జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 3

నమ్మకాలు – విశేషాలు

నమ్మకాలకి ఉండే ప్రధానమైన లక్షణం ఏమిటంటే అవి నిజమో కాదో తేల్చే అవకాశం చాలా తక్కువగా ఉండడం. God Delusion పుస్తకంలో క్రైస్తవ మతం యొక్క నమ్మకాలని రిచర్డ్ డాకిన్స్ ఇలా క్లుప్తీకరిస్తాడు –

 • పూర్వకాలంలో ఒకాయన తండ్రి అవసరం లేకుండానే ఒక కన్యకి పుట్టాడు.
 • తండ్రిలేని అతడు, శరీరం కుళ్ళిపోవడానికి అవసరమైనకన్నా ఎక్కువ కాలం క్రితమే చనిపోయిన లాజరస్ అనే ఒక స్నేహితుడిని పిలిస్తే, లాజరస్ బ్రతికి వచ్చాడు.
 • ఆ తండ్రిలేని వ్యక్తే తరువాత చంపబడి, సమాధి చెయ్యబడి, మూడు రోజులు గడిచాకా బ్రతికి వచ్చాడు.
 • నలభై రోజులు గడిచాకా ఆ తండ్రిలేని వ్యక్తి ఒక కొండ పైకి ఎక్కి శరీరంతో సహా ఆకాశంలోకి మాయమైపోయాడు.
 • నీ మనసులో కొన్ని ఆలోచనల్ని నువ్వు గొణుక్కుంటే, ఆ తండ్రిలేని వ్యక్తీ, అతని తండ్రీ (ఇద్దరూ మళ్ళా ఒకటే) విని, వాటి గురించి ఏదో ఒకటి చేస్తారు. అతడు ఏకకాలంలో ఈ ప్రపంచంలో ఉన్న అందరి ఆలోచనల్నీ వినగలడు.
 • నువ్వేమైనా చెడు చేసినా, మంచి చేసినా ఆ తండ్రిలేని వ్యక్తి అంతా చూస్తాడు. తదనుగుణంగా నిన్ను శిక్షించడంగానీ, బహుమానించడంగానీ చేస్తాడు – అది నువ్వు చనిపోయిన తరవాత కూడా కావచ్చు.
 • తండ్రిలేని వ్యక్తి యొక్క కన్య అయిన తల్లి చనిపోలేదు, బొందితో స్వర్గానికి పోయింది.

ఈ విధమైన నమ్మకాలకు రుజువులు ఉండక్కరలేదు. ఇవి తప్పు అని కూడా రుజువు చెయ్యడం చాలా కష్టం. ఇటువంటివి జరగడం దాదాపు అసాధ్యమనీ, రుజువులు లేకుండా నమ్మకాలు కలిగి ఉండడం ప్రమాదకరమనీ చెప్పడానికి గ్రంథాలు రాయాల్సి ఉంటుంది. పెద్దయెత్తున భౌతికవాద, హేతువాద సిద్ధాంతాలు వివరించాల్సి ఉంటుంది. అయినా ఈ నమ్మకాల్ని కలిగిఉండేవాళ్ళు వాటిల్ని వదులుకోడానికి ఇష్టపడరు.

జ్యోతిషంలో ఉండే నమ్మకాలు కూడా ఇంచుమించు ఈ కోవలోకే వస్తాయి. జ్యోతిషం ఏం నమ్ముతుందంటే –

 • ఆకాశంలో తిరిగే గ్రహాలు మానవ జీవితంలోని వివిధ భాగాల్ని, సన్నివేశాల్నీ సూచిస్తాయి.
 • ఎన్నో కోట్ల మైళ్ళ దూరంలో ఉండే నక్షత్ర మండలాలు కూడా గ్రహాల్లాగే మానవ సమాజం మీద, జీవితం మీద ప్రభావాన్ని కలిగి ఉంటాయి.
 • గ్రహగతుల్ని బట్టి నీకు పెళ్ళవుతుందో లేదో, ఎలాంటి అమ్మాయిని చేసుకుంటావో, ఎలాంటి ఉద్యోగం చేస్తావో మొదలైన విషయాలు చెప్పవచ్చు.
 • కొన్ని రకాల రత్నాల్ని ధరించడం ద్వారాను, కొన్ని మంత్రాలు జపించడం వల్లా, గ్రహాలు సూచించే భవిష్యత్తులోని దుష్ఫలితాలనుంచి తప్పించుకోవచ్చు.

