వినినంతనె వేగ పడక

రమారమి పదిహేనేళ్ల క్రితం మాట. అప్పుడు హైదరబాదు లో ఉద్యోగం చేస్తూ, రాష్ట్రం అంతా కంపెనీ పని మీద తరచూ చుడుతూ వుండేవాణ్ణి. ఓరోజు సాయంత్రం, తప్పనిసరిగా మర్నాడు పొద్దునకంతా నెల్లూరు వెళ్లే అవసరం ఏర్పడింది. మద్రాసు ఎక్సుప్రెస్సుకి వేళ అయిపోయింది. ఇంటికెళ్లి, బేగు సర్దుకుని స్టేషనుకొచ్చి చార్మినారు ఎక్సుప్రెస్సు పట్టుకునే వ్యవధి లేదు. విజయవాడ లో మా టెక్నీషియను వుండేవాడు. అతడికి కొన్ని విడి భాగాలు, పరికరాలు మరి కొంత సొమ్ము అందజెయ్యవలసిన బాధ్యత కూడా వుంది. విజయవాడ మీదుగా నెల్లూరు వెళ్లడానికి బస్సు వీల్లేదు కాబట్టి, రైలే అని నిర్ణయించుకున్నాను. మా ట్రావెలు ఏజంటుకి ఫోను చేస్తే, బాగా రద్దీ వున్నందువల్ల ఎలాగోలా విజయవాడ వరకూ మాత్రం చివరి బండి నర్సాపుర్ ఎక్సుప్రెస్సులో టిక్కెట్టు ఏర్పాటు చేస్తానన్నాడు.

నర్సాపుర్ ఎక్సుప్రెస్సు విజయవాడ కి తెల్లవారుజామున నాలుగు గంటలకంటే ముందు చేరుకుంటుంది. పొద్దున్నే ఆరింటికి విజయవాడ నుంచే, పినాకినీ సూపరుఫాస్టు ఎక్సుప్రెస్సు నెల్లూరు మీదుగా మద్రాసు (ప్రస్తుత చెన్నై) బయలుదేరుతుంది. ఈ బండి బయలుదేరే వేళకే ఇంకో రెండు బళ్లు సికిందరాబాదు, విశాఖపట్నాలకి కూడ వుండడంచేత టిక్కెట్టు కౌంటర్ల దగ్గర విపరీతమైన తాకిడి, తొక్కిసలాట వుంటాయి. అంచేత, మా టెక్నీషియను కి ముందే హైదరాబాదు నుంచి ఫోను చేసి, నెల్లూరుకి టిక్కెట్టు కొని నన్ను ప్లాటుఫారం మీద కలుసుకోమని పురమాయించేను.

ట్రావెలు ఏజంటు నర్సాపుర్ ఎక్సుప్రెస్సు లో గుడ్లవల్లేరుకి టిక్కెట్టు బుక్కు చేసి సాయంత్రం ఆరింటికల్లా ఆఫీసుకి పంపేడు. గుడ్లవల్లేరు అంటే, గుడివాడ బందరు రైలు మార్గంలొ మొదటి స్టేషను. గుడివాడ జంక్షనులో బందరు (అధికారికమైన పేరు: మచిలీపట్నం) వెళ్లే పెట్టెలు విడదీసి, ఓ పేసింజరు బండికి జత చేసి పంపుతారు. మిగతా బండి అంతా భీమవరం మీదుగా నర్సాపుర్ వెళ్లిపోతుంది.

సమయాభావం వల్ల సాధారణంగా ఎవరూ విజయవాడ నుంచి బందరు రైల్లో ప్రయాణం చెయ్యరు. అంచేత, ఈ బందరు పెట్టెల్లో సీటు తేలికగా దొరికిపోతుంది. కానీ గుడివాడ – బందరు విభాగంలో వుండే స్టేషనుకి టిక్కెట్టు తీసుకుంటేనేగానీ, ఈ పెట్టెల్లో రిజర్వేషను ఇవ్వరు. నాలాంటి చివరి నిమిషం ప్రయాణీకులు, విజయవాడ వెళ్లవలసివస్తే, ఇలా గుడ్లవల్లేరుకి టిక్కెట్టు తీసుకుని, బందరు వెళ్లే పెట్టెలో ఎక్కి, విజయవాడలో దిగిపోతుంటారు. ఈ బందరు పెట్టెలు, తొలగించడానికి అనుకూలంగా వుంటుదన్న ఉద్దేశంతో బండి చివర్లో తగిలిస్తారు.

రాత్రి పదిగంటలకి సికిందరాబాదు స్టేషను చేరుకున్నాను. రిజర్వేషను పట్టికలో పేరు తనిఖీ చేసుకునేసరికి, మైకులో కర్ణకఠోరంగానూ, అస్పష్టంగానూ, మొక్కుబడికి చెప్పినట్లు ముద్ద ముద్ద గొంతుతో, ఓ పురుష స్వరం బండి మూడో నంబరు ప్లాటుఫారం మీదికి వస్తోందని ఎవరో తరుముకొస్తున్నట్టు వడి వడి గా మూడు భాషలలో ప్రకటిచింది. నేను నిత్యం వస్తూవుంటాను కాబట్టి అర్థం చేసుకోగలిగాను, కానీ సగటు ప్రయాణికుడికి ఈ ప్రకటనలు బోధ పడితే ఒట్టు. “ప్రయాణికులకు గమనిక” అని మొదలెట్టే ఈ ప్రకటనలు వినేవారి గ్రహణ శక్తికీ, వినికిడి సామర్ధ్యానికీ, తప్పిపోయే రైళ్ల సాక్షిగా పెట్టని పరీక్షలు. ఈ ప్రకటనల చదువరులు సదా కిళ్లీ నములుతూనో, లేక తేనీరు సేవిస్తూనో చదువుతారని నాకో గట్టి అనుమానం. చిన్న చిన్న స్టేషన్లలోనైతే పరవాలేదుగానీ, రెండు కంటే ఎక్కువ ప్లాటుఫారాలు వున్నటువంటి పెద్ద స్టేషన్లలో ఈ ప్రకటనల ద్వారా చదువరులు తమ తమ ఉద్యోగాలని నిర్వహించుకోవడం తప్ప, ప్రయాణికులకు ఒనగూర్చేదేమీ లేదు. దీనికి తోడు మాటల్ని మరింత ధ్వంసం చేసే కాలం చెల్లిన మైకుల వ్యవస్థ (పబ్లిక్ ఎడ్రస్సు సిస్టం) పులి మీద పుట్ర లాగ ప్రయాణికులకు గ్రహపాటు.

