తెరమరుగవుతున్న తెలుగు నాటకం -2

సంధాత లేదా నిర్దేశకుడు

నాటక రచన, నటన, ఆహార్యం అనే మూడు మూల స్థంభాలూ నిలబెట్టగానే నాటకం పూర్తి కాలేదు. ఈ మూడింటినీ సరైన సమన్వయంతో నిలబెట్టి, వాటిన ఒక రీతిలో, సరైన స్థానంలో ఉంచడానికొక నిర్దేశకుడు కావాలి. ఈ మూడింటి గురించీ కూలంకషంగా తెలుసున్న ఒక సంధాత కావాలి. ఆ సంధాతనే మనం దర్శకుడు అంటూ ఉంటాం. “దర్శకత్వం అనేది ఏముందీ, రచయిత రాసిస్తాడు, నటులు నటిస్తారు, ఆహార్యం అందిస్తారు, ఇవన్నీ అమరేక దర్శకత్వం ఎవరైనా చేస్తారు” అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఇది పొరపాటు అభిప్రాయం. ఇంతకుముందు ప్రస్తావించిన ప్రతీ విభాగంలోనూ నైపుణ్యత, లోతైన అవగాహన లేకపోతే దర్శకత్వం అనేది రాణించదు.

పది కాలాల పాటూ నాటకం నిలవాలంటే దర్శకుడు చాలా శ్రమించాలి. కొన్ని నాటకాలయితే కొన్ని దశాబ్దాలుగా ఒకే రీతిన అంటే మొదట చేసిన దర్శకుడి పంథానే దాదాపుగా అనుసరిస్తూ ఇప్పటికీ ప్రదర్శిస్తున్నారు. ఉదాహరణకి గురజాడ వారి కన్యాశుల్కం అక్కడక్కడ చిన్న చిన్న మార్పులు తప్ప దాదాపు కొన్ని దశాబ్దాలుగా అదే రీతిలో ప్రదర్శిస్తున్నారు.అంటే మొదట దర్శకత్వం చేసిన ఆ మహా వ్యక్తి ఎవరో కానీ నాటకానికి జీవం పోసాడు. అలాంటి దర్శకుల ప్రతిభ కలకాలం నిలిచి పోతుంది. అలా అని ప్రతీ దర్శకుడూ మొత్తం అచ్చు గుద్దినట్లు నాటకాన్ని దించేస్తున్నారని కాదు. నూటికి డెబ్భై శాతం అదే రకంగా చూపిస్తున్నారు. నా దృష్టిలో కన్యాశుల్కం నాటకం స్క్రిప్టు పరంగా చూస్తే, కొన్ని చోట్ల అది ప్రదర్శనా యోగ్యంగా కనిపించదు. అతి చిన్న దృశ్యాలు చాలా ఉంటాయి. ఈ నాటకం చదువుకోడానికి బావుండే నాటకం. ప్రదర్శనా యోగ్యంగా మలచడం కోసం మూల ప్రతిని మరలా తిరగ రాసారు. ఇలాంటప్పుడే దర్శకుడి ప్రతిభ ప్రస్ఫుటంగా కనిపించేది.

అసలు దర్శకుడంటే ఎవరు? దర్శకత్వం చేయాలంటే అర్హతలేమిటి? కావల్సిన లక్షణాలేవిటి? ఎందుకు ఇది కష్టతరమైనది? అందరూ ఎందుకు దర్శకత్వం చేయలేరు? ఇలా అనేక ప్రశ్నలోస్తాయి. దర్శకత్వం చేయదల్చుకున్న ఎవరైనా ఈ ప్రశ్నలు వేసుకొని, ఒక్కసారి ఎవళ్ళకు వాళ్ళు జవాబు లిచ్చుకుంటే చాలు, ఇందులో ఉండే లోటుపాట్లు తెలుస్తాయి.

ముందుగా మూడు మూల స్థంభాలపైనా, వాటి నిర్మాణం పైనా దర్శకుడి పాత్ర ఎంతనేది చూద్దాం. ఈ మూడింటినీ అనుసంధానం చేయడంలో ప్రాధాన్యత ఏమిటో చూద్దాం.

