రచయితగా సత్యజిత్ రాయ్ – నా అభిప్రాయాలు

[ సత్యజిత్ రాయ్ గురించి ఓ చిన్న ఉపోద్ఘాతం, ఆయన రచనల సూచిక ఇక్కడ చూడవచ్చు – సంపాదకులు]

సత్యజిత్ రాయ్ ని బెంగాలీలు కాని భారతీయుల్లో ఎంత మంది రచయిత గా ఎరుగుదురో తెలీదు కానీ, గోపా మజుందార్ ఆంగ్ల అనువాదాల పుణ్యమా అని నాకు ఆయన రచనలు చాలా వరకు చదివే భాగ్యం లభించింది. “రాయ్ ” తో నా తొలి పరిచయం నాకు ఓ పది పన్నెండేళ్ళ వయసున్నప్పుడు కలిగింది. అప్పట్లో ఎలా వచ్చిందో తెలీదు కానీ, ఆయన రాసిన – “ఫతిక్ చంద్” అన్న పుస్తకం తెలుగు అనువాదం మా ఇంట్లో ఉండింది. సత్యజిత్ రాయ్ చనిపోయిన కొత్తల్లో కావడంతో నాకు అప్పుడే “సత్యజిత్ రాయ్ ” అని ఒకాయనున్నాడు. సినిమాలు తీస్తాడు అన్న విషయం తెలిసింది. కుతూహలంతో చదివాను ఆ పుస్తకం. అది పిల్లల కోసమే రాసిన పుస్తకం. దాదాపు పన్నెండేళ్ళు అవుతోంది అది మొదటి సారి చదివి. మద్యలో ఎన్ని సార్లు చదివానో గుర్తు లేదు. ఇప్పుడు కూడా అది కనిపిస్తే మళ్ళీ చదవడం ఖాయం. అంతలా ఆకర్షించింది ఆ శైలి నన్ను. తరువాత కొంతకాలం పాటు రాయ్ రచనలు చదవకపోయినా, ఇటీవలికాలం లో అందుబాటులో ఉండటం తో రాయ్ రాసిన కథలు, టీనేజీ పిల్లల కోసం రాసిన ఫెలూదా నవలలు చదవడం జరిగింది. అవి చదివాక మన తెలుగు వారికి సత్యజిత్ రాయ్ రచనల గురించి పరిచయం చేయాలి అనిపించింది.

ముందుగా – “సత్యజిత్ రాయ్ ఏమిటి? రచయిత ఏమిటి?” అని ప్రశ్నించుకుంటున్న వారికోసం కాస్త చరిత్ర. సత్యజిత్ రాయ్ తాత ఉపేంద్రకిశోర్ రాయ్ 1913 లో పిల్లల కోసం బెంగాలీ లో – “సందేశ్” అన్న పత్రిక మొదలుపెట్టాడు. 1915 ఆయన మరణానంతరం ఆయన కుమారుడు సుకుమార్ రాయ్ దాని బాధ్యతలు స్వీకరించి, సందేశ్ ని సాహిత్య విలువలు నిలుపుకుంటూ, ప్రపంచ జ్ఞానం అందిస్తూ, హాస్యం పాలు సమానంగా అందించే ప్రత్యేకత గల పత్రికగా నిలబెట్టారు. 1923 తరువాత సుకుమార్ రాయ్ మరణం తో సందేశ్ కి కొన్నాళ్ళు కష్టకాలం. 1934 కల్లా పూర్తిగా ఆగిపోయింది. మళ్ళీ 1961 లో సుకుమార్ రాయ్ కుమారుడైన సత్యజిత్ రాయ్ ఈ పత్రిక కు జీవం పోసి మళ్ళీ మునుపటి పేరు తెచ్చాడు. రాయ్ మరణం తరువాత కూడా పత్రిక కొనసాగుతూనే ఉంది. ఇటీవలి కాలం లో ఈ పత్రిక మళ్ళీ 1923-34 నాటి పరిస్థితులు ఎదుర్కుంటూ ఉందని వికీపీడియా వ్యాసం చెబుతోంది. రాయ్ రచనల్లో చాలా వరకు మొదట “సందేశ్” లో వచ్చినవే.

