కేయాటిక్ సమీకరణం

ఏవిటో నిన్నటికి ఇవాళ్టికి తేడా?
నిన్నటి కలల్లోంచి మొలకెత్తిన ఈ రోజు
రేపటికి నిన్నటి ఙ్ఞాపకవైపోదా !
మొన్నటి ఉగాదిలాగే రేపటి ఉగాది
నిన్నటి వసంతవైపోదూ?

ఎప్పుడు కట్టిన మావిడి తోరణాలివి
గుమ్మంలోంచి గుండెల్లోకీ గుచ్చిన
ఈ పచ్చ పచ్చని ఙ్ఞాపకాలు
గానం తప్ప రూపం తెలియని
ఏ కోయిల పాడిన పాటలివి

అప్పుడప్పుడే పవిటలు వేసుకోవడం
నేర్చిన పడుచుపిల్ల కళ్ళ మెరుపుల్లో
గాజుల గలగలల్లో, గజ్జల సవ్వడుల్లో
వాల్జడల వంపు సొంపుల్లో
ఒదిగిపోయి నా మనసులో
నిలిచిపోయిన ఈ వాడిన మల్లెల
నిన్నటి వసంత గానం – ఆ మొన్నటి
కలల్లో వినిపించిన ఉగాది రాగం కాదూ?

ఏ దేశాలకి పోను నేనిపుడు
ఏ తీరాల్లో వెదకను నేనిపుడు
పాదాల పైకి చెక్కిన పావడాలకోసం
ఘల్లుమనే గజ్జలకోసం
నడువుని మెరుపుగ చేసిన
పచ్చ పచ్చని పైటలకోసం
ఏ లోకాలకి పోను నేనిపుడు
నాయన తలమీద చుట్టిన పైపంచకోసం
చవటకి కారి జారిన అమ్మ కుంకుమ బొట్టు కోసం

ఏ ఙ్ఞాపకాల్ని తవ్వను నేనిపుడు?
ఏ కలల్లోకి తిరోగమించను
నవరాత్రుల్లో కనిపించే
వంద రకాల కృష్ణుల కోసం
ఆడిపాడే దశరా పులుల కోసం
పాటతో పండగని తెచ్చే హరిదాసుల కోసం
కలగా మారిపోయిన పెద్ద పండగ కోసం
మెదడు లోతుల్లో ఎక్కడని వెతకను

వొక తరం గడచిపోయింది నిజవే
బతుకుతో వొక రణం ముగిసిపోయింది
ఏవిటిది కూలిన అలమీద నాకీ మమకారం
ఏవిటిది పడగెత్తిన వర్తమానం
ఎందుకని ఇంత దూరం దూరం?

గోడకి కొట్టిన పిడక
ఇంటి ముందర కళ్ళాపు
పండగ నెల్లో గొబ్బెమ్మా
నానా అది బుల్ షిట్టు
నా కూతురి మాటల్లో
నాకు మా నాయనకి తెలియని
విచిత్రం, అసహ్యం, అశుభ్రం

శూన్యంలోంచి మొలకెత్తిన మొక్కలా
ఈ రోజునే, ఈ నిమిషాన్నే
నిన్నా మొన్నలతో ప్రమేయం లేకుండా
గబుక్కున, కేయాటిక్ సమీకరణంలా
ఉవ్వెత్తున లేచిన ఈ తరంలో
కూలిన అలల గుర్తులేవి?
నిన్నటి తరం అనుభవాలేవి?
వసంత కోయిలల సంగీతోత్సవపు ఙ్ఞాపకాలేవి?