తెలుగు జ్యోతి ఆహ్వానం

రాబోయే సర్వధారి ఉగాదికి, తెలుగు లలిత కళా సమితి (Telugu Fine Arts Society, NJ, USA ) తెలుగుజ్యోతి పత్రికావర్గం ఒక విశేష సంచికని మీ ముందరికి తీసుకు రాబోతోంది. ఈ విశేష సంచికలో ప్రచురించడానికి దేశవిదేశాల్లో వున్న తెలుగు భావుకులందరికీ ఈ ఆహ్వానం.

ఈ తెలుగుజ్యోతి ప్రత్యేక సంచికలోని ప్రత్యేకత ఏమిటంటే ఈ పత్రికకి అంతటికీ అంతర్వాహినిలాగ ఒక అద్భుతమైన భావం, ఒక రసము, ఒక theme వుంటుంది. ఆ భావన మనందరి జీవితాల్లోను చాలా ముఖ్యపాత్ర వహించే భావన: ప్రేమ. హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమ అయితే ఆ కోవెల గర్భ గుడిలో ఏ గొప్ప భావనకి మీరు ప్రాణ ప్రతిష్ట చేస్తారో అది మీ వ్యక్తిగతమైన విషయం.

ప్రేమంటే మనందరికీ ఎన్నో భావనలు. ముద్దుగుమ్మల మీద ప్రణయ భావన, ముద్దులొలికే చిన్నారుల మీద అనురాగ భావన, సమస్త చరాచరభూతసముదాయం మీద హద్దులులేని విశ్వమానవ సహిష్ణుత, అలోకంబైన పెంజీకటికావల ఏకాకృతితో వెలసిన ఆ భగవంతుడిమీద ఆధ్యాత్మిక భావన, ఒక అసమాన, అద్భుత, అసాధారణ అనుభూతి, అనురాగం, ఆకాంక్ష, తాదాత్మ్యత. అమ్మానాన్నలమీద, అన్నయ్యమీద, ఉన్నవూరు మీద, దేశం మీద, భాష మీద, కన్న పిల్లల మీద, పెళ్ళిచేసుకున్న భార్యమీద, పెళ్ళి చేసుకోలేకపోయిన పక్కింటి బాపు బొమ్మమీద … అబ్బో అసలు మీ హృదయమే ఒక రసరాగానుభూతుల సాగరం, ఒక ప్రేమ రాగమాలికా కీర్తనం, స్పందనా నర్తనం. మీ గుండెలోతుల్లో పొంగుతున్న ఉత్తుంగ రసగంగాతరంగాల అడ్డుకట్టలను తొలగించి కవితా, కధా, వ్యాసఝరులను నిరాఘాటంగా ప్రవహింప జేసి, గుండెల్లో ఉన్న సరస్వతిని భావాంబర వీధుల్లో విశ్రుతవిహారం చేయించండి.

ఇందులో ప్రచురించడానికి కధలు, కవితలు, వ్యాసాలు, హాస్యచిత్రాలు (కార్టూన్స్), ప్రహసనాలు (జోక్స్), మీ స్వానుభవాలను, జీవితంలోని విశేషమైన ప్రేమ ఘట్టాలను మాకు పంపడానికి ఈ ఆహ్వానం. మీలోఎందరో రచయితలు, భావుకులు, కళాకారులు, కళాభిమానులు వున్నారు. మీలోని కళాకారులని సత్కరించడానికని తెలుగుజ్యోతి రచనా పోటీలు పెట్టి విజేతలకి ఉత్తమ, ద్వితీయ బహుమతులు ఈ క్రింది విధముగా ఇస్తుంది.

బహుమతుల వివరాలు
  ప్రధమ ద్వితీయ పేజీల పరిమితి
కధలు, వ్యాసములు $200 $150 3 పేజీలు
పద్య / వచన కవితలు $150 $100 1 పేజీ
హాస్య చిత్రాలు (కార్టూన్స్) $100 $75  
ప్రహసనాలు (జోక్స్) $75 $50  
స్వానుభవాల శీర్షిక $150 $100 1 పేజీ

పైన సూచించిన అన్ని వర్గాల రచనలలోనూ కలిపి 10 ప్రోత్సాహిక బహుమతులు వుంటాయి. ఈ పోటీకి వచ్చిన రచనలలో ప్రచురణార్హమైన వాటిని తెలుగుజ్యోతి సాధారణ పత్రికలలో ప్రచురించే హక్కు మాకు వుంటుంది. రచనలు మీ స్వంతం అయి వుండాలి. దేనికీ, అనువాదమూ అనుకరణా కాకూడదు. రచనలు ఇంకే పత్రికలోనూ (web or printed) ప్రచురించబడి వుండకూడదు.

మీ స్వానుభవంలో జరిగిన గొప్ప విశేషమైన సంఘటన వ్రాయడానికి ఈ క్రింది శీర్షికల పేర్లు దోహదంగా వుంటాయేమో చూడండి.
గుండె గొంతుకలోన కోట్లాడుతాది – మీరు మొదటిసారి మీ ప్రేమమూర్తిని ని కలసినప్పుడు జరిగిన సంఘటన.
పయనమయే ప్రియతమ – మీరు ప్రేమించిన వ్యక్తి మిమ్మలిని వదలి దూరతీరాలకు ప్రవాసమై వెళ్ళిపోతున్నప్పుడు జరిగిన సంఘటన.
అమృతం కురిసిన వేళ – ఒక ప్రియవదనాన్ని చూసిన వేళలో గుండె ఒక లిప్తపాటు లయతప్పిన సంఘటన.
మనసున మనసై – మీతో చిరకాలం జీవితం పంచుకున్న వ్యక్తి తో జరిగిన ప్రేమ సంఘటన.
అమ్మా, నాన్న, అమృతం – అమ్మానాన్నల మీద ప్రేమకి సంబంధించిన సంఘటన.
ఈ నేల ఈ గాలీ ఈ వూరూ – మీ స్వగ్రామం మీద మీకున్న అభిమానం.

మీ రచనలను email ద్వారా కాని, చేతివ్రాతతో postలో కాని పంపించవచ్చును.

రచనలు email ద్వారా ఈ క్రింది మూడు పద్ధతిల్లో ఎలాగైనా పంపించవచ్చును: RTS file (most preferred) or pdf File or scanned jpeg picture file. RTS లో రాయడానికి సూచనలు: www.lekhini.org అన్న web site కి వెళ్ళి, అందులో RTS formలో type చేసి, పైన window లో వున్న English RTS text ని ఒక Microsoft Word file లోకి copy చేసి మాకు tj@tfas.net కు email ద్వారా పంపించండి.

చేతివ్రాతతో పంపించేవారు ఈ postal చిరునామాకు పంపించండి: Murthy Bhavaraju, 231 Marcia Way, Bridgewater, NJ, 08807 (bhavaraju@optonline.net 908-252-9434)

రచనలు మాకు అందడానికి గడువు: ఫిబ్రవరి 15, 2008.

తదితర వివరాలకు సంప్రదించండి: వేణుగోపాల కృష్ణ ఓరుగంటి, 732-617-1290. oruganti@yahoo.com