షరా మామూలే

ఊర్లు నిద్రిస్తున్నపుడు కుండపోతగా వర్షం
చీకటి ఊర్లను వెలుగులోకి తెస్తున్నట్టు మెరుపులు
ఆకాశం మొత్తాన్ని కబళించడాని కన్నట్టు వ్యాపిస్తుంది మెరుపు
బడాయి పడుతున్న చెట్లను బెదిరించడానికి అప్పుడప్పుడు ఉరిమే ఉరుములు
మెరుపుల ఓణీతో, ఉరుముల గజ్జెలతో తాండవం చేస్తుంది వాన.
ఆకాశానికి భూమికి మధ్య పేనిన తాడుల వాన.

భూమిని కబళించడానికి ఆకాశం కురిపిస్తున్న శరపరంపర వాన
ఎంత హఠం చేస్తుంది వాన
హఠాత్ కఠోర క్రియా విహారం చేస్తుంది వాన
అవసరమున్నపుడు అటుపక్కకు మొహం తిప్పుకుంటుంది.
అవసరం లేనప్పుడు గబుక్కున రాలిపడుతుంది.
హఠాత్తుగ ఠారెత్తిస్తుంది
ఊరులు ఊర్లను జలదిగ్భంధం చేస్తుంది
కంటిమీద కునుకు లేకుండ చేస్తుంది
కడుపు నిండా తిండి లేక ఆపసోపాలు పడుతూ
ఎట్లో బలవంతంగా నిద్రలోకి జారుకునేంతలోనె
భొరునకురిసి అతలాకుతలం చేస్తుంది వాన
ఆకాశం చిల్లుల్లోంచి పడే జల్లులు
గుడిసె పైకప్పు చిల్లుల్లోంచి కుండపోతగా పడుతుంటే
నించునే జాగాలేక తడిసి వణికిపోతూ
ఉన్న ఒకటో రెండో వస్తువుల్ని పదిలపరచుకునే క్రమంలో
రాత్రి పడకకు పొయ్యేముందు తిట్టుకుని అలిగిన భార్యాభర్తల మధ్య
సయోధ్య కుదుర్చుతుంది వాన.
ఆకలితో అలమటించే పసిపిల్లాడి ఏడుపు వినిపించకుండ
ఉరుముల్తో నింపెత్తుతుంది వాన
మట్టి రోడ్లమీద పడి విసుక్కుని మెల్లిగా
కాలువల్లోకి జారుకునే చినుకు
మురికి కాలువలోని కంపు భరించలేక ముక్కుమూసుకుని నిట్టురుస్తుంది.
ఇంటి పైకప్పుకు చిల్లిపెట్టి ఇంటిదాని మొహం మీద పడి
జానపద అందాలను ఆస్వాదించానన్న గర్వంతో ఒంపులు తిరిగి
ఇంక అందుకోవాల్సిందేమీ లేదని మత్తుతో కళ్ళుమూసుకుంటుంది ఓ చినుకు.
పాలెగాళ్ళ గుబురు మీసాల మీద పడి మీసపు రోషాలను కిందకు దింపానని
గర్వంతో ఛాతీ విరుచుకుని ఎగసిపడే చినుకు
మీ రోషాలతో పల్లెలు కాలుతున్నాయని గుర్తు చే్శానని సంబరపడుతుంది.
కురిసినతసేపు కురిసి ఉన్నవన్నీ ధ్వంసం చేసి
ఇక విశ్రాంతి అన్నట్టు చల్లగ పరారవుతుంది వాన
వాన వెలిశాక ఇళ్ళన్ని నీళ్ళతో
ఇంటి చుట్టూ నీళ్ళే
మోకాలి లోతు నీళ్ళలో ఆడుకునే పిల్లలు
మోకాలి దాక చీరలెత్తుకుని నీళ్ళు తోడేసే అమ్మలక్కలు
అప్పుడే వికసిస్తున్న పంటపొలం గురించి బెంబేలెత్తిపోతూ
చుట్ట వెలుగుల్లో ముఖంలోని ఆందోళన కప్పిపుచ్చుతున్న రైతులు
కూలిన గుడిసెల్లోంచి చెంబు తపేళాలు, కుక్కి మంచాలు భుజాన పెట్టుకుని
ఎవరి కొసమో ఆశగా ఎదురుచూసే సామాన్యులు
అందరినీ ఆటపట్టిస్తుంది వాన
వర్షం ధాటికి మట్టి మిద్దెల మీదుగా జారిన వాన నీళ్ళు
గోడలపై ఏర్పడిన వర్షపు చారలు
యుద్ధంలొ క్షతగాత్రులుగా కనిపించే గుడిసెలు
