షష్ఠ్యంతములు

కాని తిక్కన భారతమునందలి విరాటపర్వములో కథకు ముందు ఐదు షష్ట్యంతములను కందపద్యములుగా రాశాడు. వాటిలో మొదటిది –

ఓంకారవాచ్యునకు, నన-
హంకార విరూఢ భావనారాధ్యునకున్,
హ్రీంకారమయ మనోజ్ఞా-
లంకారోల్లాస నిత్య లాలిత్యునకున్
– తిక్కన, భారతము, విరాటపర్వము (1.32)
(ఓంకారతత్వము తెలిసినవానికి, అహంకారము లేమిచే వృద్ధియైన భావనలచే పూజింపబడినవానికి, హ్రీంకారముతో నిండి సుందరమైన అలంకారాలతో ఉల్లాసముగా ఎల్లప్పుడు లలితముగానుండు వానికి)

ఇక్కడ మరొక విషయాన్నిగురించి చెప్పాలి. మొల్ల రామాయణములో షష్ఠ్యంతాలు లేవు. ఇది ఆమె బహుశా తిక్కన కాలము నాటిదని చెప్పడానికి ఒక నిదర్శనమని నేననుకొంటాను. తిక్కన సమకాలీనుడు, తిక్కనపై గౌరవము గురుత్వము కలిగి ఉన్న కేతన దశకుమారచరిత్రమును తిక్కనకు అంకితము చేసినాడనే చెప్పవచ్చు. ఈ కవి ఎనిమిది కంద పద్యములను షష్ట్యంతములుగా రాసి పిదప ఒక శార్దూలవిక్రీడితమును, కందమును, మాలినిని కూడ షష్ఠ్యంతములుగా రాశాడు. అందులోని శార్దూలవిక్రీడితమును క్రింద ఉదహరిస్తున్నాను –

తేజోరాజిత సర్వలోకునకు, భూదేవాన్వయాంభోజినీ-
రాజీవాప్తున, కాగమప్రథితకర్మప్రస్ఫురత్కీర్తికిన్,
బూజాతర్పితరాజశేఖరునకున్, బుష్పాస్త్రరూపోపమా-
రాజన్మూర్తికి, దోషదర్పదమనారంభైకసంరంభికిన్
– కేతన, దశకుమారచరిత్రము (1.102)
(జగత్తులో అమిత తేజస్సుతో ప్రకాశించువానికి, బ్రాహ్మణకులశేఖరునకు, వైదికకర్మలచే అధికమైన కీర్తి గడించినవానికి, పూజింపబడిన ప్రభుశ్రేష్ఠునికి, మన్మథునివంటి రూపముగల వానికి, దోషదర్పములను నాశనము చేసినవానికి)

షష్ఠ్యంతములు కందపద్యములు మాత్రమేనా

పోతన తన భాగవతమును శ్రీరామునికి అంకితము చేసి అతని పరముగా నాలుగు షష్ఠ్యంతములను ఉత్పలమాలలో అల్లాడు. ఇక్కడ మరొక విశేషము ఏమంటే పోతన భాగవతాన్ని రామునికి అంకితము చేసినా షష్ఠ్యంతములను కృష్ణునిపరముగ రాసినాడు. అందులో మొదటిది –
హారికి, నందగోకులవిహారికిఁ, జక్రసమీరదైత్య సం-
హారికి, భక్త దుఃఖపరిహారికి, గోపనితంబినీ మనో-
హారికి, దుష్టసంపదపహారికి, ఘోషకుటీపయోఘృతా-
హారికి, బాలకగ్రహమహాసురదుర్వనితా ప్రహారికిన్
– పోతన, భాగవతము (1.27)
(మాలను ధరించినవానికి, నందగోకులములో విహారము జేయువానికి, శకటాసురుని, తృణావర్తుని చంపినవానికి, భక్తుల ఆర్తిని తీర్చువానికి, గోపికాసుందరుల మనస్సును హరించినవానికి, దుష్టుల సంపదలను దొంగిలించినవానికి, గోకులములో పాలను, నేతిని భుజించువానికి, పూతనను చంపినవానికి)
బహుశా ఈ పద్యము దాశరథీవిలాస కర్తయైన క్రొత్తపల్లి లచ్చయ్యను ప్రేరేపించిందేమో, అతడు కూడ తన షష్ఠ్యంతములలో ఇట్టి ఉత్పలమాలనే రాసియున్నాడు –
హారి కిరీట చారుమణిహారికి, సన్నివహారికిల్బిషా-
హారికి, దుష్ట సర్ప ఫణి హారికి, నాశ్రిత పూరుష ప్రతీ-
హారికి, వేంకటాచలవిహారికి, వార్ధిసుతాసతీ మనో-
హారికి, భక్తదోష పరిహారికి, నాస్యసరోరుహారికిన్
– క్రొత్తపల్లి లచ్చయ్య, దాశరథీవిలాసము (1.66)
(అందమైన కిరీటము, రత్నమాలను ధరించిన వానికి, శత్రుసమూహముల పాపములను నాశనము జేసినవానికి, దుష్టుడైన కాళియుని పడగ నెక్కిన వానికి, ఆశ్రితులను కాపాడువానికి, వేంకటాచలవిహారికి, క్షీరసముద్రరాజతనయ భర్తకు, భక్తుల తప్పులను మన్నించువానికి, చంద్రునివలె ముఖముగల వానికి)