నాకు నచ్చిన పద్యం: పారిజాతాపహరణంలో సత్యభామ

చం. అతుల మహానుభావ మని యవ్విరిఁ దానొక పెద్ద సేసి య
     చ్యుతునకు నిచ్చకంబొదవ సూడిద నిచ్చిన నిచ్చెఁగాక తా
     నతఁడు ప్రియంబు గల్గునెడ కర్పణ సేసినఁ జేసెఁగాక యా
     మతకరి వేలుపుం దపసి మమ్ముఁ దలంపఁగ నేల యచ్చటన్

పై పద్యం నంది తిమ్మన రచించిన పారిజాతాపహరణం లోనిది. ఈయనకు ముక్కు తిమ్మన అనే మరో ముద్దుపేరు కూడా ఉంది. ముక్కును వర్ణిస్తూ ఆయన వ్రాసిన ఒక పద్యానికి వచ్చిన ప్రసిద్ధి వల్ల ఆయన్ను ముక్కు తిమ్మన అంటారని జనశ్రుతి. కానీ, ముక్కును వర్ణించిన ఆ ప్రసిద్ధ పద్యం పారిజాతాపహరణంలో లేదు. రామరాజ భూషణుడు వ్రాసిన వసుచరిత్రలో ఉంది. కానీ లోకంలో ప్రతీతి మాత్రం ఆ పద్యం తిమ్మకవే వ్రాశాడని. జనంలో ఉండే ఇలాంటి కథలను బట్టి నిజానిజాలు నిర్ణయించడం వీలూ కాదు, న్యాయమూ కాదు.

తిమ్మకవి గూడా కృష్ణదేవరాయల ఆస్థాన కవే. ఆయన సభలోని అష్టదిగ్గజ కవులలో ఒకడు. రాయలవారి చిన్న భార్య అయిన చిన్నాదేవితో పాటు ఆమె పుట్టింటి రాజ్యం నుంచి అరణంగా వచ్చాడంటారు. ఒకరోజు రాత్రి నిద్రపోతుండగా చిన్నాదేవి కాలు రాయలవారి తలకు తగిలిందనీ, దానికి రాజు కోపించి ఆమె దగ్గరకు రావడం మానుకున్నాడనీ, ఆ బాధను ఆమె తిమ్మకవికి చెప్పుకున్నదనీ, భార్య కాలు భర్తకు తగలడం తప్పేమీ కాదని రాయలవారికి అన్యాపదేశంగా చెప్పడం కోసం కృష్ణా-సత్యభామలకు అటువంటి ఘట్టం ఒకటి కల్పించి పారిజాతాపహరణ కావ్యం వ్రాసి సున్నితంగా సరసంగా రాయలవారికి బోధించాడనీ, ఆ సూచనను సహజ సహృదయమూర్తి ఐన రాయలు గ్రహించి తదాది భార్యతో సఖ్యంగా వున్నాడనీ – ఒక ఐతిహ్యం జనంలో ప్రచలితంగా వుంది. పైన మనం చెప్పుకున్నట్లు జనబాహుళ్యం లోని వదంతుల నిజానిజాలు నిర్ధారించటం కష్టమే. ఏమైనా కానీ ఒక చక్కని ప్రబంధ కావ్యం తెలుగు ప్రజలకు దక్కిందనేది మాత్రం నిజం.

‘ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు’ అనేది సాహిత్యప్రియుల వాడుక. నిజమే. పారిజాతాపహరణం లోని ప్రతి పద్యమూ ఆ విషయాన్ని వేనోళ్ళ చాటుతుంది. ఎంత చక్కని కథాప్రణాలిక వేసుకున్నాడో అంత అందంగా ఆ కథను కావ్యంగా మలిచాడు తిమ్మన. కావ్యంలో ఎన్ని ఆశ్వాసాలున్నాయో గిరి గీసినట్లు అన్ని రంగాలుగా విభజించి వొక మంచి నాటకాన్ని పద్యాల్లో రూపొందించాడనుకోవచ్చు. అయితే కొందరు విమర్శకుల ఆరోపణ కూడా ఒకటుంది. ప్రధాన కథ ప్రథమాశ్వాసం లోనే అయిపోయింది, మిగిలిన ఐదు ఆశ్వాసాలూ అనవసరంగా సాగదీశాడు అని. కానీ అది పూర్తి నిజం కాదు. ప్రథమాశ్వాసం తరువాయి భాగాల్లో కవిత్వం గానీ, పద్యాలు గానీ తక్కువ స్థాయివేమీ కావు.

