నాకు నచ్చిన పద్యం: శృంగార నైషధంలో హంస వేడుకోలు

సీ. తల్లి మదేక పుత్రక, పెద్ద, కన్నులు
     కానదిప్పుడు; మూఁడుకాళ్ళ ముసలి
    ఇల్లాలు గడు సాధ్వి ఏమియు నెఱుఁగదు
     పరమ పాతివ్రత్య భవ్య చరిత;
    వెనుక ముందర లేరు నెనరైన చుట్టాలు
     లేవడి ఎంతేని జీవనంబు;
    గానక కన్న సంతానమ్ము శిశువులు,
     జీవనస్థితి కేన తావలంబు

తే. కృపఁ దలంపఁ గదయ్య యో నృప వరేణ్య
     యభయ మీవయ్య యో తుహినాంశు వంశ
     కావఁ గదయ్య యర్థార్థి కల్పశాఖి
     నిగ్రహింపకుమయ్య యోనిషధ రాజ

ఈ పద్యం శ్రీనాథ మహాకవి ఆంధ్రీకరించిన శృంగార నైషధం ప్రథమాశ్వాసం లోనిది. శ్రీనాథుడు ‘కవి సార్వభౌముడు’ గా ప్రసిద్ధుడు. తన కాలం నాటి సాహిత్య ప్రపంచానికి హిమాలయ పర్వత సదృశమైన సారస్వత మూర్తి. దేశదేశాలు తిరిగి, అనేక ఆస్థానాలలో సత్కారాలు పొందిన వాడు. విజయ నగరంలో విద్యాస్పర్థలో గౌడ డిండిమ భట్టును ఓడించి, అతని కంచు ఢక్కను పగుల గొట్టించాడు. అక్కడే, ప్రౌఢ దేవ రాయల ఆస్థానంలో రాజు చేత కనకాభిషేకం చేయించుకున్న వాడు. కొండవీటి రెడ్డిరాజుల రాజ్యంలో విద్యాధికారి పదవిని నిర్వహించాడు.అవచి తిప్పయ, మామిడి సింగయ మంత్రి లాంటి సమకాలీన రాజకీయ వేత్తలతో భుజం భుజం కలిపి తిరిగాడు. హర విలాసము, కాశీ ఖండము, భీమేశ్వర పురాణము, శివరాత్రి మహాత్మ్యము, మరుత్తరాట్చరిత్ర లాంటి కావ్యాలు వెలయించాడు. శ్రీహర్షుని సంస్కృత నైషధాన్ని ‘శృంగార నైషధం’ గా మహా ప్రౌఢంగా ఆంధ్రీకరించాడు. జానపదుల వీరగాధ అయిన పల్నాటి వీర చరిత్రను ద్విపదలో అందంగా సంతరించాడు. ఆయన కాలంలోనే ఏమి, ఈనాటికి కూడా శ్రీనాథుడు ఒక మేరు శిఖరమే!

శ్రీనాథుడు తను పర్యటించినప్పుడు గమనించిన అనేక విషయాల మీదా, దృశ్యాలూ వ్యక్తుల మీదా ఆశువుగా చెప్పిన చాలా పద్యాలు చాటువులుగా ప్రచారం పొందాయి. ఈ చాటువులకు సాహిత్య ప్రపంచంలో తక్కువ విలువేమీ లేదు. ఆ కాలపు జానపద సామాజిక జీవనం ఈ చాటువుల్లో ప్రతిఫలిస్తుంది. రకరకాల సామాజిక వర్గాల వ్యక్తులను గురించి ఈ చాటువుల్లో చేసిన వర్ణనలు – వారి నవ్వులూ, దుస్తులు ధరించే తీరూ, రాట్నం వడికే వైనమూ, ఇండ్లలోని పరిస్థితులూ – ఆయా ప్రాంతాల సాంఘిక చారిత్రక పరిశోధనకు పుష్కలమైన ముడిసరుకుని అందిస్తాయి.

