ఎవరూ దివిటీ పట్టిచూపనక్కర్లేదు.పెద్ద విశ్లేషణ అవసరం లేకుండానే ఇన్నేళ్ళుగా అందరూ ఆయన గానాన్ని విని ఆనందిస్తున్నారు. అయినా ఈ సీడీ సంగీతాభిమానులకు ఆసక్తికరమే; ఇందులో ఒకరకంగా చూస్తే సంగీతరావుగారి వ్యాఖ్యానానికి ఘంటసాలగారి భగవద్గీత ఒక ప్రారంభబిందువువంటిది. ఘంటసాల సంగతి అలా ఉంచి దీనిద్వారా మనకు సంగీతం గురించిన అదనపు వివరాలు తెలుస్తాయి. శాస్త్రీయరాగాలకు ఉదాహరణలుగా ఎంపిక చేసిన మంచి సినీగీతాలు వినబడతాయి. కొన్నేళ్ళ క్రితం ప్రతి ఉదయమూ వివిధ్‌భారతి రేడియో ప్రసారాల్లో మనం విన్న ‘సంగీత్ సరితా’కు ఇది విస్తృతమైన వెర్షన్‌లాగా అనిపిస్తుంది. ఇటువంటి సీడీ ఉందని తెలియగానే కొని విందామనుకునేవాళ్ళు తెలుగువారిలో వేలమంది కాకపోయినా వందల్లో ఉంటారనుకుంటాను.

దక్షిణాది లలిత సంగీతంలో హిందూస్తానీ రాగాల వాడకం ఎక్కువే. మన సంగీతదర్శకులలో హిందూస్తానీ సంగీతం నేర్చుకునేందుకు ప్రయత్నించినవారిలో ముఖ్యుడు సాలూరు రాజేశ్వరరావు. పదిహేనేళ్ళు నిండకుండానే కలకత్తాలో సైగల్ వద్దకూ, ఆగ్రా ఘరానా విద్వాంసుడు ఫయ్యాజ్‌ఖాన్ వద్దకూ వెళ్ళి శిష్యరికం చేశాడాయన. ఇటువంటి జ్ఞానం బాగా సంపాదించిన మరొకరు పి. ఆదినారాయణరావు.

ఘంటసాలగారు మాత్రం తొలిరోజుల్లో తనకున్న ఆర్థిక పరిమితుల దృష్ట్యా సినిమాల్లో చేరి, మద్రాసులోనే ఉండిపోయారు. అక్కడ ఆయన 1948లో మొదటిసారిగా బడేగులాం అలీఖాన్ కచేరీలు విని తీవ్రంగా ప్రభావితుడయాడు. మళ్ళీ 1954లోనూ, 1958లోనూ ఉస్తాద్‌గారు మద్రాసుకు వచ్చినప్పుడు ఘంటసాలగారు పట్టుబట్టి ఆయనకు తమ ఇంట్లోనే బస ఏర్పాటు చేశారు. ఈ వివరాలన్నీ సావిత్రమ్మగారు కొన్ని సందర్భాల్లో చెప్పారు కూడా. ఆ విధంగా రాగేశ్రీ వంటి రాగాలను మొదటిసారిగా విన్న ఘంటసాల దాన్ని ఎన్నో సార్లు తన సినీగీతాల్లో ఉపయోగించుకున్నారు. వీటిలో ఎంతఘాటు ప్రేమయో, ఇది నాచెలి, అన్నానా భామిని, రాగాలా సరాగాలా మొదలైనవి ఉన్నాయి. ఈ విశేషాలన్నీ సంగీతరావుగారు సీడీలో వివరించారు. ఈ విధంగా భగవద్గీతలో ఘంటసాల ఉపయోగించిన హిందూస్తానీ, కర్ణాటక రాగాల లక్షణాలన్నిటినీ సందర్భోచితంగా వివరించడం శ్రోతలకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నా లెక్కన ఇటువంటి సీడీలను పాఠ్యాంశాలుగానో, దేశవిదేశాల్లోని లైబ్రరీల్లోనూ, ఆర్కైవ్స్‌లోనూ చేర్చదగినవిగానో పరిగణించాలి. దీన్ని గురించిన సలహాలివ్వదలుచుకున్నవారూ, సీడీ కాపీలను కోరేవారూ అడ్వొకేట్‌గా పనిచేస్తున్న సంగీతరావుగారి కుమారుడు గోపాలకృష్ణ గారిని ఈమెయిల్ ద్వారా (pvgk010101 AT sify.com) సంప్రదించవచ్చు.

రజనీకాంతరావుగారిలాగానే సంగీతరావుగారు కూడా శాస్త్రీయసంగీతంలో నిష్ణాతుడైనప్పటికీ ప్రొఫెషనల్ గాయకుడుగా జీవించలేదు. శాస్త్రీయగాయకులుగా స్థిరపడినవారి దారి వేరు. అందుచేత ఒక ప్రయోక్తగా, వ్యాఖ్యాతగా ఆయనతో అనేక విషయాలను చర్చించి తెలుసుకోవడం వీలవుతుంది. సాహిత్య ప్రాధాన్యం కలిగిన లలిత, ఉపశాస్త్రీయ సంగీతాల్లో నేర్చుకోవలసిన అదనపు అంశాలు ఎన్నో ఉంటాయి. ఆయన చెన్నైలో ఉన్నప్పుడు సినిమాల్లో పాడే యువతీయువకు లెందరో ఆయన దగ్గరకు వచ్చి రాగాలూ, పాడే మెళుకువలూ నేర్చుకుంటూ ఉండడం చూశాను. ప్రతివారికీ అలా నేర్చుకునే అవకాశం ఉండదు కనక ఇటువంటి సీడీలు కొంతవరకూ తోడ్పడతాయి.