తిమ్మకవి సృష్టించిన ‘సత్యభామ’ ఒక మహాద్భుతమైన పాత్ర. మామూలుగా భారత భాగవతాల్లో కనిపించే సత్యభామ కాదు పారిజాతాపహరణంలో కనిపించే సత్యభామ. తిమ్మకవి సత్యభామకు కల్పించిన రూపే (ఇమేజ్) వేరు. ఏ యితర భారతీయ భాషా సాహిత్యాలలోనూ సత్యభామకు ఈ ఇమేజ్ లేదని తెలిసిన వారంటారు. భర్తను అపరిమితంగా ప్రేమిస్తూ, భర్త నుండి అంతే విపరీతమైన ప్రేమను పొందుతూ, అతనితో చనవులు నెరపుతూ, అవసరమైనప్పుడు అలుగుతూ, కోర్కెలు తీర్చుకుంటూ, అప్పుడప్పుడూ నిష్ఠురాలాడుతూ, భర్త తన కొక్కతికే అనురక్తుడుగా వుండాలని కోరుకుంటూ, అలానే వున్నాడని నమ్మే ఒక ప్రణయమూర్తి, ఒక గడుసు తెలుగు ఇల్లాలు – తిమ్మన గారి సత్యభామ. తులసి దళం చేత్తో పట్టుకుని, పతిభక్తి అనుకుంటూ పాదసేవలూ, పూజలూ చేసే రుక్మిణి లాగా వుండే సత్యభామను తెలుగువారు అంగీకరించలేరు. నాటకాల్లోని ‘మీరజాల గలడా నా యానతి’ లాంటి పాటలకూ, సినిమాల్లో జమున వేసిన సత్యభామ లాంటి పాత్రలకూ అసలు ప్రేరణ తిమ్మన రూపొందించిన పారిజాతాపహరణం సత్యభామే!

కృష్ణుడు ఒకరోజు రుక్మిణి ఇంట్లో ఉండగా నారదుడు వచ్చి ఒక పారిజాత పుష్పం ఇచ్చి నీకు ఇష్టమయిన వారికి ఇచ్చుకోమని చెపుతాడు. తాను అప్పుడు రుక్మిణితో వున్నాడు కాబట్టి కృష్ణుడు ఆ పూవుని రుక్మిణికే ఇస్తాడు. నారదుడు సత్యభామను గురించి, అప్పుడక్కడే ఉన్న సత్యభామ చెలికత్తె వినేట్లుగా కొన్ని ఎకసక్కెపు మాటలంటాడు. చెలికత్తె పోయి ఈ సంగతంతా సత్యభామకు చెపుతుంది. ఇంకేముంది! ‘వ్రేటు వడ్డ ఉరగాంగన యుం బలె, నేయి వోయ భగ్గన దరికొన్న భీషణ హుతాశన కీల యనంగ’ లేస్తుంది సత్యభామ. ఆ సమయంలో తన కోపాన్నీ, అక్కసునూ వ్యక్తంచేస్తూ తన చెలికత్తెతో మాట్లాడే సందర్భం లోనిది పై పద్యం. నిజంగానే నారదుడు అలా మాట్లాడాడా అని అడుగుతుంది. అవన్నీ విని ఊరికే వున్నాడా కృష్ణుడు అని అంటుంది. రుక్మిణి ఏమేం మాట్లాడింది అని ఆరా తీస్తుంది.

అసలు తానే కృష్ణుని మహిషులందర్లోకీ ఆయనకు అత్యంత ప్రియమైన దానినని సత్యభామ నమ్మిక. ఒక మంచి వస్తువు ఆయన చేతికి వస్తే దాన్ని తనకే ఇస్తాడని ఆమెకు ప్రగాఢ విశ్వాసం. అలాంటిది, పారిజాతాన్ని తనకీయకుండా తన సవతి కివ్వడం భరించలేక పోతుంది. నారదుడు తన గురించి ఎకసక్కెపు మాటలు మాట్లాడడం – అదీ రుక్మిణి ఎదుట – ఊహించలేని అవమానంగా భావిస్తుంది. పైగా ఈ ప్రహసనమంతా కృష్ణుని ఎదుట జరగడమూ, ఆయన ఔనూ కాదూ అనకుండా ఉండడమూ, పుండు మీద కారం జల్లినట్లయింది. ఇదీ నేపథ్యం పై పద్యానికి.

