తెరమరుగవుతున్న తెలుగు నాటకం -2

పాత్రల మేకప్ అనేది ఆహార్యంలో మొదటి అంశం అయితే రెండవ అంశం వేదికాలంకరణ (స్టేజి డెకరేషన్ లేదా సెట్టింగ్స్). సన్నివేశాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించాలంటే స్థల కాలాల్ని బట్టీ సెట్టింగ్స్ వేస్తే ఆ సన్నివేశానికి మరింత బలం చేకూరుతుంది.పూర్వం స్టేజి మీద రకరకాల తెరలు వాడేవారు. (ఇక్కడ తెర అంటే స్టేజి వెనుక తెర. సాథారణంగా తెర అన్న దాన్ని స్టేజి ముందు ఉండే తెరకి వాడడం కద్దు. కానీ ఇక్కడ తెర అంటే సదరు సన్నివేశానికి వెనుక వాడే తెర. వాడుక భాషలో చెప్పాలంటే బ్యాక్ డ్రాప్ అన్నమాట.) ఆ తెరలమీద రంగు రంగు చిత్రాలు వేసి ఆ సన్నివేశం ఎక్కడ జరుగుతోందో చూపేవారు. వివిధ రకాల తెరల వాడకం కూడా 1800 కాలంలోనే ఎక్కువయ్యింది. ఇప్పటికీ తెర లేని నాటకం ఉండదు అంటే అతిశయోక్తి లేదు.

ఈ తెరల వాడకం సన్నివేశ విభజనకి చాలా ఉపయోగ పడుతుంది. ఇంకా చెప్పాలంటే ఆయా పాత్రలు ఏ ఏ ప్రదేశంలో ఉన్నారో స్థల నిర్ణయం చేస్తూ అతి సులభంగా చూపించచ్చు. దాని వల్ల సన్నివేశానికి ఆయువు పట్టు దొరికి బలం చేకూరుతుంది. ఒక్కోసారి ప్రతీ అంకానికీ ఒక ప్రత్యేక తెర వాడడం కద్దు. మన పల్లెల్లో తరచు చూపించే తోలుబొమ్మలాటలు నాటకాలకి తెల్లటి తెరలు వాడి, నీడలతో సృజనాత్మకమైన ప్రదర్శనకి దోహదం చేసాయి. నీడలతో సన్నివేశాలకి వేరే దృక్పథాన్ని చూపించడం తోలుబొమ్మలాట ద్వారానే మొదలయ్యింది. విద్యుఛ్ఛక్తి (కరెంటు) మన జీవితంలో విడదీయలేని నిత్యావసరమవ్వడం కూడా ఈ తరహా వైవిధ్య ప్రదర్శనకి ఓ పెద్ద కారణంగా కనిపిస్తుంది.

పూర్వం నాటకాలు వేసేటప్పుడు కొంతమంది నాటకం ఆసాంతం తెరలు పట్టుకొనే వారు. సాంకేతిక పరంగా ఇప్పుడు ఇలాంటి వన్నీ అధిగమించాము. ఇంకా వేదికని రెండు మూడు భాగాలుగా చేసి సన్ని వేశాన్ని అతి సహజంగా చూపించడం కూడా చూస్తూ ఉన్నాము. తెలుగునాట వేదికాలంకరణకి ఒక రకమైన ప్రత్యేకతని కలిగించింది మాత్రం సురభి నాటక సంస్థ వారేనని చెప్పచ్చు. వేదికాలంకరణ నాటకాన్ని వేరే మెట్టు ఎక్కిస్తుంది అన్నది ప్రయోగాత్మకంగా సురభి నాటక సంస్థ వారు నిరూపించారు. అప్పట్లో నాటకాలకి బహుళ ప్రాచుర్యాన్నీ, ప్రజలో మరింత ఆసక్తిని కలిగించింది సురభి వారి ఈ వేదికాలంకరణే! కేవలం సురభి వాళ్ళ సెట్టింగులు చూడ్డానికే జనాలు తండోపతండాలు గా వచ్చేవారు. అంతే కాదు, రామాయణ, మహాభారతాల వంటి పౌరాణిక నాటకాలని కళ్ళకు కట్టినట్లు చూపించడంతో నాటకాలకి సరికొత్త వన్నె చేకూరింది. చాలా మంది సురభి వారిని అనుకరించారు కానీ, వారి స్థాయి కెవరూ చేరలేకపోయారు.

