ఎందుకు రాయాలో అందుకే చదవాలి
బాపు, రమణ, శ్రీశ్రీ, చలం, విశ్వనాథ, జాషువ, కందుకూరి, గురజాడ, త్యాగరాజు, శ్యామశాస్త్రి, నన్నయ్య, తిక్కన్న, ఎర్రాప్రగ్గడ, అన్నమయ్య, శ్రీనాథుడు, పోతన, ఘంటసాల, సాలూరి రాజేశ్వరరావు, శ్రీపాద - కొ. కు. … మనకు అంతులేని జాబితా ఉన్న ప్రముఖ తెలుగు వ్యక్తులున్నారు! అది తెలుగు వారి అదృష్టం!
అందరూ మహానుభావులే! అందరూ తెలుగు సాహిత్య, సంగీత, సంస్కృతికి వన్నె తెచ్చినవారే! ఇలా మన భాషా, సంస్కృతుల్ని సుసంపన్నం చేసినవారందరికీ, అభినందన మందార మాలలు వెయ్యవల్సిందే! వారి సేవలను గుర్తుంచుకొని మన తరవాత తరాలకు చెప్పవలసిందే! అందుకు సందేహం లేదు!
కానీ, ఈ పనులన్నీ నివాసంలో ఉన్న తెలుగువారు చెయ్య గలుగుతారు, కొంత వరకు చేస్తున్నారు కూడా! అరిచి “గీ” పెట్టినా, ప్రవాసాంధ్రుల జీవితానుభవాలు నివాసాంధ్రులు అన్వయించుకోలేరు! అది కష్టం, అసహజం కూడా! ఒక ప్రముఖ నివాస ఆంధ్రుణ్ణి అమెరికాలో సత్కరించే సభలో, ఆయనతో పాటు సభా వేదికపై కూర్చుండే అవకాశం నాకొచ్చింది! సత్కార గ్రహీత, తన ఉపన్యాసంలో తాను గత కొన్ని దశాబ్దాలుగా అమెరికా వచ్చి వెడుతున్నానని, కొంచెం గర్వంగానే చెప్పుకున్నాడు. అందులో తప్పు లేదు! కానీ, ఆ ప్రసంగంలో, ప్రవాస ఆంధ్రుల జీవితాలు నాకు తెలుసులే అన్న అర్ధం అనుమానం లేకుండా ధ్వనించింది! ఒక నివాస ఆంధ్రుడు, అమెరికాకి చాలా సార్లు వచ్చి వెళ్ళటం సంతోషింప తగ్గ విషయమే! అసలు విషయం ఏమిటంటే, ప్రవాసంలోని జీవితం తెలియాలంటే, ప్రవాసంలో బతకటంలో తప్ప వేరే దారి లేదు. నివాస ఆంధ్రుడు ఎన్ని సార్లు అమెరికాకి వచ్చి వెళ్ళినా, అమెరికాలో తెలుగు వారి జీవితాన్ని అర్ధం చేసుకోటం, వీలు పడదు.
ఎంతసేపూ తెలుగువారికి ఇష్టమైన ముద్ద పప్పు, గుత్తొంకాయ కూర, ముక్కల పులుసు రుచుల గురించేనా! అదృష్తవశాత్తు ప్రవాసాంధ్రులకి, ఈ రుచులతో పాటు, మరిన్ని రుచులు తెలుసుకొనే అవకాశం ఉంది! మరి, ఈ “కొత్త” రుచుల గురించి తోటి తెలుగు వారికి మనం చెపుతున్నామా? ఇప్పటి దాకా చెప్పకపోతే, ఇకనైనా చెప్పాలి!
ఈ మధ్య ఈమాటలో వచ్చిన, కొడవళ్ళ హనుమంతరావు గారు “జిం గ్రే” గురించి రాసిన వ్యాసం, కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారి “హిందూస్తానీ సంగీతంలో ఘరానాలు” పై వ్యాసం వంటివి, నివాసాంద్రులు రాయగలరని నేననుకోను! అది నిశ్చయంగా, ప్రవాసాంధ్రులు మాత్రమే చెయ్యగలిగే పని. చెయ్యాల్సిన పని కూడా!
ఈమాట అంతర్జాతీయ వెబ్ పత్రిక! ప్రపంచంలో తూర్పున ఉన్న అటు ఆష్ర్టేలియా, జపాన్ వంటి దేశాలు, ఆంధ్ర రాష్ట్రంలోనే కాక భారత్ లోని ఇతర రాష్టాలలోని తెలుగు వారు, దుబాయ్ వంటి గల్ఫ్ దేశాలు, ఐరోపా ఖండంతో పాటు, ఇటు పశ్చిమ దేశాల్లోనే పశ్చిమంగా ఉన్న ఉత్తర అమెరికా తెలుగు వారందరూ చదువుతున్న ప్రముఖ పత్రిక అన్న విషయం, దాదాపు పదేళ్ళుగా ఈమాట పాఠకుల అభిప్రాయాల వల్ల నిశ్చయంగా తెలుస్తోంది! ఒక్క ఉత్తర అమెరికాలోనే, విభిన్న రంగాలలో నిష్ణాతులైన తెలుగు వారు ఉన్నారు. మెడికల్ డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు, విద్యాలయాల్లో ప్రొఫెసర్లు, వ్యాపారవేత్తలు - ఇలా మరెన్నో రంగాల్లో ప్రవీణులైన తెలుగు వారున్నారు. వీరి జీవితాల్లో, అంతులేని వైవిధ్యం ఉంది! ఒక్క ఉత్తర అమెరికాలోనే ఇంత వైవిధ్యం ఉన్న తెలుగువారుంటే, ఇతర దేశాల్లో ఉన్న తెలుగు ప్రతిభ, వైవిధ్యం ఊహించుకోటం కూడా కష్టమే!
ఉదాహరణకి, జపాన్ దేశంలో, ఆష్టేలియా ఖండంలో చెప్పుకో తగ్గ సంఖ్యలోనే తెలుగువారున్నారని వినికిడి. వీరి గురించి మిగిలిన ప్రవాసాంద్రులకి దాదాపు ఏమీ తెలియదని నేననుకొంటున్నాను!
అప్పుడప్పుడు ఈమాట కోసం నేను రాసిన వ్యాసాలు, మొన్న మొన్ననే అమెరికాకి చదువుకోసం వచ్చి, ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న మా అన్నయ్య కొడుక్కిచ్చి, చదివి అభిప్రాయం చెప్పమన్నా! నేనేదో గొప్పగా రాస్తున్నానని కాక, నా వ్యాసాలపై మావాడి అభిప్రాయాలు తెలుసుకుందామని నా ఆశ! ఒకటి, రెండు వారాల తరవాత అడిగా! “ఏరా ఎలా ఉన్నాయి నా వ్యాసాలు” అని. నవ్వుతూ, “ఇంకా చదవలా బాబాయ్” అని సమాధానం! రెండు నెలల తరవాత ఏదో మాటల సందర్భంలో మళ్ళీ అదే ప్రశ్న వేసా! మళ్ళీ అదే సమాధానం!
