దాలిగుంటలో లీయా

“టిటి టిటీ! టిటీ టిటీ లీయా! కమాన్‌ బేబీ కం! కం టు మామీ,” అని నన్ను ఈ కొత్త దొరసాని ముద్దు చేసినప్పుడల్లా నాకు ఒళ్ళు మండి పోతుంది, చెప్పద్దూ! లీయాట లీయా! ఎక్కడ దొరికిందో ఈ పిచ్చి పేరు. లీయా అని పిలవంగానే, నేను పరిగెత్తు కెళ్ళి మా దొరసానిగారి ఒళ్ళో కూచోవడం నేర్చుకున్నా. అల్లాగ కూచున్నప్పుడు ఆవిడ నా నల్లటి చల్లటి ముక్కు మీద ముద్దెట్టుకుంటుంది. నాకయితే పరమ అసహ్యం వేస్తుంది! దొరసాని మంచిదే, కానీ ఆవిడ నన్ను ముద్దు పెట్టుకున్నప్పుడు ఆవిడ పెదిమలమీద ఎర్ర రంగు పూత అదేదో వాసన వేస్తుంది.

అసలు మా అమ్మ నన్ను ఏం పేరెట్టి పిలిచేదో! అమ్మ గుర్తుకి రాంగానే ముక్కు మరీచల్లబడిపోతుంది. కళ్ళు చెమ్మగిలి పోతాయి. వీళ్ళకేం తెలుసు నా బాధ! తమ్ముడూ, చెల్లెలూ ఎక్కడున్నారో, ఏమో! అసలు బతికే ఉన్నారో లేదో!! అమ్మ నన్ను, చెల్లినీ, తమ్ముడినీ ఒకేసారి కన్నది. అమ్మ పొత్తిళ్ళ వడిలో వెచ్చగా ఎంతబాగుండేదో! ముగ్గురం ముడుచుకొని పడుకునేవాళ్ళం, నల్ల గొంగళీ మీద, కటకటాల బోనులో. ఎవళ్ళన్నా దగ్గిరకొస్తే అమ్మ ౠ ౠ అంటూ గసిరేది, మా చిన్నప్పుడు. ముగ్గురికీ ఒకే నల్ల మూకుడులోనించి నీళ్ళు తాగడం నేర్పింది అమ్మ. అంతే! ఆరు వారాలు కూడా కాలేదు. ఈ దొరసాని నన్ను కొనుక్కుంది. ఆ అమ్మిన అయ్య చూపెట్టిన అమ్మా నాన్నల జాతకాల కాగితాలు దొరసానికి బాగా నచ్చి ఉండాలి. మరి నన్నొక్కణ్ణే కొనుక్కున్నదేవిటో! పాలలా తెల్లగా ఉన్న నా జుట్టు మెత్తగా ఉండబట్టేమో ! అమ్మనీ, తమ్ముడినీ, చెల్లినీ కూడా నాతో పాటు తీసుకొచ్చి ఉంటే ఇంచక్కా ఎంతో బాగుండేది! కనీసం తమ్ముడినన్నా తీసికొస్తే పరిగెత్తుతూ ఆడుకోటానికి ఎంతో బాగుండేది! తమ్ముడికి మెడకింద నల్లగా పొడలుండేవి.

