కోవెలలో పకపకలు
నారాయణకి దేవుడంటే ఇష్టం. అంత మాత్రం చేత ప్రతీ వారం గుడికెళ్ళడం ఎలా కుదురుతుంది చెప్పండి? ఏదో, చుట్టం చూపుగా అప్పుడప్పుడూ వెళ్ళి, ఆయన క్షేమం కనుక్కుని రమ్మంటే, అదో పద్ధతిగా వుండేది, అల్లా కాక ప్రతీ శనివారం వెళ్ళాలి, అందునా సుప్రభాతానికెళ్ళాలంటే, అదంత ఆచీపూచీగా తేలే యవ్వారం కాదు కదా.. అదుగో, ఆ మాటే అంటాడు నారాయణ. కానీ నారాయణకి కొత్తగా పెళ్ళవడం వల్ల..తప్పు తప్పు, పెళ్ళయిన కొత్త రోజులు కావడం వల్ల, పెళ్ళాం మాటని మరీ అంత తీసిపారేయలేక, అప్పుడప్పుడూ వెడుతూనే వున్నాడు పాపం.
శుక్కురారం రాత్రి ఏ తలమాసిన ఫ్రెండ్లో డిన్నరుకి పిలిచారంటే ఇహ అంతే సంగతి. వాళ్ళింటినించి ఊడిపడి రావాలి, పొద్దున్నే లేవాలి..రెండు చిక్కులు. అసలీ సుప్రభాతం పొద్దున్నే ఎందుకు పాడడం ? హాయిగా ఏ మధ్యాన్నాన్నో, లేకపోతే కాస్త ఎండ తగ్గాకా, నీడపట్టున యే సాయంకాలవో పాడుకోవచ్చును కదా, పాడరు.
పాపం..వారాంతానికి కూడా సెలవుండదు దేవుడికి. ఆయన్ని దబా, దబా లేపేసి, నీళ్ళోసేసి, పాలు, పసుపు, నెయ్యి, తేని, కాఫీ..ఇల్లా ఏది పడితే అది పోసేసి కడిగేసి, సొడ్డు పెట్టేసి, సీరామ రక్ష చెప్పేసి నించోబెట్టేస్తారు పాపం. అంతే, ఆ నించోవడం నించోవడం మళ్ళీ రాత్రి తలుపులు మూసే వరకూ వచ్చే వాడికీ, పోయే వాడికీ నవ్వుతూ దర్శనాలివ్వడం, అడిగినదీ, అడగనిదీ వరాలివ్వడం, ఇదే పని పెద్దాయనకి. మధ్యలో “సోషొస్తోందర్రా మొర్రో..” అంటే, కాసేపు తలుపులు మూసి, బాగా ఫాట్ వున్న తిళ్ళూ, పళ్ళూ అన్నీ ఎదురుగా పెట్టి, చెయ్యి తిప్పేసి, మహా నైవేద్యం అయిపోయిందంటారు, ఎంత దేవుడైతే మాత్రం అంతంత కొవ్వు పదార్థాలు ఎలా హరించుకోగలడు చెప్పండి? నోరు విడిచి చెప్పలేడు కదా అంచెప్పంచెప్పంచెప్పి, మనం ఇష్టా రాజ్జెం భరతుడి పట్టం చేసేయ్యడవే ? హన్నా, తప్పు కాదూ ?
ఇన్ని లాజిక్కులూ పెళ్ళాం కోరిక ముందు తీసి కట్టే… కాబట్టి ఆ రోజూ బయల్దేరాడు పెళ్ళాన్నేసుకుని. అక్కడికీ బయల్దేరే ముందు గుడికి ఫోను చేసాడు యేవైనా ప్రత్యేక కార్యక్రమాలూ, పఠనలూ, బోధలూ వున్నాయేమో కనుక్కుందామని. అల్లాంటివి వుంటే పార్కింగు దొరకదు (మనవాళ్ళకి పాప భీతి కూసింత ఎక్కువ). ఆ వంకతోనన్నా ఎగ్గొడదావని అతని వుద్దేశం. అవతలెవరో ఫోనెత్తారు.
” ఇవాళ మన గుళ్ళో ఏవైనా స్పెషల్ ప్రోగ్రాంస్ వున్నాయాండీ? ” అడిగాడు నారాయణ.