ముందుగా దర్శకుడికి రచయిత చూపించిన కథా వస్తువుపై నమ్మకం కుదరాలి. రచయిత రాసిన ప్రతిపై పూర్తి అవగాహన రావాలి. రచయిత రాసిందానికి తన సృజన జోడించి ఇంకో మెట్టు పైకెక్కించేలా చేయాలి. నాటకం ఆత్మ చెడకుండా సృజనాత్మకంగా సన్నివేశాలని నిర్మిస్తూ, నటీనటుల హావ భావాలను పాత్రకు తగ్గట్టుగా మలచి, సరైన ఆహార్యం ప్రతీ సన్నివేశానికీ అమర్చి, నాటకాన్ని రసాత్మకఫలకంలో బంధించి, ప్రేక్షకుల మనసులపై సున్నితంగా అమర్చాలి. ఇందులో ఏవొక్కటి చెడినా నాటకం రక్తి కట్టదు. దర్శకత్వానికిది ప్రాథమిక సూత్రం.

కథా నిర్ధారణ జరిగాక, దానికి రచయిత తన ఊహాశక్తి జోడించి నాటకం రాసిస్తాడు. దర్శకుడు దాన్ని ఒకటికి పదిమార్లు చదివి అందులో ఏ మాత్రం సరిపడని విషయమున్నా, లేదా, దాన్ని మరింత సృజనాత్మకంగా చెప్పాలనుకున్నా ఏమాత్రం వెనుకంజ వేయకుండా స్పష్టంగా రచయితకి చెప్పాలి. అవసరమైతే మార్పులు చేయాలి. మార్పులు చేయడానికి కారణాలు సహేతుకంగా చెప్పాలి. ఇది ఒక రోజులో, ఒక దెబ్బలో అయ్యే పనికాదు. నాలుగైదు పర్యాయాలు చర్చించిన తరువాతే నాటకం చివరి ప్రతి (ఫైనల్ స్క్రిప్ట్) సిద్ధం చేసుకోవాలి. పాశ్చాత్యనాటకం ఈ పథం లోనే తయారవుతుంది. ఒక్కో నాటకాన్నీ నలుగురైదుగురు ప్రముఖులు చదివి, వారి వారి అభిప్రాయాల్ని సమీక్షించాక, నాటకం తయారవుతుంది. ఇదే పద్ధతి హాలీవుడ్ లో సినిమాలకీ పాటించడం కద్దు. కానీ తెలుగునాట నాటకాల్లో ఈ పద్ధతి పాటంచడం చాలా అరుదుగా కనిపిస్తుంది. నాటకం రాయడం వరకే రచయిత పని అన్నట్లుగానే దాదాపు ప్రతీ నాటక దర్శకుడూ అనుకుంటూంటాడు.

ఇంతకు ముందు చెప్పినట్లుగా రచయిత నాటకానికి తన సృజన జోడించడం దర్శకత్వ ప్రతిభకి కొలమానం. ఉదాహరణకి ఇది చూడండి. ఒక నాటక సన్నివేశంలో పిల్లవాడికి ప్రమాదం సంభవిస్తుంది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళి ఆపరేషన్ చేసాకా ఆ కుర్రాడు బ్రతుకుతాడు. ఈ మధ్యలో మిగతా పాత్రల తీరూ, బాధా, వేదనా అన్నీ చూపించాక, నాటకం కుర్రాడి ఆఖరి కోరికతో ముగుస్తుంది. ఇదీ రచయిత రాసిన సన్నివేశం.

