వెచ్చని మనసులు

[ఈ కథ హిందీ మూలం “జీవన్ కా తాప్” అన్న పేరుతో “అభివ్యక్తి” వెబ్ పత్రికలో ప్రచురితమైంది — సంపాదకులు]

ఎముకలు కొరికేసేంత చలి. దానికి తోడు చాలా రోజులనుంచి సూర్యభగవాను డేమైపోయాడో తెలియడం లేదు. ఎండ పొడ చూసే చాలా రోజులవుతోంది. రోజూ లాగే ఈ పూట కూడ బిషన్ సింగ్ కనురెప్పలు బరువుగా తెరచుకున్నాయి. రాత్రంతా అస్సలు నిద్ర లేదాయనకి. ఒక సారి కళ్ళు తెరచుకుంటే ఇక మళ్ళీ నిద్రపోలేడాయన. వేసవి కాలమైతే మెలకువ రాగానే వ్యాహ్యాళికి బయల్దేరేవాడు. కాని ఈ తీవ్రమైన చలిలో పక్క మీద నుంచి ఎవరికి లేవాలనిపిస్తుంది? ఆయన వణికిపోతూ, కొంకర్లు పోతూన్న తన ముసలి శరీరాన్ని రగ్గుతో నాలుగువైపుల నుంచి సరిగ్గా కప్పుకుని, వీపుని గోడకానించుకున్నాడు. ఆయన చేతికందేంత దూరంలో, ఇంకో పక్క మీద ఆయన భార్య సుఖవంతి ముసుగు పెట్టుకుని నిద్రపోతోంది.

పాపం రాత్రంతా దగ్గుతూనే ఉందామె. ఇంటి పనులని పనిమనిషి చేత చేయించుకోమని ఎన్నో సార్లు భార్యతో అన్నాడు బిషన్‌సింగ్. ‘పనామె రోజుకి రెండు సార్లు వస్తుంది. ఆమేమీ ఊరికే పనిచేయడం లేదు కదా, జీతం తీసుకుంటోంది కదా! కాని సుఖవంతికి ఇవేవి పట్టవు. ఎప్పుడూ చలిగాలిలోనే ఉంటుంది. నీళ్ళు పడుతుంది, గిన్నెలు సర్దుతుంది, తడిగుడ్డతో ఇల్లు తుడుస్తుంది, లేదంటే బట్టలు ఉతుకుతూ కూర్చుంటుంది. ఇదివరకులా కాదు కదా, వయసైపోయింది. ముసలితనం మీద పడుతోంది. తొందరగా జలుబు చేసేస్తోంది. కాని ఈవిడ మాట వినదు…’ అంటూ భార్య గురించి తనలో తానే మాట్లాడుకున్నాడు బిషన్ సింగ్.

రాత్రి మెలకువ వచ్చినప్పుడల్లా ఆయన భార్య వీపు మీద విక్స్ రాస్తూనే ఉన్నాడు. ఆవిడ కేదయినా అయితే ఆయన తట్టుకోలేడు. పెరట్లో పిట్టల కిచకిచలతో తెల్లారిందని తెలుస్తోంది. రగ్గులో కూర్చుని ఆయన సమయం ఎంతైయుండచ్చో అంచనా వేసాడు. ‘ఆరు గంటలై ఉంటుంది’ అనుకున్నాడు. కిటికీలోంచి గాని, లేదా వాకిలి తలుపు తీసిగాని బయటకి చూడాలని ఆయనకి అనిపించింది. కానీ ఆ ఆలోచనే ఆయన ముసలి శరీరాన్ని వణికించింది. తను కప్పుకున్న రగ్గు జారిపోయినట్లనిపించి, దాన్ని సరిజేసుకున్నాడు.