తెరమరుగవుతున్న తెలుగు నాటకం -2

చివరగా విదేశాల్లో నాటకాల గురించి కాస్త ప్రస్తావిస్తాను. ఎందుకంటే తెలుగు నేల విడిచిన ప్రతీ తెలుగు వాడికీ ఒక తెలుగు సంఘం ఉంటుంది. ప్రతీ తెలుగు సంఘమూ సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తాయి. అందులో నాటకం అనేది తప్పకుండా ఉండి తీరుతుంది. కాబట్టి విదేశాల్లో తెలుగు నాటకం గురించి కాస్తయినా చెప్పుకోవడం సమంజసం. నాకు అమెరికాతో పరిచయం ఉంది కాబట్టి అమెరికాలో నాటకాల గురించి కాస్త ప్రస్తావిస్తాను.

అమెరికాలో దాదాపు అన్ని ముఖ్య నగరాల్లోనూ ఒక తెలుగు సంఘం ఉంది. ఉగాది కనీ, దీపావళి సంబరాలనీ, సంక్రాంతి వేడుకలనీ, అవనీ ఇవనీ ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. అందులో తప్పని సరిగా నాటకం ( పౌరాణికం, హాస్యం లేదా జానపదం ఏ దైనా కానివ్వండి ) వేస్తారు. కాకపోతే ఈ నాటకాలు టైం ఫిల్లర్లుగా వేస్తారు తప్ప, అంత సీరియస్ నెస్ కనబడదు. ఏదో మొక్కుబడికి లాగించేద్దామన్నట్లు గానే ఉంటాయి. వాళ్ళ పరిమితులూ, సమస్యలూ ఆ యా సంఘాలకి ఉన్నాయి కాదను. కానీ వేసే ఆ నాటకాల్లో స్టేజి ఎక్కేద్దామన్న తపనే కానీ నాటకం అంటే అర్థం చేసుకొని అవగాహనతో వేస్తున్నారని నేననుకోను. నా అభిప్రాయం తప్పని ఎవరైనా ఖండిచ వచ్చు.

అలాగే తానా, ఆటా ప్రతీ రెండేళ్ళకొక సారి ఉత్సవాల పేరిట సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. కానీ అక్కడా నాటకం అంటే సవతి తల్లి ప్రేమలాగే ఉంటాయి. కానీ అదేం చిత్రమో సినిమావాళ్ళు నాటకం వేస్తే మాత్రం జనం చూస్తారు. పైగా వాళ్ళకి రాత్రి పూట సమయం కేటాయిస్తారు. తానా, ఆటా వంటి సంస్థల్ని విమర్శించడం నా ధ్యేయం కాదు. వాళ్ళు నాటక రంగానికి చెందిన అనేకమంది కళాకారుల్ని రప్పించారు. కానీ అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళ చేత సీరియస్ గా నాటకం వేయించిన సందర్భాలు చాలా తక్కువున్నాయి. ఇక్కడా మంచి నటులూ, నాటకమంటే అభిమానమున్న వాళ్ళూ ఉన్నారు. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే ! దాదాపు అన్ని సాంస్కృతిక సంఘాలూ గతంలో పేరికగన్న నాటకాలనే వేస్తారు లేదా కాస్త హాస్యం ఉంటే కొత్తవి వేస్తారు. ఉంటే పౌరాణిక నాటకాలు, లేదా హాస్య నాటికలు లేదా స్కిట్స్ తప్ప సీరియస్ విషయాల మీద నాటకాలు వేసినవి చాలా తక్కువ. అక్కడక్కడ ఒకటీ అరా వేసుండొచ్చు. ఇక్కడ దూరంగా ఉన్న మన సమస్యలపై సీరియస్ నాటకాలు అంతగా రాలేదని నా అభిప్రాయం. ఇంకో విషయం. ఈ సాంస్కృతిక సంఘాల కార్యక్రమాలలో నాటకానికి ఓ ఇరవై నిముషాల స్లాట్ ఇస్తారు. అందులోనే మహాభారతమైనా ,రామాయణమైనా సర్వాంగ సుందరంగా వేసేయాలి. కనీసం 45 నిమిషాలు లేకుండా నాటికలు వేయలేరన్న సంగతి ఎందుకు అర్థం కాదో నాకిప్పటికీ అర్థం కాదు. కాకపోతే ఈ మధ్య కాలంలో ఆంధ్రా నుండి వచ్చి ఇక్కడ అనేక పద్య నాటకాలూ అవీ వేయడం జరుగుతోంది. దాని వల్ల మంచే జరుగుతోంది. ప్రవాసంలో ఉన్న తెలుగు వారు కూడా సొంతగడ్డ పై నాటకాన్ని బ్రతికించడానికి సహాయ పడాలి. అక్కడ మంచి ప్రదర్శనలు జరిగేలా ఆర్థిక సహాయం చేస్తే తప్పకుండా తెలుగు నాటక రంగం బాగు పడుతుందని నా ఆశ. ఆ నమ్మకం నిజమవుతుందో లేదో కాలమే సమాధానం చెబుతుంది.