ఈ ఇంటి కొచ్చి నాలుగు వారాలు కూడా కాలేదు. నన్ను బళ్ళో వేశారు. రోజుకి రెండుఘంటలసేపు ఒబీడియన్స్ బడిలో దొరసాని నన్ను వదిలిపెట్టేది. ఆ మేష్టరు నల్ల కర్ర నా ముక్కు మీద పెట్టి కూచోమని, నించోమని, డొల్లమనీ, బోర్లా పడమనీ రకకాల పాఠాలు చెప్పేవాడు. తూచా తప్పకండా వాడు చెప్పినట్టు చేస్తే, చేసినప్పుడల్లా చిన్న బిస్కట్ ముక్క ఇచ్చేవాడు. ముష్టి బిస్కెట్! ఏమాత్రం ౠ ౠ అని అమ్మలా కసురుకున్నా నోరు తెరిపించి నల్ల కర్ర నోట్లో పెట్టేవాడు. పళ్ళూ తీపి పుట్టి ఆ కర్ర కొరికేయబుద్ధి అయ్యేది. ఆ కర్ర కొరికి చిన్న గాటుపెడితే చాలు, ఆ రోజు మంచి నీళ్ళు కూడా దక్కేవి కావు. గుండ్రంగా తిరగడం, గేటుదాకా పరిగెత్తి సడెన్‌గా గేట్ దగ్గిర ఆగడం, పిలిచిన వెంటనే పరిగెత్తుకొచ్చి ముందు కాళ్ళు ఎత్తి వెనక కాళ్ళ మీద నిలబడడం, విసిరిన కర్ర తెచ్చి వాడికి ఇవ్వడం, … ఒకటేమిటి… రకరకాల పనులు చెయ్యడం నేర్పాడు. అన్నీ, వాడు చెప్పినట్టే చెయ్యాలి. అదే నాకు నచ్చదు.

నాకు వళ్ళంతా ఇంచక్కా చిక్కని చక్కని తెల్ల జుట్టు ఉండేది. దొరసాని నీళ్ళుపోసినప్పుడు జుట్టు విదిలిస్తే భలే సరదాగా ఉండేది. ఒకరోజున నన్ను దొరసాని షాపుకి తీసికెళ్ళింది. అక్కడ ఒక బొద్దుగా ఉన్న అమ్మాయి నాకు క్రాపు చేసేసింది. వీపు మీద జుట్టంతా నున్నగా గొరిగేసింది. నెత్తిమీదనుంచి చెవులదాకా జూలులా పడే జుట్టు చిన్నగా కత్తిరించింది. అద్దంలో చూసుకుంటే నన్ను నేనే గుర్తుపట్టలేకపోయాను! షాపులోనుంచి దొరసాని బయటికి తీసుకొచ్చి, కారులో కెక్కించింది. అబ్బ! కారులో చచ్చే చలి! జుట్టు ఉండిఉంటే చలి తెలిసేది కాదు. వంటిమీద జుట్టంతా పోయిందేమో మరీ వణుకు పుట్టింది. అక్కడనించి హుటాహుటిన మరో షాపు కెళ్ళాం. అక్కడ, నా ముందు పాదాలకి బుల్లి బూటీలు, తలమీద టోపీ, వీపు సగంకప్పేసే చొక్కా వేయించింది, దొరసాని!

నెలకోసారి దొరసాని నన్ను డాక్టర్ దగ్గిరకి తీసికెళ్తుంది. ఇవాళ ఆయన ఆఫీసు కెళ్ళాలి. నాకు తెలుసు! ఆ రోజు దొరసాని నాకు సబ్బు పట్టించి స్పెషల్‌ గా టబ్బులో స్నానం చేయిస్తుంది. మామూలుగా అయితే బయట రబ్బరుగొట్టం నీళ్ళతో స్నానం. నిజం చెప్పద్దూ! అదే నాకు ఇష్టం. ఎందుకంటే వళ్ళు విదిలించి ఇంటివెనక స్థలంలో పరిగెత్తచ్చు, ఒళ్ళు ఆరేవరకూ! టబ్బులో స్నానం చేయించినరోజున దొరసాని నన్ను గట్టిగా పట్టుకొని తువ్వాలుతో తుడుస్తుంది. ఒళ్ళువిదిలించడానికి పరిగెత్తడానికి పడదు. దానికి తోడు, డ్రైయర్‌ తో ఆ కాస్తజుట్టూ ఆరబెట్టుతుంది. ఆ వేడిగాలి ముఖంమీద పడితే నాకు చిరాకేస్తుంది.

