షష్ఠ్యంతములు

పరిచయము

తెలుగు కావ్యాల ప్రత్యేకతలలో షష్ఠ్యంతములు అనేది ఒకటి. ప్రాచీన కావ్యములలో సామాన్యముగా ఇష్టదేవతాస్తుతి, సుకవి ప్రశస్తి, కుకవి నింద, కృతి కర్త, కృతి భర్తల వంశ వివరణ, కావ్యోద్దేశము, మొదలగు విషయాలను చదువుతాము. కథాప్రారంభమునకు ముందు షష్ఠ్యంతములు ఉంటాయి. షష్ఠ్యంతములనగా పద్యాలు షష్ఠీ విభక్తితో అంతమయ్యే పదాలతో నిండి ఉంటాయి.

నేను ఈ వ్యాసాన్ని కొన్ని గొప్ప గుణములున్న రసికులైన పాఠకుల ఆనందానికై రాస్తున్నా. దానిని ఇలా వివరించవచ్చు – కవిత్వములో కుతూహలము ఉన్న వారికి, కొత్త భావాలలో ఆసక్తి గలవారికి, వినయసంపన్నులకు, మృదువైన హృదయము గలవారికి, మంచి కవులను పోషించువారికి, కళామృతమును ఆహారముగా భుజించువారికి అని. ఈ భావాలను ఒక షష్ఠ్యంతముగా రాస్తే అది ఇలా ఉంటుంది –

కవనకుతూహలులకు, నభి-
నవ భావరసోత్సుకులకు, నయవినయులకున్,
నవనీతహృదయులకు, స-
త్కవిపోషకులకుఁ, గళామృతాహారులకున్

కవులు తమ కావ్యాలను ఏ దైవానికో లేక ఏ మహారాజుకో అంకితము చేస్తారు. అప్పుడు ఆ కృతిభర్తపరముగా ఈ షష్ఠ్యంతములు చెప్పబడుతాయి. కాని కొన్ని వేళలలో ఈ పద్యాలు గ్రంథముయొక్క శ్రోత నుద్దేశించి కూడ అల్లబడుతాయి. వీటికి మధ్య గల భేదాన్ని వడ్లమూడి గోపాలకృష్ణయ్యవంటి విమర్శకులు వివరముగా ప్రస్తావించారు.

సామాన్యముగా ఈ షష్ఠ్యంతాలు పై పద్యమువలె కందపద్యాలు. కావ్యారంభములో కథకు ముందు షష్ఠీ విభక్తి పదములతో కనిపించే పద్యాలకు మాత్రమే ఈ ప్రత్యేకమైన షష్ఠ్యంతము అనే పేరును వాడుతారు. ఆశ్వాసాంత పద్యాలు తరచుగా సంబోధనా ప్రథమావిభక్తిలో ఉంటాయి. కాని కొన్ని ద్వితీయా విభక్తిలో లేక షష్ఠి విభక్తిలో కూడ ఉంటాయి. అట్టి దానిని ఒకటి మీకు తరువాత పరిచయము చేస్తాను. బహుశా నన్నెచోడునితో ఆరంభమైన ఈ షష్ఠ్యంతములను రాసే పద్ధతిని సుమారు గడచిన శతాబ్దపు పూర్వభాగమువరకు కవులు అనుసరించారు. కావ్యాల, ప్రబంధాల రచనపై ఆసక్తి, ఆదరణ తగ్గిన తరువాత మిగిలిన నియమాలతోబాటు ఇది కూడ అంతరిచిపోయింది.

విభక్తి

షష్ఠ్యంతాలను గురించిన వివరాలను తెలిసికొనడానికి ముందు షష్ఠీవిభక్తినిగురించి కొద్దిగా తెలిసికోవాలి. తెలుగు భాషలోని విభక్తుల అమరిక తీరు సంస్కృతములోవలెనే ఉందని చెప్పాలి. అందుకేనేమో కేతన ఆంధ్రభాషాభూషణములో ఇలా చెప్పాడు –
తల్లి సంస్కృతంబె యెల్ల భాషలకును
దానివలనఁ గొంత గానబడియెఁ
గొంత తాన కలిగె నంతయు నేకమై
తెనుఁగు బాస నాఁగ వినుతి కెక్కె
– కేతన, ఆంధ్రభాషాభూషణము (14)
(అన్ని భాషలు సంస్కృతమునుండి పుట్టాయి. కొంతవరకు దానివలన, కొంతవరకు తనకు తానే, ఇలా ఈ రెండు ఒకటై తెలుగు భాషగా పరిణమించి ప్రసిద్ధి కెక్కినది.)

సంస్కృతములా తెలుగు కన్నడములలో కూడ ఎనిమిది విభక్తులు ఉన్నాయి. విభక్తి (వి + భజ్ + తి) అంటే వేరు చేయుట లేక విభాగము చేయుట అని అర్థము. విభక్తి అంటే విశిష్ఠమైన సంయోగము అని కూడ అర్థము ఉంది. పదముల అర్థమును విభక్తి ప్రత్యయములతో చక్కగా అవగాహనము చేసికొనుటకు వీలగును. కేతన అంటాడు –
“అనంతరంబ విభక్తులు చెప్పెదఁ బ్రథమయుఁ ద్వితీయయుఁ దృతీయయుఁ జతుర్థియుఁ బంచమియు షష్ఠియు సప్తమియు సంబోధనంబు నన నెనిమిది తెఱంగుల విభజింపఁబడుటం జేసి విభక్తులనంబరఁగె. చేయువాడు ప్రథమయుఁ, జేయంబడునది ద్వితీయయు, నుపకరణంబు తృతీయయుఁ, జేయించుకొనువాఁడు చతుర్థియుఁ, బాయుటకున్బట్టయినది పంచమియు, నొడయండు షష్ఠియు, నునికిపట్టు సప్తమియు, సమ్ముఖంబు సేయునది సంబోధనంబునగు.”
– కేతన, ఆంధ్రభాషాభూషణము (68)