బ్రహ్మ జ్ఞానం

ఆదిశంకరులు ఓ రోజు రహదారి మీద నడుస్తూండగా ఓ పండితుడు సంస్కృత వ్యాకరణం వల్లె వేస్తూ కనిపించాడు. మహాత్ములకున్న సహజమైన కనికరం వల్ల శంకర భగవత్పాదులు అతడ్ని సమీపించి ఒకింత కోపంగా ఇలా అన్నారు.

జగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే
సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృంకరణే!

రామాయణంలో మారీచుడు రావణుడితో చెప్పినట్లు ’కాలం కలిసిరాకపోతే పనికొచ్చే మాటలు ఎవరైనా చెప్పినప్పుడు మనకి నచ్చదు. నచ్చినా మనం వినలేం.’ అయితే ఈ పండితుడి పూర్వ జన్మ సుకృతం వల్లో, మరింకే కారణం చేతో శంకరులు చెప్పింది విని ఆయన కాళ్ళ మీద పడ్డాడు.

అక్కడే ఉన్న ఓ చదునైన బండరాయి మీద కూర్చుని శ్రీ శంకరులు ఆతనికి మంత్రం, జ్ఞానమార్గం ఉపదేశించి ముందుకి సాగడానికి ఉద్యుక్తులౌతూండగా శాపవశాన అలా బండరాయిలా పడి ఉన్న సాకేతుడు “మహాత్మా, ఆయన పండితుడు కనక జపమూ చేయగలడూ, మంత్ర సిద్దీ సంపాదించగలడు. రాయినైన నేను ఎందుకూ పనికిరాను, ఎప్పుడో మీ బోటి మహాత్ములకు చోటివ్వడం తప్ప. నా మీద దయ ఉంచి నాక్కూడా ఓ దారి చూపించండి.” అన్నాడు.

“సాకేతా, జీవ-ఈశ్వర సమాగమం నీ లాంటి రాయికేం అర్ధం అవుతుంది? మరి కొన్ని జన్మల తరవాత మళ్ళీ నీకు మానవరూపం వచ్చినప్పుడు వేరే రూపంలో నీకు దారి చూపిస్తాను.” అన్నారు శ్రీశంకరులు.

“మహాత్మా, ఏమీ అడగని సంస్కృత పండితుణ్ణి ఉద్దరించిన మీకు, నన్నుద్ధరించటం అంత కష్టం కాదని నా ఊహ. ఎండకి ఎండి వానకి తడిసి ఎన్నో వేల ఏళ్ళు నిరిక్షిస్తే మీలాంటి మహాత్ములు మా దగ్గరకి ఓ మారు వచ్చి కూర్చుంటారు. మీరు తల్చుకుంటే నాకు మానవరూపం రావడం ఏమంత కష్టం కాదు కదా. మరో మారు ఆలోచించండి.” అంటూ మొరపెట్టుకున్నాడు సాకేతుడు.

సాకేతుడు జాలిగా పలికిన పలుకులు విని అపార కరుణామూర్తి యైన శంకరులు ఇలా అన్నారు. “సాకేతా, మానవరూపం రావడానికి ఎంతో అదృష్టం ఉండాలి. మొదట రాయీ రప్పలుగా, తరువాత వృక్ష శాకాదులగా, ఆ క్రమంలో క్రిమికీటకాదులుగా పుట్టి, జీవుడు పరాత్పరుడి అవాజ్య కరుణతో మనుషిగా జన్మిస్తాడు. అలాంటి మనుష్య జన్మరావడానికి ముందు ఎన్ని కోట్ల జన్మలెత్తాలో ఆ జీవుడు చేసే పూర్వ జన్మ కర్మలు నిర్దేశిస్తాయి. ఓ సారి మనుజుడయ్యాక, ఈ క్రమంలో ఈశ్వరుడవ్వచ్చు పైపైకి ఎదుగుతూ. కాని గర్వాంధకారాలతో మళ్ళీ ఈ నిచ్చెన మీద నుంచి కిందకు జారి క్రిమికీటకాదులయ్యే ప్రమాదం కూడా ఉంది. దానికి నువ్వే ఓ మంచి ఉదాహరణ. అయితే మనిషయ్యే వరకు ఈశ్వర జ్ఞానం అర్దమవ్వదు. బ్రహ్మ జ్ఞానం అర్ధమవడం ఓ ఎత్తు అయితే దాన్ని నిలుపుకోవడం ఇంకో ఎత్తు. అది సత్సంగం వల్ల గాని కలగదు.