” తెలియదు..వుండే వుంటాయి” అవతలి కంఠం.
“మరెవరికి తెలుస్తుందండీ ?” అమాయకంగా అడిగాడు నారాయణ.
“పూజార్లకి..”
” పోనీ వాళ్ళకివ్వండి ఫోను”
“వాళ్ళు లేరు, పూజలో వున్నారు”
వళ్ళు మండింది నారాయణకి.
“పోనీ, ఇంకెవరినన్నా కనుక్కుని చెప్పగలరా”
అవతలిగొంతు : (అసహనంగా) ” మీకు ఇంటర్నెట్టుందా? ”
నారాయణ : లేదండీ, టయోటా కరోలా వుంది.
అవతలిగొంతు : అయితే, దాన్లో తిన్నగా ఇక్కడికి వచ్చేయండి.
నారాయణ : మరి, ప్రోగ్రాముల సంగతి ?
అవతలిగొంతు : అబ్బా తెలియదండీ, రోజుకి లక్ష ప్రోగ్రాములుంటాయి, ఎంతమందికి చెప్పగలం ?
నారాయణ : అయితే, వెంఠనే మీరో పని చెయ్యండి.
అవతలిగొంతు : చెప్పండి
నారాయణ : మీ కుర్చీలో ఎవరన్నా పెద్ద మనిషిని కూర్చోబెట్టండి
ఠక్కున ఫోను పెట్టేసాడు నారాయణ. “హన్నా, భక్తుల మీద ధాష్టీకమా? ఎంత మద మెంత…, ఇల్లాంటివాళ్ళే గుడికీ, దేవుడికీ చెడ్డపేరు తెస్తున్నారు “, అనుకుని, తప్పదని బయల్దేరాడు.కాపోతే రవ్వంత ఆలీసం చేసాడు కావాలనే. పదకొండు గంటల కెళితే, అటు దర్శనం, ఇటు మధ్యాన్న భోజనం రెండూ లాగించెయ్యచ్చని పన్నాగం. యీ కుట్ర తెలియని రాధమ్మ, పోనీలే మొత్తానికి ఎగ్గొట్టకుండా వస్తున్నారు కదా అని సంతోష పడి, కారెక్కేసింది.
గుడికెళ్ళి చెప్పులు విడిచేసి, అష్టోత్తరానికి టిక్కెట్టు కొంటూంటే ఒకాయన వచ్చి “యామండీ..చేతలు ఎంగే కడగాలి?” అని అడిగాడు. చూడ్డానికి కే.వీ మహదేవనల్లే బావున్నాడు పొన్న కాయలా. అర్థం అయినా కానట్టు మొహం పెట్టి “యేవిటీ?” అని అడిగాడు నారాయణ. ఆ ఆసామి చేతులు చూపిస్తూ “చేతలు సామీ చేతలు..వాషింగ్”అని పళ్ళికిలించాడు. “చేతలు కడిగే పంపు యింకా రాలేదు గానీ, చేతులు అం..గె, అక్కడ కడుక్కోవచ్చు ” అని పంపుకేసి చూపించాడు నారాయణ.
మెల్లిగా మెట్లెక్కి పైకి నడుస్తూంటే ఎవరో ఒకాయన వెనకాలనించి “బావున్నారా” అన్నారు మంద్ర స్థాయిలో. భయమేసి, గబుక్కున వెనక్కి తిరిగి చూసాడు. ఓ పెద్దాయన..పేరు గేపకం రాలేదు, అయినా ధైర్యం చేసి చెప్పేసాడు ” బావున్నామండి, మీరు?”. మాటపూర్తయ్యేలోపులో ఆ పెద్ద మనిషి వీళ్ళని దాటుకుని పైకెళ్ళిపోయాడు (మెట్లెక్కి !). అంత అర్జెంటు పని వున్నాయన తనని ఎందుకు పలకరించాడో అర్థం కాలేదు నారాయణకి.