అయితే జ్యోతిషం ప్రత్యేకత ఏమిటంటే – గ్రహాల, నక్షత్రాల ప్రభావం మానవ జీవితం మీద నిజంగానే ఉంటుందని నమ్మినా, దాని ద్వారా గతమూ, భవిష్యత్తూ తెలుస్తుంది అని ఎవరన్నా అంటే, ‘ఏదీ, నా గతమో, భవిష్యత్తో చెప్పు చూద్దాం’ అని వెంటనే అడగవచ్చు. అంటే అది తప్పో ఒప్పో తేల్చుకోవడం చాలా తేలిక. నిజంగా జ్యోతిషాన్ని నమ్మిన వాళ్ళకి కూడా కొంతకాలానికి దానిమీద భ్రమలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. అయితే వాళ్ళు కేవలం నమ్మకానికి అతుక్కుపోకుండా అది నిజంగా పని చేస్తుందో లేదో తెలుసుకోవాలనే కుతూహలం కలిగి ఉండాలి. కానీ చాలా మందికి నమ్మడమో, లేకపోతే తప్పు అనడమో తప్ప కొంచం ఓపికగా పరీక్షించి చూసే అవకాశం ఉండదు. అందుకనే జ్యోతిషం లాంటి వెరిఫై చెయ్యగలిగిన సిద్ధాంతాలు కూడా ఇంతకాలం ఎటూ తేలకుండా నిలబడిపోవడం జరిగింది.

అయితే జ్యోతిషంలో కూడా వెరిఫై చెయ్యలేని భాగం చాలానే ఉంటుంది. ఉదాహరణకి పాశ్చాత్య జ్యోతిషంలో జాతకాల సహాయంతో మనోవిశ్లేషణ చేసి మానసిక సమస్యలకి పరిష్కారాలు సూచించడం జరుగుతుంటుంది. అందులో జ్యోతిష సంకేతాలు నామమాత్రంగా, జ్యోతిష్కుడూ, జాతకుడూ మాట్లాడుకోడానికి ఒక భూమిక (common ground) గా పనికివస్తాయి తప్ప అవి నిజం కావలసిన అవసరమే లేదు. జాఫ్రీ డీన్ చేసిన ప్రయోగం కూడా ఈ విషయాన్నే ధ్రువపరుస్తుంది. అలాగే భారతీయ జ్యోతిషంలో ‘నీకు ప్రస్తుతం దశ బాగాలేదు, ఈ రత్నం ధరిస్తే కష్టాలు తగ్గుతాయి’ అన్నారనుకోండి. రత్నం ధరించిన తరవాత పెద్ద తేడా ఏమీ లేకపోయినా అది ధరించడంవల్ల నిజంగా రావలసిన పెద్ద కష్టాలేవో తప్పిపోయాయి అని జ్యోతిష్కుడు అనవచ్చు. లేదా రత్నం ధరించకపోతే, ఏ చిన్న కష్టం వచ్చినా రత్నం ధరిస్తే అది తప్పిపోయి ఉండేది అనవచ్చు. కాబట్టి రత్నాలు ధరించడం వల్ల కష్టాలు తప్పుతాయి అన్నమాటని నిరూపించడం కష్టం.

తప్పని నిరూపించగలిగేవే పనికొచ్చే సిద్ధాంతాలు

కార్ల్ పాపర్ The Logic of Scientific Discovery గ్రంథంలో ‘తప్పని నిరూపించగలగడం’ (falsifiability) గురించి వివరిస్తాడు. ఫాల్సిఫయబిలిటీ అంటే ఏ సిద్ధాంత ప్రతిపాదన (conjecture) అయినా సరే కొన్ని రుజువులద్వారా తప్పు అని నిరూపించబడడానికి అనువుగా ఉండాలి. ఈ లక్షణాన్ని బట్టి అది శాస్త్రీయమో (scientific) కాదో చెప్పడం చాలామటుకు సాధ్యమౌతుంది. తప్పు అని నిరూపించడమే అసాధ్యమైతే అది సైన్సు కాజాలదు. ప్రయోగాలు, పరిశీలనల ద్వారా తప్పు అని నిరూపించబడిన ప్రతిపాదనల్ని తిరస్కరించడం, పరిశీలనకి నిలబడిన సిద్ధాంతాలని స్వీకరించడం జరుగుతుంది. అయితే నిరూపణకి నిలబడినంత మాత్రాన ఆ సిద్ధాంతం ‘నిజం’ అయిపోదు. మరొక నిరూపణ ద్వారా అది తప్పు అని రుజువుచెయ్యబడేంతవరకూ మాత్రమే ఆ సిద్ధాంతం పరిశీలించబడుతున్న విషయాలకి ఒక అంగీకరించబడిన వివరణగా నిలుస్తుంది. ఈ విధంగా ఎప్పటికప్పుడు సిద్ధాంతాలని కొత్త పరిశీలనలకి గురి చెయ్యడం ద్వారా సైన్సు పురోగమిస్తుంది.

