ఏది నిజం? – “రషోమాన్” జాపనీస్ సినిమా


వికీపీడియా సౌజన్యంతో

జరిగినవి రెండు సంఘటనలు. ఒక సైనికుని హత్య, అతని భార్య పై బలాత్కారం. ఈ సంఘటనలలోని ప్రత్యక్ష పాత్రల కథనం, ప్రత్యక్ష – పరోక్ష సాక్షుల కథనం ఒకరు చెప్పిన దానికి, మరొకరు చెప్పిన దానికి పొంతన లేదు. ఈ ప్రపంచంలో “పరమసత్యం” అన్నది లేదా? ఒకటి కన్నా మరొకటి నిజం. ఒకటి కన్నా మరొకటి అబద్ధం. ఇదేనా “జీవిత సత్యం”?

1950 సంవత్సరంలో, అప్పటికి ఎక్కువ మందికి తెలియక పోయినా ఆ తరవాత కాలంలో అంతర్జాతీయ సినిమా దర్శకుల్లో గొప్ప పేరు వచ్చిన జాపనీస్ సినిమా దర్శకుడు అకీరా కురొసోవా (Akira Kurosawa) తీసిన సినిమా “రషోమాన్” (Rashomon) కథకు మూలం పైన చెప్పిన తాత్వికమైన ఆలోచన. “రషోమాన్” అంటే, జపాన్ భాషలో “కోట సింహద్వారం” అని అర్ధం. ఒక తుఫాను రోజు, కుండపోతగా వర్షం పడుతుండగా, తడవకుండా తలదాచుకోడానికి పాడుబడ్డ కోట సింహద్వారం దగ్గరకి వచ్చిన పాత్రలతో సినిమా మొదలయ్యి, ఆ పాత్రలతోనే అదే కోట సింహద్వారం దగ్గర సినిమా పూర్తి అవుతుంది. మొత్తం సినిమా కథ అంతా ఈ పాత్రల మధ్య వచ్చే సంభాషణలు, వాళ్ళు చెప్పే చిన్న చిన్న సంఘటనల ద్వారా తెలుస్తుంది.

ఈ సినిమాలో జరిగిన కీలకమైన సంఘటనలకి నాలుగు పాత్రలు సాక్షులు. ముఖ్య నిందితుడుగా ఒక బందిపోటు దొంగ, చనిపోయిన సైనికుడు (ఇతని ఆత్మను బతికున్న ఒక వ్యక్తిలోకి రప్పించి సాక్ష్యం చెప్పిస్తారు), సైనికుని భార్య, ఈ సంఘటనలకి ప్రత్యక్ష సాక్షిగా ఒక కట్టెలు కొట్టేవాడు. అన్నిటి కన్న కట్టెలు కొట్టేవాడి కథనం చిత్రంగా ఉంటుంది. వీళ్ళు కాక, ఒక బౌద్ధ సన్యాసి, ఒక దారినపోయే వాడు కూడా పాత్రలే. ఒక సంఘటనలోంచి, అది పూర్తి కాకుండా, మరొక సంఘటనలోకి వెడుతూ కథ సాగుతుంది కాబట్టి, కథ అర్ధం చేసుకోటం ముందు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. (సినిమా పూర్తి అయ్యేసరికి జాగ్రత్తగా చూసినట్టయితే కథ మొత్తం అర్ధం అవుతుంది.) కానీ, కథ ఇలా విలక్షణంగా చెప్పటంలోనే, విజయం సాధించాడు దర్శకుడు కురుసోవా. అందువల్లే, రషోమాన్ సినిమాతో అకీరా కురొసోవా పేరు అంతర్జాతీయంగా సినిమా అభిమానులకు తెలిసింది. ఈ సినిమా అత్యుత్తమ విదేశీ సినిమాగా అకాడమి బహుమతి గెలుచుకుంది.

