నా మాట

గత ముప్ఫై ఏళ్ళుగా ఉత్తర అమెరికాలో తెలుగువాళ్ళు ఎవరూ ఊహించలేనంత ఎత్తు ఎదిగారు. ఉత్సాహవంతుల పనివల్లనో, ఉపకారవంతుల పోషణవల్లనో మాత్రమే కాకండా, కేవలం తెలుగువాళ్ళ సంస్కారంలో ఉన్న బలం వల్ల దేశ వ్యాప్తంగా పేరు పడ్డ సంస్థలు సుమారు పాతిక సమావేశాలు చాలా పెద్దయెత్తున జరుపుకున్నాయి. ప్రతి ఒక్క సమావేశం తరువాతిదానికి ప్రోద్బలం కలిగించింది.

దాదాపు ప్రతి పెద్ద ఊళ్ళోనూ ఒక తెలుగు సంస్థ ఉన్నది. ప్రతి స్థానిక తెలుగు సంస్థా ప్రతి ఏడాదీ ఎన్నికలు జరుపుకుంటూన్నది. పెద్ద ఎత్తున పండగలు చేసుకుంటూన్నది. తెలుగు భాష పిల్లలకి నేర్పాలని ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు, పిల్లలకి తెలుగు పాటలు, నాట్యాలు నేర్పించాలని అహోరాత్రాలూ కృషి చేస్తున్న వాళ్ళు ప్రతి ఊళ్ళోనూ ఉన్నారు. తెలుగు చరిత్ర, తెలుగు సాహిత్యం గురించి తెలుగు వాళ్ళకే కాకుండా, ఆంధ్రేతరులకి, పాశ్చాత్యులకీ తెలియ చెప్పాలని కుతూహలం చూపించే వాళ్ళు కూడా ప్రతిఊరిలోనూ ఉన్నారు. వీళ్ళతో పాటే, ఎన్నికల రాజకీయాలలో మునిగి తేలుతున్నవాళ్ళు, రాజ్యాంగాల యంత్రాంగాలు నడిపిస్తున్నవాళ్ళూ ఉన్నారు.

ఎవరైనా కొత్తవాళ్ళు ఒక్కసారి తూర్పునుంచి పడమరదాకా, ఉత్తరం నుంచి దక్షిణందాకా ఈ దేశంలో చూస్తే ఒక్క సంగతి స్పష్టంగా బోధపడుతుంది. ఇక్కడి తెలుగు సంస్థల్లో మూడు రకాల తెలుగు వాళ్ళు ఉన్నారు.

మొదటి రకం: ఒకసారి ఎన్నికలు అయిపోగానే వచ్చే ఎన్నికలగురించి ఆలోచిస్తారు. రాజ్యాంగాలలో ప్రతీ అక్షరాన్నీ విరిచి, మలిచి, వ్యాఖ్యానించి ఏపనికైనా సరే గంటలకొద్దీ అన్ని రకాల న్యాయ శాస్త్రకోణాలనించీ చర్చించి, సిద్ధాంతాలూ, రాద్ధాంతాలూ చేస్తారు. ఆ పనులన్నీ అయేసరికి మళ్ళా ఎన్నికల కాలం వస్తుంది. మళ్ళీ వీళ్ళంతా యధాశక్తి టెలిఫోన్లమీద, విమానాలమీద, ఉత్తరాల ద్వారా, పత్రికా ప్రకటనలద్వారా, సమావేశాల ద్వారా ఈ పనుల్లో మునిగి పోతారు.

ఇకపోతే, రెండవరకం: తెలుగు భాషపిల్లలకి ఎలా నేర్పడం, తెలుగు నాటకాలు ఎలా వేయించడం, తెలుగు పాటలు ఎలా పాడించడం, తెలుగు నృత్యాలు ఎలా చేయించడం — ఇలాంటి ప్రశ్నలతో సతమతమవుతూన్నవాళ్ళు. వాళ్ళతో ఎప్పుడు మాట్లాడినా ఈ పనులు వాళ్ళకి చేతినిండా పని కల్పిస్తున్నాయని వెంటనే తెలుస్తుంది. వీళ్ళల్లో కొందరు స్వయంగా రచయితలు, మరి కొందరు పాత పాటలు శ్రావ్యంగా పాడతారు; కొత్త పాటలు రాయించి కొత్తకొత్త బాణీలు కడతారు. కొందరికి నాట్యంలో చక్కని ప్రవేశం మంచి అభిరుచి ఉంది. మరి కొందరికి నాటకం మీద ప్రత్యేకమైన ప్రేమ ఉన్నది. ఇంకా కొందరికి సాహిత్యం, సాహిత్య చరిత్ర, అంటే ఇష్టం. వీళ్ళందరికీ ఉమ్మడిగా ఒకటే సమస్య. మన పిల్లలు తెలుగు సంస్కృతికి దూరమయి పోతున్నారు; ఆ దూరాన్ని తగ్గించి, వాళ్ళని తెలుగు వాళ్ళుగా ఎలా తీర్చి దిద్దాలీ అని.

ఈ రెండు రకాల వాళ్ళూ ఒకరికొకరు ఎంత విడిపోయి కనిపిస్తారంటే — సంస్కృతి గొడవల్లో ఉన్న వాళ్ళకి రాజకీయాలు పట్టవు. ఆ రాజకీయాల్లో మునిగి తేలుతున్నవాళ్ళకి సంస్కృతిని గురించి ధ్యాసకి టైముండదు.

