ఈమాట సెప్టెంబర్ 2007 సంచిక విడుదల

సరికొత్త కథలు, కవితలు, వ్యాసాలతో ఈమాట సెప్టెంబర్ సంచిక విడుదల! ఈ సంచిక “కన్యాశుల్కం” ప్రత్యేక సంచిక. ఈ సంచికలో ప్రత్యేక ఆకర్షణలు –


A Play from Colonial India,
Gurajada Apparao
Translated from Telugu
By Velcheru Narayana Rao

 • గురజాడ కన్యాశుల్కానికి వెల్చేరు నారాయణ రావు గారు చేసిన ఇంగ్లీషు అనువాదం “Girls for Sale, kanyasulkam” ఇటీవలే విడుదలయింది. గడచిన వందేళ్లలో కన్యాశుల్కాన్ని సాహితీవేత్తలందరూ కాచి వడబోసేసామని అనుకుంటున్నపుడు మరొక అనువాదమా? ఇంకొక విశ్లేషణా? ఏముందీ ఈ అనువాదంలో? ఏమిటీ విశ్లేషణలో కొత్తదనం? జవాబులు కే.వీ.ఎస్ రామారావుగారి సమీక్షా వ్యాసం “కన్యాశుల్కానికి వెల్చేరు అనువాదం, వ్యాఖ్యానం” లో.
 • “Girls for Sale, kanyasulkam” లో వెల్చేరు గారు రాసిన వెనుక మాట “The Play in Context” కన్యాశుల్కాన్ని సంప్రదాయ విశ్లేషణలకు భిన్నంగా ఉండే, విప్లవాత్మకమైన కొత్త కోణంలో ఆవిష్కరిస్తుంది. ఈ కోణంలోంచి చూస్తే కన్యాశుల్కంలో ఇదివరకెన్నడూ కనబడని అర్థాలు, అంతరార్థాలు, సొగసులు కనబడుతాయి. ఈ విశ్లేషణల దృష్ట్యా కన్యాశుల్కాన్ని మళ్లీ ఎందుకు చదవాలో చెప్పే వేలూరి వెంకటేశ్వర రావు వ్యాసం: “కన్యాశుల్కం మళ్ళీ ఎందుకు చదవాలంటే …
 • ఇప్పటివరకూ తెలుగు సాహిత్య విమర్శకులందరూ కన్యాశుల్కం గురించి ఎంతో కొంత రాసారు, ఉపన్యాసాలు చేసారు, చర్చించారు, విమర్శించారు. ఈ విమర్శల అవగాహనా సారాంశం ఆయా విమర్శకుల మాటల్లోనే ఉదహరిస్తూ, వేలూరి వెంకటేశ్వర రావు పై వ్యాసానికి అనుబంధంగా రాసిన మరొక వ్యాసం: “కన్యాశుల్కం వ్యాసానికి అనుబంధం

[కన్యాశుల్కానికి వెల్చేరు నారాయణ రావు గారి ఇంగ్లీషు అనువాదం “Girls for Sale: Kanyasulkam, a Play from Colonial India ” amazon.com లోనూ, ఇంకా, అనేక ఆన్లైన్ స్టోర్లలలోనూ దొరుకుతోంది. ఇది అందరూ కొని చదువుకుని, చదివించవలసిన పుస్తకం. మీరు చదవడమే కాక, మీ స్థానిక గ్రంథాలయాలకి కూడా కొనమని సూచించండి.]

తెలుగు ప్రాచీనతకు సంబంధించి గత రెండుసంవత్సరాలుగా తెలుగు పత్రికల్లోనూ, సాహితీ సదస్సుల్లోనూ అనేక అపరిపక్వమైన వాదాలు వినిపిస్తున్నాయి. ఈ వాదాల్లోని అశాస్త్రీయతని చర్చించే కొలిచాల సురేశ్ గారి సంపాదకీయం :”ప్రాచీనత గురించే మరోసారి