ఎంతో వైభవంగా బ్రతికిన శ్రీనాథుడి చివరి దినాలు మాత్రం చాలా బాధాకరంగా గడిచాయి. సానుభూతి లేని పాలకుల చేతుల్లో బాధలు పడ్డాడు. సొంత వ్యవసాయం లో పక్షుల వల్లా, వరదల వల్లా పంటలు పాడై పోయాయి. పన్నులు కట్టలేక శిక్షలు అనుభవించాడు. చివరికి ఆ దిగులుతోనే మరణించాడు. అయినా, ఆ మహాకవి ఆత్మ విశ్వాసం చూడండి. చనిపొయే టప్పుడు ‘దివిజ కవివరు గుండియల్ దిగ్గురనగ అరుగుచున్నాడు శ్రీనాథు డమర పురికి’ అంటూ స్వర్గారోహణం గావించాడు.

శృంగార నైషధం నల దమయంతుల కథ. వారిద్దరి మధ్యా సఖ్యతను పెంపొందింప జేసి ప్రేమను కలిగించింది ఒక హంస. ఈ హంస మొదట నలుని ఉద్యానవనం లోని కొలనులో విహరిస్తూ నలునికి పట్టుబడుతుంది. తనను రక్షించి వదిలి పెట్టమని వేడుకుంటున్న సందర్భం లోనిది పై పద్యం. సంస్కృతంలో హంస అంత వివరంగా బ్రతిమిలాడుకున్నట్లు లేదు. కేవలం తనను వదిలి పెట్టమని ఆ హంస ప్రార్థిస్తుంది. తెలుగులో హంస ప్రాధేయపడే విధాన్ని శ్రీనాథుడు ఎంత ముచ్చటగా రూపు కట్టించాడో చూడండి. మూలంలో లేనిదానిని తన స్వోపజ్ఞతో కరుణ భరితంగా చిత్రించాడు.

తల్లికి ఒక్కడనే కొడుకుననీ, ఆమె చూపు కూడా లేని ముసలి తల్లి అనీ, ఇల్లాలు అమాయకురాలనీ, చుట్టాలెవరూ లేరనీ, పిల్లలు పసివారనీ, కుటుంబానికి తానే ఆధారమనీ, ఆ హంస చేత శ్రీనాధుడెంత స్వభావ సిద్ధంగా దయనీయంగా చెప్పించాడో చూడండి. అలతి పదాలూ, చక్కని వాడుక పలుకుబడులూ, తెలుగు జాతీయాలూ, వీటన్నిటితో పద్యం ఎంతో కాంతివంతంగా ఉంది. పైగా సీస పద్యం శ్రీనాథుడి ప్రత్యేకత గదా!

శ్రీనాథుడు హర్షనైషధం తెలిగించడంలో మూలం లోని సంస్కృత సమాసాలు అలానే దించేశాడనీ, కేవలం ‘డు-ము-వు-లు’ మాత్రమే చేర్చాడని కొందరంటారు. ఈ సందర్భంగా ఒక పిట్టకథ కూడా ప్రచారంలో ఉంది. పిల్లలమర్రి పిన వీరభద్రుడూ, శ్రీనాథుడు సమకాలికులు. అంటే, శ్రీనాథుని పెద్దతనం నాటికి పిన వీరభద్రుడు పసివాడు. అయినా, బాల విద్వాంసుడిగా పేరు గన్న పిన వీరభద్రుడు అద్భుతమైన పాండిత్యమూ, కవనశక్తీ తొమ్మిది పదేండ్ల వయసులోనే సాధించాడట. ఆ కాలపు చాలామంది కవులు తమ కావ్యాలు ఆ పిల్లవానికి వినిపించి ఆమోద ముద్ర వేయించుకొనే వారట. పిన వీరభద్రుడు నెల్లూరు జిల్లా లోని బిట్రగుంట దగ్గర సోమరాజు పల్లి నివాసి. శ్రీనాథుడు కూడా తాను తెనిగించిన నైషధం తీసుకొని, ఆ వూరు వెళ్ళి, వీధిలో పిల్లలతో ఆడుకుంటున్న ఓ అబ్బాయిని అడిగాడు పిన వీరభద్రుని ఇల్లెక్కడా అని. ఆ అబ్బాయి ‘ఎందుకూ’ అని అడిగాడు. ‘నైషధాన్ని తెలుగు చేశాను, అది అతనికి చూపించి పోదామని వచ్చాన’ని చెప్పాడు శ్రీనాథుడు. సరే గానీ, ‘గమి కర్మీకృత నైకనీవృత మయా’ అనే శ్లోకంలో ఆ పదాలకు నీ ఆంధ్రీకరణమేదో చెప్పు? అని అడిగాడా పిల్లవాడు. ‘గమి కర్మీకృత నైకనీ వృతుడనై’ అని జవాబిచ్చాడు శ్రీనాథుడు. ‘ఇందులో నీవు తెలుగించినదేమున్నది? ఆ సంస్కృతాన్ని పక్కన పెట్టేసి నీ డు-ము-వు-లు నువ్వు తీసుకొని పో!’ అన్నాడట, ఆ పిల్లవాడు పిన వీర భద్రుడు. ఇది కేవలం పిట్ట కథ. కల్పితం అని తెలుస్తూనే ఉన్నది. ఆంధ్ర సారస్వతంలో శ్రీనాధుని సాహిత్య దేహ పుష్టి ఎంతటిదో పిన వీరభద్రుని శరీర పుష్టి ఎంతటిదో అందరూ ఎరిగినదే. నిజానికి, వారి సమకాలీనత కూడా అనుమానమే.