సరే, మెట్లెక్కి దేవుడి దెగ్గరకెళ్ళారు. తిన్నగా వెంకన్న దెగ్గిరికెళ్ళకూడదని, ముందు వినాయకుడి దెగ్గిర కెళ్ళారు. రాధ ప్రదక్షిణాలు మొదలెట్టింది. నారాయణ నమస్కారం చేస్తున్నాడు (దేవుడికి). “బుర్ర్..బుర్ర్” మని శబ్దం వినిపించి, ఎవరో పిల్లాడు అల్లరి చేస్తున్నాడేమోననుకున్నాడు నారాయణ. అంతలోనే మళ్ళీ అదే శబ్దం వినిపించింది. పక్కకి తిరిగి చూసాడు. ఒకాయన రెండూ బుగ్గలూ పట్టేసుకుని, బైటకి లాగేసుకుంటూ, దేవుణ్ణి వెక్కిరిస్తున్నట్లున్నాడు, అంతలోనే మొట్టికాయలు మొట్టుకుంటున్నాడు. నవ్వాపుకోలేకపోయాడు నారాయణ. పనిలో పని, తనూ ఓ చెయ్యేద్దామా అనుకుంటూండగా, “ఏవిటా సకిలింపులు, తప్పు, కళ్ళు మూసుకు దణ్ణం పెట్టుకోండి” అంది రాధమ్మ. వెంఠనే కళ్ళు మూసుకుని దణ్ణం పెట్టేసుకున్నాడు నారాయణ, లెంపలు కూడా వేసుకున్నాడు, బోనస్ మార్కుల కోసం.
ఇటుగా తిరిగి పెద్దాయన దెగ్గిరికొచ్చే సరికి చాంతాడంత లైన్లు, అటోటీ, ఇటోటీని. ఇంతలో మంత్రాలు మొదలయ్యాయి. లోపల పూజార్లు మహా జోరుగా చదివేస్తున్నారు. బయట ఓ ముక్క తెలిసిన వాళ్ళు అక్కడక్కడా గొంతు కలుపుతున్నారు. నారాయణ చెవిలో స్టీరియో మోగినట్టుగా దడదడలాడిస్తున్నాడో పెద్దాయన, పూజారులతో సమంగా. కాసేపు చూసాడు పెద్ద పూజారి. తరవాత వళ్ళుమండి, ఆ మంత్రం ముగించి, ఏదో వేరే భాషలో మొదలెట్టాడు. అలవాటు లేని భాష వినేసరికి నారాయణ చెవులు ఎలర్టు అయిపోయాయి. పక్కనున్న స్టీరియో ఎఫెక్టు కూడా ఠపీ మని ఆగిపోయింది. “తిక్క కుదిరిందా?” అన్నట్టు ఓ చూపు, మందహాసం విసిరి, గొంతు పెంచి మరీ పాడసాగారు పెద్ద పూజారి గారు.
అయితే ఆడాళ్ళలో కొందరు అందుకున్నారు. వాళ్ళెంత రాగంలో పాడినా “ళ”కారం తప్ప యింకేవీ వినపడలేదు నారాయణకి. సరే, అదీ పూర్తైంది.
తరవాత సహస్రనామాలు మొదలయ్యాయి. అవి చాలామందికి కొట్టిన పిండి కాబట్టి అందరూ రెచ్చిపోయి చదవసాగారు. అందరు సుబ్బులక్ష్ముల్ని తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరైపోయడు నారాయణ.
తరవాత తీర్థం, ప్రసాదం, అర్చన అయ్యాయి. తీర్థం తాగి చెయ్యి నెత్తిమీద ఎందుకు రాసుకుంటారో అర్థం కాదు నారాయణకి. యింకా చాలా విషయాలు అతనికి అంతు పట్టవు. సంస్కృతంలో సుప్రభాతం, ఆనక వేద మంత్రాలూ చదివి, అరవంలో తిరుప్పావయ్యో మరేదో చదువుతారు కదా, మరి తెలుగులో ఏవీ చదవరెందుకు? యింతకీ వెంకటేశ్వర స్వామిది యే భాష? ఇవే ప్రశ్నలు ఓ సారి రాత్రి భోజనాలూ, తాంబూలం అయ్యాకా రాధమ్మనడిగాడు. “దేవుడికి యే భాషైనా ఒకటే. మన తృప్తి కోసం ఏదో చదువుతాం..” అంది. ఆ సమాధానంతో తృప్తి పడలేదు నారాయణ. కనీసం తెలుగులో ఓ పద్యమో, అన్నమాచార్య కీర్తనో విధిగా పాడాలి..అనిపించింది అతని ఫాక్షనిష్టు బుర్రకి.