వేదికాలంకరణలో అనేక ప్రయోగాలు జనరంజకంగా చేసింది సురభి నాటక సంస్థ వారే ! మాయాబజారు నాటకంలో వీరు వాడిన సెట్టింగులు కళ్ళు చెదిరేలా ఉంటాయి. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలలో ఆయుధాలతో స్పెషల్ ఎఫెక్ట్స్ చూపిస్తూ వేదికాలంకరణ లో కొత్తదనానికి ప్రాణం పోసారు. కానీ వేదికాలంకరణలో పాశ్చాత్య దేశాల స్థాయికి మాత్రం మనం చేరుకోలేకపోయాం. ఒక రకంగా చెప్పాలంటే మన ఆర్థిక స్థితి కూడా ముఖ్య కారణం కావచ్చు. ఇప్పటికీ లండన్ లో షేక్‌స్పియర్ నాటకాలకి ఈ వేదికాలంకరణే ప్రత్యేక ఆకర్షణ. లండన్లో షేక్‌స్పియర్ థియేటర్లో నాటకం చూడడం వర్ణించనలవి కాని అనుభవం. మిమ్మల్ని కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళి మీ కళ్ళముందే జరుగుతున్నట్లుగా చూపిస్తారు. అక్కడ నాటకం చూసాక మిమ్మల్ని కొన్ని రోజులు ఆయా సన్నివేశాలూ, పాత్రలూ వెంటాడుతూనే ఉంటాయంటే అతిశయోక్తి కాదు.

పాశ్చాత్య దేశాల్లో నాటకాలకి కేవలం వేదికాలంకరణ కోసం ప్రత్యేకంగా ఇరవై ముఫ్ఫై మంది పని చేస్తారు. దీనికొక మేనేజరుంటాడు. వాళ్ళకి ప్రత్యేకమైన తర్ఫీదు ఇస్తారు. మనం తెలుగు నాటకం మాత్రం ఈ విషయంలో వెనకబడే ఉంది.ఇంకా పాత పద్ధతులనే అనుసరిస్తున్నారు. ఏ మాత్రం నవ్యత చూపించడానికీ తగిన శ్రద్ధ చూపడం లేదు. అమెరికా వంటి దేశాల్లో బ్రాడ్‌వే షోలకి కేవలం ఈ సెట్టింగులూ, హంగులూ చూడ్డానికే జనం ఎగబడతారు. స్టేజి మీద తుఫాను, మంచు కురవడం లాంటి వన్నీ చూపిస్తూ, ఆచరణ యోగ్యం కాని, ఊహ కందనీ కొన్ని సన్నివేశాలని చూపిస్తూ సంభ్రమాశ్చర్యాలకి గురిచేస్తారు. ఆహార్యంలో వేదికాలంకరణ ఒక ప్రత్యేకమైన విభాగం. సన్నివేశాన్ని నిలబెట్టేది ఈ వేదికాలంకరణే! దర్శకుడి సృజనాత్మకత, భావుకత అన్నీ కొట్టచ్చినట్లు కనిపించేది ఇక్కడే!

సాంకేతికాభివృద్ధి పెరిగాక ఆహార్యంలోకి నిశ్శబ్దంగా చొచ్చుకుపోయి, ఇప్పుడు నే లేందే నాటకం లేదంటూ మిగతావాటిని వెనక్కి నెట్టేసిన మరొక వస్తువు మైకు. ప్రస్తుతం ఏమున్నా లేకపోయినా మైకు లేందే నాటకం లేదు. అది లేందే నటులకి గొంతు పెగలని పరిస్థితి ఏర్పడింది.