అసలు కథ

కథా కాలం 11 లేదా 12 శతాబ్దం. జపాన్ దేశంలో ఒక దట్టమైన అడవిలో, కొండల మధ్యలో ఒక సైనికుడు (జాపనీస్‌లో ‘సామురాయ్’) హత్య చేయబడటం, ఆ సైనికుని భార్య మానభంగం కావడం — ఈ రెండు సంఘటనల చుట్టూ కథ తిరుగుతుంది. ఈ రెండు పనులకి ముఖ్య నిందితుడిగా ఒక బందిపోటు దొంగ. కానీ, సినిమా చూసే ప్రేక్షకులు అసలు అడవిలో ఆ రోజు ఏం జరిగిందో నిర్దుష్టంగా తేల్చుకో లేకపోతారు. ఎందుకంటే, ఈ ప్రధాన పాత్రలు మూడూ కూడా ఎవరికి వారే తాము తప్పు చెయ్యనట్టుగా ఉండే పరస్పర విరుద్ధమైన కథనాలు వినిపిస్తాయి. ఈ మూడు ప్రధాన పాత్రల కథనాలను ఇద్దరు పరోక్ష సాక్షుల ద్వారా చెప్పిస్తాడు కురొసోవా. అందులో ఒకరు – చనిపోయిన సైనికుని శవాన్ని మొదటిసారిగా చూసి, ఊరి అధికారులకి చెప్పిన ఒక కట్టెలు కొట్టేవాడు. రెండో పరోక్ష సాక్షి – భార్యాభర్తలను అతి కొద్ది క్షణాలు అడవిలో చూసిన ఒక బౌద్ధ సన్యాసి. పూర్వ కథా ప్రకాశన (ఫ్లాష్‌బాక్) ల మధ్య ఒక న్యాయసభలో తాము ఏం చూసామో ఈ ఇద్దరు సాక్షులు కోట సింహ ద్వారం దగ్గరకి వర్షంలో తడవ కుండా ఉండటానికి వచ్చిన ఒక దారేపోయేవాడితో చెప్పటం జరుగుతుంది. ఈ సినిమాలో న్యాయాధిపతి కనపడడు, వినపడడు. ప్రేక్షకులే న్యాయ నిర్ణేతలు. అన్యాపదేశంగా కథను ఇలా చెప్పటం వల్ల ఈ సినిమా యొక్క ప్రయోజనం రెట్టింపు అయినట్టు అనిపిస్తుంది.

బందిపోటు కథనం


తొషిరో మిఫూనె
మచోకి క్యో

సైనికుని భార్య మానభంగం, సైనికుని హత్య తరవాత పారిపోతున్న బందిపోటు అనుకోని పరిస్థితుల్లో ఊరి అధికారులకు పట్టుబడతాడు. ఊరి అధికారులకు అడవిలో ఏం జరిగింది అన్నదానిపై బందిపోటు ఒక శృంగారపరమైన కథ చెపుతాడు. “మూడు రోజుల క్రితం మిట్ట మధ్యాహ్నం, అడవిలో ఒక రహదారి పక్కనే వేసవి వేడికి నేను సేద తీర్చుకుంటుండగా, తన భార్యను గుర్రం మీద ఎక్కించుకొని, గుర్రాన్ని నడుపుకుంటూ ఒక సైనికుడు కనిపించాడు. సైనికుని భార్య ముఖం కనిపించకుండా ఒక ముసుగు కప్పుకుంది. అంతలో వీచిన చల్ల గాలికి, ఆమె ముసుగు తొలగి ఆమె అందమైన ముఖం నాకు కనిపించింది. అప్పుడే నిశ్చయించుకున్నా ఆమెను అనుభవించాలని. ఏదో ఒక వంకతో ఆ సైనికుడ్ని దూరంగా తీసుకెళ్ళి, నేను సైనికుణ్ణి నా బలంతో జయించి కట్టేసిన తరవాత, అతని భార్యను నేను మచ్చిక చేసుకున్నాను. అందుకు సైనికుని భార్య చాలా సహకరించింది. ఆ తరవాత నేను ఒక పెద్ద మనిషిని కాబట్టి, దయతలచి, కట్టిన ఆ సైనికుడి కట్లు విప్పి, కత్తితో ధర్మయుద్ధంలో అతణ్ణి జయించి, చివరకి చంపేసాను!”