“ఎవరన్నా ఓ పాట…”. పూజారి గారి గొంతు ఖంగుమని వినిపించేసరికి తెలివిలోకొచ్చాడు నారాయణ. వెనకాల ఎవరో ఒకావిడ అప్పుడే కూర్చుని వాసింపట్టేసుకుని సిద్ధమైపోయింది పాటకి. “సీజండు ఆర్టిస్టు కాబోలు..”ననుకున్నాడు నారాయణ. ఆవిడ గొంతు విప్పేసరికి హాలంతా నిశ్శబ్దం. ఏదో రేడియోనో, టేపో వింటున్నంత అద్భుతంగా వుందా గొంతు. “సామజవర గమనా..” నడుస్తోంది.
ఏవిటో..మనవాళ్ళకి యీ శ్రద్ధ లేదుకదా. యెప్పుడు చూసినా తన్నుకోడాలూ, కుమ్ములాటలూ తప్ప, ఓ పాటా, ఓ పద్యవా?..” ఒక్కసారి పెదవి విరిచి నిట్టూర్చాడు నారాయణ.
“యాదవ గుల మురళీ వాదన..”
ఒక్కసారి ఎవరో ఫేడీ మని తన్నినట్టై ఉలిక్కిపడి చూసాడు నారాయణ. మళ్ళీ అదే వాక్యం, వేరే వేరే సంగతులేస్తూ. చక్రపొంగలిలో రాయొచ్చినంత బాధ పడిపోయాడు నారాయణ. “వీళ్ళ సంగీతం మేష్టారెవరో గానీ, వీళ్ళకి సాహిత్యం కూడా సరిగా అర్థంతో నేర్పించుంటే ఎంత బాగుణ్ణు..” అనుకున్నాడు. యింకక్కడ వుండలేక రాధతో సహా కాంటీను కొచ్చి, పులిహోరా, చక్ర పొంగలీ బిగించాడు. అక్కడ కనబడ్డ వాళ్ళందరికీ భాషా భేదం లేకుండా ఓ రబ్బరు నవ్వొకటి పారేసి బైటికొచ్చేసాడు. ” యివాళ గుడి ఎంత బావుందో..కదండీ” అంది రాధ బైటికొస్తూ.
“అవును చక్రపొంగలి బాగా కుదిరింది. అచ్చం తిరపతిలో టేష్టు పడింది” అన్నాడు నారాయణ. ఇంకా ఏదో అనబోయాడు గానీ..రాధ కళ్ళు పెద్దవి చేసి “హన్నా” అన్నట్టుగా చూడ్డం గమనించి, ఆగిపోయాడు. కిందకొచ్చి కారెక్కుతూంటే, మొదట్లో కనిపించిన పెద్దాయన మళ్ళీ కనిపించి, అదే గొంతుతో “బావున్నారా” అన్నాడు మళ్ళీ.
“లేరు. కాంపుకెళ్ళారు. సోంవారం వస్తారన్నమాట..”. ఆయన రియాక్షన్ కోసం చూడకుండా, కారెక్కి తుర్రుమన్నాడు రాధతో సహా.

రచయిత శ్రీనివాస ఫణి కుమార్ డొక్కా గురించి: శ్రీనివాస ఫణికుమార్ డొక్కా జననం అమలాపురంలో. నివాసం అట్లాంటా జార్జియాలో. కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్‌లో పనిచేస్తున్నారు. కథలు, కవితలు రాసారు. ... పూర్తిగా »
రాజేంద్ర కుమార్ దేవరపల్లి అభిప్రాయం:
January 2, 2008 12:41 am
“యాదవ గుల మురళీ వాదన..”
అసలీ సుప్రభాతం పొద్దున్నే ఎందుకు పాడడం ?
తెలుగులో ఏవీ చదవరెందుకు? యింతకీ వెంకటేశ్వర స్వామిది యే భాష?
