అదిగో పులి

“మీరెన్ని చెప్పండి..అతనలా నిర్ణయించుకోవడానికి సరైన కారణం కనపడదుగాక కనపడదు. మతి మతిలో వున్నవాడెవడూ దీన్ని ఎంతమాత్రమూ సమర్థించలేడు. ఎంతమందికి లేవు కష్టాలు ? ‘నా’ అనే దిక్కులేక, పూటకి గతిలేక, ముద్దకోసం ముష్టెత్తుకుంటున్న వాళ్ళు లేరూ?”

“మరే..దిక్కుమాలిన పిల్లలు వదిలేసి పోతే, ఇంటింటా పాచిపని చేసుకుని బతుకుతున్న పార్వతమ్మని చూడండి. బతకటంలేదూ?”

“రోడ్డు మీద బొగ్గుతో బొమ్మలు గీసుకునే సుదర్శనాచారి కన్నానా? వాళ్ళ కష్టాల ముందు అతనివే పాటి?”

“ఏవిటో, మనుషులోపట్టాన అర్థం కారు. మనిషన్న మాటేవిటీ, అసలీ సృష్టే అల్లా తగలడింది కామోసును. అంతా తెలిసినట్టే ఉంటుంది. తీరా కాస్త తరచి చూస్తే..ఏదీ.. ఉత్తదే, మొదలెట్టిన చోటుకే వస్తాం, గానుగెద్దులా.”

“అయినా ఏమోలెండి, ఆ మహాతల్లి ఎంతల్లా ప్రాణం విసిగించేసిందో మరి. ఏళ్ళొచ్చినా, మనసు తెలుసుకుని మసలడం తెలిసిందికాదేమో మరి. చెట్టంత కొడుకున్నాడు, వాడే తిరుగుళ్ళు తిరుగుతున్నాడో, సూర్యుణ్ణి చూడకూడదని నియమం కాబోలు. రాత్రవంగానే పోతాడు, పెంటలదొరలా టకప్పూ వాడూను. మళ్ళా పాల పాకెట్లొచ్చే వేళకి చేరుతాడు కొంపకి. ఎంతటి తండ్రైనా మరి తలెత్తుకు తిరగ్గలడా నలుగుర్లోనూ?”

“ఇహ ఆ కూతురుంది, భూమ్మీద నడవదు. కాస్త కన్నూ, ముక్కూ తీరుగా వుంటాయేమో..ఆ మాత్రం చావన చాయకే అంతగా అల్లల్లాడిపోవాలా? పూసలమ్మలా సంకలో బేగ్గూ, గుర్రాలు తోలేవాళ్ళలా మేజోళ్ళూ, టక్కూ టిక్కూమంటూ ఆ నడక, అబ్బో..పట్టలేం. అందరూ చేసేది ఆ బోడి వుజ్జోగాలేగా, ఏంచూసుకునో ఈ ఫోజులూ, బడాయీ. బహుశా తండ్రిమాట ఖాతరు చెయ్యలేదేమో. ఏ ఏబ్రాసిగాడితోనో ప్రేమలో పడిందేమో.”

“అయినా కన్న తండ్రి గదుటండీ..ఆ విశ్వాసవన్నా వుండద్దూ..”

“కర్ణుడి చావుకి కారణాలనేకవనీ..పాపం అన్నీ కలిసొచ్చుంటాయి అతనికి. గయ్యాళి పెళ్ళాం, కొరగాని కొడుకు, చెప్పు చేతల్లో లేని కూతురు.”

“వాళ్ళకి అతని మాటంటే వెంటుకా బరాబరీ అయిపోయుంటుంది. ఇంటిలోనిపోరు ఇంతింత కాదయా అని వూరికే అన్నాడా వేమన్న? ”

“ఇంకా ఎనిమిదేళ్ళ సర్వీసుందిట. వాలంటరీ తీసుకుని ఏ కాశీకో పోయినా బాగుండును. అయినా కాశీ నిండా ఇల్లాంటివాళ్ళేట. అక్కడ ఇతన్నీ నన్నూ చూసే వాళ్ళెవరు? కోటిలింగాల్లో బోడిలింగం.”

