వందేమాతరం

హిమపాతాలు, మంచుమణుల మాలికలు
ఛాయాచిత్రాలలో మాత్రమే మిగులుతాయేమో
ముత్యాల కూపాలు, పగడాల ద్వీపాలు
భూగోళ చిత్రాలలో మాత్రమే మిగులుతాయేమో
శార్దూలాలు, మత్తేభాలు, హరిణులు, కోకిలలు
కావ్యాలలోని పద్యాలలో మాత్రమే మిగులుతాయేమో
జలచరాలు, భూచరాలు, ఖేచరాలు
అగోచరాలై పోతే మిగిలేది
చిల్లులు పడ్డ ఆకాశం
పెల్లుబికిన సముద్రం
కుంచించుకొన్న భూఖండం
నిర్జీవమవుతున్న నిఖిలం
తల్లీ
వందేమాతరం

నదులు సాగరాలు మలినాకరా లవుతున్నాయి
మహారణ్యాలు మరుభూము లవుతున్నాయి
మహీతలం వేడితో మాడిపోతూ ఉంది
పాడిపంటలు పాడవుతున్నాయి
తల్లీ
సుజలాం సుఫలాం మలయజశీతలాం
సస్యశ్యామలాం మాతరం
వందే మాతరం

కలుషితమైన అంతరిక్షంలో
మసకబారిన వెన్నెలలో
రాగాలకు బదులు రాత్రులు
రోగాల మూలుగులతో మ్రోగిపోతున్నాయి
నేల బీటలువారి చెట్లు ఎండిపోతున్నాయి
తల్లీ
శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం
ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీం

మేము కలలు గన్న వరాలేనా
ఈ బాధ, వేదన, రోదన
వికసించలేని నవ్వుల పువ్వులు
మూగవోయిన మధుర వాణులు
కష్టభూయిష్ఠమైన జీవితాలు
ఎండమావులలో జలక్రీడలు
తల్లీ
సుహాసినీం సుమధురభాషిణీం
సుఖదాం వరదాం మాతరం
వందే మాతరం

శైలాగ్రంనుండి అగాధం చేరడానికి
ఒక్కడుగు మాత్రమే చాలు
ఆశ పేరాశగా మారి
దురాశగా రూపొంది
నేడు నిరాశ అయిపోయింది

అయిపోయింది
అంతా అయిపోయింది

చివరకు మిగిలేది
అన్ని గ్రహాలవలె
సౌరకుటుంబంలో
మరొక నిర్జీవమైన గ్రహం
మన గృహం
తల్లీ
వందే మాతరం