డాక్టర్‌ ఆఫీసు కెళ్ళడం నాకు ఇష్టమే. అక్కడ నాకు తోడుగా బోలెడుమంది ఉంటారు, ౠౠ, ౠౠ అంటూ పలకరిస్తారు. అయితే ఎవ్వరితోటీ ఆడుకోటానికి కుదరదు. ఒకళ్ళనొకళ్ళు చూసుకోవడం పలకరించుకోవడమే తప్ప! డాక్టర్ నన్ను వెల్లకిలా పడుకోబెట్టి, పొట్టమీద చెయ్యిపెట్టి రుద్దుతాడు. అలా చేస్తే నాకు భలే బాగుంటుంది. దొరసానితో ఏమిటో సొద చెపుతాడు. నోరు తెరిపించి చూస్తాడు. చెవుల్లో కెలుకుతాడు. అంతవరకూ పరవాలే. ఉన్నట్టుండి సూదితో పొట్టకింద పొడుస్తాడు. అది నాకు నచ్చదు. అప్పుడు వాడి ముక్కుని పళ్ళతో కరిచి పట్టేద్దామనిపిస్తుంది, చెప్పద్దూ! నామటుకు నాకు, నెల నెలా డాక్టర్ దగ్గిరకెళ్ళడం అనవసరమని పిస్తుంది. ఆయన ఏదో చెప్తాడు; దొరసాని ఊ కొడుతుంది. నెలనెలా నన్ను అక్కడికి తీసుకోపోతుంది. ఒక్క విషయం కనిపెట్టా. కంటికింద పెద్ద నల్ల మచ్చ ఉన్న ఒక దోస్తు నాకు మల్లే నెలనెలా రాడు. ఎందుకో? నాకయితే అర్థం కాదు. వాడంటే భలే ఇష్టం. నన్ను చక్కగా పలకరిస్తాడు. సూది పొడిచిన రోజున ఒళ్ళంతా తిమ్మిరితిమ్మిరిగా వుంటుంది. ఆ రోజంతా నెగడిముందు ముడుచుకొని పక్కనే ఉన్న పరుపుమీద కళ్ళుమూసుకొని పడుకోటమే!


అలా నెగడిముందు కళ్ళుమూసుకొని పడుకున్నప్పుడు నన్ను నేనే మరిచిపోతా. మగతగా ఉంటుంది. అప్పుడు బలే బలే కొత్త కొత్త కలలొస్తాయి. కొన్ని కలలు భయం వేస్తాయి కూడాను!

పెద్ద ఇల్లు. మేడమీద గది. ” ఫ్లష్‌ , ఫ్లష్ ” అని పిలవంగానే నేను దొరసాని సోఫా పైకి దూకే వాడిని. సోఫా వెనకనించి కిందకి డొల్లేవాడిని. అల్లాగ దూకడం, డొల్లడం ఆటలు ఆడినప్పుడల్లా ఈ దొరసాని కిలకిలా నవ్వేది. ఈ దొరసాని చిన్నగా ఉంది. సన్నగా నీరసంగా ఉంది. రోజంతా పక్కమీదో, సోఫాలోనో ఉండేది. ప్రతిరోజూ సాయంత్రం నన్ను ఇంటివెనక తోటలో షికారుకి తీసికెళ్ళేది. తను మరెక్కడికీ వెళ్ళేది కాదు! ఎప్పుడూ ఏదో చదువుకుంటూ వుండేది. లేకపోతే ఏదో రాసుకుంటూ ఉంటుంది. రాస్తూరాస్తూ అప్పుడప్పుడు మధ్యలో ఆగిపోయి చాలాసేపు నాకేసి ముద్దుగా నా కళ్ళల్లో కళ్ళుపెట్టి తీక్షణంగా చూసేది. నేనూ కళ్ళార్పకండా చూసేవాడిని. పొద్దున్నే పింగాణీ కప్పులో తనుతాగే నల్లటివేడి నీళ్ళు, పాలూ కలిపి నాకూ ఇచ్చేది. అది చేదుగా వుంటే ముఖం పక్కకి తిప్పుకునే వాడిని. వెంటనే అందులో ఏదో కలిపేది. అప్పుడు ఆ నీళ్ళు తియ్యగా వుండేవి. నేనూ తనలాగే జుర్రుతూ తాగేవాడిని. ఆ నీళ్ళు తాగినప్పుడల్లా నాకు తుమ్ములొచ్చేవి. అప్పుడు ఆవిడ నన్ను ఎత్తుకొని బుజ్జగించేది. ఆవిడ, నేనూ — నేనూ, ఆవిడా మంచి స్నేహితులం. ఎప్పుడూ కలిసే ఉండేవాళ్ళం. ఏ పని చేసినా, ఎక్కడికెళ్ళినా నేను దొరసానితోనే ఉండేవాణ్ణి.

