తెరమరుగవుతున్న తెలుగు నాటకం -2

ఇహ ఆహార్యంలో ఆఖరిది, అతి ముఖ్యమైనది సంగీతం. ఇది నాటకంలో సన్నివేశానికొక విధమైన వాతావరణాన్ని కలిగిస్తుంది. ఒక రకమైన అర్థాన్నీ, రసాత్మకతనీ కలగజేస్తుంది. పూర్వం నాటకాలు ప్రారంభమైనప్పటి నుండీ సంగీతం ఉంది. నాటక ప్రక్రియ అనేది నృత్య నాటికల నుండే వచ్చింది. నృత్య నాటకాలకి సంగీతమే ఊపిరి. సంగీతం లేకుండా నాటకం ఏమాత్రం రక్తి కట్టదు. ఒక్కోసారి పాత్రల చిత్రీకరణకి సంగీతం అత్యద్భుతంగా ఉపయోగపడుతుంది. నటీనటుల సంభాషణలకి సన్నివేశ పరంగా ప్రాణ ప్రతిష్ట చేస్తుంది. నిజ జీవితంలో మనకు వినిపించే శబ్దాలని స్టేజి మీద వినిపిస్తూ సన్నివేశానికి మరింత బలం చేకూర్చేది సంగీతమే!

కొన్ని కొన్ని నాటకాలలో పద్యాలూ, పాటలూ ఉంటాయి. అవన్నీ సంగీత ప్రధానమైనవే ! ముఖ్యంగా తెలుగు వారి సొత్తయిన పద్య నాటకానికి వెన్నెముక ఈ సంగీతమే! పద్యనాటకంలో ప్రతీ పద్యానికీ ఒక రాగం, లయ ఉంటుంది. దాని కనుగుణంగా పద్యాన్ని పాడుతుంటే ఎంతో కర్ణపేయంగా ఉంటుంది. పద్య నాటకాలకి మంచి సంగీతం ఆయువు పట్టు లాంటిది. పాండవోద్యోగ విజయంలో పద్యాలు ఇప్పటికీ మన చెవుల్లో గింగిర్లాడుతున్నాయంటే కారణం సంగీతమే! రాగభూయిష్టమైన పద్యాలు జనరంజకం అయితే ఆ పద్య నాటకం ప్రేక్షకుల మనస్సులలో నిలిచి పోతుంది. ఒకప్పటి పద్య నాటకాలలో జనరంజకమైన పద్యాల్ని ఇప్పటికీ అవే ట్యూన్లతో వాడుతున్నారు. ఎందుకంటే మనం వినీ, వినీ ఆ రాగాలకీ, ట్యూన్లకీ అలవాటు పడిపోయాం. ఫలానా పద్యం ఫలానా రాగంలో ఉంటేనే బాగుంటుందని ఒక స్థిరమైన అభిప్రాయానికి వచ్చేసాం. అందుకే కొన్ని పద్యాల ట్యూన్లు కొన్ని దశాబ్దాలుగా జీవించే ఉన్నాయి. ముందు ముందు జీవిస్తాయి కూడా! చాలామంది నాటాకాలు వేయడానికి అన్నీ సమకూర్చుకుంటారు కానీ సరైన సంగీతం అమర్చుకోరు. దాంతో ఎంత గొప్ప నాటకమైన దెబ్బతినే అవకాశం ఉంది. అదీకాక అనేక రకాల వాయిద్యాలు వాయించే వాళ్ళు దొరకడం కూడా కష్టమే ! ఈ మధ్య కీబోర్డు వచ్చాక సంగీతం అంటే కీబోర్డు ప్లేయరే తప్ప, ఇహ వేరేమీ కాదు అన్న అభిప్రాయం స్థిరపడి పోయింది.