ఇలా కాదని, ఈసారి క్రిస్‌మస్ శలవుల్లో కలిసినప్పుడు, నా లాప్‌టాప్ మీద ఈమాట వెబ్ సైట్‌కి వెళ్ళి, ఆన్‌లైన్‌లో నా వ్యాసాల్ని లోడ్ చేసి, మా వాడ్ని దగ్గర కూర్చోబెట్టి చదివించటానికి ప్రయత్నించా! మా వాడు తడుముకొని, తడుముకొని, ఒక్కొక్క అక్షరమే చదువుతుంటే, నా కడుపులో ఏదో అవుతున్నట్టనిపించింది! మా వాడు ఒక చిన్న పేరా చదవటానికి పది నిమషాలు టైం తీసుకోటం చూసి నా కళ్ళు గిర్రున తిరిగాయి. పైగా ఈ పది నిమషాల్లో వంద తప్పులు. మా వాడు హైదరాబాదులో చదువుకొన్నాడు. అమెరికా వచ్చి రెండేళ్ళు దాటలేదు. “ఏరా నీ తెలుగు ఇలా ఉందేమిటీ?” అని అడిగితే, “నీకు తెలియదా బాబాయ్? నేను తెలుగు చదవటం మానేసి చాలా రోజులైంది! అందులో మనది హైదరాబాద్ తెలుగు!” అని నవ్వుతూ సమాధానం చెప్పాడు. మా వాడికి ఏం సమాధానం చెప్పాలో తెలియక, నోరు మూసుకున్నా!
ఎందుకంటే!
దాదాపు 20 ఏళ్ళ క్రితం, అవి నేను అమెరికాకి కొత్తగా వచ్చిన రోజులు. ఎక్కడో, తూర్పు గోదావరి జిల్లాలో ఒక మారుమూల పల్లెటూళ్ళో, ఆర్థిక అవసరాలకోసం డబ్బు పంపమంటూ ఆమె రాసిన ఉత్తరానికి సమాధానంగా, వృద్ధాప్యంలో ఉన్న మా పెద్దమ్మ గారికి డబ్బు పంపిస్తూ తెలుగులో ఉత్తరం రాద్దామని మొదలు పెట్టా! ఒక్క వాక్యం కూడా కదలదే? తెలుగు అక్షరాలు, గుణింతాలు, వత్తులు అన్నీ దాదాపు మర్చిపోయా! భయం వేసింది! నాకు అంతో ఇంతో బాగా వచ్చిన భాష తెలుగు ఒక్కటే! అది కూడా ఇలాంటి స్థితిలో ఉంది. ఏం చెయ్యాలో తెలియలా! అప్పుడు గుర్తొచ్చింది. కారణాలు ఏమైనా, దాదాపు పదేళ్ళపాటు నేను తెలుగు రాయటం మర్చిపోయా! అసలు తెలుగు చదవటమే మర్చిపోయా! చిన్న పిల్లవాడు తప్పటడుగులు వేస్తున్నట్టు, ఇంట్లో ఉన్న తెలుగు పుస్తకాలు కూడబలుక్కొని చదవటం మొదలెట్టా! చిన్నప్పటి నుంచి తెలిసిన భాష కాబట్టి, తొందరలోనే మళ్ళీ ధారాళంగా చదవటం నేర్చుకున్నా. అప్పుడప్పుడు రాయటం వల్ల, రాత కూడా మళ్ళీ పట్టుపడుతోంది. ఇదే విషయాన్ని, మా వాడికి చెప్పా! “ప్రయత్నిస్తాలే బాబాయ్” అని మా వాడు భరోసా ఇచ్చాడు! చూద్దాం ఏం అవుతుందో?
కొస మెరుపు: నేను తెలుగులో ఈ మాత్రం రచనలు చెయ్యగలనని ఎప్పుడూ అనుకోలేదు! నా పదవ తరగతి పరీక్షల్లో, తెలుగులో నాకు నూటికి అత్తెసరు మార్కులే వచ్చాయి! తెలుగులో ఇంటర్‌నెట్ సౌకర్యం వల్ల, నాకు తెలుగులో రాసే అవకాశం వచ్చింది. వీలు చూసుకొని, గత రెండు దశాబ్దాలుగా ఇంటర్‌నెట్‌లో తెలుగులో రాయడానికి దారి సుగమనం చేసిన వ్యక్తులు, వారి కృషి మీద వచ్చే ఈమాట సంచికల్లో రాయడానికి ప్రయత్నిస్తాను! ఇందుకు సంబంధించిన వివరాలు మీ దగ్గర వుంటే, నాకు పంపమని మనవి! గత శతాబ్దిలో, అచ్చు యంత్రం కనిపెట్టటం వల్ల, తెలుగులో కొత్త రచయితలు ఎలా పుట్టుకొచ్చారో, ఈ శతాబ్దిలో, ఇంటర్‌నెట్లో తెలుగు లిపి పరిచయం ద్వారా మరింతగా తెలుగు రచయితలు పుట్టుకొచ్చారన్నది అతిశయోక్తి కాదు!

రచయిత విష్ణుభొట్ల లక్ష్మన్న గురించి:
పుట్టటం, పెరగటం ఆంధ్రాలో. హైదరాబాద్, విశాఖపట్టణంలో కాలేజీ చదువు, ముంబై ఐ. ఐ. టి ఇంజనీరింగ్ చదువు తరవాత టాటా ఇన్స్టిట్యూట్లో భౌతిక శాస్త్రంలో పి.హెచ్. డి. 1980 దశాబ్దంలో అమెరికా రాక. వృత్తి రీత్యా అమెరికా, ఫ్రాన్స్ దేశాల్లో పని చేసారు.
ఈమాట వెబ్ పత్రిక ప్రారంభకుల్లో ఒకరు. ముందుముందు తెలుగు సాహిత్యంలో ఇంటర్నెట్ కి ప్రధాన పాత్ర ఉందని గాఢంగా నమ్మే వాళ్ళలో ఒకరు. ... పూర్తిగా »
రాజేంద్ర కుమార్ దేవరపల్లి అభిప్రాయం:
January 1, 2008 12:24 am
తెలుగునేల మీదే ఉంటూ దాదాపు ఒక దశాబ్దం పాటు అటు చదువుకు,ఇటు రాతకూ దూరంగా ఉన్న నాకు తెలుసు మీరు చెప్పిన అవస్థలు. చదువు దినకొత్త, రాత నెలకొత్త అని బూదరాజు చెప్తుండే వారు. వాస్తవానికి ఈరోజు సగటు మనిషికి కూడా చదివే, వినే భారం ఎక్కువయ్యింది. కానీ ఏమిటి అవీ ఏ వికాసానికి దోహదం చేస్తాయి అనేదో పెద్ద ప్రశ్న. అలాగే మన భాషలోని యాసలు. 21 సం వత్సరాలుగా విశాఖపట్నం లో ఉంటున్నా, అల్లుడిని అయినా నీకు మీ గుంటూరు జిల్లా మాట తీరు పోలేదని ఇక్కడి వారు అంటుంటే,పూర్తిగా వైజాగ్ యాసలో మాట్లాడుతున్నావని మావూర్లో నిందిస్తున్నారు. అమెరికా పౌరుడైన మాబావమరిది ఇక్కడికి వస్తే చక్కటి తెలుగులో మాట్లాదుతుంటే మూడు సంవత్సరాల అతని కూతురు పెరుగన్నాన్ని పప్పు అంటొంది. తనకొచ్చిన నాలుగు పదాల్లో అదొకటి.