ఇలా ఉండగా ఒక రోజున, బయట తోటలో నడవడాని కెళ్ళినప్పుడు, ఎవడో దొంగవెధవ నన్ను బలవంతంగా ఎత్తుకొని పరిగెత్తుకొని పారిపోయాడు, వెనక గేటు దూకేసి. “ఫ్లష్‌, ఫ్లష్‌ ” అని ఆవిడ గట్టిగా అరిచింది. నేను వాడి చేతుల్లోంచి తప్పించుకొని వెళ్ళగలిగితేగా? నాకు భలే భయం వేసింది. నాకోసంకాదు, దొరసాని కోసం. ఆ దొంగవెధవని కరుద్దామనుకున్నా. వీలయితేనా! వాడు నా నోరు గుడ్డతో గట్టిగా నొక్కేసాడు. కాసేపు ఊపిరాడలేదు…. చచ్చిపోతానేమోనని ……భయం…

ఠక్కున మెలుకువొచ్చింది. నెగడి ముందునుంచి లేచి కలతగా కలతగా సోఫా చుట్టూ తిరుగుతూ వుంటే, మా దొరసాని హాయ్‌ లీయా అని పలకరించంగానే పూర్తిగా తెలివొచ్చింది. అమ్మయ్య! ఆ దొంగవెధవ నన్నెత్తుకొపోయింది కలలోనేనన్నమాట! వెంటనే దొరసాని ఒళ్ళోకి దూకి కూచున్నా.

నాకు తెల్ల ప్లేటులో డిన్నర్‌ పెట్టింది దొరసాని. చెప్పద్దూ! నాకయితే ఆ స్పెషల్‌ డిన్నర్లు నచ్చవ్‌. అవన్నీ చప్పగా వుంటాయి. బొమికలుండవు, కసిదీరా కొరకడానికి. మా దొరసాని ఈ డిజైనర్‌ డిన్నర్లు అతి ప్రేమగా కొన్నదికానీ, నాకుమాత్రం దొరసాని తినేటప్పుడు కింద పడ్డ రొట్టెముక్కలే ఇష్టం. అల్లా తిందామని తారట్లాడుతూ ఉంటే, దొరసాని కనిపెట్టేసి, నో, నో, నో అంటూ మందలిస్తుంది. అప్పుడు, బిక్కమొహం పెట్టుకొని తిన్నగా నా ప్లేటు దగ్గిరకే పోతాను!

అప్పుడప్పుడు, దొరసానితోకలిసి సాయంకాలం పెద్ద పార్కు కెడతా. దొరసాని స్నేహితుడొకడు పార్కు కొస్తాడు. అతనితో పార్కు బెంచీమీద కూర్చొని దొరసాని ఘంటసేపు బాతాఖానీ వేస్తుంది. పార్కులో బోలెడు చెట్లు, కర్ర బెంచీలూ ఉంటాయి. నాకు ఆ బెంచీల మీదనించి దూకడమంటే భలే ఇష్టం. అక్కడ కావలసినంత దూరం పరిగెత్తచ్చు, ప్రతిచెట్టు చుట్టూ గిరగిరా తిరుగుతూ! ఒకసారి మెడకింద నల్ల మచ్చవున్న వాడిని చూశా. అచ్చంగా చిన్నప్పటి తమ్ముడిలాగున్నాడు. పలకరిద్దామని పరిగెత్తుకొని వాడి దగ్గిరకెళ్ళా. వాడిని గొలుసుకి కట్టి పెద్ద బొర్రాయన ఒకడు దబదబా నడిపించుకొని పోయాడు, నన్ను చీదరించుకుంటూ. వాళ్ళు మళ్ళీ ఎప్పుడూ కనిపించలా! ఒకవేళ కనిపించినా గుర్తుపట్టడం సులువుకాదేమో!