త్సంగత్సే నిస్సంగత్సం, నిస్సంగత్సే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తిః

“నీ శాపం తీరగానే నీకొచ్చే మనుష్య జన్మలో ఇవన్నీ అర్ధమౌతాయి, అప్పటికి నీ జ్ఞాననాడి పనిచేసి వినగలిగితే. లేదూ, మళ్ళీ ఈ జనన మరణ చక్రంలో పునరపి జననం, పురనపి మరణం, అంతే.”

“ధన్యుణ్ణి. అయితే ఒక్క సందేహం. నేను మానవ జన్మెత్తి దురహంకారంతో విర్రవీగుతూ శాపవశాన ఈ స్థితికి చేరాను. మళ్ళీ మానవ జన్మెత్తి సుఖదుఃఖాలు మరిగితే, నా గతేమిటి? కాస్త శెలవివ్వండి.”

“శ్రీకృష్ణుడు చెప్పనే చెప్పాడు కదా!

పూర్య మాణమచలం ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్
తద్వత్కామాయం ప్రవిశంతి సర్వే స శాంతి మాప్నోతి నకామకామీ

(ఏ విధంగా సముద్రం అనేక నదులు తనలో కలుస్తున్నా చెలియలికట్ట దాటకుండా ప్రశాంతంగా ఉంటోందో, అదే విధంగా ఏ జీవుడిలో ఈ కోరికలు, సుఖ దుఃఖాలూ అలజడి కలిగించవో, వాడే స్థితప్రజ్ఞుడౌతాడు. కోరికలు తీర్చుకునేవాడెప్పటికీ కానేరడు.)

” దీనికి రావణుడో మంచి ఉదాహరణ. వాడు సీతే తన ఆనందం అనుకుని ఎంతోదూరంనుంచి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని ’ఓ ఆనందమా, నన్ను పొందు’ అన్నాడు. ఆనందం ’పొందడం’ ఎలాగ కుదురుతుందీ, నువ్వే ఆనందమై ఉండగా? ఆనందం ’పొందడానికి’ ప్రయత్నం చేసేవాడికి ఎప్పుడూ మిగిలేది దుఃఖమే.

“మహాత్మా, ఆనందం పొందడానికి ప్రయత్నం చేయకూడదని వినీ కూడా ఎందు మూలంగా మనుష్యులందరూ ఈ కర్మలు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆచరిస్తున్నారు? ఆనందం కోసం కాదాండీ?”

కామ ఏష, క్రోధ ఏష రజో గుణ సముధ్భవః
మహాశనో మహాపాప్మా విధ్ధినో మిహ వైరిణమ్

“కామ క్రోధాల వల్లనే అని కృష్ణుడు చెప్పాడు కదా. ఇవన్నీ ఎప్పటికీ శాంతింపజేయలేని అత్యుగ్రమైన రజోగుణంలోచి ఉద్భవించేవే. మనిషికి ఈ రజోగుణం కన్నా మించిన శత్రువు లేదు. అది విడిచిపెడితేనే ముక్తి.”

“ఆర్యా, అయితే సుఖదుఃఖాలు మరిచి ఎంత కష్టపడ్డా జీవితంలో ఏదో కొంత మాత్రమే సాధించి మరణిస్తే నా గతేం కాను. అటువంటప్పుడు మహాపాపాలు చుట్టుముట్టి నరక కూపంలో పడిపోతానా?”