జలదిగ్భంధంలో ఊరు
ఊరు ఊరంతా ఒకచోట చేరి పోగొట్టుకున్న వాటికై ఆరాటంటొ వెతుకులాట
తిండి లేక నకనకలాడుతూ
ఆకాశంలోకి చూపులు
ఉప్పెన తర్వాత ఆకాశం అన్నం కురుస్తుంది
కుక్కలు చింపిన విస్తరి జీవితం.
ఉప్పెనలో చిక్కుకుపోయి, ప్రవాహంలో కొట్టుకుపోయిన
రామిగాడు, సీతిగాడు, చిన్నన్న
చెట్టు కొమ్మకు వేలాడుతూ సొమ్మసిల్లిపోయి బతుకుతో యుద్ధం చేస్తున్న సూరిగాడు
ఏటిగట్టుకు ఎక్కడ్నుంచో కొట్టుకు వచ్చిన గుర్తుతెలియని అనామక శవం
పక్కఊళ్ళో చెరువుకు గండిపడిందని
ఊరుఊరే మునిగి పోయిందన్న కలవర పెట్టే విషయాలు
అంత ఆందోళనలోనూ రేపు జరగబోయే తిరణాల గురించిన ఊహాగానాలు
ఊరుఊరంతా వింతగా ఉంటుంది
విచిత్రంగా ప్రవర్తిస్తుంది.
తాము ఓట్లేస్తే గెలిచి ఏమీ చేయడానికి రాని రాజకీయ నాయకులు అప్పుడు గుర్తొస్తారు.
పక్కా ఇళ్ళు ఇస్తామని పెద్దలు చేసిన వాగ్దానాలను గుర్తు తెస్తుంది వాన.
గండిపడిన చెరువు నీళ్ళు పంటపొలాలను తడిపేస్తుంటే
పెరిగిన పంటను తినేస్తుంటే పెంచుకున్న బిడ్డను కసాయి వాడికి అప్పగించి
కళ్ళప్పగించినట్టు నిరాశగా చూస్తున్న గాజుకళ్ళు
ఉప్పెన ప్రవాహంలో కొట్టుకుపోయి పెంచుకున్న ఎనుములు
నీటి పాలవుతుంటే కన్నీటి బొట్ట్లు జార్చడం తప్ప మరేం చేయలేని
జాలి చూపులు…………
మరుభూమిపై చక్కర్లు కొడుతున్న గద్దల్లాగా హెలి్కాప్టర్లు
డేగకన్నుతో ఉప్పెన నష్టాన్ని గాలిలోనే అంచనాలు వేస్తున్న అధికార యంత్రాంగాలు
హడావుడి సమావేశాలకై వడివడిగా అడుగులు వేసే పాలక పక్షాలు
అదను దొరికింది కదాని నోళ్ళు విప్పే ప్రతిపక్షాలు
నష్టాన్ని అంచనా వేస్తూ హోరెత్తించే ప్రకటనలతో టీవీ చానళ్ళు
ఎవడి ధోరణి వాడిది
ఎవడి లోకం వాడిది
గిరాటైన బతుకు బండి ఇరుసుల్ని చక్కదిద్దే ప్రయత్నాల్లో మాత్రం జాప్యం
మళ్ళీ వాన వచ్చేదాకా, ఉప్పెన ముంచెత్తేదాక అంచనాలే
వాగ్దానాలు తీరేలోపల మళ్ళీ వాన………
షరామామూలే
మళ్ళీ నిద్రపోతున్నపుడు వాన వచ్చి తట్టి లేపుతుంది
కొన్నాళ్ళు కలకలం సృష్టించి
అతలాకుతలం చేస్తుంది
జీవితాలతో ఆడుకుంటుంది
షరామాములే

జె. స్వరూప్ కృష్ణ

రచయిత జె. స్వరూప్ కృష్ణ గురించి: రేడియో ప్రసంగాలు, ఇప్పుడోనది కావాలి (కవితా సంపుటి) ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటెజ్ ఆఫ్ ఫోక్ ఆర్ట్స్ ఆఫ్ రాయలసీమ(వ్యాస సంపుటి) రాయలసీమ జానపద కళారూపాల పై పరిశొధన, జానపద కళా రూపాల వీడెయోలు సేకరించడం, రూపకల్పన చేయడం, (ఈ వీడియోలన్ని http://www.maganti.org/page11.html లో అప్లోడ్ చేయబడినాయి). www.24fps.co.in లో జానపద కళారూపాలపై ఆర్టికల్స్ వ్రాయడం.  ...