అయితే కార్ల్ పాపర్ చెప్పినది మొత్తం సైంటిఫిక్ ఫిలాసఫీలో ఒక అంశం మాత్రమే. సైంటిఫిక్ ఫిలాసఫీ పరిధి చాలా విస్తృతమైనది. క్వాంటం ఫిజిక్సు, స్ట్రింగ్ థియరీ వంటి నవ్య నూతన సిద్ధాంతాలలో ఈ ‘ఫాల్సిఫయబిలిటీ’కి లొంగని చిక్కులు ఉంటాయి. అయినప్పటికీ పాపర్ చెప్పిన విషయాన్ని చాలామటుకు దైనందిన జీవితంలో ఎదురయ్యే నమ్మకాల నిజానిజాలను గురించి సందేహించడానికి ఒక ప్రాతిపదికగా స్వీకరించవచ్చు.

ఏ సిద్ధాంతమైనా అసలు శాస్త్రీయ పరిశీలనకి గురిచెయ్యడానికి అనువుగా లేకపోతే దాన్ని తప్పకుండా సందేహించాల్సి ఉంటుంది. ఐన్ స్టీన్ చెప్పిన రెలెటివిటీ సిద్ధాంతాన్ని పరిశీలనలద్వారా తప్పో ఒప్పో నిరూపించవచ్చు. పరిశీలనల్లో అది నిజమే అని నిరూపితమైంది. అది నిజమని నిరూపించబడడం వేరు సంగతి, అసలు ఆ సిద్ధాంతం తప్పని నిరూపించడానికి అవకాశం ఉంది, కాబట్టే అది శాస్త్రీయమైనది అని పాపర్ అంటాడు.

1998 మే నెలలో భారతదేశం అణుపరిక్షలు జరిపినప్పుడు ఇండియా-టుడే ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ పత్రిక విలేకరులు పోఖ్రాన్ పరిసర ప్రాంతాల్లో గల ప్రజలని వాళ్ళ అనుభవాలగురించి ప్రశ్నించారు. అలా ప్రశ్నించినవాళ్ళలో ఒక సాధువు ఉన్నాడు. ‘భూ కంపం ఎందుకు వచ్చిందో మీకు తెలుసా’ అని ఆ సాధువుని విలేకరి అడిగాడు. అప్పుడా సాధువు భూకంపాలు ఎందుకు వస్తాయో ఇలా వివరించాడుట – ‘భూమి మొత్తాన్ని ఒక గోవు తన కొమ్ము పైన మోస్తూ ఉంటుంది. ఒక్కోసారి తనకు బరువు అనిపించినప్పుడు భూమిని ఒక కొమ్ము మీదనుంచి మరొక కొమ్ము మీదకి మార్చుకుంటూ ఉంటుంది. ఆ కదలిక మనకి భూకంపంలాగా అనిపిస్తుంది’.

మానవుడు అంతరిక్షంలోకి ప్రయాణం చేసి ఉండడం వల్లా, ఉపగ్రహాల సహాయంతో భూమిని ఫొటోలు తీసి ఉండడం వల్లా ఇలాంటి సిద్ధాంతాలు మనకి చాలా హాస్యాస్పదంగా అనిపిస్తాయి. అంతరిక్షంలోంచి తీసిన ఫొటోల్లో భూమిని మోస్తున్న గోవు ఏమీ కనపడలేదు కాబట్టి ఆ సిద్ధాంతం తప్పు అని నిరూపించబడినట్టే. కానీ సైన్సు ఇంతగా అభివృద్ధి చెందని పాతరోజుల్లో ఈ సిద్ధాంతం వెరిఫై చెయ్యలేని ‘నమ్మకం’ మాత్రమే. అప్పట్లో దానిని తప్పు అనడం కష్టం.

బెర్ట్రండ్ రస్సెల్ దేముడున్నాడా అని చర్చిస్తూ మరొక ఉదాహరణ ఇస్తాడు. భూమికీ, కుజ గ్రహానికీ మధ్యలో ఒక చిన్న టీ కప్పు ఉందనుకోండి. అది కూడా సూర్యుడిచుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతున్నదనుకోండి. అయినా అది ఎంత చిన్నదంటే ప్రస్తుతం మనకున్న అత్యంత శక్తివంతమైన టెలిస్కోపులు కూడా దాన్ని కనిపెట్టలేవనుకోండి. అటువంటి టీకప్పు ఉన్నది అని కనిపెట్టడం అసాధ్యం కాబట్టి, అది ఉంది అని నేను గట్టిగా చెప్పినంతమాత్రాన అది నిజమైపోతుందా? అంటాడు.

ఈ ఉదాహరణలతో పోల్చి చూస్తే ‘జ్యోతిషం ద్వారా భవిష్యత్తు తెలుస్తుంది’ అన్న విషయాన్ని తప్పని నిరూపించడం ఏమంత కష్టం కాదు. కాబట్టి జ్యోతిషం ఫాల్సిఫయబిలిటీ పరిధిలోకే వస్తుంది అనుకోవచ్చు. అందుచేత అది కేవలం నమ్మకానికి సంబంధించిన విషయం, సైన్సు కానక్కరలేదు అని వదిలెయ్యవలసిన అవసరం లేదు.