“లేదు. దానిక్కూడా కృష్ణుడే సమాధానం చెప్పాడు.

పార్థ నైవేహ నాముత్ర వినాసస్తస్య విద్యతే
నహి కల్యాణ కృత్కశ్చి దుర్గతిం తాత గఛ్ఛతి

నాయనా, మంచి పనులు చేసేవాడెప్పుడూ దుర్గతి పొందడు. పూర్వకర్మలని బట్టి, ఇప్పుడు చేసే కర్మల బట్టీ, ఇంకో మంచి జన్మ వస్తుంది. ఆ జన్మలో ముందుకెళ్ళడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తాడు. ఈ విధంగా మెట్టుమీద మెట్టు ఎక్కుతూ దివ్య పరంధామం జేరవచ్చు.”

“అయితే మీరు చెప్పినట్టు ఇదంతా అరటి పండు వొల్చి చేతిలోపెట్టినంత సులభమా?”

“ఇదంతా సులభం కాదు కనకే చేసే కర్మలన్నీ పరమేశ్వరార్పణం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ పరమేశ్వరార్పణం కూడా అంత సులభమా? పుట్టిన దగ్గర్నుంచి ఆఖరి శ్వాస తీసే వరకు మనకి అన్నీ అమర్చిపెట్టే పరమేశ్వరుడికి మనం అర్పించగలిగేది ఏముంది?

రస్తే హేమద్రౌ గిరీశ నికటస్తే ధనపతౌ
గృహస్తే స్వర్భూజామర సురభి చింతామణి గణే
శిరస్తే శీతాంసౌ చరణ యుగళస్తే అఖిల శుభౌ
కమర్ధం దాస్యే జహం భవతు భవదర్ధం మమ మనః

“పరమ శివా, బంగారు కొండైన హేమాద్రి నీ చేతిలోనే ఉంది. అత్యంత ధనవంతుడైన కుబేరుడు నీ స్నేహితుడే. నీ ఇంటి ముంగిట్లోనే కల్ప వృక్షం, కావలసినవన్నీ సమకూర్చే చింతామణి, కామధేనువు ఉన్నాయి. చల్లదనాన్నిచ్చే చంద్రుడు నీ శిరస్సుమీదే ఉన్నాడు. సకల శుభాలు నీ పాదాల్లోనే ఉన్నాయి. అటువంటి నీకు నేనిచ్చేదేమీ కనిపించదు కనుక నా మనస్సే నీదవుగాక.”

“మరి నా ఇలాంటి మంచి ఆలోచన్లు వచ్చే మనస్సు ఉండడానికీ, దాన్ని పరమేశ్వరార్పణం చేయాలంటే ఏం చెయ్యాలో సెలవివ్వండి.”

సుషారధి రశ్వానివ యన్మనుష్యాన్ నేనీయతే భిశుభిర్వాజిన ఇవ
హృత్ప్రతిష్టమ్ యదజిరం జవిష్టం తన్మే మనః శివ సంకల్పమస్తు

“సుశిక్షితుడైన సారథి గుర్రాలను అదుపులో పెట్టేటట్టు, ఏ ఆత్మ నా మనుస్సుని నియంత్రిస్తోందో, హృదయంలో ప్రతిష్టితమై ఉందో, నిత్య యవ్వనంలో ఉంటుందో, వేగవంతమైనదో, ఆ ఆత్మ సదా నా మనుస్సుని సత్సంకల్పం చేసేలా ప్రేరేపించుగాక.”

ఇది గుర్తు పెట్టుకుని మనుగడ సాగించు. ఇదే సరైన దారి, నాన్యః పంధా విద్యతే అయనాయ. నీకు పరమేశ్వరానుగ్రహం ఎల్లప్పుడూ ఉండు గాక.” అని కమండలంలోని జలం బండరాయిగా ఉన్న సాకేతుడి మీద చిలకరించి శంకరులు ముందుకి కదిలారు.

(కల్పితం)