ఈ పద్యంలో మూడు పనులు స్పష్టంగా ఎత్తిచూపుతుంది సత్య – నారదుడు పూవుని కృష్ణుని కీయడం, ఆయన దానిని రుక్మిణి కీయడం, నారదుడు తనను గేలి చేస్తూ మాట్లాడడం. ఈ మూడూ సత్యకు హృదయ శల్యాలే. నారదుడు పువ్వును కృష్ణుని కివ్వడంలో తప్పేముంది. కానీ కృష్ణుడు దాన్ని రుక్మిణి కిచ్చేసరికి, అసలు పువ్వును తేవడమే తప్పై పోయింది అభిమానవతీ, కోపనా అయిన సత్యకు. ఈ పద్యంలో సత్యభామ మనస్థితి చాలా స్వభావసిద్ధంగా చిత్రితమైంది. నిజానికి పారిజాతం ‘అతుల మహాను భావ’మైనదే. అది అంత గొప్పది కాబట్టే నారదుడు దాన్ని పెద్ద జేసి వర్ణించాడు. మామూలు పువ్వైతే ఎవరిచ్చినా, ఎవరికిచ్చినా ఎవరూ పట్టించుకోవల్సిన పనే లేదు. ‘అతుల మహానుభావమని యవ్విరి తానొక పెద్ద జేసి అచ్యుతునకు ఇచ్చకం బొడవ సూడిద ఇచ్చిన ఇచ్చెగాక’ అని సత్య అనడం అందని ద్రాక్షపండ్ల సామెతను జ్ఙాపకం చేయడమే గాక, ఒక రకంగా ఆ పూవు గొప్పదనాన్ని అంగీకరించి దానిని తనకు కాకుండా తన సవతి కీయడం పట్ల బాధ పడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. పైగా దాన్ని ‘అచ్యుతునకు ఇచ్చకం బొదవ సూడిద’ ఇచ్చాడట. నారదుణ్ణి ఇచ్చకాలాడే వాడిగా తేల్చి పారేసింది. ‘తానతడు ప్రియంబు గల్గు నెడ కర్పణ జేసిన జేసె గాక’ అనడంలో రుక్మిణి ఎడనే కృష్ణునికి ప్రియమున్నది, తన ఎడ లేదు అని కొత్తగా తెలుసుకున్న నిజం వల్ల కలిగే బాధను అనుభవిస్తూనే, కడుపుడుకుతో ‘తన కిష్టమైన వాళ్ళకు ఇచ్చుకుంటే ఇచ్చుకోనీ’ అంటున్నది. ఇవ్వడం కూడా కాదు ‘అర్పణ’ చేయడం అట.

నారదుడు ఆ మాములు పువ్వును ఓ బ్రహ్మాండమైనదిగా వర్ణించి కృష్ణుడి మెప్పు కోసం ఇస్తే ఇచ్చుకోనీ, దాన్ని కృష్ణుడు తనకు నచ్చిన వాళ్ళకు సమర్పణ చేస్తే చేసుకోనీ! కానీ, మాయావి ఐన ఆ దేవ ఋషి, ఆ మతకరి వేలుపుం దపసి (మతకము + అరి మోసకారి) మమ్మల్ని గూర్చి మాట్లాడ్డమెందుకు అక్కడ? ఇదీ ఆమె బాధ.

ఎంత లెక్క లేని తనమో చూడండి, నారదుడన్నా, రుక్మిణన్నా, తనను చిన్న పరచిన కృష్ణుడన్నా. ఈ పద్యంలో ఆ ముగ్గురి మీదా ఎంత తిరస్కారం ప్రకటించిందో గమనించండి. నారదుడు ఇచ్చకాల మారి, మోసకారి. కృష్ణుడి మెప్పు కోసం ఓ మాములు పువ్వును గొప్పజేసి పొగిడిన భట్రాజు. ఇక రుక్మిణి పేరు ఎత్తడం గూడా ఇష్టం లేదు ఆమెకు. ‘తానతడు ప్రియంబు గల్గు నెడకు’ అని రుక్మిణి ఊసు కూడా పరిహరిస్తూ మాట్లాడడం, ఆమెకు రుక్మిణిపై గల చులకన భావం చెప్పకనే చెబుతున్నది. ఇక కృష్ణుణ్ణి తిరస్కారంగా ‘అతడు’ అని సూచించింది, పువ్వుని ‘అర్పణ’ చేశాడు అంది. వాళ్ళపై తిరస్కారమే గాదు, తన అతిశయోక్తి ఎలా ప్రకటించిందో చూడండి. ‘మమ్ము దలంపగ నేల?’ అట. కృష్ణుడేమో ‘అతడు’ తానేమో ‘మమ్ము’ !

ఇలా సత్యభామ మనసు లోకి దూరి, ఆమె మనోభావాల ఛాయాచిత్రంగా పద్యాన్ని చెక్కాడు తిమ్మకవి. సత్య అతిశయమూ, కోపమూ, బాధా, అక్కసూ, తిరస్కారా లన్నింటినీ అద్భుతంగా బొమ్మ కట్టించాడు. పారిజాతాపహరణం లోని ప్రతీ పద్య సమూహమంతా అమృత బిందు సందోహం. అందులో నాకు నచ్చిన చాలా పద్యాల్లో ఒకటైన ఈ పద్యం ప్రథమాశ్వాసం లోనిది.