ఉపసంహారం

ఈ వ్యాసం చదివాక నాటకం అంటే కాస్తయినా తెలుసుకో గలిగాము అన్న భావన ఒక్కరికి కలిగినా నేను రాసిన ఈ వ్యాసానికి ఫలితం దక్కినట్లే!

అంకితం

దాదాపు రెండేళ్ళ క్రితం నంది నాటకాలకి నేనొక పద్య నాటకం ( పంచమ ధర్మం ) రాసాను. ఆ నాటకం 2005 నంది నాటకోత్సవాల వడబోతలో ఎన్నికైన చివరి తొమ్మిది నాటకాలలో ఒకటి. ఆ నాటకం ద్వారా నాకు అనేక మంది తెలుగు నాటకరంగ కళాకారులు పరిచయం అయ్యారు. ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తుల్ని కలుసుకునే అవకాశం నాకు లభించింది. టాలెంటు ఉండి అవకాశాలు రాని ఎంతో మంది కళాకారుల్ని చూసాను. అలాగే ఆ పద్య నాటకం ధర్మమా అని నాకు ఎం.వి.రమణ మూర్తి గారితో పరిచయమయ్యింది. ఆయనే నే రాసిన పంచమ ధర్మం అనే నాటకానికి దర్శకత్వం వహించారు.

రచయితకీ, దర్శకుడికీ మధ్య అవగాహన ఉంటేనే నాటకం రక్తి కడుతుందని నమ్మే వ్యక్తుల్లో ఆయనొకరు. ఆయనే నోరి నరశింహ శాస్త్రి గారి ‘వాఘీరా’’ అనే నాటకం కూడా దర్శకత్వం వహించారు. నాటకం వేసేటప్పుడు ఎంత సీరియస్ మనిషో, బయట అంతకంటే పదిరెట్లు సౌమ్యుడు. హాస్యానికి కూడా అబద్ధం చెప్పలేదని ఆయన మిత్రులందరూ ముక్త కంఠంతో అంటారు. ఆయన పరిచయంలో నేను చాలా నేర్చుకున్నాను. ఆ మహా మనిషి 2008 ఫిబ్రవరి 20న పరమ పదించారు.

బ్రతికినన్నాళ్ళూ నాటకం మధ్యనే బ్రతికి, జీవిత చరమాంకానికి హఠాత్తుగా తెర దించేసుకొని అందరికీ కనుమరుగైన ఆ మహా వ్యక్తికి నా ఈ వ్యాసం అంకితం.

ఉపయుక్త గ్రంథాలు

  • సమగ్రాంధ్ర సాహిత్యం – ఆరుద్ర
  • ఆంధ్ర నాటక రంగ చరిత్ర – మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి
  • భారత నాటక చరిత్ర – సాహిత్య అకాడమీ
  • Indian Literature – Sahitya Acadamy
  • Indian Modern Drama – Sahitya Acadamy
  • ధర్మవరం రామకృష్ణా చార్యులు – పోనంగి శ్రీ రామ అప్పారావు
  • అలనాటి నాటకాలు – ఇంద్రగంటి శ్రీకాంత శర్మ