చివరకు మిగిలేది

పెద్దయ్యాక నేనో గొప్పవాడౌతాడనుకునే నాన్నా
తనబ్బాయో రారాజనుకునే అమ్మా
ఉద్యోగంచేసి నన్నుద్ధరిస్తాడనుకునే చెల్లెలూ
బెంగగా ఎదురుచూసే తోబుట్టువులూ
అందరూ వెళ్ళిపోయారు

యవ్వనంలో వేడిగా ప్రేమించిన ప్రేయసీ,
చిన్నప్పుడు నన్నో హీరో అనుకున్న పిల్లలూ,
బావగారో మంచి బాలుడనుకునే మరదలూ,
అల్లుడో గొప్ప మనిషనుకునే అత్తగారూ
వీళ్ళెవరూ ఇప్పుడు లేరు.

వళ్ళు ఉడికించే రక్తం
కొండలైనా పిండిచేయగల బలం
వడివడిగా నడిపించే యవ్వనం
దేన్నేనా ఎదుర్కోగల ధైర్యం
అన్నీ విడిచిపెట్టాయి.

గుండెల్లో గుబులు పుట్టించే జ్ఞాపకాలూ
కళ్ళల్లో నీళ్ళు తెప్పించే స్మృతులూ
ప్రాణం ఎప్పుడు పోతుందోనన్న భయం
మెల్లిమెల్లిగా మూసుకుపోయే హృదయకవాటాలూ
మాత్రమే ఇంకా మిగిలున్నాయి.

చేద్దామని చేయలేకపోయిన పనులూ
నిత్య యవ్వనంలో కొట్టుకుపోతున్న మనస్సూ
రజోగుణంతో అత్యుగ్రమైన కోరికలూ
ఇంకా చాలాకాలం బతకాలనే దురాశా
ఇంకా అలాగే కొట్టుమిట్టాడుతున్నాయి.

అయినా ప్రభూ

ఎప్పటికైనా మారతాననీ
నీ నామం పలుకుతూ అన్నీ త్యజిస్తాననీ
నీ కోసం ఒక్కడుగైనా ముందుకొస్తాననీ
ఇంకొక్కసారి క్షమించి చూద్దామనీ
వచ్చే జన్మలో తప్పకుండా మారతాననీ
నీకు నువ్వే చెప్పుకుని నన్నంటిపెట్టుకున్నావా?