మీ రానున్న వ్యాసావళి కోసం ఎదురుచూస్తూ,
భవదీయుడు,
రాజేంద్ర కుమార్ దేవరపల్లి
పాఠకురాలు అభిప్రాయం:
January 2, 2008 9:09 am
“బాపు, రమణ, శ్రీశ్రీ, చలం, విశ్వనాథ, జాషువ, కందుకూరి, గురజాడ, త్యాగరాజు, శ్యామశాస్త్రి, నన్నయ్య, తిక్కన్న, ఎర్రాప్రగ్గడ, అన్నమయ్య, శ్రీనాధుడు, పోతన, ఘంటసాల, సాలూరి రాజేశ్వర రావు, శ్రీపాద - కొ. కు… మనకు అంతులేని జాబితా ఉన్న ప్రముఖ తెలుగు వ్యక్తులున్నారు!” - ఈ ప్రముఖ తెలుగు వ్యక్తులలో ఒక్క స్త్రీ కూడా లేకపోవడం తప్పు కాదూ? ఇటువంటి వివక్ష పోవాలంటే, అది తప్పా?
- ఒక పాఠకురాలు
Rohiniprasad అభిప్రాయం:
January 2, 2008 11:53 am
మనవాళ్ళు చెప్పే ‘తిరిగే కాలూ..’ వగైరాలకు ‘రాసే చెయ్యి’ అనేదాన్ని కూడా చేర్చాలేమో. బలివాడ కాంతారావు, కవనశర్మ, వివినమూర్తి తదితరులు ఏ ఊళ్ళో ఉన్నప్పటికీ రచనలు చేస్తూనే ఉండేవారు. ఎటొచ్చీ తమ నివాసస్థలానికి దూరంగా ఉంటున్న రచయితల పెర్స్పెక్టివ్ మెరుగయే అవకాశం ఉంటుంది. వారి అనుభవాలు విస్తృతం అయేకొద్దీ రచనల వైవిధ్యం కూడా పెరుగుతుంది. లక్ష్మన్న చెప్పిన విషయాల్లో ఇదొక ఆహ్వానించదగ్గ పరిణామం.
తెలుగు యువతీయువకులకు తెలుగు రాకపోవడం అనేది ‘చేసే పని కూటికా గుడ్డకా’ అనే ఈనాటి ధోరణికి ప్రతీక. తెలుగు నేర్చుకోవడంవల్ల ప్రత్యక్షంగా లాభమేదీ కనబడదు కనక వారు నేర్చుకోరు. ఇటువంటి విషయాల్లో వారి సంగతిని తగినంతగా పట్టించుకోని తల్లిదండ్రులదే తప్పు అనాలి.
వెంకట్ అభిప్రాయం:
January 3, 2008 7:32 am
మీరు చెప్పింది అక్షరాలా నిజం. ఇప్పుడు యువతరంగం తెలుగు చదవడం రాదు అని చెప్పుకోవడం గొప్ప ఫ్యాషనయ్యింది. మొన్నొకాయన తెలుగులో వెబ్సైట్ స్థాపిస్తూ సలహా కోసం అతనికి తెలిసిన ఒక ఎంబిఏ కుర్రాడినడిగాడు. “మీరు సినిమాల గురించి రాయండి చాలా మంది వస్తారు. ఇలా సాహిత్యం, కవిత్వం అంటే మీకు నలభై ఏళ్ళకు మించిన వాళ్ళే గతి” అన్నాడు. అది ఒక విధంగా నిజమే. ఆ పరిస్థితి ఇక మారదు కూడా అని నా అభిప్రాయం. కానీ చూస్తూ వదిలేయకుండా ఓపికున్న వాళ్ళు తమ వంతు ప్రయత్నం చేస్తూనే వుండాలి.
Rohiniprasad అభిప్రాయం:
January 4, 2008 9:02 am
వ్యాసం చివర్లో రచయిత ప్రస్తావించిన విషయం కూడా ముఖ్యమైనదే.ఒకప్పుడు తెలుగులో ముద్రణాసౌకర్యం ఏర్పడడం ఎంతటి మార్పుకు కారణమయిందో, గత 20, 25 ఏళ్ళలో ఇంటర్నెట్ మీద తెలుగు చదవడం, రాయగలగడం అనేవి కూడా ఎన్నో పరిణామాలకు దారితీశాయి. ఈ ప్రయత్నాల్లో పాల్గొన్న ఔత్సాహికులు ఇంకా మన మధ్యనే ఉన్నారు కనక వారి కృషినీ, అనుభవాలనూ వివరిస్తూ లక్ష్మన్నవంటివారు వ్యాసాలుగా రాస్తే బావుంటుంది. యూనికోడ్ విషయంలో ఈమాట సంపాదకవర్గం చేసిన కృషి కూడా చెప్పుకోదగ్గదే. వీరందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవడంలో భవిష్యత్తులో తప్పులు జరగకుండా ఉండాలంటే ఈ సమీపచరిత్ర అంతా వెంటనే నమోదు కావాలని నా ఉద్దేశం.
ఇక ఆస్ట్రేలియా మాటకొస్తే అక్కణ్ణుంచి బి.శారద ఏపీవీక్లీ డాట్ కామ్ లో నలుపు తెలుపు అనే శీర్షికతో ఆసక్తికరమైన వ్యాసాలు రాస్తున్నారు.
reader అభిప్రాయం:
January 5, 2008 2:11 am
ఈ వ్యాసంలో ఆశ్చర్యార్థకాలు చాలా ఎక్కువగా, ముఖ్యంగా, వాక్యాంత బిందువుకు బదులుగా, వాడుతున్నారు! ఇది చదవడానికి చాలా ఎబ్బెట్టుగా ఉంది! గుర్తించగలరు!!
విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
January 5, 2008 3:37 am
Reader గారు:
నిజమే. నేనూ గమనించాను.
Suryanarayana Saripalle అభిప్రాయం:
January 5, 2008 5:05 am
లక్ష్మన్న గారు తమ వ్యాసం లో , ” హిందుస్తానీ సంగీతంలో ఘరానాలు” అనే విషయం మీద అంత చక్కగా వ్రాయడం రోహిణీ ప్రసాదు గారి లాగ ప్రవాసాంధ్రులైన వారు తప్పించి ,నివాసాంధ్రులైన వారెవ్వరికీ సాధ్యం కాదనడం లో కొంత “లాజిక్కు” లోపించింది అనుకుంటాను. ఆ వ్యాసం అలా రూపొందడానికి ప్రవాసం ,నివాసాల మాట అటుంచండి , అసలు వారి తెలుగు తనం కంటె , సంగీతజ్ఞత , ముఖ్య కారణం,. వారు తెలుగు వారు అయిఉండడం అక్కడ యాదృఛ్ఛికం అని నా ఉద్దేశం.
వ్యాసానికి విశిష్టత ఏవైనా ఉంటే అది వారు ఖాను సాహిబ్ ల దగ్గర జేసిన శిష్యరికం వల్ల వచ్చిందంటాను. మిగిలిన విషయాలు తెలుగులో చక్కగా చెప్పారన్నది తెలుస్తున్నా, తెలుగు లో లేవని తప్పించి, తెలుగు మీద దురభిమానం లేని సంగీతాభిమానులకి ఇలాంటి విషయాలు “గూగులీయ” మైన ఈ లోకం లో దొరక్కపోవు.
