తెరమరుగవుతున్న తెలుగు నాటకం -2

నాటకరంగం ఎదగకపోడానికి సినిమా పెద్ద కారణమయితే, నాటక రంగం నుండి వెళ్ళిన వాళ్ళెవరూ దానిపై శ్రద్ధ చూపలేదు. ఒక రకంగా సినిమా రంగం లోకి ప్రవేశించడానికి నాటక రంగం పెద్ద వేదికలా తయారయ్యింది. చాలామంది సినిమాల్లో అవకాశాలు రాగానే నాటకాన్ని మర్చిపోయారు. అంతే కాదు సాంకేతికంగా ఎదిగినా, ఒక నాటకం వేయడానికి కావల్సిన ఖర్చు భరించి నాటకాన్ని పోషించిన పెద్దలెవరూ లేరు. సంపన్నులెవరూ నాటకాలలో పెట్టుబడి పెట్టలేదు. ఒకరకంగా చెప్పాలంటే మనకి మనం మంచి ధియేటర్ కట్టుకో లేకపోయాం. ఇంతకు ముందు చెప్పినట్లుగా నవరాత్రి పందిళ్ళలో అమర్చిన వేదకల పైనే నాటకం చాలా కాలం బ్రతికి బట్ట కట్టింది. లేదా ఏదైనా కాలేజీ లేదా యూనివర్శిటీ వారోత్సవాలకే నాటకాలు వేయడం మొదలయ్యింది. స్థూలంగా ధియేటర్ సౌకార్యాలు లేకపోవడం ఒక ప్రధాన కారణమైతే, పెట్టుబడి పెట్టి నాటక సమాజాలని ప్రోత్సహించిన నాధులెవరూ లేకపోవడం మరో పెద్ద కారణం. నాటక కళపై మక్కువున్న వారందరూ ఒక సమాజంగా ఏర్పడి వారి వారి సొంత డబ్బుని నాటకాలకి ఖర్చుపెట్టిన వారే ఎక్కువ. ఈ లోగా పరిషత్తు నాటకాల పోటీలు మొదలయ్యాక బహుమతులు ఎలా సంపాదించాలా అన్న దాని మీదే అందరి దృష్టీ పడింది. దాంతో రకరకాల సమస్యలు మొదలయ్యాయి. ఒకరకంగా చెప్పాలంటే పరిషత్తులొచ్చాక మేలూ జరిగింది. దానికి తగినంత కీడూ జరిగింది.

ఈలోగా ప్రభుత్వమూ నడుం బిగించింది. నాటక రంగానికి గుర్తింపంటూ నంది నాటకోత్సవాలను ఏటేటా నిర్వహించడానికి పూనుకొంది. దాంతో నాటక సమాజాల్లో కొత్త ఉత్సాహం, ఆసక్తి బయలదేరినా బహుమతుల పంపకాల్లో తేడాలు పొడసూప సాగాయి. మా నాటకం గొప్పది, మాకు బహుమతి రాలేదంటే మాకు రాలేదనీ, నొక్కేసారనీ, తొక్కేసారనీ ఇలాంటి బాధలూ, నిందలూ, ఆరోపణలూ మొదలయ్యాయి. దీనికి ప్రధాన కారణం ఆయా పరిషత్తుల నాటక పోటీలకి ఎన్నుకునే విధానం, వారి వారి నియమాలూ, సూత్రాలే కారణం అని చాలామంది ప్రముఖుల అభిప్రాయం.

