మనీప్లాంట్: అనువాద కథలు


రచన: కొల్లూరి సోమశంకర్
వెల: 40 రూపాయలు
ప్రతులకు: కస్తూరి పద్మ, ప్లాట్ నం. 32
దమ్మాయి గూడ
హైదరాబాద్.
AVKF బుక్ లింక్ ద్వారా

తెలుగునాట పత్రికలు యధేఛ్ఛగా రాజ్యమేలుతున్న కాలంలో అనువాద రచనలతో తెలుగు సాహిత్యం సుసంపన్నమైంది. మనకి పొరుగు భాషలైన తమిళ కన్నడాలనించే కాక, బెంగాలీ తదితర భారతీయ భాషలనించీ, ఆంగ్లం, ఫ్రెంచి, రష్యను ఇత్యాది ప్రపంచ భాషలనించీ తెలుగులోకి సారస్వతం ప్రవహించింది. జాక్ లండన్ కథలూ, అలెక్జాండర్ డ్యూమా, మార్క్ ట్వైన్, మాక్సిం గోర్కీల నవల్లూ – ఇవి అసలు తెలుగులోనే రాశారేమో అనిపించేంత సహజంగా మనకి దగ్గిరయ్యాయి. శరచ్చంద్ర ఛటర్జీ ఐతే తెలుగువాడేనేమో అన్నంత సాన్నిహిత్యం ఏర్పడిపోయింది.

ఇటీవలి కాలంలో, కారణాలు ఏవైనా, కథలూ నవల్లూ తెలుగులోకి తర్జుమా కావటం బాగా తగ్గిపోయిందనే చెప్పాలి.

ఈ నేపథ్యంలో కొల్లూరి సోమశంకర్ వంటి సమర్ధుడైన యువరచయిత ఇతర భాషల కథల్ని తెలుగులోకి తర్జుమా చెయ్యటం మీద తన దృష్టి కేంద్రీకరించడం అభినందించాల్సినదే. ఐతే ఉత్తినే దృష్టి కేంద్రీకరిస్తే ఏమైంది? ఇప్పటివరకూ 40కి పైన కథల్ని చక్కటి తెలుగులోకి అనువదించి వివిధ పత్రికల్లో ప్రకటించటమూ, వాటిల్లోంచి 19 కథల్ని ఏరి “మనీప్లాంట్” అని చిన్న సంపుటం వెలువరించటం – అదీ నిజంగా అభినందించాల్సిన విషయం.

సోమశంకర్ అనువాద కథల గొప్పతనంలో కనీసం సగమైనా మూల కథల ఎంపికలో ఉంది. అనువాదానికి కథల్ని ఎంచుకోవటంలో సోమశంకర్ చక్కటి విచక్షణ కనబరిచారు. వృత్తి అనువాదకులకి తాము దేన్ని అనువదించాలో ఎంచుకునే స్వేఛ్ఛ ఉండదు కదా. అలా ఎంచుకోగలగడం వరమే అనువాద రచయితకు. మంచి అనువాదకుడెప్పుడూ తనకి నచ్చే, తన మనస్తత్వానికి దగ్గరగా ఉండే రచనలనే ఎంచుకుంటాడు. తాను స్వంతంగా కథ రాస్తే ఎటువంటి కథలు రాస్తాడో అటువంటి రచనలనే అనువదించడానికి పూనుకుంటాడు. ఈ ప్రక్రియ వల్ల మూల కథా రచయితకీ అనువాదకుడికీ మధ్య మాటలకి అతీతమైన ఒక హార్దిక బంధం ఏర్పడిపోతుంది. వెరసి అనువాదం మరింత శోభిస్తుంది. సోమశంకర్ అనువాదాల్లో ఇదే జరిగింది.

మూల భాషలు తమిళ, ఆంగ్ల, హిందీ, కాశ్మీరీ, బెంగాలీ అని ఆయా కథల దగ్గిర సూచించారు. చాలా కథల్ని ఇంటర్నెట్ నించి సేకరించటం ప్రపంచ సాహిత్య రీతుల్లో ఒక కొత్త ట్రెండ్ ని సూచిస్తున్నది. మూల కథల రచయితల పేర్లేవీ నేనైతే ఇదివరలో విని ఉండలేదు. ఆంగ్ల కథలు కూడా ఎక్కువగా భారతీయులు చేసిన ఆంగ్ల రచనలే ఉన్నాయి, భారతీయులు కాని రచయితలు రాసినవి మూడు కథలే ఈ సంపుటిలో.