ఇంతకూ, శ్రీనాథుని కవిత్వం కేవలం డు-ము-వు-లు చేర్చడం కాదని చెప్పేందుక్కూడా పై పద్యం ఓ సాక్ష్యం. పెద్ద పెద్ద సంస్కృత సమాసాలను పక్కన బెట్టి వాడుక భాష లోని తెలుగు పదాలనే వాడాడు శ్రీనాథుడీ పద్యంలో. కన్నుల్ కానదు, మూడు కాళ్ళ ముసలి, వెనుక ముందర లేరు, కానక కన్న సంతానము – ఇలాంటి, జీవద్భాషలోంచి ఉబికి వచ్చిన పలుకుబళ్ళూ, ముఖ్యంగా ఒక గొప్పవాడిని వేడుకునేటప్పుడు సామాన్యుడు తన బాధలను ఎంత దయనీయంగా ఏకరువు పెడతాడో ఆ వైనమూ, ఒక చిన్న గీత పద్యంలో చెప్పగలిగిన భావాన్ని వివరంగా సీస పద్యం లోకి విస్తరించి చెప్పి, చక్కటి శ్రవణ పేయతనే గాక, ఆర్ద్రానుభూతిని సాధించిన నేర్పూ, దీనిని ఒక మంచి పద్యం గా తయారు చేశాయి.

నా చిన్నతనంలో, ఎస్సెల్సీ లోనూ, ఫిఫ్త్ ఫారం లోనూ, తెలుగు పాఠ్య భాగంగా ఈ ఘట్టం ఉండేది. ఆ సంవత్సరం స్కూలు తనిఖీకీ వచ్చిన డీ.ఈ.ఓ.గారు మా తెలుగు మాస్టారిని పరీక్షించడానికి సాయంకాలం ఆఖరి పీరియడ్‌లో మా క్లాసుకు వొచ్చి ఈ పాఠం చెప్పమని అడిగారు ( డీ.ఈ.ఓ.గారికి తెలుగు సాహిత్యమంటే ఇష్టమట. ఆఖరి పీరియడ్ అయితే స్కూలు టైమై పోయింతర్వాత కూడా కవిత్వ చర్చ చేసుకుంటూ కూర్చో వచ్చు). స్వయంగా కవీ, పండితుడూ, మంచి కంఠస్వరమూ ఉన్న మా మాస్టారు, ఆ రోజు డీ.ఈ.ఓ.గారి మెప్పు కోసం మరింత గొప్పగా పాఠం చెప్పారు. ఆ రోజు ఆయన ఈ పద్యాన్ని వివరించిన తీరు ఎంతలా కళ్ళ ముందు నిలిచి పోయిందంటే, త్వరలోనే శృంగార నైషధం సంపాదించి పూర్తిగా చదివిందాకా నాకు నిద్ర పట్టలేదు.

శృంగార నైషధం లోని వందలాది మంచి పద్యాల్లో మరీ మంచి పద్యమైన ఇది, నాకు బాగా నచ్చిన పద్యాల్లో ఒకటి.