తెరమరుగవుతున్న తెలుగు నాటకం -2

నాటక రథానికి రచయిత రెండు చక్రాల మధ్య ఇరుసయితే, నటులు ఆ రథానికి అశ్వాల్లాంటి వాళ్ళు. గుర్రాల్ని సరిగ్గా నియంత్రిస్తూ, రథగమన వేగాన్ని నియంత్రిస్తూ చక్కగా సాఫీగా ముందుకు తీసుకెళ్ళే సారథే దర్శకుడు. వీటిల్లో ఏ ఒక్కటీ తమ తమ బాధ్యతల్ని నిర్వర్తించక పోయినా ఆ గమనం గతి తప్పుతుంది. అందుకే దర్శకుడి బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి కొంతమంది నటుల్ని చూస్తాం. నటులుగా వాళ్ళు అద్భుతంగా చేస్తారు. తీరా దర్శకత్వపు పాగా ధరించగానే చతికిల పడతారు. నటించడం వేరు, నటింపచేయడం వేరు. అందుకే అతి తక్కువ నట దర్శకుల్ని చూస్తూ ఉంటాం.

నాటకాని కైనా, ఆ విషయాని కొస్తే ఏ కళాత్మక రూపానికైనా, ఒక ప్రత్యేకమైన గుణం ఉంది. అదేమిటంటే – “కొద్దిగా తెలిస్తే చాలు, చాలా ఎక్కువగా తెలుసు అన్న భావన (ఫీలింగ్) కలగజేస్తూ ఉంటాయి”. అందుకే చాలామంది నటులు దర్శకత్వం చేసేస్తాం అంటూ ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. ఇంతకుముందు చెప్పినట్లుగా నటించడం అనేది ఒక్క పాత్రకి సంబంధించేదే! కానీ దర్శకత్వం అంటే అన్నీ పూర్తిగా తెలియాలి. తెలుసునన్న భావన (ఫీలింగ్) ఉంటే చాలదు.

నాటక ప్రదర్శనలో దర్శకుడి పాత్ర చాలా ఉంటుంది. డైలాగులెలా చెప్పాలీ, ఎలాంటి అభినయం చేయాలీ ఇవన్నీ చెప్పి శిక్షణ ఇవ్వాలి. దాని కంటే ముందు ప్రతీ సన్నివేశం గురించీ ఆయా పాత్రల పరిధి గురించీ, నటన గురించీ సవివరంగా చెప్పాలి. అంతే కాదు, తను ఆ సన్నివేశాన్ని ఎలా మలచ దల్చుకున్నదీ విశదీకరించాలి. నటీనటుల మధ్య నటన, ప్రతి నటన (యాక్షన్, రియాక్షన్) అన్నీ పర్యవేక్షిస్తూ నటనా శిక్షణ ఇవ్వాలి. ఒక్కోసారి నటనానుభవం ఎక్కువైన నటులుంటారు. వారికి తెలుసున్న పద్ధతి ఉంటుంది. అదే తీరులో చేసుకుంటూ పోతారు. వాళ్ళ నటనాచాతుర్యాన్ని ప్రదర్శించే యావ తప్ప వాళ్ళకేం పట్టదు. అలాంటప్పుడు దర్శకుడి పని కత్తిమీద సాము లాంటిదే. కొంతమంది మాట వినరు. అలాంటప్పుడు నాటకం చెడిపోతుంది. చెడితే దర్శకుణ్ణే అందరూ వేలెత్తి చూపుతారు. కానీ విజయవంతం అయితే నటులకే ఎక్కువ పేరొస్తుంది. అది వేరే విషయం.