కొత్తపాళీ అభిప్రాయం:
January 5, 2008 5:41 am
మాంఛి ఊపుతో మొదలైన వ్యాసం మధ్యలో ఎక్కడో వ్యక్తిగత అనుభవాల తోటలో పడి దారి తప్పింది. వ్యాసం మొదటి భాగంలోచెప్పిన కారణం తప్ప (ప్రవాసాంధ్రుల జీవితాల గురించి ప్రవాసాంధ్రులే రాయాలి) మిగతాదంతా ఏదో విషయాల్ని పైపైన స్పృశించి వదిలేసినట్టు ఉంది. “ఇది మనది, దీన్ని మనం నిలబెట్టుకోవాలి” అన్న తపన ఒక్కటే కాకుండా .. ఇంకేమైనా ఉత్సాహ జనకమైన కారణాలు ఉన్నాయా అని మనం వెదకాలి.
Srinivas Nagulapalli అభిప్రాయం:
January 10, 2008 12:23 pm
“ప్రవాసంలోని జీవితం తెలియాలంటే, ప్రవాసంలో బతకటంలో తప్ప వేరే దారి లేదు.” అన్నది ఎట్లా ఉందంటే స్త్రీల సమస్యలు, జీవితాలు తెలియాలంటే స్త్రీగానే బతకాలి, లేదా అణగారిన బడుగుజీవుల వ్యథలు తెలియాలంటే వారిలాగానే బతకాలి, రోగుల కష్టాలు తెలియాలంటే మనం కూడా రోగం తెచ్చుకోవాలి అన్నట్లుంది. అలా చేస్తే సాయపడదని కాదు, అట్లా చేయకపోతే అసలు తెలియదు అని అనుకోనవసరం లేదు.
అమెరికా చాలా సార్లు వచ్చినంత మాత్రాన ఇక్కడి వారిని అర్థం చేసుకున్నామనుకోవడం ఎంత పొరపాటో, అసలు అమెరికా ను ప్రత్యక్షంగా చూడకపోయినంతమాత్రాన ఒకరికి ఈ విషయాలు ఏవీ చచ్చినా అర్థం కాలేవు అని అనుకోవడం అంతే పొరపాటు.
పది కాలాలపాటు కాపురం చేసిన దంపతులు, తమ భార్య (లేదా భర్త) కన్నా ఇంకెవరో తమని ఎంత బాగా అర్థం చేసుకున్నారని చెప్పుకోవడం పెద్ద వింతా కాదు, మనకు కొత్తా కూడా కాదు కదా!
సహృదయత, సమగ్రమైన నిశిత పరిశీలన, తప్పిదాలను, అపోహలను దిద్దుకునే ఔదార్యం ఉంటే ఎవ్వరైనా ఎవ్వరి సమస్యలనైనా అర్థం చేసుకోగలరు. ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోతున్న నేటి ప్రసార వ్యవస్థలో ఇక్కడ ఉన్న వాళ్ళే ఇది వ్రాయగలరు, అక్కడున్న వాళ్ళే అది వ్రాయగలరు అని అనలేం. ఇక్కడి వాళ్ళు అక్కడికి, అక్కడి వాళ్ళిక్కడికి వస్తునే ఉన్నారు, ఉంటారు.
ఎక్కడ పొందిన అనుభవాలు అని కాక, ఎంత లోతుగా గ్రహించిన అనుభూతి అని బేరీజు వేసుకుంటే ఎవ్వరు చెప్పినా అది మనకు తాకుతుంది. అసలు “ఈ మాట” పత్రికే ఒక చక్కని ఉదాహరణ. ఎక్కడో నేర్చిన తెలుగులో, ఎప్పుడో నేర్చుకున్న భాషలో ఎక్కడెక్కడికో వచ్చి వ్రాస్తూ మాట్లాడుకూంటున్నాం,
ఎంకా చెప్పాలంటే, ఎంతో కొత్త విషయాలను అంతే పాత భాషలో చెప్పుకుంటున్నాం కదా! ఇక వేరే చెప్పేదేముంది.
విధేయుడు
Srinivas
కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
January 12, 2008 1:59 pm
శ్రీనివాస్ గారిచ్చిన స్త్రీల, పేదల, రోగుల గురించి రాయడానికి సంబంధించిన పోలిక ఈ సందర్భంలో సమంజసంగా లేదు. ఎందుకంటే వీళ్ళ గురించి రాయడానికి వాళ్ళ జీవితంతో కావలసిన ప్రత్యక్షమైన అనుభవం వేరే వాళ్ళకుండే అవకాశం వుంది. అమెరికా జీవితం గురించి అలాంటి ప్రత్యక్షానుభవం అమెరికాలో ఉంటే తప్ప అసాధ్యం.
“ఇంటర్నెట్ తోనూ, ఈమాట తోనూ, ఇరవై నాలుగ్గంటలూ ప్రసారమయ్యే టీవీ షోల తోనూ వేరే వాళ్ళ జీవితం గురించి తెలుసుకోలేమా? సృజనాత్మక సాహిత్యం సృష్టించలేమా?” అంటే ఎక్కడో కొడవటిగంటి కుటుంబరావు అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి: సాహిత్యం జీవితవృక్షాన పూసే పువ్వు అనే ఉపమానం వాస్తవమనుకుంటే, సాహిత్యాన్నించి సాహిత్యం పుట్టడం, పువ్వునుంచి పువ్వు పుట్టడం లాంటిది - అసంభవం.
అసాధ్యం, అసంభవం అన్నవి పెద్ద మాటలనుకోండి. ఎక్కడన్నా మినహాయింపులుండొచ్చు.
కాని లక్ష్మన్న గారితో నేను కొంతవరకే ఒప్పుకుంటాను. ఎందుకంటే ఆయన నివాసాంధ్రులు ఎన్నిసార్లు ఇక్కడకొచ్చి వెళ్ళినా అమెరికాలోని తెలుగు జీవితం అర్థంచేసుకోలేరన్నారు. జీవితం, తెలుగు వాళ్ళదే అయినా, చాలా విశాలమయింది. ఇక్కడ ఉన్న వాళ్ళకయినా అది అర్థమయ్యేది అసంపూర్తిగానే.
రెండు మూడు నెలలు వాళ్ళ పిల్లల్ని చూడటానికి వచ్చినవాళ్ళు, తాము చూసి అనుభవించినంతలో అర్థం చేసుకొని రచనలు చెయ్యొచ్చు.
మొన్నో కథ చదివాను: అమెరికాలో తెలుగు వాళ్ళు సత్యనారాయణ వ్రతం ఎంత ఘనంగా - మీగడలతో భోజనం, తాంబూలంతో ఫాటు వెండిగిన్నె ప్రదానం - చేసుకుంటున్నారో, ఒకరింట్లో స్వామి వారొకరు యజ్ఞం ఎలా జరిపించారో చెప్పి, ఇండియాలో లక్ష వత్తుల నోము ఎవరూ చేస్తున్నట్లు లేరు; అది కూడా ఇక్కడ చూసే భాగ్యం కలుగుతుందేమో అన్నారు.