“ఈ మాటలకేంగానీ, వెయ్యి చెప్పండి, లక్ష చెప్పండి, బలవన్మరణం మహా పాపం. అయినా చావాలనుకున్న వాణ్ణి ఆపడం బ్రహ్మ తరవటండీ? ఆ చచ్చేదేదో ఊరవతలగా ఏ రైలు కట్టమీదో.. అయిపోయుంటే, పోనీ అని ఓ ఏడుపేడ్చి ఊరుకోవచ్చు. ఏ కౌశికలోనో దూకినా పోయుండేది వెధవ ప్రాణం. ఇదేవిటిదీ? పట్టపగలు, సెలవు వేళ, అందరూ ఇళ్ళల్లో ఉండగా, అన్నంలో విషం మాత్తర్లు కలుపుకు తిని, ఆనక మరచెంబుడు మంచినీళ్ళు తాగడవా? ఇదిటండీ నిర్వాకం? ఎంత న్యూసెన్సు? మీరు చెప్పండి, నే చెప్పిన ముక్కలో న్యాయవుందా? లేదా?..”

“ఏదో..మన మందుల షాపు రామారావు గారు పెద్దమనిషి గాబట్టి, మనకి ముందుగా హెచ్చరిక చేసారు కాబట్టి తెలిసిందిగానీ, లేకపోతే ?”

“రానీ, వస్తాడుగా ఇవాళ ఆ విషం మాత్తర్ల కోసం, ఆ పెట్టే చీవాట్లు నాలుగూ కాస్త గెట్టిగా పెట్టి మన ధర్మం మనం నిర్వర్తిద్దాం, ఆనక అతనిష్టం.”

“శుక్కురారం రాత్రి కొట్టు కట్టేసే వేళకొచ్చి – సైనైడు మాత్రలు కావాలని అడుగుతాడూ? అదీ నిబ్బరంగా? కాస్త లోకం చూసి, తలపండిన మనిషి గాబట్టి రామారావు గారు తేరుకుని – “ఇవ్వాళ లేవు, ఆదివారానికి తెప్పిస్తా ” నని పంపించేసారు. ఇదిగో ఆదివారం రానే వచ్చింది. అపరాహ్ణమౌతోంది. షాపు తెరిచేవేళవుతోంది. రండి అందరం షాపు దగ్గర కాపేద్దాం.”


షాపు దగ్గర కోలనీ వాళ్ళంతా పోగయ్యారు.

అతను స్నానం, పూజ పూర్తిచేసుకుని, సివిల్ డ్రెస్సిప్పేసి, పేంటూ షర్టూ తొడిగాడు. “అమ్మలూ, టైమెంతయ్యిందే?” అడిగాడు. సమాధానం రాలేదు. వెళ్ళి చూసాడు, ఫోనులో వుంది, “బావ ఫోను” అంది రహస్యంగా. “ఓసినీ ఫోను బంగారం కానూ, పెళ్ళికింక నెలన్నా లేదే. నా మాట విని వాణ్ణి విమానవెక్కి వచ్చెయ్యమను, ఫోనుకి తగలేసే కన్నా అదే నయం” అని నవ్వుకుంటూ వంటింట్లో కెళ్ళాడు.

ఓ చేత్తో సీవెండి చట్రంతో మూకుట్లో కాజా ముక్కలు వేయిస్తూ, మరో చేత్తో ఇనపట్లకాడతో ఇత్తడి గిన్నెలో బెల్లప్పాకం పదును చూస్తోంది ఇల్లాలు. “ఎందుకొచ్చిన శ్రమే. నీకు బెల్లంకాజాలు చెయ్యడానికి ఐదు గంటలు పడుతుంది, ఆ బడుద్ధాయి ఐదు నిమిషాల్లో ఊదేస్తాడు, హాయిగా పది రూపాయిలు పడేస్తే పటేల్ షాపు వాడిస్తాడుగా స్వీట్లు..” అన్నాడు నవ్వుతూ.

