షష్ఠ్యంతములు

కావ్యాలలో షష్ఠ్యంతాలు రాయాలనే ఆలోచన ఎలా వచ్చిందో కానీ, శాసనాలలో ఈ ప్రయోగము ఉన్నది. యుద్ధమల్లుని బెజవాడ శాసనములోని (క్రీ. శ. 898) రెండవ పద్యము (మధ్యాక్కర) నందలి మొదటి పంక్తి “పరఁగంగ బెజవాడఁ గొమరసామికి భక్తుడై గుడియు”, ఇందులో కి అనే షష్ఠీ విభక్తి వాడబడినది. కరీంనగర్ శాసనములో (క్రీ. శ. 1170) లో ఒక షష్ఠ్యంత కంద పద్యము గలదు. అది –
వర మంత్రకూట పురమున
వరదునకు జగజ్జనానువందిత చరణాం-
బురుహున కాచంద్రార్క
స్థిరముగ గుడి వృత్తి నిల్పితిన్ త్రినయనకున్
– కరీంనగరం శాసనము (దక్షిణము)
(ప్రశస్తి గాంచిన మంత్రకూటపురములో ఉండే వరదునికి, లోకమునందలి జనులచే వందించబడిన పదకమలాలు గలవానికి, ముక్కంటికి, శాశ్వతముగా ఉండేటట్లు గుడి కట్టినాను.)

నన్నయభట్టు శ్రీమదాంధ్రమహాభారతములో షష్ఠ్యంతాలను వాడలేదు. కథను ప్రారంభించడానికి ముందటి పద్యము “సారమతిం గవీంద్రులు ప్రసన్నకథాకలితార్థయుక్తి” (భా, ఆది 1.26). తెలుగులో మనకిప్పుడు దొరికే ఛందస్సుమీది లక్షణ గ్రంథాలలో అతి ప్రాచీనమైనది భీమన ఛందస్సు అనబడే రేచన కవిజనాశ్రయము. ఈ పుస్తకము నన్నయ తరువాతి కాలముదని చాలమంది ఊహ. ఇందులో రెండవ అధ్యాయములోని మొదటి పద్యము షష్ఠ్యంతమే –
పరమాత్మ ముఖారుణ సర-
సిరుహ వినిర్గత సమస్త సిద్ధాక్షర పం-
క్తి రసావహ మృదుపద సుం-
దరతర కృతి రచన లీవుతను దయ మాకున్
– రేచన కవిజనాశ్రయము (2.1)
(పరమాత్ముని ఎర్రని ముఖకమలమునుండి వెలువడిన సిద్ధాక్షరముల వరుసలు రసములతో నిండిన మృదు పదముల సౌందర్యాన్ని మాకు దయతో నీయుగాక.)

నన్నెచోడుని మొదటి షష్ఠ్యంతము

కవిరాజశిఖమణి నన్నెచోడుని కుమారసంభవములో మనము మొట్టమొదట షష్ఠ్యంతములను చూడగలుగుతాము. కొందరు ఈ మహాకవి నన్నయకు పూర్వుడని, మరి కొందరు తిక్కనకు తరువాతివాడని తలుస్తారు. కాని అధికులు ఇతడు నన్నయతిక్కనలకు మధ్యకాలపు వాడని అనుకొంటారు. నన్నయ షష్ఠ్యంతాలను వ్రాయలేదు కాబట్టి నన్నెచోడుడే ఈ పద్ధతికి సృష్టికర్త అని చెప్పవచ్చు. ఇతడు తన గురువైన జంగమ మల్లికార్జునునకు పరమాత్ముడైన మల్లికార్జునునకు అభేదభావము కల్పించి ఈ కావ్యమును అతని ప్రీతికొరకు రచించెను. అతనికే అంకితము చేశాడని కొందరు, అతనిని శ్రోతగా మాత్రమే భావించాడని కొందరు చెబుతారు. ఏది ఏమైనా ఇందులో కథాప్రారంభమునకు ముందు అష్టమూర్తియైన శివస్వరూపునిపై ఎనిమిది షష్ఠ్యంతములను నన్నెచోడుడు కంద పద్యాలుగా రాశాడు. దానికి ముందు గల ఈ వచనము కూడ షష్ఠ్యంతమే. “… సద్భక్త జనాత్మాలోకనైక హేతుభూతుం డగుట మునిజనముఖమణిముకురుండైన జంగమ మల్లికార్జున దేవునకు -” (మంచి భక్తుల మనోదృష్టులకు ముఖ్యమైన కారణమైనవాడగుట, మునుల ముఖాలకు అద్దమువంటి వాడైన మల్లికార్జున దేవునికి). తెలుగు సాహిత్యమునందలి మొదటి షష్ఠ్యంతము –
శ్రీకంఠమూర్తి, కమల-
శ్లోకున, కనఘునకు, మితవచోనిధికి, సుధీ-
లోకస్తుతునకు, విజ్ఞా-
నాకారున, కమితమతికి, నచలాత్మునకున్
– నన్నెచోడకవి, కుమారసంభవము (1.59)
(శివరూపునికి, అమలకీర్తికి, పాపములేనివానికి, మితభాషికి, పండితులచే పొగడబడువానికి, విజ్ఞానాకారునికి, అసీమ మేధాశక్తికి, నిశ్చలమైన వానికి)

తిక్కన కాలము

తిక్కన ఆంధ్రమహాభారతములోని పదిహేను పర్వాలు మాత్రమే గాక నిర్వచనోత్తరరామాయణాన్ని కూడ రచించెను. అందులో కథకు ముందు షష్ఠ్యంతాలు లేవు. కాని సీసపద్యపు తరువాతి ఆటవెలది పద్యపు సరిపాదములు ముఖవికాసమునకు, జనవిభునకు అనే పదాలతో అంతమవుతాయి. కాని ఇది మనకు పరిచితమైన షష్ట్యంతము కాదు. కాని పంచమాశ్వాసాంతములో షష్ఠ్యంతములు రెండున్నాయి. అందులో ఒకటి –
పరిజనపద్మమిత్రునకు, బాఠకమిత్రున, కన్యసైన్య వి-
స్ఫురణలతాలవిత్రునకు, సుందరగాత్రున, కిందిరామనో-
హరసుభగాతపత్రునకు, నంబుజనేత్రునకుం, బ్రమోదని-
ర్భరధరణీకళత్రునకు, రాజితగోత్రున కిజ్జగంబునన్
– తిక్కన, నిర్వచనోత్తరరామాయణము (5.142)
(సేవకులనే తామరపూవులకు సూర్యునివంటి వానికి, వైదికుల స్నేహితునకు, శత్రుసైన్యాలనే తీగలకు గొడ్డలివంటి వానికి, మంచి శారీరము గల వానికి, లక్ష్మీదేవియొక్క మనోహరమైన సిరుల గొడుగు గలవానికి, వనజనయనునకు, ఆనందముతో ఉండే విశాలమైన భూమికి రాజైనవానికి, గొప్ప వంశములో పుట్టినవానికి, ఈ జగతిలో …)