తెరమరుగవుతున్న తెలుగు నాటకం -2

నాటకాన్ని బ్రతికించుకుందాం

మొదటి నుంచీ తెలుగు సాహిత్యంలో నాటకాలకి ఒక ప్రత్యేకమైన స్థానం అంటూ అందరూ గొంతులు చించుకున్నా, చేతల్లో మాత్రం నాటకానికంత విలువ లేదని నా అభిప్రాయం. తెలుగు సాహిత్యం లో అన్ని ప్రక్రియలమీదా విమర్శనా గ్రంధాలూ, వ్యాసాలూ వచ్చాయి. కానీ ఒక్క నాటకాలపై పరిశోధనాత్మకంగా పని జరగలేదు. నాటకాలు వేయడం వరకే కానీ, ఆ నాటకాలపై మంచి విశ్లేషణాత్మకమైన పుస్తకాలు వెలువడలేదు. ఒక్క షేక్ ష్పియర్ నాటకాలే తీసుకోండి, వాటిపై ఎన్ని గ్రంధాలు వెలువడ్డాయో లెక్కలేదు. తెలుగులో మహా మహులంతా నాటకాలు రాసారు కానీ విమర్శ పై ఏ విధమైన శ్రద్ధా చూపలేదు.

అలాగే పత్రికల వాళ్ళకి కూడా నాటకం అంటే చిన్న చూపే. కథలూ, కవితలూ, వ్యాసాలూ వేసుకుంటారు కానీ, తెలుగునాట ఏ పత్రికలోనూ ఒక్క నాటకం ప్రచురించిన జాడలు కనిపించవు. అలాగే నాటకం వేద్దాము అనుకునే ఔత్సాహికులకి నాటక ప్రతులు దొరకడం కష్టమే! ఎప్పుడో పూర్వం అచ్చు వేసిన నాటక ప్రతులు ఏ గ్రంధాలయంలో లభిస్తాయో తెలియదు. నాటక విభాగానికి సంబంధించిన పుస్తకాలు లభించే గ్రంధాలయాలు కరువయ్యాయి. ఇప్పటికైనా మించి పోయింది లేదు. గత వందేళ్ళల్లో వచ్చిన నాటకాలన్నీ సంపాదించి ఒక లైబ్రరీ లా చేయాల్సిన సమయం ఆసన్నమయ్యింది. దీని వల్ల ముందు తరం నాటక ప్రియులకి ఎంతో లాభం చేకూరుతుందనడంలో సందేహం లేదు.

అలాగే వార్తా పత్రికలు కూడా అక్కడ నాటకం వేసారు, ఇక్కడ నాటకం వేసారు అని ఏమూలో అట్టడుగున వార్తలు వేయకుండా మంచి కవరేజి ఇస్తే నాటకం అంటే జనంలో ఆసక్తి పెరిగుతుంది. వారం రోజుల పాటు ఏటా నంది నాటకోత్సవాలు జరుగుతాయి. ప్రారంభం రోజున మంత్రి గారి ఫోటో తో ఓ వార్తా, చివరిరోజున బహుమతి ప్రదానం గురించి మరో మంత్రిగారు “నాటక రంగాన్ని అభివృద్ది చేస్తామంటూ ” కళాకారులకి చేసే వాగ్దాన వార్తతో మరో వార్తా తప్ప ఒక్కటీ ఏ వార్తా పత్రిక తరిచి చూసినా కనిపించవు. అసలు ఏ నాటకాలు వేస్తున్నారు? వాటి కళాకారులెవరు? కథా వస్తువులేమిటి? ఈ వార్తలు ప్రథాన పేజీల్లో కనిపించవు. ఏ ఊళ్ళో జరుగుతున్నాయో ఆ ఊరి ఎడిషన్లో ఫొటోలూ, దానిపై రెండు వాక్యాలతో పత్రికల వాళ్ళు నాటకాలకి మంగళం పాడతారు. ఈ విషయంపై నాటక రంగం వాళ్ళూ శ్రద్ధ పెట్టిన దాఖలాలు లేవు. గ్లోబలైజేషన్ ధర్మమా అని ప్రసార మాద్యమాల ప్రాభవం పెరిగింది. దాన్ని సవ్యంగా ఉపయోగించుకోవాల్సిన బాధ్య మాత్రం నాటక రంగానిదే ! ఇది ఎవరూ కాదనలేని నిజం. కాకపోతే ఎవరు పిల్లి మెడలో గంట కడతారన్నదే తేలని విషయం.

అలాగే ఏటా జరిగే నంది నాటకాలకైనా, లేదా ఏ పరిషత్తు నాటకాలకాల్లో నయినా ప్రదర్శింపబడే నాటకాలని పుస్తక రూపంలో ప్రచురించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా నంది నాటకోత్సవాలకి పెట్టే ఖర్చులో ఇది ఏమాత్రమూ లెక్క లోకి రాదు. ఇలా నాటక ప్రతులుండడం వల్ల నాటకరంగంలో వచ్చే ప్రతీ నాటకాన్నీ పుస్తక రూపంలో చరిత్రకెక్కెస్తున్నాం. అలాగే నాటకాభి లాష ఉన్న విద్యార్థులకి ఈ పుస్తకాలు ఎంతైనా ఉపయోగపడతాయి. ఇలా ఎన్నో గంటలున్నాయి కానీ, మెడ మాత్రం ఒకటే! దీనికి నాటకరంగ పెద్దలే నడుం కట్టాలి.

అలాగే ప్రతీ కళాశాల లోనూ, విద్యాలయాల్లోనూ నాటక సమాజాల వాళ్ళు ఉచితంగా నాటాకాలు వేసి విద్యార్థులకి నాటకం పై ఆసక్తి కలిగించాలి. అలాగే యూనివర్శిటీ వారోత్సవాల్లోనూ అక్కడా మంచి ప్రదర్శనలు ఇచ్చి విద్యార్థుల్లో నాటకం అంటే ఉత్సాహం పెంచాలి.

నాటకాలు ఎవరైనా వేస్తూ టిక్కట్లు పెడితే ఖచ్చితంగా అందరూ టిక్కట్లు కొని మరీ వెళ్ళాలి. ఆ మధ్య ఒక నాటక సంస్థ వారు నాటకానికి టిక్కట్లు పెట్టారు. పట్టుమని పదిమంది కూడా రాలేదు. వచ్చిన వాళ్ళల్లో సగం మంది ఫ్రీ పాసులే ! ఇలా ఉంటుంది పరిస్థితి. అలాగే ప్రభుత్వం కూడా ధియేటర్లని నాటక సమాజాలకి తక్కువ ధరకి అద్దెకివ్వాలి. దాని వల్ల మంచి నాటకాలు అన్ని సౌకర్యాలూ ఉన్న ధియేటర్లో ప్రదర్శించవచ్చు. ధియేటర్ కయ్యే ఖర్చుని స్టేజి డెకరేషన్ కో మరో దానికో ఉపయోగిస్తే మంచి నాటకాలు వచ్చే అవకాశం ఉంది. చాలా సమాజాలు ఖర్చు ఎక్కువనీ ఆహార్యం దగ్గర సమాధాన పడిపోతారు. అందువల్ల నాటకాలంటే జనంలో ఆకర్షణ తగ్గిపోతుంది. మంచి మంచి సెట్టింగులు వేసి నాటకాలు వేస్తే జనం తప్పకుండా వస్తారని నా ఆశ. నాటకం జనాన్ని ధియేటర్ కి రప్పించాలి. ఎలా చేసినా సరే, దాని సర్వ బాధ్యతలూ నాటకరంగానిదే !