అందరు సుబ్బులక్ష్ముల్ని తట్టుకోలేక —-
ఇలాంటి ఆయుధాలతొ కూడా దాడులు ..చచ్చిపోతున్నాం బాబొయ్ నవ్వలేక
Surya అభిప్రాయం:
January 2, 2008 12:52 am
shaili is good
కొత్తపాళీ అభిప్రాయం:
January 2, 2008 9:07 am
“గుల మురళీ ..”
hilarious.
teresa అభిప్రాయం:
January 2, 2008 9:42 am
ఎందుకుబావుందో వివరించాల్సిన పనే లేదు. బా…గుందంతే! :)
పాఠకురాలు అభిప్రాయం:
January 2, 2008 9:51 am
నాకయితే, ఈ కధ బోరు కొట్టింది. దేముణ్ణి నమ్మే వ్యక్తులు ఆ దేవుణ్ణీ, ఆ పద్ధతుల్నీ వెక్కిరించడం, అందులో హాస్యం చూడ్డం - చాలా విచిత్రంగా వుంటుంది నాకు. సహేతుకంగా విమర్శిస్తూ, వెక్కిరిస్తే, అది వేరే సంగతి. ఇందులో రచయిత లేవనెత్తిన ప్రతీ ప్రశ్నకీ సమాధానం ఎప్పటినించో వుంది సమాజంలో. అయినా అవేమే పటించుకోకుండా, మళ్ళీ అదే పాట. “సుప్రభాతం పొద్దున్నే పాడటం ఎందుకు” అనే ప్రశ్న, “good morning” అనేది పొద్దున్నే ఎందుకు చెప్పడం అన్నట్టు వుంది. ఈ కధలో కధ అనేదే లేదు. అంతా కామెంటరీ మాత్రమే వుంది. తమిళుల మీద వెక్కిరింతలు కూడా వున్నాయి. ఏక్సెంటు అంటే ఏమిటీ? అమెరికాలో ఇండియన్లు మాట్టాడే ఇంగ్లీషులో ఇండియా ఏక్సెంటు ఎలా వుంటుందో, అలాగే తమిళులు పాడే తెలుగు పాటల్లో తమిళ ఏక్సెంటలుకూడా అలా వుంటుంది. దీనర్థం తెలుగు పదాలు సరిగా తెలుసుకోకుండా, పాడొచ్చని కాదు. నాకయితే ఇది బొత్తిగా నచ్చలేదు ఈ కధ. క్షమించాలి.
- పాథకురాలు
mOhana అభిప్రాయం:
January 2, 2008 10:22 am
రచయిత తమాషాకు అన్నారు, బాగానే ఉంది.
కాని తమిళములో కూడ పదమధ్యములో ఉండే పరుషములే
సరళములుగా మారుతాయి. ముందు ఉన్న అక్షరము
ఎప్పుడూ పరుషమే. తెలుగువారు కూడ కొన్ని అక్షరాలను
సరిగా పలుకలేరన్న విషయాన్ని మరువరాదు. ఉదా.
దంత్యాలను తాలవ్యాలుగా, త్యాగాన్ని చాగముగా ఉపయోగిస్తారు.
ఇక పోతే థ-కారము తెలుగులో లేదంటే అయోశయోక్తి కాదేమో.
రామనాథము ఎప్పుడు రామనాధమేగా తెలుగులో. ఒక్కొక్క
భాషకు ఒక్కొక్క విధమైన ఆచారము ఉంది. తప్పుగా
ఉచ్చరించినా కర్ణాటక సంగీతానికి తమిళులే జీవగఱ్ఱ అన్న
నిజాన్ని అందరూ అంగీకరిస్తారనుకొంటా.
విధేయుడు - మోహన
Chilakapati Srinivas అభిప్రాయం:
January 2, 2008 11:26 am
దీనిని కథ అని ఎందుకు అనవచ్చో ఎవరయినా చెప్పగలరా?
(హాస్యానికొస్తే _ వొట్టు, నాకెక్కడా నవ్వు రాలేదు.)
phaNi DokkA అభిప్రాయం:
January 2, 2008 2:54 pm
పాఠకురాలు గారూ,
కేవలం కొన్ని హాస్య సన్నివేశాలని కథగా కూర్చి మీ
ముందుంచుదామనే ప్రయత్నమే తప్ప, ఎవరినో వెక్కిరించాలనో,
కించపరచాలనో రాసినది కాదు (దేవుడితో సహా). కొత్త
సంవత్సరంలో కొందరినైనా నవ్విద్దామనే ఆశతో చేసిన చిన్ని
ప్రయత్నమిది. కోపంకలిగించాలని కాదు.