“లీయా, లీయా” అని పిలవంగానే మన ఆట కట్టు. దొరసానితో కారెక్కి ఇంటికి వెళ్ళిపోవాలి.

కారెక్కి పోవడం బాగానే ఉంటుంది. రివ్వున గాలి మొహంమీదికి వస్తుంటే. ఒక్కొక్కసారి, దొరసాని కారులో వెనక సీటు మీద నన్ను వదిలిపెట్టి, అద్దం కొద్దిగా తీసి, తనొక్కత్తే పోతుంది. అప్పుడు నాకు భలే విసుగేస్తుంది. అటుపక్కా ఇటుపక్కా ఆగిపోయిన కార్లు! ౠౠ అని అరవడంతప్ప వేరే ధ్యాసే ఉండదు. ఒక రోజున అల్లాగ అరుస్తూ ఉంటే ఒక నల్ల కుర్రాడు కారు పక్కగా నడిచిపోతూ, వాడి చెయ్యి నా ముక్కుమీద పెట్టబోయాడు. కసుక్కున కరిచేద్దామనిపించింది! నయమే!! వాడిని కరిచి ఉంటే ఏమయ్యేదో ఏమో. వాడికి నాకున్నట్టుగా యిన్‌స్యూరెన్స్ లేకపోతే, దొరసాని పని గోవిందా! అందుకని, ౠౠ ౠౠ అని కసిరికొట్టేశా! భయపడి పారిపోయాడు.

ఇవాళ ఒకటే వర్షం. ఎడతెరిపి లేకండా కురుస్తున్నది. గుమ్మం దగ్గిరకికూడా వెళ్ళబుద్ధి కాలేదు. ఇంట్లోనే ఇటూఅటూ కాస్సేపు తిరిగి మళ్ళీ నెగడి ముందు నా పరుపు మీద కూలబడ్డా. అల్లా కళ్ళు మూసుకుంటే, మరో కల!


నేను నాలుగడుగులెత్తున్నా, నల్లగా నున్నగా. నా తోక చాలా పెద్దది. గుండ్రంగా వెనక్కి ముడుచుకొని, నే తలతిప్పితే నా ముక్కుకందేది. అబ్బ! తోకచివర ఎంత జూలో! చూడటానికి నాకే ముచ్చటేసేది. ఈ దొరసాని రోజూ బోలెడు రొట్టెలు చేసేది. రొట్టెలు చేసేటప్పుడు, అక్కడ ఘుమఘుమ వాసనలు. ఆ వాసనలు ఎంత బాగుంటాయో! ఆవిడ రొట్టెలు చేస్తూంటే ఆవిడ కాళ్ళచుట్టూ తిరిగేవాడిని.

“కీపర్‌, కీపర్‌ ” ఇదిగో ఇది నీకు, అని నాకు ఒక వేడివేడి రొట్టె ఇచ్చేది. నేను, ఆవిడా రోజూ జట్టుగా బజారు కెళ్ళేవాళ్ళం. ముందు నేను, నావెనక మెల్లిగా నడుస్తూ ఆవిడ. చుట్టుపక్కల వాళ్ళకి నేనంటే హడల్‌. నా సైజు పెద్దదిగా! వీధిలో అందరితోటీ పేచీ పెట్టుకునే వాడిని. అందరినీ, ఉసి కొలిపే వాడిని. నా దగ్గరకి రావడమంటే వాళ్ళకి భయం. అది దొరసానికి బాగా ఇష్టమే ననుకుంటా. ఏమో మరి!