అలాంటి కథలు విలువయినవే; నిజానికి చుట్టపుచూపుగా వచ్చిన నివాసాంధ్రులే అవి మిన్నగా రాయగలరేమోమో. అవి చదివి, అక్కడ కంటే ఇక్కడే మన సంస్కృతి గురించి ఎక్కువ పట్టించుకుంటూన్నామని సంబరపడొచ్చు; లేదా, పెరిగిన ఆర్థిక స్తోమతుతో పాటు పెరగకూడనవేవో మనలో పెరుగుతున్నాయని విచారించనూ వచ్చు - చదివే వారి దృష్టిని బట్టి.
కొడవళ్ళ హనుమంతరావు
వికటకవి అభిప్రాయం:
January 24, 2008 1:53 pm
నేను శ్రీనివాస్ నాగులపల్లి గారితో ఏకీభవిస్తాను. కొడవళ్ళ వారు అన్నారు “ఎందుకంటే వీళ్ళ గురించి రాయడానికి వాళ్ళ జీవితంతో కావలసిన ప్రత్యక్షమైన అనుభవం వేరే వాళ్ళకుండే అవకాశం వుంది.” మరయితే, ఈ సూత్రం ప్రవాసం నుంచి తిరిగివచ్చి స్వదేశంలో స్థిరపడినవారికీ వర్తిస్తుంది కదండీ. ఎవరికి సంబంధించిన విషయాలు వారే రాయాలి అంటే, ఇక ఉహా రచనలకి స్థానం లేనట్టే. గొప్పగొప్ప కావ్యాలు అన్నీ ఊహాశక్తితో రాసినవే. అనుభవించో, మరొకరి నోట విని రాసినవి కాదు. ఇటువంటి ఆంక్షలు అభిలషణీయం కాదని నా అభిప్రాయం.
కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
January 26, 2008 1:07 pm
వికటకవి గారూ,
ఆ సూత్రం ప్రవాసంలో ఉండి వచ్చినవాళ్ళకి వర్తించదని నేననలేదు. తప్పకుండా వర్తిస్తుంది. నిజానికి, నేను లక్ష్మన్న గారితో కొంతవరకే ఒప్పుకుంటాను అంటూ, ఆయన అన్నదాంట్లో నేను అంగీకరించని విషయమొకటుందని ఓ ఉదాహరణతో పాటు వివరించాను. (పేరివ్వడం మర్చిపోయాను - పి. సత్యవతి గారి “మంత్రనగరి”)
మరో ఉదాహరణ ఇచ్చి విరమిస్తాను. ఉన్నవ రాసిన “మాలపల్లి” కి ఇతివృత్తం పల్లెలో ఉండే ఓ దళిత కుటుంబం. ఉన్నవ దళితుడు కాడు; వాళ్ళ జీవితానికీ ఆయన జీవితానికీ చెప్పుకోదగ్గ తేడా ఉంది. అయినా గూడా వాళ్ళ జీవితం గురించిన ప్రత్యక్ష అనుభవం ఆయనకుంది - ఎందుకంటే వాళ్ళూ ఆయన ఉండే సమాజంలో భాగమే. ఎంత ఊహాశక్తి గల రచయిత అయినా తను వేరే సమాజంలో ఉంటూ “మాలపల్లి” లాంటిది రాయలేడు అని నా నమ్మకం. రాస్తే అది కత్తిమీదసాము లాగుంటుంది.
“మనం ఇంటర్నెట్ యుగంలో కొచ్చాం, ప్రపంచమంతా ఒక చిన్న కుటుంబం,” అంటే నేనొకటడుతాను. గత వంద సంవత్సారాలలో అనేక దేశాల్లో అనేక మార్పులొచ్చాయి. ప్రచార సౌకర్యాలలో ఊహించలేనంత మార్పులొచ్చాయి. కాస్త విద్యావంతులైన వాళ్ళకి వేరే దేశాల్లోని జీవితాల గురించి కొంతవరకైనా తెలుసుకోడానికి అవకాశం కలిగింది. కాని రచయితలెవరైనా కేవలం తమ ఊహా శక్తి నుపయోగించి తామెప్పుడన్నా నివసించిన దేశంలో కాక వేరే దేశంలో ఉన్న మనుషుల జీవితాలని ఇతివృత్తంగా తీసుకొని గొప్ప సాహిత్యం సృష్టించారా? సృష్టిస్తే, తెలుగులో కానీ ఇంగ్లీషులో కానీ, దయచేసి కొన్ని పేర్లివ్వండి.
కొడవళ్ళ హనుమంతరావు
mOhana అభిప్రాయం:
January 26, 2008 1:48 pm
మరొక దేశానికి వెళ్లకుండా, చూడకుండా ఉత్తమముగా రాయవచ్చు.
క్రిస్తమస్ సమయములో Silver Skates అనే చిత్రాన్ని టీవీలో
అప్పుడప్పుడు చూపిస్తుంటారు. దీని మూలము Mary Mapes Dodge రాసిన
Hans Brinker or the Silver Skates అనే పుస్తకము. నేను బహుశా
20 ఏళ్లకు ముందు ఈ చిత్రాన్ని టీవీలో చూచాను. తరువాత
ఏదో పాత పుస్తకాల కొట్టులో పుస్తకాన్ని కూడ కొని చదివాను.
ఇది పిల్లల పుస్తకము, 1865లో రాయబడింది. ఇందులో Hans and Gretel
అనే ఇద్దరు పిల్లల తండ్రికి ఆరోగ్యము బాగు లేదు. అక్కడ సమీపములో
ఉండే నగరంలో ఒక స్కేటింగ్ పోటీ జరుపుతారు. అందులో విజేతలకు
వెండి స్కేట్స్ బహూకరిస్తారు. ఆ పోటీలో ఈ పిల్లలు పాల్గొంటారు.
ఆ కుటుంబం కష్టాలు కూడ తీరుతాయి. పిల్లలు తమ గ్రామంనుండి
ఎలా వెళ్తారు, ఎలా స్కేట్ చేస్తారు, ఆ కాలములో హాలండ్ దేశపు
పరిస్థితులు, నైసర్గిక వర్ణన, ఇత్యాదులు చాల చక్కగా ఈ పుస్తకములో
ఉన్నాయి. ఇందులో గమ్మత్తేమంటే శ్రీమతి డాడ్జి అమెరికా దేశములో నుండి
ఈ పుస్తకాన్ని రాశారు. ఆమె హాలండ్ దేశంపై కాలు పెట్టలేదు.
ఇప్పటి కాలానికి వస్తే, చాల దేశాల నగరాల మ్యాపులు గూగుల్ ద్వార
చూడవచ్చు. (నాకు ఎప్పుడైనా బెంగళూరు, మదరాసు, ఇత్యాదులపై
మమకారము కలిగితే ఈ మ్యాపుల ద్వార రహదారులను, భవనాలను చూచి
ఆనందిస్తా.) Internet ద్వారా అన్ని విషయాలు సేకరించుకోవచ్చు.
ఒక దేశంలో కాలు పెట్టకుండా ఆ దేశంపై రాయడం అంత కష్టం
కాదనుకొంటాను.
విధేయుడు - మోహన
వికటకవి అభిప్రాయం:
January 28, 2008 2:01 pm
హనుమంతరావు గారు,
నేను ఉహా(కాల్పనిక)రచనలు గా పేర్కొన్నవి మనం ఎన్నో ఏళ్ళుగా ఆదరిస్తూ వచ్చిన జానపద కధలు, భేతాళ కధలు, తాంత్రిక కధలు వగైరాలు.