“మనీప్లాంట్” సంపుటిలో కథలన్నిటికీ సమాన ధర్మంగా ఏదన్నా అంతస్సూత్రం ఉన్నదా అని వెతికితే, అన్నీ మానవ సంబంధాల విశిష్టత మీద దృష్టిని కేంద్రీకరించాయి అనిపిస్తుంది. ఒక పదేళ్ళ పాపకి తన బడి మిత్రుడి పరిస్థితిలో పాలుపంచుకోవాలనే సహానుభూతి (పెరుగన్నం), ఒక పనిమనిషికి తన ఎగువ మధ్యతరగతి యజమానురాలితో కలిగే సహానుభూతి (మిగిలిపోయినవి), విఫల ప్రేమికుడైన యువడాక్టరుకి వృద్ధ నౌకరుతో కలిగిన సహానుభూతి (వృత్తిధర్మం), కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడుతున్న అగాథాలూ, వాటిని దాటి సేతువులు కట్టే మామూలు మనసులూ (మనీప్లాంట్, ఆశా నిరాశేనా) మొదలైనవి. కొన్ని కథల్లో ఓహెన్రీ ట్రేడ్ మార్క్ వంటి చివరి కొసమెరుపులూ (హస్తలాఘవం), మరి కొన్నిటిలో నారికేళ సలిలము భంగిన్ అన్నట్లు పాత్రల స్వభావాల్లో జరిగే మార్పులూ (మనీప్లాంట్) చమక్కుమని మెరుస్తాయి, మరొకచోట నిశ్శబ్దంగా ఆశ్చర్య పరుస్తాయి. కొన్ని కథలు అరటిపండొలిచి పెట్టినంత బహిరంగంగా ఉన్నా, మరికొన్ని కథలు మబ్బు చాటు చంద్రుళ్ళా మసక మసగ్గా ఉండి పాఠకుల జిజ్ఞాసని రేపుతాయి (బాకీ, విషవలయం). అన్నీ “సీరియస్” కథలే కాదు, అక్కడక్కడా కితకితలు పెట్టేవీ ఉన్నాయి (యమరాజు).

ఈ సంపుటికి డా. అనివ్తా అబ్బీ రాసిన “మనీప్లాంట్” కథ మకుటాయమానమైనది. ఒక మధ్యతరగతి పంజాబీ కుటుంబంలో అప్పటిదాకా మూలస్తంభంగా నిలిచిన అన్నయ్య ఇక తనదారి తను వెతుక్కుంటూ విదేశాలకి తరలి వెళ్ళిపోతుంటే, అవలంబం పోయిన మనీప్లాంట్ తీగలా ఆ కుటుంబం వాలిపోతున్న తరుణంలో ఆ ఇంటి ఆడపడుచులో జాగృతమైన చైతన్యాన్ని సున్నితంగా చిత్రించారు.

ఇటువంటిదే ఇంకొకటి ఆస్థా రాసిన హిందీ కథ “ఆశా నిరాశేనా?” విదేశాల్లో స్థిరపడి చుట్టపుచూపుగా వచ్చే కొడుకూ కోడలు దృష్టిలో జననీ జన్మభూమీ ఎలా మారిపోతున్నాయో చూపిస్తుంది. ఎనిమిదేళ్ళ సింధు ప్రధాన పాత్రగా నడిచిన రెండు కథలు “పెరుగన్నం”, “బొమ్మ” (తమిళ రచయిత వరలొట్టి రంగస్వామి రచనలు) శైశవ మౌగ్ధ్యంతో తొణికిసలాడుతుంటాయి. మానస్ భట్టాచార్య రచన “వృత్తిధర్మం”, దీపాంకర్ బసు రచన “ఆత్మావలోకనం” ముఖ్య పాత్రల్లో అంతస్సంఘర్షణకి అద్దం పడతాయి. అమెరికను కథలు “విషవలయం” (బ్రయన్ కోట్), “బాకీ” (జెరికో ముసెద్), “అమ్మ వస్తే బాగుండు” (లీలాన్) ప్రపంచంలో ఎక్కడైనా కొన్ని కొన్ని అనుభూతులు అందరికీ ఒకటే అనే సత్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. ఒక బైబిలు నీతికథ (పేరబుల్) లాగా సాగే రేషునాథ్ కథ “ఓ మనిషీ, ఎందుకిలా?” సులభంగా మర్చిపోలేము. ఆ కథ చదివాక పుస్తకం మూసేసి కొంతసేపు అలా నిశ్శబ్దంగా ఉండిపోయాను. “దేవుని చెక్కిళ్ళ మీద దీనంగా జారే కన్నీటిని చూసి … మానవుడే దానవుడై తిరగబడినప్పుడు, పాపం పెద్దవాడు – కన్న కడుపు – ఏంచేస్తాడని!” అన్న తిలక్ పద్యం పంక్తులు గుర్తొచ్చాయి.