సైనికుని భార్య కథనం

మానభంగం కాబడ్డ సైనికుని భార్య తన కథనంలో తాను ఎలాంటి అసహాయతకు గురి అయిందో చెపుతుంది. ముందు తన బలంతో తనను మానభంగం చేసిన బందిపోటు, ఆ తరవాత కఠినుడైన తన భర్త చూసే చూపులు, దాల్చిన మౌనం వల్ల ఆదర్శ స్త్రీలు అందరు అనుభవించే మనోవేదన వల్ల, తాను స్పృహ తప్పిపోటం, స్పృహ వచ్చిన తరవాత చూస్తే ఎప్పుడూ తన దగ్గరే ఉండే తన బాకు తన భర్త గుండెల్లో పూర్తిగా దిగి ఉండటం చూసానంటుంది. ఈమె కథనం ప్రకారం, బందిపోటుకు, తన భర్తకు మధ్య అసలు కత్తి యుద్ధమే జరగలేదు. ఇలా చెప్పటంలో, తను స్పృహలో లేనప్పుడు కట్లతో ఉన్న తన భర్తను తానే చంపానేమో అన్న అర్ధం ధ్వనిస్తుంది.

సైనికుని (ఆత్మ) కథనం


మసాయుకి మోరి

వీటన్నిటిని మించి విచిత్రమైంది మూడో కథనం. ఇది, చనిపోయిన సైనికుని ఆత్మను బ్రతికున్న ఒక మనిషి లోకి రప్పించి చెప్పే కథనం. పై రెండింటికన్నా భిన్నంగా ఉంటుంది. (ఈ కథనాన్ని కట్టెలు కొట్టేవాడు ఒప్పుకోడు. ఎందుకంటే, మొదటిసారిగా సైనికుణ్ణి శవంగా చూసానని ముందు చెప్పినా, ఈ మూడో కథనంలో కట్టెలు కొట్టేవాడు అసలు విషయాన్ని బైట పెడతాడు. సైనికుని హత్య, అతని భార్య మానభంగం — రెండింటినీ కట్టెల కోసం చెట్టెక్కిన తను ప్రత్యక్ష సాక్షిగా, వివరంగా చూసానంటాడు.) సైనికుని కథనం ప్రకారం, అతని భార్య, బందిపోటుతో చేతులు కలిపి కౄరుడైన తన భర్తను చంపమంటుంది. కానీ, బందిపోటు తన విశాల హృదయం చూపించటం కోసం సైనికుణ్ణి వదిలేసి అతని భార్యని చంపుతానంటాడు. ఈ గొడవలో సైనికుని భార్య తప్పించుకు పోతుంది. దయతలచి బందిపోటు తన కట్లు తీసిన తరవాత, తను కూర్చొని కొంతసేపు ఏడ్చి, చివరగా ఆత్మ హత్య (hari – kiri) చేసుకున్నానంటాడు. ఈ కథనంతో ఒప్పుకోని కట్టెలు కొట్టేవాడు బందిపోటు కథనాన్ని ఒక చిన్న సవరణతో ఆమోదిస్తాడు. కట్టెలు కొట్టేవాడి కథనంలో బందిపోటుకీ, సైనికుడికీ మధ్య జరిగిన యుద్ధం వీరోచితమైనది కాదు, పిరికివాళ్లు చేసే ఒక నికృష్టమైన యుద్ధం.

కట్టెలు కొట్టేవాడి కథనం

ఒక పేరు లేని కట్టెలు కొట్టేవాడు, న్యాయాస్థానంలో, విచారణ సమయంలో, “అడవిలో మూడు రోజుల ముందు కట్టెలు కొట్టడానికి వెడుతూ, ఒక సైనికుడి శవాన్ని చూసాను. ఆ శవాన్ని చూడగానే భయపడుతూ, దగ్గరలో ఉన్న ఊరి అధికారులకి చెప్పటానికి పరిగెట్టాను. అంతకన్నా, నాకు ఇంకేం తెలియదు” అంటాడు. నిజానికి “అడవిలో అసలు ఏం జరిగింది?” అన్న దానికి ప్రత్యక్ష సాక్షి ఇతడు. కానీ, ఆ సంగతి కోట సింహ ద్వారం దగ్గర బౌద్ధ సన్యాసికి, దారేపొయ్యేవాడికి మాత్రమే చెపుతాడు.