మరికొన్ని విశేషాలు —

 • కవిగా, కథారచయితగా, సమీక్షకుడిగా చంద్రశేఖర్(చంద్ర) కన్నెగంటి ఈమాట పాఠకులకి సుపరిచితులు. ఇటీవలే విడుదలైన ఆయన కవితా సంకలనం “వానవెలిసిన సాయంత్రం” గురించి మరొక కవి, విమర్శకుడు, విన్నకోట రవిశంకర్ సమీక్ష “కవితల ఇంద్రధనుస్సు“. అదే సంకలనం పై కొత్త రచయిత యన్. వి. రాయ్ సమీక్ష “చంద్ర కవితలపై ఒక మతింపు“.
 • ఆర్థిక స్వాతంత్ర్యం స్త్రీలకెంత వరకూ ప్రయోజనకరం? స్త్రీకి జీవితంలో సర్దుబాటు తప్పదా? సర్దుబాటు స్త్రీ, పురుషుల్లో ఇద్దరికీ ఉండాలా? లేక ఒక్కరికే ఉండాలా? వంటి అనేక విషయాలు ఇటివలే విడుదలైన డి.కామేశ్వరి గారి నవల “మనసున మనసై” లో చర్చించబడ్డాయి. ఆ నవలపై దార్ల వెంకటేశ్వర రావు గారి పరిశోధనాత్మక వ్యాసం : “‘మనసున మనసై’ నవల: మధ్యతరగతి ఉద్యోగిని మానసిక సంఘర్షణ”.
 • కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు కర్నాటక, హిందుస్తానీ సంగీతాలని, సంగీతకారులని పరిచయం చేస్తూ ఈమాటలో అనేక వ్యాసాలు రాసారు.ఈ సంచికలో ఆయన వ్యాసం “కీబోర్డు మీద రాగాలు” లో సూచించిన అభ్యాసాలు ప్రాథమిక స్థాయిలో కీబోర్డు మీద రాగాలు పలికించాలనుకునే ఔత్సాహికులకి కరదీపికల్లాంటివి. ఆ అభ్యాసాలని పదే పదే వాయిస్తే మీకు రాగ లక్షణం పట్టుబడడమే కాదు, మీకు తెలిసిన పాట లోని వరస మోగకపోదు.
 • విష్ణుభొట్ల లక్ష్మన్న ఈమాట వ్యవస్థాపకులలో ఒకరు. ఆయన 2002 నించీ కుటుంబంతో కలిసి మూడేళ్లపాటు ఫ్రాన్సులో ప్రవాసజీవితం గడిపినప్పటి అనుభవాలపై సచిత్ర వ్యాసం: “మా ఫ్రాన్సు అనుభవాలు
 • ప్రపంచంలోని సినీదర్శకులలో అగ్రశ్రేణికి చెందిన సత్యజిత్ రాయ్ పేరు వినని భారతీయులు బహుశా ఉండరు. దర్శకత్వమే కాక సినిమాకు సంబంధించిన అనేక శాఖలలో ప్రావీణ్యం ప్రదర్శించిన సత్యజిత్ రాయ్ సాహిత్యంలో కూడా మేటి అనిపించుకున్నాడు. ఆయన రచనలని పరిచయం చేస్తూ కొడవటిగంటి రోహిణీప్రసాద్ ఉపోద్ఘాతంతో కూడిన సౌమ్య బాలకృష్ణ వ్యాసం “రచయితగా సత్యజిత్ రాయ్ – నా అభిప్రాయాలు
 • కంటికి కనిపించే ప్రపంచమంతా నిజం కాదు; నిజమైన ప్రపంచం అంతా కంటికి కనిపించదు. సుమారు వంద ట్రిలియన్లకి పైగా జీవకణాలున్నమన శరీరంలో పదవ వంతు మాత్రమే మానవ కణాలనీ, మిగతా 90% బాక్టీరియా కణాలని మీకు తెలుసా? బాక్టీరియాతో మన సహజీవనం ఎప్పుడు మొదలయింది? వివరాలు వేమూరి వెంకటేశ్వర రావు గారి వ్యాసం “తిష్టతత్వం జ్వలించింది” లో.
 • క్రిందటి సంచికలో ప్రారంభించిన వ్యాసపరంపర “నాకునచ్చిన పద్యం”లో మరొక వ్యాసం: చీమలమర్రి బృందావన రావు గారి ” మను చరిత్రలో సాయంకాల వర్ణన
 • ఛందస్సు గురించి తెలియనివారికైనా ఒక్క చంపకమాల లేదా ఉత్పలమాల పద్యం కంఠతా వచ్చి ఉంటుంది. అంత ఖ్యాతమైనవి చంపకమాల, ఉత్పలమాల వృత్తాలు. ఈ వృత్త ఛందస్సుల ఉత్పత్తినీ, వికాసాన్నీ సోదాహరణంగా చర్చించే జెజ్జాల కృష్ణ మోహనరావు గారి వ్యాసం: “చంపకోత్పలమాలల కథ“.

ఇంకా, సాయి బ్రహ్మానందం గొర్తి, ఎస్ నారాయణ స్వామి, లైలా యెర్నేని ల కథలు: (వరుసగా): “ఒంటరి విహంగం“, “సాయము శాయరా డింభకా!“, “లింఫోమా – ఒక ‘నిసి షామల్’ కధ

మూలా సుబ్రహ్మణ్యం, విన్నకోట రవిశంకర్ ల కవితలు: “అరణ్య కవితలు“, “వాన-పాట

ఈ సంచిక నిర్మాణంలో సహాయపడ్డ సమీక్షకులు, రచయితలందరికి మా కృతజ్ఞతలు. ఎప్పటిలాగే మీ నిర్మాణాత్మకమైన అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తూ
–సంపాదకులు