సంగీతరావుగారిలో ఇప్పటికీ పెల్లుబుకుతున్న ఉత్సాహం ఆశ్చర్యకరం అనిపిస్తుంది; అది తరవాతి తరంవారికి ఆచరణీయం కూడా. పేరుకు తగ్గట్టే ఆయన ఆలోచనలన్నీ సంగీతం గురించినవే. ఏదైనా రాగం ఆయనను ఆకట్టుకున్నప్పుడు అందులో స్వరరచన చెయ్యాలనే కోరిక ఆయనలో ఇప్పటికీ తరుచుగా కలుగుతుంది. కూచిపూడి నృత్యనాటకాల నుంచి రిటైర్ అయిన తరవాత ఆయన క్రియేటివిటీకి మార్గాలు వెతుక్కోవలసి రావడంతో ఆయన తన ట్యూన్లకు సరిపోయే గీతాలను కూడా స్వయంగా రాసుకుంటున్నారు. ఇంతకు మునుపు కవిత్వం జోలికి పోకపోయినప్పటికీ అవసరార్థం ఆయన ఇది మొదలుపెట్టినట్టుగా అనిపిస్తుంది. అదే విధంగా సంగీత పరీక్షకు కూర్చునే విద్యార్థిలా ఆయన తనకు అంతగా పరిచయం లేని హిందూస్తానీ రాగాల పోకడలను గురించి తెలుసుకోవాలని ప్రయత్నించడం చూస్తే ఆయన ఆసక్తికీ, జిజ్ఞాసకూ వయసుతో నిమిత్తం లేదేమోననిపిస్తుంది. రెండు కచేరీలు చెయ్యగానే తాము విద్వాంసులైపోయినట్టుగా ప్రవర్తించేవారితో పోలిస్తే ఇది మరీ ఆశ్చర్య మనిపిస్తుది.

సంగీతరావుగారిని కదిపితే ఎన్నెన్నో విషయాలు చెపుతారు. ఆయన చిన్నతనం లోనే వీణ వెంకటరమణదాసుగారు పండుముసలి. దాసుగారు వయసులో ఉన్నప్పుడు అనేక రాజాస్థానాల్లో కచేరీలు చేసిన గొప్ప విద్వాంసుడు. ‘అక్కడ మీరేం వాయించారు గురువుగారూ?’ అనడిగితే ముసలాయన ‘నేను ఫలానా రాగంలో గీతం వాయించాన్రా అబ్బాయ్’ అనేవాడట. ప్రస్తుతకాలంలో గీతాలనేవి విద్యార్థులకు నేర్పడానికి మాత్రమే పనికొస్తాయని భావించడంతో వర్ణాలూ, కీర్తనలూ మొదలైనవి మాత్రమే కచేరీల్లో వినిపిస్తున్నారనీ, పూర్వం అలా ఉండిఉండేది కాదేమోననీ సంగీతరావుగారంటారు. అలాగే వీణమీద ఇప్పటిలాగా రాగం, తానం మాత్రమే కాక పూర్వకాలంలో ‘ఘనం’ కూడా వాయించేవారట.

హిందూస్తానీలోలాగే కర్ణాటక సంగీతంలోకూడా ప్రతి రాగానికీ లక్షణగీతాలుంటాయి. వీటి గురించి నేటి సంగీతపు టీచర్లకు కూడా సరిగ్గా తెలియదు. సంగీతరావుగారివంటి అనుభవజ్ఞుల నుంచి నేర్చుకోదగిన విషయాల్లో ఇవి కూడా ఉన్నాయి. సంగీతరావుగారి రెండో కుమార్తె పద్మావతి మంచి గాయని. ఆమె గాత్రం వింటే ఆయన తాతగారి కాలంనుంచీ వారి కుటుంబంలో కొనసాగుతున్న సంగీతానికి భవిష్యత్తు ఉందనిపిస్తుంది.

పాతతరం పాడిన సంగీతానికి ఈ రోజుల్లో రెలెవెన్స్ అంతంతమాత్రమే. అయితే ఇదొక రకమైన వారసత్వం. దీని మూలాలని తెలుసుకోదలుచుకున్నవారికి మాత్రం ఇటువంటి వారిని ముఖాముఖీ కలుసుకోవడం చాలా లాభిస్తుంది. ప్రస్తుతపు ‘ఆధునిక’ సంగీతాన్ని వింటే ఎక్కడికి వెళుతున్నామో తెలియదేమో కాని రజనీకాంతరావు, సంగీతరావు తదితరుల ద్వారా మన సంగీతం, సంస్కారం ఎక్కణ్ణుంచి వచ్చాయో తెలుస్తుంది.

కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

రచయిత కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ గురించి: కొడవటిగంటి రోహిణీప్రసాద్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. పాపులర్ సైన్సు, సంగీతం మరియు ఇతర విషయాల గురించి తన మాతృభాషైన తెలుగులోను, ఆంగ్లంలోను పలు వ్యాసాలు రాశాడు. ఆయన ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు కుమారుడు. ...