సాంకేతిక ప్రకర్ష

ఈ సినిమా స్క్రీన్‌ప్లే కోసం కురొసొవా, షినొబు హషిమోటో (Shinobu Hashimoto) తో కలిసి పని చేసాడు. అప్పటి కాలానికి తగ్గట్టు తెలుపు – నలుపులో తీసిన రషోమాన్ విజయానికి కారణం ఈ సినిమాలో ఏం చెప్పారో అన్న విషయం కాదు. ఏం చెప్పలేదో అన్నదానితో పాటు, సినిమాటోగ్రఫి, ద్వంద్వాన్ని సూచించే అడవిలోని ఆకులు, వాటి నీడలు, సినిమా అంతటా పాత్రల్లో కనపడే భయం, ఆందోళన, ఆశ్చర్యం, ముఖ్య పాత్రల మొహాల్లో నిశ్శబ్దంగానే కాక ప్రస్ఫుటంగా కనపడే హావభావాలు కూడా కారణాలే. అన్నిటి కన్నా ముఖ్యమైన విషయం – మనిషి నమ్మకాలలో గాఢంగా ఉండే “చూసేదంతా నిజం” అన్న నమ్మకాన్ని చావు దెబ్బ తీస్తుంది రషోమాన్.

చిన్న చిన్న విషయాల్లో, మనిషికి, మనిషికి మధ్య అభిప్రాయ భేదాలు రావడం సహజం. కానీ, రషోమాన్ సినిమాలో సైనికుడు కత్తి దెబ్బల వల్ల చనిపోయాడా లేక బాకు గుండెల్లో పొడవటం వల్ల పోయాడా అన్న సంగతే తేలదు. సింహద్వారం వద్ద కట్టెలు కొట్టేవాడు, బౌద్ధ సన్యాసి, దారినపోయేవాడి మధ్య రకరకాలైన కథనాల చర్చ తరవాత, కురొసోవా సినిమాని ఒక రకంగా తడబడుతూ ముగిస్తాడనిపిస్తుంది! కానీ, ఈ సినిమాకి కొసమెరుపు ముగింపు.

రషోమాన్‌కి సినిమాటోగ్రఫి (అంటే ఛాయాగ్రహణం అనొచ్చు) ఇచ్చిన కాజువో మియాగావా (Kazuo Miyagawa) గురించి చెప్పకపోతే, అన్యాయమే అవుతుంది. ఈ సినిమాలో కెమేరా కూడా నటించింది అంటే ఆశ్చర్య పోనక్కరలేదు. ఈ సినిమా తీసేనాటికి 42 ఏళ్ళ వయసున్న కురొసోవా, 44 ఏళ్ళ వయసున్న మియగావా తో కలిసి పనిచేయటం – ఈ అరుదైన కలయికే రషోమాన్ విజయానికి కారణం. మియగావా పనితనం, కొన్ని లాంగ్ షాట్‌లలోనూ, కొన్ని క్లోజప్ షాట్‌లలోనూ కనపడుతుంది. ఉదాహరణకి, కట్టెలు కొట్టేవాడు శవం చూసే ముందు, అడవిలోకి వెడుతున్నప్పుడు, కురొసోవా కావాలనే కట్టెలు కొట్టేవాడి నడక ఎక్కువసేపు (పూర్తిగా రెండు నిమషాలు) పెట్టాడు. ఈ నడకలో, కట్టేలు కొట్టేవాడ్ని ఒక లాంగ్ షాట్‌లో దూరంగా చూపిస్తూ, అదే షాట్‌లో క్లోజప్ చూపించి, కెమేరా కుడి నుంచి ఎడమకు తిప్పుతూ, ఒక అద్భుతమైన షాట్ తీసాడు మియాగావా. ఇటువంటి పనితనం చూసి “నేను ఆశ్చర్యపోయా” అని కురొసొవాయే చెప్పుకున్నాడు. అలాగే, కోట ద్వారం దగ్గర వర్షాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు, కోట వెనకాల ఉన్న తెల్ల బాక్‌గ్రౌండు వల్ల వాన కనపడేది కాదు! అందుకోసం, మియాగావా సలహా మేరకు నీళ్ళలో నల్ల సిరా కలపటం వల్ల వర్షం ఎఫెక్టు చాలా బాగా వచ్చింది.

