ఈమాట » చెట్టు కూలిన వేళ

Expand to right
Expand to left

చెట్టు కూలిన వేళ

నా చుట్టూ తన ఆశీస్సుల శ్రీకరములు
పరచి మూలాల్ని కౌగలించిన చెట్టు
కొమ్మలలో పసి నిసుగుల అమ్మల్ని దాచిన చెట్టు
రెమ్మలతో మలయ సుగంధాలు వీచిన చెట్టు
వసంతోదయవేళ నిండార పూచి
నన్నాహ్లాద పరచిన చెట్టు
బ్రతుకు సేదతీరుస్తూ చల్లని చిరుగాలుల
నా చెంపల్ని నిమిరిన చెట్టు
మండుటెండలో తానెండినా చలువ పందిరి
నా కోసం తానైన చెట్టు

ఏ పురుగు తొలిచిందో
ఏ మనసు కినిసిందో
అసహనం ఆకృతిదాల్చింది
కర్కశత్వం రూపం దాల్చింది
పిదప కాలపు బుద్ధి పెడదారి పట్టెనో
పచ్చ చెట్టును గూల్చ మనసెట్టులొప్పెనో
కరకు గుండెల కర్కశ మూకలు
దుడుకు గుండెల ముష్కర మూకలు
చెలగి చెండాడి తునిమి ముక్కలు చేసి
పదును రంపాల పరపరా కోసి
కూల్చినారే నిన్ను కర్తవ్యమూఢులై

ఎన్ని దెబ్బలు వేసినా ఎదురాడదు చెట్టు
ఎన్ని కోతలు కోసినా మాటాడదు చెట్టు
గుండె కోతలెన్నైనా మండి పడదు చెట్టు
అలసి అవనతయై పతనమైంది
మమతల జాబిల్లి మూగ తల్లి చెట్టు
పెంచిన ప్రేమపాశం గంటువడి
పుడమి బిడ్డ నేలకొరిగింది
ఉరుక వచ్చీ ఉడుత ‘ఉస్సు ‘ రని మళ్ళింది
వాల కొమ్మా లేక వలస బోయెను పిచుక
గూడు కూనా లేక గోడుమనె గోరింక
పిట్టల కలరవం దూరమైంది
చెట్టు లేక ప్రాంగణం చిన్నబోయింది
ప్రకృతి పరితపించింది
కలవర పడి ఓ క్షణం చిత్తరువులా నిలిచి
మౌనమూర్తియై కాలం కదలసాగింది

తన పట్టులన్నీ సడలి చెట్టు కూలిన వేళ
మనిషిలో ప్రేమ సూత్రపు పట్టు జారిన వేళ

 

(3 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. rama bharadwaj అభిప్రాయం:

    March 4, 2008 5:30 am

    డియర్ ఝాన్సీ,

    మీ కవిత లోని చెట్లు కూలటం లోని ఆవేదన బాగా వచ్చింది. ఆర్ద్రత వుంది. ఇండియాలో ముఖ్యంగా తెలుగుదేశం లొ పిచ్చికలు క్రమంగా మాయమై పొతున్నాయి. చాలా బాధకరం ఆ సన్నివేశం.

    రమ.

  2. rajasankar kasinadhuni అభిప్రాయం:

    March 4, 2008 7:06 pm

    సాధుసజ్జనులను చెట్టుతో పోల్చే తులసీదాసు దోహాని జ్ఞప్తికి తెచ్చిందీ కవిత:

    తులసీ సంత్ సుఅంబ్ తరూ ఫూల్ పలహి పర్ హేత్
    ఇతతే వే పాహన్ హనత్ ఉతతే వే ఫల్ దేత్

  3. kosyasura అభిప్రాయం:

    March 30, 2008 7:22 am

    పూకొమ్మలతో, లేరెమ్మలతో, కొమ్మలలో గిజిగాడి గూళ్ళతో, నిలువనీడలేని నిర్భాగ్యుల పాపల ఊయలలూగిస్తో, మనిషి పోయినా, తరం పోయినా నిరంతరంగా నిలబడేవి చెట్లు..
    కాని రాను రాను నిర్దాక్షిణ్యంగా మూగ వృక్షాలను నరికివేస్తుంటే నిస్సహాయంగా చూస్తూ ఊరుకోలేని ఝాన్సీ గారి బాధ వర్ణనాతీతం.
    ఇక తను పట్టుకున్న చెట్టూ లేదని, కట్టుకున్న గూడూ లేదని తెలియని వెర్రి పిచుక రోజూ వచ్చి వెతుకుకుని నిరాశతో వెనక్కి తిరిగిపోవడం కళ్ళకి కనిపిస్తూనేవుంది.
    లేదు కన్పించడంలేదు. కళ్ళు మసకలు కమ్ముతున్నాయి కంటిలో తడితో.
    కొ స్యా సు రా

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a