ఆహా

తొలిసంధ్యలో పూసే పూలకి
పురిటిస్నానం చేయించే మంచు
మలిసంధ్యలో రాలే పూలకి
ఆఖరి స్నానం చేయించేదీ మంచే

రెండు సంధ్యల మధ్య
అనాదిగా అదే కావ్యం
ఎన్నిసార్లు చదివినా
తనివి మాత్రం తీరదు


గుడ్డుని పగలగొట్టుకుని
లోకాన్ని తొలిసారి చూసే
పాముపిల్ల కళ్ళల్లో ఆశ్చర్యం

ఎన్ని యుగాల స్మృతుల్ని నింపుకున్నా
నా కళ్ళలోనూ అదే ఆశ్చర్యం!


నాతో పాటు కళ్ళు తెరిచి
నాతో పాటు కళ్ళు మూసే లోకం
నా కనురెప్పల వెనకే
అనంత విశ్వం!

నిద్రపోయే పసిపాప
కనురెప్పల వెనక
ఎన్ని అద్భుత లోకాలున్నాయో!

ఎప్పుడూ విస్మయంతో
పాపని నేనూ..
నన్ను పాపా..


సాయంత్రపు చలిమంట
ఎండుపుల్లలు చిటపటమంటుంటే
ఎర్రగా అటు ఇటు ఊగే
అగ్ని కీలలు

దట్టమైన అడవి
రాలిన ఆకుల మధ్యనుండి
జర జరా పాకే
నాగుపాము

భయానకంలో సౌందర్యం
కళాకారుడి కళ్ళకో నమస్కారం!


కొండలకి జ్ఞానోదయాన్ని కలిగిస్తూ
ఏడు గుర్రాల వాడు
మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా
వాడు మాత్రం ఆగడు

చీకటిని కప్పుకుని నిద్రపోయే చెట్లమీద
మంచు చిలకరించి మరీ లేపుతాడు
బరువుగా మూసిన కనురెప్పల్ని
కిరణాలతో గుచ్చి మరీ తెరుస్తాడు

గుండెని..
నిండుగా తెరిచే
ఒకే ఒక్క కిరణం కోసం
జన్మ జన్మల నిరీక్షణ


భూమిని చీల్చుకు వచ్చి
లోకాన్ని ఆశ్చర్యంతో తిలకిస్తూ
పచ్చగడ్డి

నన్ను నేను చీల్చుకుని
అంతర్లోకాన్ని విస్మయంతో తిలకిస్తూ
నేను

నేను.. పచ్చగడ్డి..
పచ్చగడ్డి.. నేను..
ఈ మహాప్రకృతిముందు
నేనొక గడ్డిపోచను


ఉప్పు కరిగాకే
కూరంతా వ్యాపిస్తుంది

“నేను” కరిగిపోతే
విశ్వమంతా వ్యాపించనూ?


ఒకటి… రెండు… మూడు…
గడియారం క్షణాల్ని..

ఒకటి… రెండు… మూడు…
నేల చినుకుల్ని..

ఒకటి… రెండు… మూడు…
తీరం కెరటాల్ని..

ఒకటి… రెండు… మూడు…
నేను నాలోని “నేను”ల్ని


“నేను” పెరిగేకొద్దీ
కన్నీరు కూడా..

ఆ నదిని దాటాలని
నిర్మించని వంతెన లేదు
మధ్యలోకి వెళ్ళగానే
కూలిపోని వంతెనా లేదు

దేన్ని దాటాలనుకుంటామో
దాంట్లోనే మునిగిపోతాం!


రైలు ప్రయాణించినంతసేపూ శబ్దమే
నీలోనే వెతుక్కోవాలి నిశ్శబ్దాన్ని..

రైలుకిటికీలోంచి
అనంతంలోకి విసిరేసుకుంటూ..
ప్రయాణంలో..
మరొక ప్రయాణం

ఈ చిన్ని ప్రయాణంలో
ఎన్ని ప్రయాణాలో?


“అయ్యో నిన్న చెయ్యలేదే..
పోనీ రేపు చేద్దాం”
“నిన్న” “రేపు”ల మధ్య
మోసపోతూ “నేడు”

కాలం జాలంలో పడి
గిలగిలలాడని వాడెవడు?

ఆలోచించి ఆలోచించి కాలం
అంతరంగానికి అద్దమేనని గ్రహించి
ఆ కాళ్ళకి నమస్కరిద్దా మనుకునేసరికి
నాకు అందనంత దూరంలో..


కోటి ఆలోచనలతో
ఏటి ఒడ్డున

ఎక్కడనుంచో వచ్చి
ఎక్కడికో వెళ్తోందా?
రావడం వెళ్ళడం
అంతా అబద్ధమేనా?