ఒకసారి ఏం జరిగిందంటే, నేనూ దొరసానీ రోడ్డుమీద పోతున్నాం. వీధిచివర తెల్లగా ఉన్న ఒక చిన్నవాడు తన పొట్టి తోక కదుపుతూ నన్ను చూసి ఒకటే అరవడం మొదలెట్టాడు. వాడి అరుపు విని నాకు చిర్రెత్తుకొచ్చింది. వాడిని తరిమి తరిమి పట్టుకొని గట్టిగా మెడమీద కరిచి పారేశా! అంతే! వెంటనే మా దొరసాని నన్ను మెడ పట్టుకొని, ఈడ్చి కర్రతో బాదింది. అమ్మా! ఆ దెబ్బలు గుర్తుకి రాగానే చటుక్కున మెళుకువొచ్చేసింది. వళ్ళువిదిలించి కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా సోఫాలో దొరసాని! హాయ్‌ లీయా అంటూ!!

దొరసానిని చూడటానికి వారానికోసారి ఒక మీసాల పెద్దమనిషి వస్తాడు. అతను వచ్చినప్పుడు, నాకు బోలెడు స్వతంత్రం! వాళ్ళిద్దరూ మంతనాలాడుతూ నన్ను ఇంటి వెనక ఖాళీ స్థలంలో వదిలిపెడతారు. ఎంత పరిగెత్తచ్చో చెప్పలేను. ఈ మీసాల పెద్దమనిషి రోజూ వస్తే బాగుండును అని నేను అనుకోని రోజు లేదు.

ఒకసారి, అట్లాగ చూసుకోకండా ఖాళీ స్థలంలో పరిగెత్తుతూవుంటే, నా కుడి కాలి మటిమకి రాయి తగిలింది. పాదంలో మేకో ఏదో గుచ్చుకుంది కూడా. కుంటుకుంటూ ఇంట్లోకి వచ్చా. అదిచూసి, దొరసాని వెంటనే డాక్టరు దగ్గిరకి తీసుకోపోయింది. మళ్లీ సూది మందులు. డాక్టర్‌గారు నా కాలికి కట్టుకట్టాడు. ఇక మన ఆటలన్నీ బంద్‌. ఇంట్లో ఎంతసేపని ఉండగలం? విసుగెత్తి పోయేది. అయినా, కుంటుకుంటూ ఎక్కడికి వెళ్ళగలం? అంచేత, మనపని తినడం, నెగడిముందు కళ్ళుమూసుకొని పడుకోవడం…. కలలు కనడం….


” కార్లో, కార్లో,” అని ఘట్టిగా అరుస్తుంది ఈ ఇంటి ఆవిడ. పరిగెత్తుకొని వెళ్ళేవాడిని. ముఖంలో ముఖం పెట్టి ఏవేవిటో చెప్పేది. విని, చెవులూపేవాడిని. అలా చెవులూపినప్పుడు
నన్ను ముద్దు చేసేది. వచ్చిన ప్రతి స్నీహితురాలితో, స్నేహితుడితో ఏవేవో మాట్లాడేది. అవన్నీ నాకు చెపుతున్నట్టుగా నాకేసే చూసేది. ఎంతమంచి ఆవిడో. ఎప్పుడూ ఒక్కసారి కూడా కసరలేదు. బహుశా నా వయసు కారణం అయి ఉంటుంది. బాగా పెద్ద వయస్సులో ఈ విడదగ్గిరకొచ్చా. అప్పట్లో దబదబ నడవడమే కష్టంగా ఉండేది. ఎప్పుడూ ఆవిడ కాళ్ళదగ్గిరే పడుకొని ఉండేవాడిని, లేచే ఓపిక లేక! అప్పుడప్పుడు ఆవిడే నన్ను లేవదీసేది బాధగా…..