ఆ సీన్ అక్కడతో ముగించి ఆపరేషన్ ధియేటరు ముందు మిగతా పాత్రలన్నీ చేరితే వాళ్ళ మధ్య సంభాషణల ద్వారా చెప్పించొచ్చు. అదే సృజనాత్మకత ఉన్న దర్శకుడైతే ఇంకాస్త ముందు కెళతాడు. విభిన్నంగా చూపించడానికి ప్రయత్నిస్తాడు. పై చెప్పిన సన్నివేశాన్ని ఒక ప్రతిభ గల దర్శకుడు ఇలా మలిచాడు. పిల్లాడికి ప్రమాదం జరిగి పడిపోగానే, తల్లి చూసి ‘బాబూ!’ అంటూ పరిగెత్తుకొస్తుంది. అందర్నీ పిలుస్తుంది. అందర్నీ పిలుస్తుంది. అక్కడ ఆ సీను ముగించి, తరవాత సన్నివేశంలో స్టేజి అంతా చీకటి చేసీ, తెరవెనుక అంబులెన్స్‌ ధ్వని వినిపిస్తూ, ఆ అంబులెన్స్ ఎరుపూ, నీలం లైట్లు వైలిగీ ఆరుతూ స్టేజి మీద చూపించాడు. దాంతో పాత్రల మధ్య వాచ్యం సగం తగ్గింది. తరవాత సీనులో ఆ పిల్లాడు ఇంటి కొచ్చినట్లు చూపించి తెలిసీ తెలియకుండా ఆపరేషన్ విషయం చిన్నగా చెప్పించాడు. దాంతో ఆ సన్నివేశం విభిన్నంగా ఉండడమే కాదు, ప్రేక్షకుడికి హత్తుకునేలా చూపించాడు. ఇదీ దర్శకత్వ ప్రతిభకి మచ్చుకొక ఉదాహరణ. అందుకే దర్శకుడికీ రచయితకీ పరస్పర అవగాహన ఉండాలి. ఒక్కోసారి ఒకే నాటకాన్ని పలు రకాలుగా చూస్తూ ఉంటాం. ఒక్కో దర్శకుడూ ఒక్కో పద్ధతిలో మలుస్తారు. ఎవరెలా మలచినా రచయిత రాసిన మూలానికి ఆత్మ చెడిపోకూడదు. రచనకీ, దర్శకత్వానికీ ఉన్న సన్నని సరిహద్దు స్పష్టంగా దర్శకుడికి తెలిసినప్పుడు ఏ ఇబ్బందీ రాదు. రచయితని దర్శకుడు డామినేట్ చేయడం మొదలు పెడితే నాటకం కూలిపోతుంది. ఒక్కోసారి కొన్ని సన్నివేశాల్లో దర్శకుడు కనిపిస్తాడు. అంతర్లీనంగా కొన్ని చోట్ల రచయితా కనిపిస్తాడు.

కొంతమంది రచయితలకీ, దర్శకులకీ సమన్వయం చక్కగా కుదురుతుంది. వారి కలయికలో చక్కటి దృశ్యాలు తయారవుతాయి. సినిమా రంగంలో (నాటకం కాకపోయినా) తెలుగు నాటక రచయిత జంధ్యాలకీ, విశ్వనాథ్‌కీ ఉన్న సమన్వయం ఎన్నో మంచి చిత్రాలను అందించడానికి కారణంగా చెప్పచ్చు. నాటక రంగంలో ఇటువంటి సమన్వయం నాకు తెలిసి ఎక్కడా లేదు. చాలా మంది రచయితలు నాటకాలు చదువుకోవడానికి బాగుండేలా రాస్తారు. దర్శకుడు దాన్ని ప్రదర్శనా యోగ్యంగా మలచే ప్రయత్నంలో అనేక మార్పులు చేస్తాడు. దాని వల్ల ఒక్కోసారి రచయిత రాసిందాని కంటే బాగుండచ్చు, ఒక్కోసారి చెడిపోనూ వచ్చు.

ఒక్కోసారి రచయిత తన ధోరణిలో తను రాసుకు పోతాడు. దర్శకుడు తన ధోరణిలో తను ప్రదర్శింపజేస్తాడు. వారిద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడుకుంటే ఒట్టు. తరవాతెప్పుడైనా ఆ రచయిత ఆ నాటకాన్ని చూసాడనుకోండి, “నాటకాన్ని నాశనం చేసేసాడు, తగలెట్టేసాడు” అంటూ రచయితలు బాధ పడడం చూస్తూనే ఉంటాము. ఇలాంటి పరిస్థితి ఎందుకొస్తుందంటే దర్శకుడికి నాటకం పూర్తిగా అర్థం కాకపోవడమే ! నాటకం చెయ్యాలన్న తపనే తప్ప, ఆ దర్శకుడు నాటకం ఆత్మని చూడలేక పోవడమే ముఖ్య కారణం.

కొంతమంది దర్శకులు నాటక రచయితని పూర్తిగా పక్కకు పెట్టేస్తారు. దానివల్ల నాటకాలు రాసే ఒకటీ అరా రచయిత లెవ్వరూ మరలా నాటకాల జోలికి వెళ్ళరు. దాని వల్ల మంచి నాటకాలు వచ్చే అవకాశాలు సన్నగిల్లుతాయి. దర్శకత్వం చేయగలగడం వేరు, ఒక సన్నివేశాన్ని నిర్మించడం వేరు. సంభాషణలూ, పాత్రల మధ్య లింకులూ, సన్నివేశ నిర్మాణం ఇవన్నీ ఒక్క రచయిత వల్లే సాధ్యం. రచయితలే దర్శకులైన వైనాలు చూస్తాం కానీ, దర్శకుడే రచయితైనవి చాలా అరుదుగా చూస్తూంటాం.