దేహంతోనే సందేహం
రెండూ సహజాతాలేనా?

అన్ని ప్రశ్నలు
ఒకటే జవాబు
మృత్యువు

ఆమె తలుపులు మూయదనీ
భళ్ళున తెరుస్తుందనీ
ఎంతమందికి తెలుసు?

అన్నీ వదులుకుంటే
ప్రతీదీ నీదవుతుంది
మృత్యువును ప్రేమించు
జీవించడం నేర్పుతుంది


విరహంతో పిలిచే చెట్లకీ
విహాయసాన విహరించే మేఘాలకీ
ఏనాటిదో చినుకుల బంధం

వర్షం కురిసిన ప్రతిసారీ
ఆమె గుర్తుకు రావడంలో
ఆశ్చర్యం ఏముంది?

కవిత్వానికి ఋణపడ్డాను
ప్రేమించడం నేర్పినందుకు.


కొలనులోనే ఉంది
కానీ కొలనులో లేదు
తామరాకు

ఆశించడంలోనే
నాశనం ఉందా?

కవితాత్మకంగానే అయినా
భగవద్గీతని
మళ్ళీ రాయడానికి
మనసొప్పడం లేదు

కృష్ణ పరమాత్మా ఈ
తృష్ణ తీర్చగ రావా?
మీరా రాయని కీర్తన.

“గోడో” ఎప్పటికీ రాడు నీ
గోడు ఎప్పటకీ వినడు

నచికేతా
కఠోపనిషత్
కఠినంగా ఉందా!

తరచి తరచి చూశాకా..
దేనికీ అర్ధంలేదని తెలిశాకా..

నిఘంటువును చూస్తే
నవ్వొస్తోంది


ఆ సాయంత్రం
అదే ఏటి ఒడ్డున..

సెలయేరు మీద
చీకటి వెలుగులు రాస్తున్న
చిత్ర లిపిని చదువుతూ

దేనికీ అర్ధం లేదంటే..

చిరు నవ్వు నవ్వుతూ
ఆమె అన్నది కదా…

“నీకు అర్ధం కానంత మాత్రాన
అర్ధం లేనట్టేనా?”


గలగలమంటూ సెలయేరు
ఏవో రహస్యాలని
గానం చేస్తుంటుంది

పసిపాప తప్పటడుగుల్లో
ప్రపంచాన్ని బంధించే
లయ వినిపిస్తుంది

పూలు రాలిపోతూ
ఇంతే.. ఇంతే..
అని నవ్వుతుంటాయి

విశాలమైన మైదానాల్లో
విశృంఖలంగా సంధ్య
నర్తిస్తునే ఉంటుంది

కడలితో సంగమించే
నదిలో ఆనందం
సుళ్ళు తిరుగుతుంది

పిల్లనగ్రోవి రంధ్రాలు
ఏవో పురాతన సొరంగాల్లోకి
తీసుకుపోతునే ఉంటాయి

అనంతంగా ఆకాశం
అధివాస్తవిక చిత్రాల్ని
గీస్తునే ఉంటుంది

ప్రకృతి తమలో నింపిన సంగీతాన్ని
తిరిగి ప్రకృతిలోనే ఐక్యం చేస్తూ
పక్షులు పాడుతుంటాయి

పువ్వులు..పక్షులు..సెలయేళ్ళు.. ఆకాశం..
ఆమె దగ్గర్లోనే ఉందని నాకు చెప్తునే ఉంటాయి.


మలిసంధ్యలో రాలే పూలే
తొలిసంధ్యలో పూసే పూలు
సూర్యుడు ఇక్కడ అస్తమించేది
ఇంకెక్కడో ఉదయించడానికే

రెండు సంధ్యల నడుమ
అనంతంగా ఇదే కావ్యం
ఎక్కడెక్కడో వెతక్కు
సమాధానం ఇక్కడే ఉంది!


మొగ్గలో
అనంత విశ్వం ముడుచుకుంటుంది
పువ్వులో
విశ్వ నేత్రం తెరుచుకుంటుంది

యుగాలుగా దిగబడ్డ
ప్రశ్నార్థకాలన్నీ
పెకిలించాకా

చీకటి సముద్రపు లోతుల్లో
పాతిపెట్టబడిన సూర్యుడు
మెల్ల మెల్లగా..
పైకొస్తుంటే..

నా నోటి నుండి వెలువడే
చరమ వాక్యం….

ఆహా!!!

రచయిత మూలా సుబ్రహ్మణ్యం గురించి: ఐదేళ్ళ క్రితం కవిత్వం రాయడం ప్రారంభించి, యాభైకి పైగా కవితలు, పది కథలు, మరికొన్ని వ్యాసాలురాసారు. "ఏటి ఒడ్డున " అనే కవితా సంకలనం ప్రచురించారు.  ...