అనువాద ప్రక్రియలో, శైలిలో సోమశంకర్ మెచ్చుకోదగిన ప్రతిభ కనబరిచారు. తెలుగు కథల పేర్లు మూల కథల పేర్లకి డైరెక్టు అనువాదాలుగా కాక, కథా వస్తువుని సూచించే విధంగా, సహజంగా, ఆర్ద్రతతో, కొండొకచో చమత్కారంతో పేర్లు పెట్టటంలో రచయిత అభివ్యక్తి తేటతెల్లమౌతోంది. ఆంగ్లేతర భాషల కథలు మూలభాష నించి నేరుగా కాక ఆంగ్లానువాదాల ద్వారా వచ్చాయేమోనని నాకు అనుమానం. చాలా వరకూ కథనం, సంభాషణలూ సహజమైన భాషలోనే ఉన్నా, అక్కడక్కడా అనువాదకుడు ఆంగ్ల వాక్య నిర్మాణపు భల్లూకప్పట్టుకి చిక్కిపోయారు. కాకపోతే, కథా వస్తువులన్నీ సార్వజనీనమైన అనుభవాలే కావటంతో, ప్రత్యేక ప్రాంతీయ విశేషాల్నీ ఆచార వ్యవహారాల్నీ వివరించాల్సిన అదనపు బాధ్యత లేదు అనువాదకుడికి.

అనువాదకులకి ఎదురయ్యే కొన్ని ముఖ్యమైన సమస్యల విషయంలో సోమశంకర్ ఇంకొంచెం శ్రద్ధ తీసుకోవాలి. ఉదాహరణకి కథ చెప్పే “గొంతు”ని సరిగ్గా పట్టుకోవటం. సంపుటిలో మొదటి కథ “పెరుగన్నం”లో ఉత్తమ పురుషలో కథ చెబుతున్న తండ్రి, తను ప్రాణ ప్రదంగా ప్రేమించే ఎనిమిదేళ్ళ తన కూతురి గురించి రాస్తూ “ఆమె” అని రాయడం ఎబ్బెట్టుగా ఉంది. “అమ్మవస్తే బాగుండు” కథ తన చిన్నతనంలో తన మాతృదేశమైన వియత్నాం లో జరిగిన సంఘటనని తల్చుకుంటూ ఒక వియత్నమీస్-అమెరికను రాసిన కథ. ఈ సూక్ష్మాన్ని అనువాదకుడు గమనించలేదేమో అని నాకు అనుమానం. తనకి అపరిచితమైన సంస్కృతులనించి వచ్చిన కథల్ని తర్జుమా చెయ్యటంలో అనువాదకుడు కొంత అధిక పరిశ్రమ చెయ్యాల్సి ఉంది. “బాకీ” కథలో మస్టాంగ్ కారుని ముస్తాంగ్ అనడం వంటివి కొద్దిగా తమాషాగా అనిపిస్తాయి, కానీ పెద్ద సమస్యలు మాత్రం కావు. వాక్య నిర్మాణం కూడా ఇంకా సహజమైన తెలుగు వాడుకలో రాయడానికి ప్రయత్నం చెయ్యాలి. ఎలాగూ ఇంటర్నెట్ నించి మూల కథలు ఎంచుకుంటున్నారు కాబట్టి ప్రపంచ దేశాల కథలని కూడా ఎంచుకోవచ్చు. యువకులు కాబట్టి సోమశంకర్ రచయితగా అనువాదకుడుగా ఇంకా ఎదిగి మంచి పరిణతి సాధిస్తారనీ, ఎన్నో మంచి కథల్ని మనకి అందిస్తారనీ ఆశిద్దాం.

ఎస్‌. నారాయణస్వామి

రచయిత ఎస్‌. నారాయణస్వామి గురించి: కథకుడిగా, అనువాదకుడిగా, సమీక్షకుడిగా అమెరికాలోనూ, ఇండియాలోనూ, బ్లాగుల లోకంలోనూ పేరు గడించిన ఎస్‌. నారాయణ స్వామి అమెరికా ఆంధ్రుల జీవన తలాల్లో కొత్తకోణాల్ని ఆవిష్కరిస్తున్న కథకుడిగా ఈమాట పాఠకులకు చిరపరిచితులు.  ...