కానీ విజయవాడ స్టేషను మాత్రమే దీనికో మినహాయింపు. అక్కడ మెరుగైన మైకుల వ్యవస్థ నడుమ సుస్పష్టంగా ఓ స్త్రీ కంఠం ఈ ప్రకటనలు చదువుతూ వుండేది. రాష్ట్రం నలుచెరగులా మరే స్టేషనులోనూ, అలాంటి కంఠం నేను విని వుండలేదు. హైదరాబాదు వివిధభారతి లో పాటల మధ్య వ్యాపార ప్రకటనల చదువరికీ ఈవిడకీ ఈ గొంతుల్లో పోలికేమిటబ్బా అని తరుచూ నేను బుర్ర గోక్కుంటూ వుండేవాణ్ణి.

రాత్రి పదిన్నరకి సికిందరాబాదు లొ బండి బయలుదేరే వేళ. చివరి పెట్టెలో, చివరి బే లో నాకు దొరికిన పైబెర్తు మీద సామాన్లు వుంచి, టీటీయీ కోసం ఎదురు చూస్తున్నాను. టీటీయీ వచ్చి టిక్కెట్టు పరిశీలించేక, నన్ను విజయవాడలో లేపమని అభ్యర్ధించేను. దానికి ఆయన, తానుకూడా అక్కడే డ్యూటీ దిగిపోతున్నట్టూ, తప్పక లేపుతాననీ చెప్పేడు.

బూట్లు కింద వదిలి, పై బెర్తు మీదికెక్కి, దిండులో గాలి వూదుకుని, దుప్పటి ముసుగేసుకుని పడుకున్నాను. రైల్లో చివరి పెట్టెలో, చివరి బెర్తులో ప్రయాణం – ‘గ్రామణి’ బస్సులో వెనక సీటును తలపింపచేస్తోంది. అలసిపోయుండడంచేత వెంటనే నిద్రలోకి జారుకున్నాను. బీబీనగరూ – నడికుడి మార్గం పేసింజరు బళ్లకి పూర్తిగా వినియోగిస్తూ బహుశా అప్పటికో ఏడాది అయ్యుంటుందేమో.

కుదుపులతో ఊయలలూగిన శరీరానికి ఏదో స్టేషనులో బండి చాలాసేపు ఆగేసరికి, బయటి వెలుతురికి, ‘టీ, టీ, చాయ్, చాయ్, కేలా, బనానా, అరటిపళ్లూ’ అనే విక్రేతల అరుపులకి కొద్దిగా మెలకువ వచ్చింది. ఈ లోగా బండి పూర్తిగా సేదదీరి బయలుదేరుతున్నట్టు చిన్నగా కుదిపింది. విడీ విడని కళ్లకి చేతి గడియారంలో సమయం సరిగా ఆనడంలేదు. అప్పుడు వినిపించింది, నాకు ఎంతో పరిచయమున్నట్టనిపించే ఆ సుమధుర కోమల స్వరం “ప్రయాణికులకు గమనిక. హైదరాబాదు నుంచి నర్సాపుర్ వెళ్లు ఫలానా నంబరు ఎక్సుప్రెస్సు ఒకటో నంబరు ప్లాటుఫారం నుండి బయలుదేరుటకు సిద్ధముగా వున్నది” తర్వాత హిందీ లోనూ, ఆ పైన ఆంగ్లంలోనూ అదే సందేశం. అంటే బండి విజయవాడ స్టేషను దాటిపోవడానికి సిద్ధంగా వున్నదన్నమాట. టీటీయీ నన్ను నిద్ర లేపడం మర్చిపోవడమో, లేక లేపినా నేను మొద్దు నిద్ర పోతుండడంతో నన్ను వదిలేసి తాను డ్యూటీ ముగించుకుని విజయవాడలో దిగి వెళ్లిపోవడమో జరిగుంటుం దనుకున్నాను. చూస్తే చుట్టుపక్కలున్న ప్రయాణీకులంతా గాఢ నిద్రల్లో వున్నారు. వాళ్లంతా బెజవాడ దాటి పైకెళ్లుతున్నారు కాబోలనుకున్నాను. బండితో ముందుకెళ్లడానికి నాకు టిక్కెట్టైతే వుంది, కానీ అలా చేస్తే నా ప్రణాళికా, కార్యక్రమం అంతా వృధా అవుతాయి. ఒక్క క్షణ కాలం ఈ ఆలోచనలతో సతమతమయ్యి, చివరికి రైలు వేగం పుంజుకునేలోపుగా కదిలే బండిలో నుంచి విజయవాడలోనే దిగిపోవడానికి నిశ్చయించుకున్నాను.