నడిమి వయసు యిడుములు

సీ. పూర్వజులెడకల్గు పూజ్యభావములకు
        ముందుతరముపైని మురిపెములకు
సాంప్రదాయమునిల్ప జరుపు పర్వములకు
    యువతరంబులు యూగు యుత్సవముకు
గతపు నెమరువేత కదలు ధోరణులకు
    భావియూహాజగద్భావనలకు
పందెమ్ము పంతమ్ము బాయునలసటకు
    గెలుపుకై పరుగుల గెంతులకును

తే.గీ. విరమణముల కెదురు చూచు విసుగులకును
       నిరత వ్యస్తత నాశించు చురుకులకును
       నడుమ నిదమిధ్ధ మవనట్టి తడబడులవి
       నడిమి వయసు నడలు కావు నుడువ నలవి

సీ. వేళమించిగుడువ వేధించెడి వయసు
      ఒకపూటె భుజియించ నుత్తమంబు
ఒడలుశ్రమపడగానోర్పలేని వయసు
     కాలినడకలెంతొ మేలు గూర్చు
గాయమ్ము శీఘ్రమ్ము మాయనట్టివయసు
    స్వస్థసూత్రానుశాసనమె సుఖము
జాగరమ్ములు సల్ప జాలనట్టి వయసు
    సమయాన నిదురలే సబబు లిపుడు

తే.గీ. ప్రాకులాటలికపయిన బాయ, వయసు
       తగిన మోతాదులోనుండ దగిన వయసు
       శేష జీవనమ్మంత సంతోషముగను
       గడుప సన్నాహమె గద యీ నడిమి వయసు

సీ. తుళ్ళుతు త్రెళ్ళెడి దోరవయసు గాదు
       వంగివణ్కెడిపెద్ద వయసు గాదు
సర్వమాస్వాదించు జవ్వనమిదిగాదు
    చవులుడిగినముదుసలినె? గాదు
ఆయువెంచగబోని ప్రాయమా యిది గాదు
    కాటికి కాల్జాపు కాలమవదు
జడుపు బెరుకులేని పడుచునసలుగాను
    మరణభయముతోడ జరుడ గాను

తే. గీ. బాధ్యతస్పృహలటలేని బాటగాదు
       భారమింకమోయగలేని స్వారి గాదు
       భావిగతములకుచెడిన రేవడిగతి
       మధ్య వయసున పడ్డటి మనుజుని గతి

సీ. వృధ్ధులయినవారి పధ్ధతి కూకొట్టి
      వర్ధమానులకును వార బెట్టి
పాతకాలపువారి సేతల తెగడక
    యవ్వనోత్సాహాంబు కడ్డుపడక
సాంప్రదాయమ్ముల సాగించి భక్తిగ
    కొత్తదారికనువు గూర్చి చనగ
శాస్త్రోక్తవిధముల ఛాందసములనక
    యువకుల ప్రశ్నల చవక గనక

తే.గీ. పాత కొత్తల కలిపెడి సేతు వవగ
      పిన్నపెద్దతరములకభిన్నమవగ
      రెండుభాషలనందునుద్దండులవగ
      నడిమి వయసు కత్తిపయిన నడక! నరుడ!