ఉదాహరణకి నంది నాటకాలనే తీసుకుందాం. ఇది మొత్తం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సమక్షంలో జరిగే నాటకోత్సవం. ఇక్కడ పద్య నాటకాలూ, సాంఘిక నాటకాలూ, నాటికల పోటీ నిర్వహిస్తారు. దాదాపు ఆర్నెల్లు ముందుగా ప్రకటన వస్తుంది. అనేక నాటక సమాజాలు ఈ పోటీలకి సంసిద్ధులవుతారు. ముందుగా వాళ్ళు ఏ ఏ విభాగంలో వేస్తారో నాటకం స్క్రిప్టు పంపాలి. వచ్చిన నాటకాలని స్క్రిప్టు పరంగా వడబోత మొదలవుతుంది. కొన్ని నాటకాలకి వాళ్ళ స్క్రూటినీ మొదలవుతుంది. కొంత మంది న్యాయ నిర్ణేతలు ఆయా సమాజాల వారు వేయబోయే నాటకాల రిహార్సల్సు చూస్తారు. మేకప్పు, స్టేజీ లేకుండా నటీ నటుల నటనా పరంగా నాటకం చూసి, స్క్రిప్టు తో బేరీజు వేసుకొని అందులో చివర పోటీకి అత్యుత్తమమని అనిపించిన తొమ్మిది లేదా పది నాటకాలని సెలక్ట్ చేస్తారు. ఏ ఏ నాటకాలు సెలక్ట్ చేసారన్న విషయం పేపరు ప్రకటనలో వస్తుంది. చివరికి ఈ నాటకాలని వారం రోజుల సమయంలో నంది నాటకోత్సవంలో ప్రదర్శిస్తారు. న్యాయ నిర్ణేతలు అందులోంచి అత్యుత్తమమైన నాటకాలకి ప్రధమ, ద్వితీయ బహుమతులు ఇస్తారు. అలాగే మంచి రచనకీ, నటులకీ, దర్శకులకీ బహుమతులుంటాయి. ఇదంతా చూడ్డానికీ, రాయడానికీ బాగానే ఉంటుంది. కానీ ఈ నిర్ణయ విధానంలోనే అనేక అవకతవకలు జరుగుతాయని ప్రతీ సారీ అందరూ గగ్గోలు పెడతారు.

లాబీలూ, పక్షపాతా ధోరణులూ, సిఫార్సులూ ఇవన్నీ మంచి నాటకాలని ప్రోత్సహించకుండా చేయిస్తున్నాయని అనేక మంది ఆరోపణ. “లేదూ బాగానే ఉన్నాయి. పరవాలేదు, ఆమాత్రం రాజకీయాలు ఎక్కడ లేవు చెప్పండి? ఏదో ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది కదా, అలా సంతోషించడం పోయి ప్రతీ దానికీ వెంట్రుకలు లాగితే ఎలాగ?“ అనే వర్గం కూడా ఉంది.

ఈ పోటీ నాటకాలు అనే సరికి నాటక సమాజాల వాళ్ళకి కొన్ని అపోహలున్నాయి. ప్రేక్షకుల్నీ, న్యాయ నిర్ణేతల్నీ అతి సులభంగా మెప్పించగల శోక రసం (ఏడుపు) ఉండి తీరాలి. అది ఎంత ఎక్కువ పాళ్ళలో ఉంటే అంత మంచిది. అంతే కాదు భారీగా డైలాగులుండాలి. ఇలా రాసుకుంటూపోతే చాలానే ఉంటాయి. దాంతో ఏమవుతోదంటే ప్రతీ నాటకంలోనూ తప్పనిసరిగా విషాదం ఉంటోంది. న్యాయ నిర్ణేతలకీ అవే కావాలి, ఏం చేస్తాం అని సమర్థించుకునేవారు ఎక్కువైపోయారు. దీనివల్ల సున్నితంగా మనుషుల మధ్య జరిగే ఘర్షణల్ని చూపలేకపోతున్నారు.

ఒక పరిషత్తులో కట్టిన నాటకాన్ని అనేక పరిషత్తులకి ఏడాదిపాటు తిప్పుతారు. ఈ లోగా గిర్రున కొత్త సంవత్సరం వస్తుంది. మరలా ఈ పోటీ ప్రహసనం మొదలవుతుంది. దీనివల్ల ఏడాదిలో అతి తక్కువ నాటకాలు వస్తాయి. అవీ ఆయా పరిషత్తుల పోటీలకోసం రాసినవే అవుతాయి. దాంతో కొత్తదనం, నవ్యత లేక నాటకం చూడ్డానికి జనం రావడం తగ్గించేసారు. ఇదే గత ఇరవై ఏళ్ళుగా జరుగుతోంది. అలాగే నాటకాలు వేసే వాళ్ళు స్క్ర్తిప్టుల కోసం సినిమాల పైనా ఆధార పడుతున్నారు. లేదా పొరుగు రాష్ట్రాల వైపు పరిగెడుతున్నారు. ఏ ఊరెళ్ళినా ధియేటర్ల కొరత ఎలాగూ ఉంది.