ఎలక్ట్రానిక్ కీబోర్డు వల్ల కాస్త మంచీ ఉంది, చెడూ ఉంది. ఒక్క మనిషే సంగీతాన్ని సమకూర్చొచ్చు. కానీ కీబోర్డులో కొన్ని శాస్త్రీయ సంగీత రాగాలు పలికించడం కష్టం. అలాంటప్పుడు కాస్త ఇబ్బందే ! ముఖ్యంగా పద్య నాటకాలకి ఇదొక అవరోధం లాగే కనిపిస్తుంది. కాకపోతే ఇవన్నీ ఇప్పుడెవరూ పట్టించు కోవడం మానేసారు. ఏదో లాగించేద్దాం అన్నట్లుగానే ఉంటోంది సంగీతం. సంగీతం వల్ల వచ్చే ప్రత్యేకమైన అనుభూతి, అమెరికాలో బ్రాడ్వే మ్యూజికల్స్ తో కూడిన బాలేలు (ballets) చూస్తే తెలుస్తుంది. తెలుగు నాటా మంచి సంగీతకారులున్నారు కానీ, వాళ్ళెవ్వరూ నాటక రంగానికి పనిజేసిన దాఖలాలు లేవు.

కాకపోతే మామూలు సాంఘిక నాటకంలో పాటలూ, పద్యాలూ ఉండవు కాబట్టి, కీబోర్డు సంగీతం చాలు అన్న స్థాయికి వచ్చేసింది నాటకం. సినిమాలు వచ్చేక నాటకాల్లో సంగీతానికి ప్రాధాన్యత చాలా వరకూ తగ్గింది. త్యాగరాజు లాంటి వాగ్గేయకారులు సంగీత ప్రధానమైన నృత్య నాటికలు (ప్రహ్లాద విజయము, నౌకా చరితము) రచించారు. నృత్య నాటికలు కేవలం నృత్య ప్రధానమైనవే కాదు, సంగీత ప్రధానమైనవి కూడా. నృత్యానికి లయ, తాళం అతి ముఖ్యమైనది. కాబట్టి లయ బద్ధమైన సంగీతం, నృత్య నాటకానికి చాలా అవసరం. ఇప్పటికీ కొన్ని అన్నమాచార్య కీర్తనలకీ, త్యాగరాజ కీర్తనలకీ నృత్యం చేయడం చూస్తూనే ఉంటాం. సంగీతం లేకుండా నాటకాలు రక్తి కట్టవు. ఇది ఎవ్వరూ కాదన లేరు.

అందుకే, ఒక మంచి నాటకానికి ఆహార్యం చాలా ముఖ్యం. ఆకర్షణీయమైన సెట్టింగులూ, నటీనటులకి మంచి మేకప్పూ, హృద్యమైన సంగీతమూ ఇవన్నీ కలిస్తేనే నాటకం ప్రేక్షకుల హృదయాల్లో నాటుతుంది.

చాలామంది నటులకీ, సంభాషణలకీ, కథా వస్తువుకీ ఇచ్చిన ప్రాధాన్యత ఆహార్యానికివ్వరు. అలాంటి నాటకాలు ఎక్కువ కాలం బ్రతికి బట్ట కట్ట లేవు. ఈ రోజు వరకూ కూడా సురభి వాళ్ళ నాటకాలకి జనం ఎగబడడానికి కారణం ఆహార్యమే ! ఈ విషయం చాలా నాటక సంస్థలు గ్రహించినట్లు కనిపించవు. ఇదంతా ఖర్చుతో కూడిన వ్యవహారం కాబట్టి పరవాలేదులే అని సరిపెట్టుకుంటూ ఉంటాం. ఆ సరిపెట్టుకునే గుణమే నాటకాన్ని మరో మెట్టుకి తీసుకెళ్ళ లేక పోయింది. ఇదంతా మనకి నాటక కళాపోషకులు లేకపోవడమే కారణం. నాటకం అంటే మనకి కాస్త చిన్న చూపు పెరగడానికి కారణం మనకి సరైన థియేటర్లు లేకపోవడం ఇంకా పెద్ద కారణం. ఇప్పటికీ స్టేజి మీద సరైన సెట్టింగులు లేకుండానే ప్రదర్శనలు జరుగుతాయనడంలో అతిశయోక్తి లేదు. కారణాలు ఏవయితనేం నాటకం వేదిక పెరగాల్సినంత పెరగలేదు.