పూర్వం నాటకానికి మైకు అనే సాంకేతిక వస్తువు లేదు. వాళ్ళు యథాశక్తి తమ తమ కంఠ స్వరాలపైనే ఆధార పడేవారు. ఆ కాలంలో నాటకాలు వేసేటప్పుడు నటీ నటుల గొంతులకి అతి ప్రాముఖ్యత ఇచ్చేవారు. ఎందుకంటే వారు చెప్పే డైలాగులు స్పష్టంగా ఆఖరి వరసలో వాళ్ళకి బిగ్గరగా వినబడేలా ఉండాలనుకునే వాళ్ళు. కాల క్రమేణా విజ్ఞాన ప్రగతిలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న వస్తువు మైకనే ఖచ్చితంగా చెప్పచ్చు. మనిషి సాంకేతిక ప్రగతి పెరిగాక, ఈ మైకు అనేది నాటకాని కొక ప్రత్యేక అవసరంగా తయారయ్యింది. మైకు లొచ్చాక నటీనటులు గొంతు చించుకో నవసరం లేక పోయింది.

అంతే కాదు చివరి వరుస నున్న వారికి కూడా స్పష్టంగా ప్రతీ మాట వినిపించడానికి ఈ మైకు తోడ్పడుతుంది. కానీ ఈ మైకులూ, స్పీకర్లూ ఇవన్నీ ఖర్చుతో కూడుకున్న పని. అంతే కాదు, ఇవి పని చేస్తేనే నాటకం రక్తి కడుతుంది. ఈ మైకులు పనిచేయాలంటే విద్యుచ్చక్తి కావాలి. పట్టణాల్లో ఫరవాలేదు కానీ, పల్లెల్లో ఇప్పటికీ ఇది సమస్యే!

అలాగే రాత్రి పూట నాటకాలు వేయాలంటే లైటింగ్ కావాలి. దీనికీ కరెంటు అవసరం ఉంది. ఇవన్నీ సరిగ్గా కుదిరితేనే నాటకం సవ్యంగా వస్తుంది. ఒక్కోసారి మైకులు మొరాయిస్తే అంతే సంగతులు. ఇప్పటికీ నాటకాలకి ఇది పెద్ద సమస్యే! అనేక నాటక సంస్థలు మిగతా విషయాలపై చూపించే శ్రద్ధా, ఆరాటం ఎందుకో ఈ మైకులూ, స్పీకర్ల మీద చూపించరు. మిగతా వాట్లకి ఎంత ఖర్చయినా చేస్తారు కానీ ఇక్కడ కొచ్చేసరికి ప్రతీ సంస్థా పొదుపు కార్యక్రమం మొదలు పెడతారు. సాంకేతికంగా ముందుకెళ్ళినా ఇలాంటి వాటిని తెలివిగా ఉపయోగించుకో లేకపోతున్నాం. శ్రీరామనవమి పందిళ్ళలోనూ, వినాయక చవితి పండగలకీ వేసే నాటకాలకి ఈ కరెంటు బెడద ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. నాటకం వేయాలంటే ఈ హంగులూ, సాంకేతిక సదుపాయాలూ ఉన్న ధియేటర్లు కావాలి.

మన తెలుగునాట పట్టుమని ఒక మంచి థియేటర్ లేదు. ప్రతీ ఊళ్ళోనూ ఇదే పరిస్థితి. కాస్తో కూస్తో హైద్రాబాదు రవీంద్ర భారతి నయం. చిన్న చిన్న పట్టణాలూ, పల్లెల్లో ఇప్పటికీ నాటక థియేటర్ల కొరత ఉంది. బహుశా సినిమాలు వచ్చాక నాటకం వెనకబడి పోవడానికిదొక ముఖ్య కారణం కావచ్చు. మంచి థియేటరు ఉండి సరైన సౌకర్యాలు ఉంటే నాటకం చూడ్డానికి తప్పకుండా జనం వస్తారు అని చాలామంది నాటకాభిమానుల విశ్వాసం !