నేను – నువ్వు

ఎండకి ఎండుతూనో
వానకి నానుతూనో
చలికి బిగుసుకపోతూనో
ఉక్కకి వాడిపోతూనో
బ్రతుకులోంచి నడచిపోతూనే వుంటాం
చీకట్లోంచి, వెలుగుల్లోంచి
నవ్వుల్లోంచి, కన్నీటి ధారల్లోంచి
జారిపోతూనే వుంటాం
మనలోకి మనం
ముడుచుకుపోతూనే వుంటాం

ఎప్పుడో వొకసారి, క్షణమాత్రం
నేను నాలోంచి బయటపడి
నేను నువ్వవుతాను
ఆ ఒక్క క్షణం
నేను నీతోపాటు
నవ్వుతాను
ఏడుస్తాను
నీ మనసులో ఆలోచన్నవుతాను
నీ కడుపులో ఆకలినవుతాను
నీ గుండెల్లో మిగిలిన
ఆఖరి పాల చుక్కనవుతాను

ఆ వొక్క క్షణం
నీ ఆశల వెనుక పరిగెత్తుతాను
నీ ఆశయాల వేడిలో ఆవిరినవుతాను
నీ భయాల బాహువుల్లో బందీనవుతాను
నీ నిరాశల నిట్టూర్పునవుతాను

ఆ క్షణం నేను
నేనెవరి బిడ్డనీ కాదు
ఎవరి తల్లినీ, తండ్రినీ కాదు
నేనెవరి చెల్లినీ, అక్కనీ కాదు
ఎవరి మొగుడ్నీ, పెళ్ళాన్నీ కాదు
నేనే దొంగనీ, దొరనీ కాదు
నాయకుణ్ణీ, నాటకుణ్ణీ కాదు
కవినీ, కథకుడినీ కాదు

ఆ క్షణం నాకు
నా చుట్టూ నేను కట్టుకున్న
గోడల గుర్తుకూడా వుండదు
నాకే మతం లేదు
నాకే గతం లేదు
ఆ క్షణం నేనెవరికీ
శిష్యుడ్ని కాదు
గురువునీ కాదు
భక్తుడ్నీ కాదు
దేవుడ్నీ కాదు

ఆ క్షణం నేను
నీ మనసున మనసవుతాను
నేను నువ్వవుతాను
నువ్వవటం వలననే
ఆ వొక్క క్షణం
నన్ను నేను నిర్వచించుకోని
ఆ వొక్క క్షణం
నేను నేనవుతాను