ఈ రెండురకాల వాళ్ళతోనూ ఉన్నట్టు కనిపించకుండా మూడో రకం వాళ్ళున్నారు. వీళ్ళు నిశ్శబ్దంగా ఉంటారు. నిజానికి ఏం చేస్తున్నట్టు కనిపించరు. సొంతపనుల్లో మునిగిపోయిఉన్నట్టే కనిపిస్తారు. కాని, తోటి తెలుగు వాళ్ళు కనిపిస్తే మాత్రం, వీళ్ళు ఆప్యాయంగా పలకరిస్తారు. మా ఇంటికి ఒకసారి రమ్మని ఆహ్వానిస్తారు. ఇంటికి వెడితే భోజనం పెట్టి గుండెనిండా అభిమానం నింపి గుమ్మందాకా వచ్చి సాగనంపుతారు.

దేశవ్యాప్తంగా చేసే సభల్లో చూడండి; స్థానికంగా చేసే సభలు చూడండి — సరిగ్గా ఈ మూడు రకాల వాళ్ళూ ఉత్తర అమెరికా తెలుగు సమాజానికి మూడు రకాల “సేవలు” చేస్తున్నారని తేలిగ్గా బోధపడుతుంది. పైకి ఏం చేస్తున్నట్టు కనిపించని వాళ్ళున్నారే — వాళ్ళ మనసుల్లో తెలుగు వాళ్ళపట్ల ఉన్న అభిమానమే — ఈ సభలన్నీ ఇంత ఉత్సాహంగా జరగటానికి బలమైన కారణం. ఎక్కడ ఈ సభలు జరుగుతున్నా, తోటి తెలుగు వాళ్ళు కనిపిస్తారుకదా అనే ఆశతో దగ్గిరయినా దూరమయినా ఓపిగ్గా ప్రయాణాలు చేసుకొని వచ్చే వాళ్ళు వీళ్ళే. దూరపు చుట్టాలు కలుపుకోవడం, పాత స్నేహాలు నెమరు వేసుకోవడం, తమ చిన్నప్పటి ఊళ్ళల్లో తమకి తెలిసినవాళ్ళని తలచుకొని, రాత్రంతా మేలుకొని తరగని కబుర్లు చెప్పుకొని అందరి కళ్ళల్లో ఆరని ఆప్యాయత దీపాలు వెలిగేలా చేసేది వీళ్ళే. వీళ్ళు ఎవరో పోల్చుకోవడం కష్టం కాదుకానీ — వీళ్ళెవరో పేర్లు చెప్పడం కష్టం. ఇందాక చెప్పిన మూడు తరహాలలో, మూడో తరహాలో ఉన్నవాళ్ళంతా వీళ్ళే. వీళ్ళని మనం ముందు తలచుకొని సగౌరవంగా వీళ్ళకి అభినందనలు చెప్పాలి.

ఇక రెండో తరహా వాళ్ళు ఏ సభలకైనా సరే, నెలల ముందు నించీ రాత్రనక, పగలనక నాటకాలకీ నాట్యాలకీ రిహార్సల్సు వేసి, పాటలు పాడే వాళ్ళకి తర్ఫీదులిచ్చి, వివిధ చర్చలలో తెలుగు వాళ్ళ సంస్కృతీసమస్యలు చర్చించడానికి సమాచారం పోగుచేసుకొని, వచ్చే తరంవాళ్ళ సమస్యలు తమ సమస్యలు చేసుకున్న వాళ్ళు. వీళ్ళవలన, మన సభలన్నిటికీ సాంస్కృతిక గౌరవం, సరదా, నిండుతనం వస్తున్నాయి. వీళ్ళ శక్తి సామర్ధ్యాలకి , ఉత్సాహానికి, సాంస్కృతిక నాయకత్వానికీ మనం గర్వపడాలి; ఆనందించాలి.

ఇక చివరి వాళ్ళు — ఇందాక చెప్పిన మొదటి తరహా వాళ్ళు. అంటే, ఎన్నికలవాళ్లూ, రాజకీయాల వాళ్ళూనూ. వీళ్ళ ఉత్సాహాన్ని, ఓపికనీ, చొరవనీ మెచ్చుకోకండా ఉండలేం. కాని, వీళ్ళ సమస్యలు ఉత్తర అమెరికా తెలుగు సమాజానివి కావని చెప్పకుండా ఉండలేం. తెలుగు దేశంలో ఉండిఉంటే వీళ్ళు సమర్థులయిన రాజకీయ నాయకులయి ఉండేవాళ్ళు. నిజానికి, పాత అలవాటులు మార్చుకోలేని కారణం వల్లనే, చోటుమారినా ఆ రాజకీయాల కోటు మారని మనుషులు వీళ్ళు. వీళ్ళ ఆలోచనలకి మనం ఒక రకంగా రుణపడిఉన్నాం. వీళ్ళవల్ల దేశవ్యాప్త సంస్థలకి ఒక ఆకారం వచ్చింది. అంతేకాదు. అనేక పట్టణాలలో తెలుగు సంస్థలని తలపెట్టిన వాళ్ళు వీళ్ళల్లో ఉన్నారు. అయితే, రాజకీయ “పండితుల” ప్రాబల్యం రోజురోజుకీ పెరుతోందని మాత్రం చూసే వాళ్ళకి కచ్చితంగా తెలుస్తుంది. ఈ తరహా వ్యక్తుల శక్తిసామర్థ్యాలు చిన్నవి కావు. ఉత్సాహం తక్కువది కాదు. వీళ్ళ ఉత్సాహం, వీళ్ళ సామర్థ్యం ఉత్తర అమెరికా తెలుగు సమాజానికి చాలా అవసరం. వీళ్ళ ఆలోచనల తీరు మాత్రం — కేవలం అనవసరం.