శ్రావణమాఘాలు

నేను మాఘమాసాన్ని
నీవు శ్రావణమాసానివి

వర్షించే మేఘాలతో
హర్షాన్ని కలిగించే
శ్రావణమాసానివి
నీ రాకతో నెమళ్లు పురి విప్పుతాయి
రకరకాల రాగాలతో
శుకపికాలు గానము చేస్తాయి
నదులు పొంగుతాయి
మదులు నిండుతాయి
నీ మెరుపులతో
నీ మురిపెముతో
జగత్తే జిగేలు మంటుంది

నీవు శ్రావణమాసానివి
నేను మాఘమాసాన్ని

మెరుపులేని మేఘాలతో
ఉరమలేని మాఘమాసాన్ని
మంచు కురిసే వేళలో
కుంచించుకుపోయిన శారీరములో
రవాలు రావు
జవాలు లేవు
ఈ మానసవీణ
ఆలపించేదల్లా
మూగ రాగాలే
ప్రతిధ్వనించేదల్లా
మౌన తరంగాలే

చైత్రం వచ్చే ముందు
కలహంసలా
హంసధ్వని
నాలాపించాలని ఉంది
ఆ చైత్రరథం
ఆ జైత్రరథం
ఎప్పుడు వస్తుందో