తెరమరుగవుతున్న తెలుగు నాటకం -2

ఇహ చివరి విభాగం ఆహార్యం. ఇక్కడ కూడా దర్శకుడి పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. ప్రతీ పాత్రకీ తగినా ఆహార్యం చూసుకోవాల్సిన బాధ్యత దర్శకుడిదే ! ఒక్కో సారి ఆయా కాల పరిస్థితుల్ని సావధానంగా తెలుసుకోవాలి. ఉదాహరణకి, అనేక పౌరాణిక నాటకాల్లో మునులను చూస్తూ ఉంటాం. మునులనగానే మనం సన్యాసుల్లా భావించి కాషాయం రంగు దుస్తులు వేసేస్తాం. కానీ మనకు కాషాయం బౌద్ధం తరువాతే వచ్చింది. బౌద్ధం రాక మునుపు ఏం వాడేవారు అన్న రీసెర్చి మన దర్శకులు చేస్తారను కోను. విషయం తెలుసున్న దర్శకుల తీరు వేరేలా ఉంటుంది. కాషాయం వాడడం అంతగా పట్టించు కోనవసరం లేని చిన్న విషయమే. కాదనను. కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని కూడా అధ్యయనం చేసేవాడే మంచి దర్శకుడనిపించుకుంటాడు.

ప్రతీ పాత్రకీ ఏ ఏ దుస్తులుండాలీ, నాటక పరంగా వాడే వస్తువులూ, స్టేజి మీద సెట్టింగులూ, ఇవన్నీ చూసుకోవాల్సింది దర్శకుడే! ఈ విభాగానికొక వ్యక్తిని దర్శకుడు ఖచ్చితంగా నియమించుకొని తీరాలి. అన్నీ లెక్క చూసుకోవాలి. స్టేజి మీద సెట్టింగులు ముందుగా ప్లాన్ చేసుకొని తయారు చేయించాలి. లైటింగ్ ఏ ఏ సన్నివేశాల్లో ఎంత ఉండాలీ చూసుకోవాలి. ఇది చేయడం రాసినంత, అనుకున్నంత సులభం కాదు.

కొంతమంది దర్శకులుంటారు, స్టేజీ మీద సెట్టింగులూ, స్పెషల్ ఎఫెక్ట్స్‌కీ ఇచ్చే ప్రాధాన్యత మిగతా విభాగాలకి ఇవ్వరు. అలాంటప్పుడు ఆ స్పెషల్ ఎఫెక్ట్స్‌ చూడ్డానికి బాగానే అనిపిస్తాయి కానీ నటీనటుల నటన సరిగ్గా లేకపోతే కొట్టచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. అందుకే అన్నిటా సమన్వయం చూపించాల్సిన బాధ్యత మాత్రం ఖచ్చితంగా దర్శకుడిదే దర్శకుడిదే!

ఈ ఆహార్యంలో మరో ముఖ్యమైన అంశం సంగీతం.దాని గురించి మరీ ఎక్కువగా దర్శకుడికి తెలియకపోయినా, ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. ముఖ్యంగా పద్య నాటకాలు వేసేటప్పుడైతే కాస్తయినా రాగాల గురించి తెలియాలి. చాలా మంది సంగీతం గురించి తెలుసుకోడానికి శ్రద్ధ చూపరు. సంగీత దర్శకుడు ఏం చెబితే అది వింటారు. సంగీత దర్శకుడికి సన్నివేశం గురించీ, ఆయా పద్యాలకైనా, పాటలకైనా, వాటి వెనుకున్న అంతర్గత సన్నివేశ నిర్మాణం గురించీ ఖచ్చితంగా చెప్పాలి. కాకపోతే తెలుగు నాటకాల్లో సంగీతం గురించి దర్శకులు అంతగా పట్టించుకోరు. ఏదో ఉండాలి కదా అన్న తీరుగానే ఉంటుంది వారి ప్రవర్తన!

పద్యనాటకాలకి సంగీతం ఆయువుపట్టు. ఏ రాగం ఎక్కడ వాడాలీ, ఎలాంటి రాగం ఉపయోగించాలీ ఇవన్నీ సంగీత దర్శకుడి బాధ్యతైనా, దర్శకుడి బాధ్యతా సమంగానే ఉంటుంది. ఇప్పటికీ, “బావా ఎప్పుడు వచ్చితీవు”, “జండాపై కపిరాజు”, “ముందుగ వచ్చితీవు”, “అదిగో ద్వారక” – వంటి పద్యాలు అందరి మన్ననలూ పొందడమే కాదు, ఆయా పద్యాల్లోని సాహిత్యాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్ళిన ఘనత ఆ సంగీత దర్శకులదే!

పద్యనాటకాలకే కాదు, సాంఘిక నాటకాలకి కూడా సంగీతం చాలా అవసరం. కొన్ని సందర్భాల్లో సంగీతం ప్రేక్షకుల్ని నాటకంలోకి లాక్కెళుతుంది. అందుకే దర్శకుడికి సంగీతం మీద కాసింతైనా సంగీతం గురించి తెలిస్తే మంచిది. కాబట్టి దర్శకత్వం చేయడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఇది తెలుకున్న విజ్ఞులు దాని జోలికి పోరు. వాళ్ళ వాళ్ళ పరిధిల్లో వారి వారి కళా పిపాసని తీర్చుకుంటారు.

అన్ని స్థంభాలనీ సరిగ్గా నిలబెట్టినప్పుడే ఆ నాటకం నిలబడుతుంది. దర్శకుడూ తలెత్తుకునేలా నిలబడగలడు. కాబట్టి ఓ నాటకం జనరంజకంగా చెయ్యాలంటే దాని వెనుక ఎంతో మంది కృషి ఉంటుంది. ఏ ఒక్కరి ప్రతిభ వల్లో అవి విజయవంతం కాలేవు. అందుకే నాటకం సమిష్టి సృజన!