“పాపవండీ, వెర్రి నాగన్న, రాత్రల్లా పనిచేసొస్తాడా, ఇవ్వాళొక్కపూట కదా వాడికి కాస్తంత తీరిక. ఏదో వాడికిష్టవైంది చేసిపెడితే అదో తృప్తి. అయినా ఇవి మీకూ ఇష్టవేగా..”

“నువ్విలాగే వాడికి మప్పితే, రేపు ఆ వచ్చే పిల్ల నిన్నూ నన్నూ తిట్టుకుంటుంది, ఛస్తుందది చెయ్యలేక” అన్నాడు నవ్వుతూ.

“ఆలూ లేదు, చూలూ లేదనీ…, వున్న కొడుకు మీద లేదు గానీ, రాబోయే కోడలిమీదట ప్రేమ..చాలా బావుందండీ” అంది నవ్వాపుకుంటూ.

“అవును మరి, అమ్మలు వెళ్ళిపోతే, ఆ వచ్చే పిల్లే మనకి అమ్మలు..” అంటూ, “వాడి రూములో అలికిడౌతోంది, బడుద్ధాయి లేచినట్టున్నాడు, వాడికేవిటి కావాలో చూడు..” అంటూ బయటికొచ్చి చెప్పులేసుకుని షాపుకి బయల్దేరాడు.

షాపు దగ్గర కోలనీ పెద్దమనుషులంతా గుమిగూడి వున్నారు. ఎవరికీ నోరు తెరిచి అడిగే ధైర్యం లేదు. అంతా కిక్కురుమనకుండా అతనికేసే చూస్తున్నారు. అతనివేవీ పట్టించుకోవటం లేదు. ఏదో పాట పాడుకుంటూ వస్తున్నాడు “ఎంతకాలమొ కదా ఈ దేహ ధారణము చింతా పరంపరల చిక్కుబడ వలసే …”

అతను దగ్గరకొచ్చే కొద్దీ అందరిలోనూ ఒకటే అతృత, ఆదుర్దా. అతను రానే వచ్చేసాడు.

“రామారావుగారూ, నేను చెప్పిన మాత్రలు తెప్పించారా, యీ సైనస్ కొంచెం మరీ ఇబ్బంది పెడుతోందండీ, వెధవది, ఉండుండి వచ్చేస్తాయి తుమ్ములూ, ముక్కు దిబ్బడా, కొంచెం స్ట్రాంగు మాత్రలే ఇవ్వండి….”

“మీరు మొన్న అడిగినవి సై..న..స్.. కి మాత్రలా?” బిక్క చచ్చిపోతూ అడిగారు రామారావు గారు.

“కాకపోతే సైనైడు మాత్రలా?” నవ్వుతూ అడిగాడు అతను.

మారు మాట్లాడకుండా కొన్ని మాత్తర్లు తీసిచ్చారు రామారావు గారు, తీసుకుని డబ్బిచ్చి వెళ్ళిపోయాడతను.

ఇహ ఆ రోజుకి షాపు మూసేసి వెళ్ళిపోయారు చెవిటి రామారావు గారు, కారణాలడిగి నన్నిబ్బందిపెట్టడం తమలాంటి పెద్దమనుషులకి భావ్యం కాదు !!

శ్రీనివాస ఫణి కుమార్‌ డొక్కా

రచయిత శ్రీనివాస ఫణి కుమార్‌ డొక్కా గురించి: శ్రీనివాస ఫణికుమార్‌ డొక్కా జననం అమలాపురంలో. నివాసం అట్లాంటా జార్జియాలో. కంప్యూటర్‌ సైన్స్‌ ఫీల్డ్‌లో పనిచేస్తున్నారు. కథలు, కవితలు రాసారు. ...