యాత్ర

గ్రాండ్ కాన్యన్

చర్మపు మడతల్లో
చరిత్రపాఠాలు
చెక్కుకున్న శిలలు;
లోతుల్లో ప్రవహించే నది.

మనసొక్కక్షణం
మాష్టారు ప్రవేశించిన
తరగతి గది

ధ్యాన భంగం చేయలేను

వీలింగ్, వెస్ట్‌ వర్జీనియా

బంగారు భవంతి.
భక్తుల అనురక్తితో
బందీ ఐన ప్రభుపాదుడు

సెలయేటి ఒడ్డున నెమలి.
వల విసిరింది పురివిప్పి
చిక్కుకొని పథికుడు

ముక్తిలేదు ఎవరికీ

జనవరి, పిట్స్‌బర్గ్

మూతబడిన ఉక్కుగనులు,
పగ్గాల్లో బిగించిన నది,
ఆకులు రాల్చిన చెట్లతో
అరణ్యాల అవశేషాలు.

ఏ పైడ్ పైపర్ ఋణమో
తీర్చనట్టున్నారు.
వసంతాన్ని
వెంటబెట్టుకుపోయాడు.