ఇకపోతే, ప్రత్యక్షముగా ఒక ప్రాంత ప్రజలతో గడపకపోయినా, ఎందరో పాశ్చాత్యులు మన భాషని, సంస్కృతిని అర్ధం చేసుకొని మనకు సంబంధిత గ్రంధాలెన్నో రచించారు, అనువదించారు. నాకు తెలిసి బుద్ధుడు, బౌద్దమతం, తాంత్రిక బౌద్దం పైన మన వాళ్ళ పుస్తకాలకంటే, విదేశీయులు రాసినవే ఎక్కువ.
ఇకపోతే, సి.పి.బ్రౌన్ గారు తన నిఘంటువులో ఉదహరించిన ప్రతి పదం యొక్క ప్రయోగం ప్రత్యక్షంగా చూసి ఉంటాడంటారా? ఆయన సంగ్రహ పరచిన సామెతలు అంతే. ఆయన చదివిన ఇతర పుస్తకాల ప్రభావం ఉండదంటారా? ఇది మరో పద్ధతి, మనకు తెలియని విషయాలపై పరిశోధించి రాయటంలో.
ఇంకాస్త మీరన్నదానికి దగ్గరగా ఉండే ఉదాహరణలంటే, అంగారకుడి మీద జీవం ఉండొచ్చు అన్న విషయాన్ని తీసుకొని గ్రహాంతరవాసులపై కోకొల్లలుగా వచ్చిన రచనలు, సినిమాలు. చాలా వరకు ప్రాచుర్యం పొందాయి. ఎవరు చూసారు అక్కడి మనుషులు, వాళ్ళ వేషభాషలు (అసలంటూ ఉనా కూడా)?
వికటకవి అభిప్రాయం:
January 28, 2008 6:37 pm
పుస్తకాల లిస్ట్ పెద్దది. ఇక్కడ buddhist books చూడండి
http://www.mlbd.com/
http://en.wikipedia.org/wiki/Madhira_Subbanna_Deekshitulu
విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
February 19, 2008 5:45 pm
ఒక రోజు పొద్దున్నే ఆవేశంతో మొదలెట్టి, ఆ రోజే లంచ్‌కి ముందే పూర్తి చేసిన నా రాతలపై తమ అభిప్రాయాలను చెప్పిన అందరికీ ధన్యవాదాలు.
పాఠకురాలికి: మీరు చెప్పే దాకా, ప్రతిభావంతులైన తెలుగు స్త్రీలను మర్చిపోయాన్నన్న విషయమే తెలియలా! అసలు నేను ఆ కోణం నుంచి తేడాగా ఎప్పుడూ చూడలా. ఒక్క మనవి. ఎంతో మంది తల్లులు, అక్కలు, చెల్లెళ్ళు, మరెంతో మంది స్త్రీమూర్తుల ప్రేమా, దయ, వాత్సల్యం లేకుండానే తెలుగు తేజోమూర్తులు వృద్ధి లోకి వచ్చారని నేననుకోను. దయచేసి ఇటువంటి తేడాలు మరి తీసుకు రావద్దు.
సరిపెల్ల వారికి: అయ్యా సూర్యనారాయణ గారూ! 1980 లలో మీతో కలిగిన పరిచయం, మళ్ళీ ఈ మాట ద్వారా గట్టిపడుతోంది. తెలుగు నాట తెలుగు వాడి వ్యవసాయంలో ముఖ్యమైన పంట, వరి. వరి విత్తు నాటాక, కలుపు తీసి మరొక చోట పాతటం అవసరం. అలాగే, తెలుగు వాడు, తెలుగునాట నుంచి బైటకు వచ్చేదాకా, శోభిల్లే అవకాశం ఉండదేమో! నిజానికి రోహిణీప్రసాద్ గారు, ఆంధ్రాలో ఎప్పుడూ నివసించలా! కానీ, ఆయన ముంబాయి నివాసం ఆయన హిందూస్తానీ అభిరుచుల్ని సానపెట్టింది, అని అనుకుంటాను. ఈమాట కోసం మీ ఆస్ట్రేలియా అనుభవాలు పంచుకోమని కోరుతున్నా.
కొత్తపాళీ గారు: ఇందులో నా వ్యక్తిగత విశేషాలు కేవలం ప్రతీకలే. నేను, నా కన్నా వయస్సులో మాత్రమే చిన్న వారయిన వారికి ఏం చెప్పాలో అన్నదానికి ప్రయత్నమే ఈ నా రచన.
కొడవళ్ళ హనుమంత రావుగారు, శ్రీనివాస్ నాగులపల్లి, మోహన రావు గారు, వికటకవి గారు : మీ అభిప్రాయాలకు ధన్యవాదాలు. నేను రాసిన వాటితో అందరూ ఏకీభవించాలని నేనెప్పుడూ అనుకోలేదు. ఒక దేశం వెళ్ళ కుండా, ఆ దేశం గురించి రాయవచ్చు. అలాంటప్పుడు, రచయిత సమర్ధుడయి, అందరిచేతా “భేష్” అనిపించుకుంటే, ఆ రాత మంచి ఫిక్షన్ అవుతుంది. వాటి గురించి నేను ప్రస్తావించటం లేదు. ప్రవాసాంధ్రులకు స్వానుభవంలోకి వచ్చిన విషయాలు ఎందుకు, ఎలా చెప్ప గల్గాలి అన్న ఆలోచన నా రాతలకి మూలం.
అందరికీ నమస్కారాలతో,
లక్ష్మన్న
Lyla Yerneni అభిప్రాయం:
February 19, 2008 8:37 pm
లక్ష్మన్నకు:
“అసలు విషయం ఏమిటంటే, ప్రవాసంలోని జీవితం తెలియాలంటే, ప్రవాసంలో బతకటంలో తప్ప వేరే దారి లేదు. నివాస ఆంధ్రుడు ఎన్ని సార్లు అమెరికాకి వచ్చి వెళ్ళినా, అమెరికాలో తెలుగు వారి జీవితాన్ని అర్ధం చేసుకోటం, వీలు పడదు.”
మీరు చెప్పిన పై విషయం నిజమే ననిపిస్తున్నది.
పై విషయం నిజమైతే, మీరు స్త్రీ ఐతే తప్ప స్త్రీ జీవితం మీకు అర్థం కాదు . మీరు పాఠకురాలికిచ్చిన ఈ కింది సమాధానం చూస్తే మీకు స్త్రీలలో ప్రతిభావంతులున్నారన్న సంగతి అసలు తెలియదేమో అనిపిస్తున్నది.
లక్ష్మన్నా! మీరు, మీ వ్యాసంలో మొదటి పేరాలొ ఉదహరించిన తెలుగు తేజోమూర్తులను, మీరు క్రింద చెప్పిన విధంగా వృద్ధిలోకి తెచ్చినవారిగా స్త్రీలను గుర్తిస్తున్నారు కాని స్త్రీలు స్వయంగా తేజోమూర్తులని, మీకు అనిపిస్తున్నట్లుగా లేదు.
“పాఠకురాలికి: మీరు చెప్పే దాకా, ప్రతిభావంతులైన తెలుగు స్త్రీలను మర్చిపోయాన్నన్న విషయమే తెలియలా! అసలు నేను ఆ కోణం నుంచి తేడాగా ఎప్పుడూ చూడలా. ఒక్క మనవి. ఎంతో మంది తల్లులు, అక్కలు, చెల్లెళ్ళు, మరెంతో మంది స్త్రీమూర్తుల ప్రేమా, దయ, వాత్సల్యం లేకుండానే తెలుగు తేజోమూర్తులు వృద్ధి లోకి వచ్చారని నేననుకోను. దయచేసి ఇటువంటి తేడాలు మరి తీసుకు రావద్దు.”