భాష, యాసలతో హాస్యాన్ని స్ఫురింపచేయాలనే ప్రయత్నమే తప్ప,
మరో భాష వాళ్ళని కించపరచాలన్నది నా వుద్దేశ్యం కాదు. మీరు
అన్నట్టుగా “యాస” అనేది అందరికీ వుంటుంది. కొంచెం పరిశీలిస్తే,
అన్ని భాషలవారిలోనూ హాస్యాన్ని చూడవచ్చని నాకనిపిస్తుంది.
“సుప్రభాతం పొద్దున్నే ఎందుకు పాడాలి?” అనేదీ, ఇంకా మిగితా
ప్రశ్నలూ, కేవలం నవ్వించడానికి నారాయణ పాత్ర ద్వారా
చెప్పించినవే గానీ, సీరియస్ గా “రచయిత” కి వచ్చిన
అనుమానాలు మాత్రం కావు ( నేను సుప్రభాతాన్ని ప్రతిపదార్థ
సహితంగా నేర్చుకున్న అభిమానిని కావున..)
మీకుగానీ, మరెవరికి గానీ కష్టం కలిగించి వుంటే, క్షంతవ్యుణ్ణి.
phaNi DokkA అభిప్రాయం:
January 2, 2008 3:04 pm
మోహన గారూ,
మీ విశ్లేషణ బాగుంది. మీరు చెప్పిన విషయాలతో అక్షరాలా
ఏకీభవిస్తాను నేను. కర్నాటక సంగీతానికి నేటికీ ఊతమిచ్చి,
పెద్దపీట వేసి, పెంచి పోషిస్తున్నది వారే అన్నది నిర్వివాదాంశం.
అందుకు ఎల్లప్పుడూ కృతజ్ఞులం.
నేను కేవలం నవ్వించడానికి రాసిన కథను, సహృదయంతో,
అదే స్ఫూర్తితో చదివిన మీకు కృతజ్ఞతలు.
పాఠకురాలు అభిప్రాయం:
January 3, 2008 8:15 am
రచయితగారూ,
మీరు హాస్యం అనుకున్నది మీరు రాశారు. మీ అభిప్రాయాలని మీరు రాశారు. అది అందరికీ నచ్చాలని లేదు. నచ్చని వాళ్ళు తమ అభిప్రాయాలని తాము వెలిబుచ్చుతారు. అంతే! ఇందులో క్షమించమని అడిగేంత చెడ్డ విషయం గానీ, నెగటివ్ తనం గానీ వుందని నేను అనుకోవడం లేదు.పాఠకులకి వ్యాఖానించే హక్కు వున్నట్టే, రచయితలకి కూడా తమ అభిప్రాయాలని రాసుకునే హక్కు వుంటుంది. ఇందులో క్షమాపణలూ, అవీ అనవసరమని నేను అనుకుంటున్నాను. రాయగలిగే శక్తి వున్నప్పుడు, మంచి సబ్జెక్టు ఎన్నుకుని రాస్తే, ఇంకా బాగుంటుందని ఒక పాఠకురాలిగా నేను అనుకుంటున్నాను.
- పాఠకురాలు
cj అభిప్రాయం:
January 3, 2008 12:19 pm
పెద్దగా బుర్ర పెట్టకుండా చదివితే బానే వుంది. నిజ జీవితంలో గుడి లో జరిగే విషయాలు బావున్నయి.
radhika అభిప్రాయం:
January 3, 2008 1:04 pm
బావుందండి.ఈ కధ లో చెప్పినవి అమెరికా వాసుల జీవితాల్లో సాధారణం గా జరిగే విషయాలే .
lahari అభిప్రాయం:
January 13, 2008 7:40 pm
నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే, నేను ఇలాంటి సన్నివేశాలను గుడికి వెళ్ళినప్పుడల్లా చూస్తునే ఉంటాను, చాలా రియల్‌గా, కళ్ళకి కట్టినట్టుగా రాశారు. చదివి చాలా ఆనందించాను. మీరు ఇంకా ఇలాంటివి చాలా రాయాలి అని ఆశిస్తున్నాను.