అసలు విషయానికొస్తే రాయ్ శైలి కి సుమారు గా అభిమానులు ఉండటనికి కారణం ఆ భాష అంత సాధారణంగా ఉండటమే కావొచ్చు. పెద్ద పెద్ద పదాలూ, అర్థం కాని భావాలూ …ఇవేవీ లేకుండా ఏమీ తోచనప్పుడు ఆ పుస్తకం తీసి అలవోకగా కథలు చదూకోవచ్చు. సమయం తెలీదు. సుమారు హాస్యం కూడా ఉంది. ఉదాహరణ కి Pterodactyl’s egg అన్న కథలో మొదలు నుండి చివర దాకా ఒక విధమైన విచిత్ర రసం (అధ్భుత రసం అనాలేమో) లో సాగుతుంది. కానీ, చివరికొచ్చే సరికి నవ్వొస్తుంది. “ఓస్! ఇదా ఆఖరికి జరిగింది?” అనిపిస్తుంది. Barin bhowmik’s ailment అన్న కథ లో బరీన్ రైలు లో తన తో పాటు కూర్చుని ఉన్న ప్రయాణికుడిని ఎక్కడో చూసాను అనుకుంటాడు. ఇంతకు ముందు ఓ సారి తాను యువకుడిగా ఉన్నప్పుడు ఇలాంటిదే ఓ రైలు లో అతనితో ప్రయాణం చేసినట్లూ, అప్పుడతని వస్తువొకదాన్ని దొంగిలించినట్లూ గుర్తు వస్తుంది. బరీన్ బాబు కి “క్లెప్టోమానియా” ఉండేది అన్నమాట అప్పట్లో. అక్కడినుండి బరీన్ బాబు తనని ఆ మనిషి గుర్తిస్తాడేమో అని, అతనికి తెలీకుండా అతని వస్తువు అతని సంచి లో పెట్టేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. ముగింపు సమయానికి మనకు అసలు విషయం తెలుస్తుంది. నవ్వూ వస్తుంది. ఇలాంటి తరహా కామెడీ లు మరీ ఎక్కువగా లేకున్నా కూడా ఓ మోస్తరుగా ఉంటాయి రాయ్ కథల్లో. Sadhan Babu’s suspicions ఓ అనుమానప్ప్రాణి కథ. Load shedding అన్న కథ కూడా మంచి నవ్వుకోగల కథ. కొన్ని చిన్న చిన్న వాక్యాలు, నిజానికైతే వాటిలో విశేషమేదీ ఉండదు కానీ, ఎందుకో కానీ, ఈ కథల మధ్యలో అవి వచ్చి నవ్వు పుట్టిస్తాయి. The millionaire కథ డికెన్స్ క్రిస్మస్ కెరోల్ ని అధారం చేసుకుని రాసినట్లు అనిపించింది.