పాఠకురాలిని ఇంకెప్పుడూ ఇలాటి తేడాలు తీసుకురావద్దంటున్నారు. ఎంచేత? పాఠకురాలు మీరు మర్చిపోయిన ఒక ముఖ్య విషయం గుర్తు చేశారు. మంచిదేగా! కాదా?
లైలా.
baabjeelu అభిప్రాయం:
August 2, 2008 8:23 am
బహుశా ఈ వ్యాసం కూడా సంపాదకులు “చెయ్యిచేసుకోడం” లాటిదే అయుండాలి.
మీ “స్పెల్లింగు మిస్టేకులే” కొన్ని వున్నాయి, మీరు మీ అన్నయ్య కొడుకు “హైదరాబాద్ తెలుగు” గురించి తెలుగు కాదని ఎందుకు బాధపడిపోతున్నారు? లిపి చదవడం రాకపోతే బాధపడవలసిన విషయమే, అయితే మౌఖికం వుండడం “థేంక్ గాడ్” aని అనుకోవాలి.
“నివాసాంధ్రులయినా” “ప్రవాసాంధ్రులయినా” తెలుగులో మంచి వ్యాసం రాయడానికి వస్తువు గురించి తెలిసుండాలి, ఆ భాషలో బాగా రాయగలిగుండాలి. అంతే.
మీరు, “ఈ మాట” మొదలెట్టిన వారిలో ప్రముఖులని నిన్ననే నాకు తెలిసింది.
అందుకే,
“ఈయమ్మని అడివిలో ఒగ్గేసినోడు ఆ బాబా? అదేటది. గొప్ప సిక్కొచ్చింది. ఈ యమ్మని లోపలికి తీసుకెల్లండెహె. జార్త, జార్త, జార్తొరె.
ఆ బాబు గురించేటనకండి. అప్పుడప్పుడు ఈ “మాట” నిలబెట్టడం కోసం ఆ బాబు “సెయ్యి సేసుకుంటూ” వుంటాడు. ఇదీ అలాటిదే. “వెబ్‌జైన్” ని ఇలా పరుగెత్తించడవంటే మాటలా? ఆ లజ్జుగుజ్జులు మనకి తెలవ్వు.
అడ్డబుర్రా, ఉంకో మాటాడినావంటే, ఒరే, ముక్కు మీద గుద్దీగల్ను.
“తాళపత్రాల” కాణ్ణించీ “గుటెన్ బెర్గ్” కాణ్ణించీ, “యూనీకోడ్” దాకా మనదృష్టవే కదా.
ఎవళెందుకు రాసినా మనవందుకే చదవాలి.
ఎందుకంటే మనమ్మే సల్లగుంటాది కాబట్టి.
మాయమ్మకీ మల్లెపూదండా, మముగన్న తల్లికీ మంగళారతులూ.
Sai Brahmanandam Gorti అభిప్రాయం:
August 2, 2008 10:44 am
బాబ్జీలు గారూ,
ఆవతల వాళ్ళు నొచ్చుకోకుండా మీరు రాస్తున్న కామెంట్లు బావున్నాయి. మీ చురకలూ, వ్యంగ్యాలూ నచ్చాయి. ఒక్కోసారి తిడుతున్నారో లేక పొగుడుతున్నారో తెలీకుండా బాణాలేస్తున్నారు. సేరున్నర బియ్యంలో పంటి కింద ఒక్క రాయి పడినా తిన్నది రుచించదు. మీ బాధ అర్థమయ్యింది.
కాకపోతే నాకున్న అభ్యంతరమల్లా ఒక్కటే! మీ విమర్శ ఇంకాస్త వివరంగా ఉంటే మాలాంటి వాళ్ళకి ఉపయోగ పడుతుంది. ఆలాంటి తప్పులు తిరిగి దొర్లకుండా జాగర్త పడ్డమూ జరుగుతుంది.
మీరు కాదన్నా, అవునన్నా ఇంటర్నెట్ పత్రికలతో, ముఖ్యంగా ఈమాటతో, పాత సంచికలు చదవడమూ, వాటిపై కామెంట్లు రాసే వెసులుబాటూ వుంది. అదే అచ్చు పత్రికలయితే ఈ సమస్యే లేదు. తెలుగునాట పత్రికల్లో అప్పుతచ్చులూ, తలలేని వాక్యాలూ కనిపిస్తూనే ఉంటాయి. చేయి తిరిగిన రచయితలూ తక్కువేం తినలేదు. దాన్నెవరూ పట్టించుకున్న పాపాన పోరు. అది వేరే విషయమనుకోండి.
మీరొచ్చాక కామెంట్లకి కాస్త ప్రాణం లేచొచ్చినట్లుంది.
భాషతో నిమిత్తం లేదు. వాక్యం ఎవరిదన్న పట్టింపూ లేదు. రావిశాస్త్రిదయినా, బీనాదేవి దయినా, చలం దయినా, లత దయినా, రంగనాయకమ్మ దయినా, ఏదైనా మాకిష్టమే!
చురకలతో ముక్కు మీద గుద్దినా పరవాలేదు.
బాణాలూ, పిడిగుద్దులూ, మెచ్చుకోళ్ళూ, తలనిమరడాలూ, అన్నీ స్వీకరిస్తాం.
చివరాకరుగా చిన్న విన్నపం. మీరూ కాస్త ‘చేయి చేసుకోండి’.
-సాయి బ్రహ్మానందం
P.S: దయచేసి ఎక్కడ తప్పులున్నాయో స్పష్టంగా చెబితే అందరికీ ఉపయోగ పడుతుందని నా అభిప్రాయం.
baabjeelu అభిప్రాయం:
August 3, 2008 12:52 am
సాయిగారూ,
మీ లాటి వారు ఇలాగ రాయకూడదు.
బహుశా నా తెంపరితనం తోనో, “జయప్రభ” గారు అభిప్రాయపడ్డట్టు “వికటకవి” కోతి చేష్టల వలనో నా అభిప్రాయాలు మితిమీరిపోయుంటాయి.
అభిప్రాయాలు, సామాన్యపాఠకుడి “విమర్శలు.”
అయితే,సామాన్య పాఠకుల “విమర్శలకి” తూనికరాళ్ళు వుండవు. “అనుభవించి పలవరించడం” తప్ప.
శ్రీశ్రీ “మహాప్రస్థానం” ముందుమాటలో “చలం” ఎంత చక్కగా రాసీసేడు.
దాని శీర్షిక కూడా “యోగ్యతా పత్రం”. అయితే “చలం” “యోగ్యతా పత్రం” ఇవ్వలేదు.
నచ్చప్పోతే “పాసిట్ ఆన్” అనీసేడు. తలకింద దిండులా పెట్టుకుని పడుకోవద్దన్నాడు.
ఇంకోటాలకించండి.