Sowmya అభిప్రాయం:
January 30, 2008 6:27 am
బాగుంది. చాలా నవ్వుకున్నాను చాలా చోట్ల.
kosyasura అభిప్రాయం:
February 9, 2008 10:02 am
ఏదో నారాయణ హాస్యానికన్నమాటల్ని మరీ అలా పట్టించుకోకండి.
అసలు ఇది కధగా కాకుండా ఒక చైతన్య స్రవంతి గా చదువుతే చాలా బాగుంటుంది.
( ఐనా తెలుగువాడు హాస్యప్రియుడన్నవాడెవడండి. మనవాళ్ళంత సీరియస్ మనుషులు ఇంకెక్కడా లేరనుకోండి )
అలా సరదాగా నవ్వుకోడానికి బాగుంది.
అన్నట్టు ఫణిగారు, పోతనగారి మీద మీ అభిప్రాయం ఆంధ్రజ్యోతిలో చదివాను. బాగుంది
Sujatha అభిప్రాయం:
February 27, 2008 10:29 pm
ఫణి గారూ, మీ కధ చాలా బాగుంది. నిజంగానే మన తెలుగు వాళ్ళకి హాస్య ప్రియత్వం లేదండీ! చక్కగా సరదాగా చదువుకుని నవ్వుకోవాల్సిన కధని ఎంత రాజకీయం చేస్తున్నారండీ! దీన్నేరంధ్రాన్వేషణ లేదా బొక్కలు వెతుకుట్ అంటారనుకుంటా. గుడికెళ్ళిన ప్రతి వారికీ ఎదురయ్యే అనుభవమే ఇది. నేనయితే అచ్చం నారాయణ లాగా బోలెడన్ని సార్లు ఫీలయ్యాను. ముఖ్యంగా అవతలి వాళ్ళ భావాలకు ఏ మాత్రం విలువ ఇవ్వకుండా, పూజారితో పాటుగా, మంత్రాలు, సహస్రాలు, అదీ తారాస్ఠాయిలో.. చదివేవాళ్ళ విషయంలో!దీన్ని ఒప్పుకోకుండా , విమర్శిస్తున్నారంటే, భుజాలు తడిమేసుకుని, దేవుడిని తల్చుకుని ‘ఇంకా నయం. దేవుడికి ఇదంతా తెలిసిపోతేనో’ అనేసుకుంటున్నారనమాట. పైగా ప్రాంతీయవాదాలు కూడా లేవనెత్తడం ఆశ్చర్యాన్ని కలిగించింది. మీరు ఎవర్నీ పట్టించుకోకుండా ఇలాంటి మంచి హాస్య కధలు మరిన్ని రాయాలని కోరుకుంటున్నా! ఎందుకంటే, హాస్యం రాయడం చాలా కష్టం.
Phani DokkA అభిప్రాయం:
February 28, 2008 10:08 am
రాజేంద్ర కుమార్ దేవరపల్లి, సూర్య, కొత్తపాళీ, తెరెస, సీ.జే,
రాధిక, లహరి, సౌమ్య, కొస్యసుర, సుజాత గార్లకు..
కథ నచ్చిందనీ, హాయిగా నవ్వుకున్నామనీ రాసిన అందరికీ
కృతజ్ఞతలు.
కొస్యసుర గారు,
పోతనగారి ఆర్టికల్ మీద అభిప్రాయం తెలియజేసినందుకు
ధన్యవాదాలు.
కృతజ్ఞతలతో
ఫణి డొక్కా
banda Giribabu అభిప్రాయం:
April 28, 2008 6:11 am
Hi Phani,
This a new reveiw on your old story. and of course, on the same lines of “PATHAKURALU’ Review.
The theme you wanted to narrate is good. But the topics you have choosen to create humour are not.You could have used some other topics.
I don’t think you need to struggle to wirte a story. When you can easily convey your thoughts in to a story format, why don’t you invest some more ti me to think of theme and narration style.
One can tell the same story more effectively and humorousely. Please try.
All the best
Giri
banda Giribabu అభిప్రాయం:
April 28, 2008 6:12 am
Hi Phani,
By the way the Title is not at all good.
Sorry.
Giri