భయంతో మెళుకువొచ్చి చూస్తే, మా దొరసాని సోఫాలో కూచొని ఏదో అల్లుకుంటున్నది. హాయ్‌ లీయా అనంగానే, దబుక్కున ఎగిరి గంతేశాను, నేను ఇంకా చిన్న వాడినే అన్న ధైర్యం వచ్చి! అబ్బ విరిగిన కాలు చచ్చే నెప్పి పుట్టింది, ఎగరగానే! కాస్సేపు దొరసాని దగ్గిరే కూచొని మళ్ళీ నెగడి పక్కన నా పరుపుమీదికెళ్ళి పడుకున్నా. అలా కళ్ళుమూసుకొని పడుకుంటే….


ఒక పండు ముసలాయన, చిన్నగా ఉన్న నన్ను ఎత్తుకొని వస్తున్నాడు. ఎదురుగా గుర్రబ్బండి ఆగింది. అందులోనుంచి ఒక చిన్న అమ్మాయి నాకేసి చూసింది. ఆ ముసలాయన, నన్ను ఆ అమ్మాయికిచ్చి, నవ్వుతూ వెళ్ళిపోయాడు.

నేను బాగా చిన్న వాడిని. నాకు కొనలుతేరిన చెవులు, నిక్క బొడుచుకొని ఉన్నాయి. కోలముక్కు, వెనక్కి ముడుకుంటూ చిన్న తోక. ఆ అమ్మాయి నన్ను ఎత్తుకొని ముద్దు పెట్టుకొని, ఇంటికి తీసుకొని పోయింది. నన్ను ” ఫాక్సీ,” అని పిలవడం మొదలెట్టింది. ఆ ఇంట్లో మీమీ, మిట్జీ కూడా ఉండేవాళ్ళు. ఆటలకి అడ్డవే లేదు. ఎందుకో, మీమీ మిట్జీ లతో ఆ అమ్మాయి ఎక్కువగా మాట్లాడేది. అప్పుడు, నాకు భలే కోపం వచ్చేది. ఇల్లు వదిలేసి పారిపోదామనిపించేది. ఇలా ఉండగా, ఒక రోజున హటాత్తుగా మీమీ చచ్చిపోయింది; కారణం ఎవ్వరికీ అంతు పట్టలేదు. నాకు చచ్చే భయం వేసింది. …… కెవ్వుమన్నా …..

దబుక్కున మెళుకువ వచ్చేటప్పటికీ మా దొరసానీ, నేనే ఉన్నాం గదిలో. హమ్మయ్య అనిపించింది. లేచి వెంటనే అటూఇటూ కాస్త తిరిగి, మళ్లీ సద్దుకొని పడుకున్నా.


అబ్బ! ఎంతపెద్ద కొండో! కొండమీద పెద్దగుడి. పెద్ద కాళీ స్థలం, ఇష్టమైనట్టు పరిగెత్తటానికి ! ఎంతమంది ఉన్నారో.! ఎవరో ఎవరినో పిలుస్తూనే ఉన్నారు, ఏవేవో రకరకాల పేర్లు పెట్టి! పక్కనే చిన్న చెరువు. ఇక్కడ ఇష్టమైనంతసేపు జోరుగా పరిగెత్తచ్చు. నా ఇష్టమైనప్పుడు తినచ్చు. రోడ్డు మీద ఏవి దొరికితే అవి తినచ్చు. అసలు తినకపోయినా పరవాలేదు. అంతా నాఇష్టం! అబ్బ! ఎంతబాగుందో…..

ఇంతలో లీయా లీయా అని దూరంగా నూతిలోనుంచి వస్తున్న గొంతు. ఎవరో పిలుస్తున్నారు!. ౠౠ ౠౠ అంటూ నే మగతనిద్రలోనే పలికా! ఎవరబ్బా అని ఆలోచిస్తూండగానే, పూర్తిగా మెళుకువొచ్చింది. నెగట్లో సన్నగా మంట. ఎదురుగా సోఫాలో దొరసాని!


( పి.యస్‌: దాలి గుంటలో పడుకున్నప్పుడు కుక్కలకి పూర్వజన్మ స్మృతి వస్తుందని అంటారు)