ఇవి పక్కన పెడితే, సాధారణంగా రాయ్ కథల్లో ఎందులో చూసినా ప్రస్ఫుటంగా కనిపించేది Wierdness factor. ఈ కథల్లో ఒక విధమైన భయానక రసం కూడా ఉంటుంది. అది విపరీతంగా, అసహజంగా అనిపించే పరిస్థితులవల్ల కలిగే భయం. ఉదాహరణ కి Frtiz అన్న కథలో వస్తువు ఏమిటంటే ఒకానొక బొమ్మ దయ్యంగా మారినట్లు కథలో హీరో కి భ్రాంతి కలుగుతూ ఉంటుంది. బొమ్మలు దయ్యాలవ్వడం వంటివన్నీ ఎలా సంభవం అని చదువరులకి ఓ పక్క అనిపిస్తూనే ఉంటుంది. కానీ, చదవక మానరు. అంతతెలిసీ, ఈ కథ చివరి వాక్యం చదివి భయపడ్డవారు కూడా ఉన్నారు. ఇలాంటి తరహా కథలే చాలా వరకు సత్యజిత్ రాయ్ రాసినవి. Chameleon కథ నిరంజన్ అనే మారువేషాల పిచ్చి ఉన్న మనిషి కథ. కథ సాధారణంగా నే సాగినా, అక్కడక్కడా చిన్న చిన్న కుదుపులు ఇస్తుంది చదువరులకి. కథ చివరికొచ్చే సరికి ఒక పరిస్థితిలో నిరంజన్ బాబు వేసుకున్న మారువేషం తనకు తానే తొలగించుకోలేకపోతాడు. అక్కడి వర్ణన ఓ సారి చదివితే, కళ్ళ ముందు ఆ దృశ్యం కదలాడుతూ ఉంటే – ఎక్కడిలేని భయమూ ముంచుకొస్తుంది ఎవరికన్నా. Mr Brown’s cottage లో ఎప్పుడో చనిపోయిన ముసలాయన అప్పుడెప్పుడో తాను పెంచుకున్న పిల్లి సైమన్ పేరు జపిస్తూ అర్థరాత్రి ఒకప్పటి తన ఇంటిలో ఆనంద తాండవం చేస్తూ కనిపించినా, khagam లో మనిషి పాముగా మారినా, Anath Babu’s terror లో చనిపోయిన మనిషి కనిపించినా, Ashomonja’s Dog కథలో కుక్క నవ్వినా, Hungry septopus లో ఒకానొక భయానకమైన ప్రవర్తన కలిగి ఉన్న చెట్టు గురించి చెప్పి గగుర్పాటు కలిగించినా, Mr Eccentric లో విచిత్రమైన ఓ మనిషి గురించి చెప్పినా, Bhuto కథలో ఒక వెంట్రిలాక్విస్టు బొమ్మ లోకి మరో వెంట్రిలాక్విష్టు పరకాయప్రవేశం చేసినా – ఇలా ఎన్ని రకాల విచిత్ర ప్రవర్తనలు, నమ్మశక్యం కాని, భయం కలిగించే సంఘటనలను సృష్టించినా అది రాయ్ కే చెల్లింది. సత్యజిత్ రాయ్ కి ఉన్న సైన్స్ విజ్ఞానం తన కథల్లో బాగా వాడుకున్నట్లు తోస్తుంది – Big Bill, Hungry septopus -వంటి కథలు చదివితే. ఆ మధ్య ఓ ఆర్కుట్ లో సత్యజిత్ రాయ్ సమూహంలో ఎవరో అన్నట్లు – “రాయ్ కథలు చదువుతూ ఉంటే కూడా ఆయన స్క్ర్రీన్ ప్లే చూస్తున్న భావన కలుగుతుంది.” అన్న మాటలు నాక్కూడా నిజమనిపించాయి.

ఈ కథలు చదవగా రాయ్ కథల్లో ఉండే కొన్ని ప్రత్యేక గుణాలు కొన్ని అవగతమౌతాయి. ఉదాహరణ కి – ఆయన ఎన్నుకునే కథానాయక పాత్రలు. ఈ కథల్లో చాలా మటుకు విచిత్రమైన మనస్తత్వం ఉన్న వ్యక్తులో లేక విపరీత మనస్తత్వం ఉన్న వారో చాలా తరుచుగా కనబడుతూ ఉంటారు. Barin bhowmik’s ailment, Petrodactyl’s egg, Sadhan Babu’s suspicions, Chameleon, Mr Eccentric, Stranger – వగైరా కథలని దీనికి ఉదాహరణ గా చెప్పొచ్చు. మరో తరహా కథలు గగుర్పాటు కలిగించడం, ఉలిక్కపడేలా చేయడం – వంటి ఫలితాలు పాఠకులకు కలిగించే తరహా కథాంశాలతో నిండినవి. Fritz, Bhuto, Vicious Vampire, Anath Babu’s terror, Indigo – వంటి చాలా కథలు ఈ కోవ లోకి వస్తాయి. రాయ్ కథల్లో చాలా భాగం ఈ తరహా కథలే. ఇలాంటి రెండు తరహాలూ కాక మూడో తరహా కథలు ఉన్నాయి. ఇలాంటివి బహుశా రాయ్ ఎక్కువ రాయలేదు అనుకుంటా. Fotik chand, Pinkoo’s Dairy, Patolbabu, film star వంటివి ఈ కోవ లోకి వస్తాయి. అయితే, ఈ మూడు తరహా కథల్లోనూ వీటితో పాటుగా తోడుగా ఉన్నది సాధారణమైన హాస్యం. అక్కడక్కడా ఓ డైలాగు… లేదా ఓ సన్నివేశం … ఎంత భయంకలిగించే కథలైనా కూడా అక్కడక్కడా నవ్వుకునేలా చేసాయి. కథకుడిగా రాయ్ గురించి రెండు మూడు వాక్యాల్లో చెప్పాలంటే – రాయ్ కథనం స్క్రీన్‌ప్లే లాగా ఉంటుంది, ఆ ఆర్కుట్ పాఠకుడు చెప్పినట్లు. రాయ్ కథల్లో హాస్యం, భయం, ఒక విధమైన “ఇదేమిటి? ఇలా ఉంది?” అనిపించే అంత విచిత్ర పరిస్థితులు అన్నీ కలగలిసి పోయి ఉంటాయి. ఈ కథలో లేని “క్లాసికల్” గొప్పతనమే వీటిని సామాన్యులకి చేరువ చేసి ఏ సమయం లోనైనా ఓ కథ పేజీ తెరిస్తే, అది మునుపెన్నిసార్లు చదివున్నా కూడా బోరు కొట్టకుండా చదివింపజేస్తుంది. బహుశా సత్యజిత్ రాయ్ ని ఈ తరం బెంగాలీ యువత, వారి తల్లి తండ్రుల తరం – ఇద్దరూ అభిమానిస్తూ నే ఉండటానికి ఇదే కారణం. రచయిత గా సత్యజిత్ రాయ్ అన్న విషయం పై ఆర్కుట్ లో నాలా ఇరవైలలో ఉన్న వారు వేలకొద్దీ ఉన్న బెంగాలీలు చర్చించడం చూసాక తెలుగు వారిలో ఈ వయసు వారిలో తెలుగు పుస్తకాల గురించి ఎంతమంది ఇలాంటి చర్చల్లో పాల్గొంటున్నారు? అని సందేహం కూడా వచ్చింది.