ముగింపు

కట్టెలు కొట్టేవాడు, బౌద్ధ సన్యాసి, దారినపోయేవాడితో చర్చలు అవుతూ ఉండగా, దారినపోయేవాడు ఉన్నట్టుండి ఒక చంటి పాప ఏడుపు వింటాడు. కోట సింహద్వారం దగ్గర ఒక శాలువలో చుట్టి ఎవరో వదిలేసిన చంటి పాప ఏడుపది. అది వినగానే దారిన పొయ్యేవాడు, ఆ శాలువా దొంగిలించి పారిపోతూ ఉంటే, కట్టెలు కొట్టేవాడు, వాడిని “పాపిష్టి వెధవ” అని తిడుతూ ఆపటానికి ప్రయత్నిస్తాడు. దానికి ఆ దారేపోయేవాడు, ఆ చంటి పాపను కని వదిలేసిన తల్లి తండ్రులు దౌర్భాగ్యులు, కట్టెలు కొట్టేవాడు ఒక అబద్ధాలకోరు, బహుశా హంతకుడేమో కూడా అని అరుస్తూ, శాలువా తీసుకొని, వర్షంలో తడుస్తూ వెళ్ళి పోతాడు. ఆ చంటి పాపను పట్టుకొని సన్యాసి, కట్టెలు కొట్టేవాడు వర్షం వెలిసి సూర్యుడు వచ్చేదాకా ఆగుతారు. “నాకు ఆరుగురు పిల్లలున్నారు, ఈ పిల్ల మరేమీ పెద్ద భారం కాదు. నే తీసుకుపోయి పెంచుకుంటా” నంటాడు కట్టెలు కొట్టేవాడు. జీవితం మీద, మానవత్వం మీద నమ్మకం ఇంకా ఉందని సన్యాసి సంతోషిస్తూ ఉండగా, వర్షం వెలసి, విడిపోతున్న మబ్బుల వెనకగా ప్రకాశిస్తున్న సూర్యుడి రాకతో సినిమా పూర్తి అవుతుంది.

నటీనటులు, విమర్శలు


తొషిరో మిఫూనె

రషోమాన్‌లో నటించిన నటీనటులంతా అద్భుతంగా నటించారన్నది నిజమే కానీ, బందిపోటుగా నటించిన “తొషిరో మిఫూనె” (Toshirō Mifune) నటన కొంచెం “అతి” గాను, పిచ్చిగానూ ఉండటమే కాక, ఈ పాత్రకు ఇవ్వవలసిన దానికన్న ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చారేమో అనిపిస్తుంది. ఈ సినిమాతో ఒక గొప్ప నటుడిగా తొషిరో ప్రేక్షకులకు పరిచయం అయినా, “నటనంటే ఇలా ఉండాలి” అనిపించేట్టు నటించిన నటుడు సైనికుని పాత్రధారి, “మసాయుకి మోరి” (Masayuki Mori). అప్పటికే, జపాన్‌లో ఇతను ఒక పెద్ద రంగస్థలనటుడు కూడా. బందిపోటు పాత్ర కన్నా, సైనికుని పాత్ర తక్కువ ప్రస్ఫుటంగా కనపడ్డా, మసాయుకి చూపించిన హావభావాలు ఇతరులు అనుకరించలేనివి. అన్ని పాత్రల కథనాల్లో మసాయుకి చూపించిన విలక్షణత గమనించతగ్గది. ఒక వైపు బందిపోటుతో తన పరాజయం, ఆ పై తన కళ్ళ ఎదుటే తన భార్య మానభంగం, తన నిస్సహాయత, ఇన్ని విరుద్ధమైన భావాలను చాలా ప్రతిభవంతంగా చూపించాడు. ఈ పాత్రలో కనుబొమ్మలు పైకి ఎత్తటం, కిందకి దించటం ద్వారా, నిజం – అబద్ధాల మధ్య ఉన్న తేడాలని చూపెట్టాడు. సత్యాసత్యాల మధ్య ఉన్న తేడాలను నటనలో చూపించగల నిపుణుడు మసాయుకి.