మణిరత్నం “గీతాంజలి” సినిమా చూసి, అప్పుడెప్పుడో, చాన్నాళ్ళ కిందట, “శ్రీకాకుళం” లో “బాలక్రిష్ణ వీర అభిమాని” “టైలర్ రాము” ఏవన్నాడు తెలుసా? “పొగెట్టీసేడండీ, సినిమా అంతా. అయితే మీలాటోళ్ళకి నచ్చొచ్చు. సినిమా ఆడ్డం కష్టం.” రాము చెప్పింది అతని అభిప్రాయం.
రామూ లాగే నేను కూడా నాకిష్టవయిన “ఈ మాట” శీర్షికలన్నిటికీ, నా అభిప్రాయాలు రాసీసేను. “అనుభవించి, పలవరించి, తూనిక రాళ్ళ తో కొలవకుండా.”
మృణాలిని గారి వుపన్యాసం గురించి నేను రాసిన అభిప్రాయం లో నేను అవాకులూ చవాకులూ రాసీసేను. “ఈ మాట” సంపాదకులు నా తోక కత్తిరించీసేరు. కత్తిరించడం వల్ల “మరియాదా” వచ్చింది. ఆ మర్యాదపూర్వకమైన అభిప్రాయాన్నే ప్రచురించేరు.
సామాన్య పాఠకుడు, మీలాటి వ్యాసకర్తల, కవుల రచనలు తప్పకుండా చదువుతాడు. చాలా నచ్చుతాయి, కొన్ని నచ్చవు. అదే “మీ అభిప్రాయం తెలపండి” లో “అప్పుతచ్చు”లతో సహా “సబ్మిట్” చేసేస్తాడు.
మీరూ, మీరూ రాసిన వాటిల్లో తప్పులు మాలాటి పాఠకులకి తెలీవు. మాకు తెలిసిందల్లా “తొలాట కష్టం” అనో “వోరం ఆడ్డం కష్టం” అనో “అదురు బినాకా టాపు” అనో అనడం. అది నిజాయితీ తో కూడిన అభిప్రాయం. తప్పవచ్చు “రైటవొచ్చు.”
చివరాకర్లో సిన్నముక్క.
“ఫలించిన వృక్షానికే రాతి దెబ్బలు” కదా?
మీరూ, కొడవళ్ళవారూ, భైరవభట్లవారూ, వైదేహీ శశిధర్ గారూ, మూలా సుబ్రహ్మణ్యం గారూ, రవికిరణు గారూ, జెజ్జాల క్రిష్ణమోహనుగారూ, పప్పు నాగరాజు గారూ, భైరవభట్ల వారూ, ఇలపావులూరి వారబ్బాయీ, లక్ష్మన్నగారూ, ఇత్యాదులతో సంపాదకులు వేలూరివారూ & కో; మీ అందర్నీ మించిపోయి ఉదయకళ గారూ, మీరంతా ఫలించిన వృక్షాలు.
అందుకే మీ రచనల్లో నచ్చినవి ” జిత్ నా ఖాయా మీఠా థా” పధ్ధతిలోనూ, నచ్చనివి ” జో హాత్ న ఆయా ఖఠ్ఠా థా” పధ్ధతిలోనూ నా లాటి పాఠకులు అభిప్రాయాల్ని వ్యక్తీకరిస్తారు, విమర్శించం.
ప్రస్తుతం మీరు వ్యక్తీకరించిన అభిప్రాయంలో, అప్పుతచ్చు అని మీరు రాసేరు. కావాలనే మీరు రాసుంటారు. అలాటప్పుడు “అప్పుతచ్చు” అని “కొటేషన్స్‌లో” పెట్టుంటే “చమక్”మని కితకితలు పెట్టుండీవారు. నా సందేహం ఏవిటంటే రాయడంలో “మిస్టేక్ సే గల్తీహోగయా హోగా” నేమోనని.
సాయిగారూ, నేను “సప్తపది”కి రాసినది విమర్శా? అనుభవించి పలవరించడవా?
Sai Brahmanandam Gorti అభిప్రాయం:
August 3, 2008 6:30 am
బాబ్జీలు గారూ,
మీ పలవరింతల్లో ‘మన” అనే నిజమూ, తప్పటడుగులు వేసే పిల్లాణ్ణి పరిగెత్తించేలా చేసే నిజాయితీ కనిపించాయి. వీధి చివర కిరాణా కొట్టు వాడిలా “తూనిక రాళ్ళ” తో కొడుతున్నారని అనిపించలేదు. మీ అనుభవాల్లో కూసింత ‘అందమూ,’ పలవరింతల్లో పిసరంత “పేమా: కనిపించాయి. అందుకే రాసాను.
ఆ మధ్యనే ఓ సాహితీ సదస్సులో “చేయి” తిరిగిన ఓ పెద్ద రచయిత కనిపించారు. ఆయన రాసిన కథల ప్రస్తావన తెస్తూ, “చదివి, బాగుందని విమర్శించండి” అంటూ ఆయనకేం కావాలో నికార్సుగా సెలవిచ్చాడు. నేనేమీ అలా అడగ లేదు కదా? రత్తాలూ, రాంబాబుల “అడ్డబుర్ర” నడ్డం పెట్టుకొని పలవరించినా, “బాలకిష్టుడి” స్థాయిలో చెప్పినా, “బినాకా గీత మాలా” స్టైల్లో రేటింగ్ ఇస్తూ “అభీ ఆ రహే హై - ఆప్ కీ మన్ పసంద్ ” అని ఊరించినా, ఆ “చేతల్లో” నిజాయితీ కనిపించింది. అందుకే రాయమని అడిగాను. తెంపరి తనాలూ, కోతి చేష్టల్లా అనిపించలేదు. మీ వాక్యాలు “నిజ్జం” గా గిలిగింతలు పెడుతున్నాయి. పిచ్చితల్లి “గానాపసూనాంబ” మీదొట్టు. కావాలంటే రమణ గారబ్బాయి “బుడుగు” నడగండి. “సత్తెపమాణికం” గా చెబుతున్నాను. ఇంకోటి.
సంపాదకుల ఉజ్జోగం చూస్తే, ఊరు చివర మంగలి గుర్తుకొస్తాడు. కత్తెర వాళ్ళ ఆయుధం. వెంట్రుకలయినా పీగ్గలరు. అవసరమైతే మెడైనా తెగ్గోయగలరు. “యాబ్రాసి” మొహానిక్కూడా “మహేష్ బాబు” కటింగ్ ఇవ్వగలరు. కాబట్టి వారితో కాస్త “జాగర్త” గా ఉండాలని అప్పుడేప్పుడో ” టౌన్ హాల్లో గిరీశం” దంచుకుంటూడగా ఈ నాలుగు ముక్కలూ చెవిన పడ్డాయి. సరిగ్గా కత్తెరేయలేదని మాసిన తలని మోయలేం కదా? నెల తిరక్కుండా అక్కడికే పరిగెడతాం. అయినా “కత్తెర” ఎక్కడ లేదు చెప్పండి? జీవితమే ఓ పెద్ద కత్తెర. కావల్సినవి అతికించుకుంటాం, అక్కర్లేనివి ఆవతల విసిరి పారేస్తాం. కాదంటారా?
మీ “పలవరింత” అనుభవంలో తప్పటడుగులేదు.
-సాయి బ్రహ్మానందం
( కావాలనే “అప్పుతచ్చు” అని రాసినా, మీరన్నట్లు గిలిగింతల కొటేషన్లో ఇరికించడం మరిచాను. మే బి, నెక్స్ట్ టైం. )