అందరికంటే అతి తక్కువ ప్రాముఖ్యం గల పాత్ర “మచోకి క్యో” (Machiko Kyō) నటించిన సైనికుని భార్య పాత్ర. ఈ పాత్ర కన్నా ఇంకా నిడివిగల పాత్ర ధారి “కిచిజీరో ఉయేడా” (Kichijiro Ueda) వేసిన దారినపోయే వాడి పాత్ర కూడా “మనుష్యులు అంతా అసహ్యమైన విషయాలు తొందరగా మరచిపోతారు! వాళ్ళు ఏం గుర్తుంచుకోవాలని అనుకుంటారో, వాటినే గుర్తుంచుకుంటారు!” వంటి మంచి డైలాగులు చెపుతుంది. సాధారణ ప్రేక్షకుడు అతి తేలిగ్గా అన్వయించుకో తగ్గ పాత్ర ఇది.

ఈ సినిమా సారాంశం ఎంత శక్తి వంతమైనదంటే మనస్తత్వ శాస్త్రంలో ఈ సినిమా పేరుతో ఒక నిర్వచనం కూడా ఉంది. ఒకే సంఘటనకి సాక్షులైన వారి కథనాల్లో, వారి వారి దృక్పథాన్ని బట్టి పరస్పర విరుద్ధత జనిస్తుంది. కానీ, ప్రతీ కథనంలోనూ ఎంతో కొంత నిజం ఉంటుంది. ఇలా ఒకే సంఘటన పరస్పర విరుద్ధమైన రూపాల్లో, ప్రతీ కథనమూ కొంత సాపేక్షిక సత్యాన్ని వ్యక్తం చేయటాన్ని “రషోమాన్ ఎఫెక్టు” అని వ్యాఖ్యానిస్తారు. ఒకే సంఘటనకి సంబంధించి పలువురు వ్యక్తులు భిన్న దృక్పథాలు కలిగి ఉండడాన్ని మానసిక, న్యాయశాస్త్ర సంబంధ విషయాలలోనూ పరిగణనలోకి తీసుకుంటారు. రషోమాన్‌లో నాటకీయత (మెలోడ్రామా) ఉందంటారు కొందరు విమర్శకులు. ఈ సినిమాలో ఉన్నది నిజంగా అత్యున్నత స్థాయి ఆర్టు, డ్రామా. ఈ సినిమా ‘అబద్ధాన్ని, నిజాన్ని అనుమానం లేకుండా ఎలా అర్ధం చేసుకోవాలి?’ అని ప్రేక్షకుల్ని ఆలోచింప చేస్తుంది.

ఆర్టు సినిమాల్లో ప్రపంచంలో అత్యున్నత శ్రేణిలో ఉన్న సత్యజిత్ రాయ్ ఎంత గొప్పవాడో, కురొసోవా కూడా అంతే గొప్ప వాడు. వీరిద్దరికీ ఒకరంటే మరొకరికి గౌరవంతో కూడిన అభిమానం ఉండేది.

రషోమాన్ సినిమా డివిడి గా కాని, వీడియో గా కాని అమెరికాలో స్థానిక గ్రంథాలయాల్లో దొరుకుతుంది. 84 నిమషాలే ఉన్న ఈ సినిమాని ప్రతి ఫ్రేము కొంచెం జాగ్రత్తగా చూడాలి. సినిమా ప్రియులు ఆనందిస్తారనే నా నమ్మకం. డివిడిలో రాబర్ట్ ఆల్ట్‌మాన్ ఈ సినిమా గురించి చెప్పిన ముందుమాటలతో పాటు, సినిమాటోగ్రాఫర్ మియాగవాతో ఇంటర్‌వ్యూ కూడా ముఖ్యమైనవే.