కథారచయిత గా సత్యజిత్ రాయ్ చాలా వరకు కాస్త పెద్ద వయసు పాఠకులకే పరిమితం. అంటే పిల్లలు చదవరని కాదు. అవి ప్రత్యేకం పిల్లలకోసం రాసినవి కావు అని అర్థం. కానీ, సందేశ్ లో దాదాపు ముప్పైఏళ్ళ పాటు తరచుగా కనబడ్డ యువ డిటెకివ్ పాత్ర ఫెలూదా అని రాయ్ సృష్టించింది మాత్రం పిల్లల కోసమే. ఒక తరం టీనేజర్ల లో ఫెలూదా కి వీరాభిమానులైన బెంగాలీలు ఎందరో. అలాంటి అభిమానుల్లోనే ఒకరైన గోపా మజుందార్ సత్యజిత్ రాయ్ రాసిన ఫెలూదా నవల్లనూ ఆంగ్లంలోకి అనువాదం చేసి నా లాంటి వారికి పరిచయం చేసారు. షెర్లాక్ హోమ్స్ ప్రభావం తో ఈ కథలు రాసానని రాయ్ తాను స్వయంగా చెప్పుకున్నారు. ఈ ఫెలూదా కథలు సామాన్యుల భాష లో రాసినవి. ఎన్నిసార్లు చదివినా బోరు కొట్టనివి. ఫెలూదా కథలన్నీ కలిపి రెండు పెద్ద సైజు సంకలనాలుగా విడుదలయ్యాయి. విడివిడిగా కూడా ఒక్కో నవలా దొరుకుతున్నాయి. నవల అనకూడదేమో బహుశా. నవలికలనో… లేదా పెద్ద కథలనో అనాలేమో. యాభై నుండి వంద పేజీల లోపు ఉన్నవే అన్నీనూ. ఈ కథల్లో ఉన్న సార్వజనీనత కు నిదర్శనం పిల్లల కోసం రాసిన ఈ కథల గురించి రాయ్ కి ఎందరో పెద్ద అభిమానుల నుండి ఉత్తరాలు రావడమే. ఆర్కుట్ లో ఫెలూదా పేరిట ఉన్న గుంపులూ, వాటి లో జరిగే చర్చల ఫ్రీక్వెన్సీ చూస్తే ఆశ్చర్యమేసింది. నేను మొదట ఫెలూదా అంటే – ఏముందీ, అవి కొన్ని కథలు. అంతే..అనుకున్నా. కానీ, జనం పై వాటి ప్రభావం గురించి నిజంగా తెలిసింది ఆ ఆర్కుట్ కమ్యూనిటీల వల్లే.

నిజానికి ఓ సారి వెనక్కి తిరిగి చూస్తే, ఈ ఫెలూదా కథల్లో పెద్ద గొప్పతనమేమీ లేదనిపిస్తుంది. ప్రత్యేకత అంటూ ఉంది అంటే అది ఎక్కడా కాస్తంత అసభ్యత అన్నదానికి కూడా తావివ్వక, ఎక్కడా హింసని గురించిన భయంకర వర్ణనలు లేక, ఏ విధంగా చూసినా “క్లీన్” గా రాయగలగడమే అని చెప్పొచ్చు. తాను రాస్తున్నది పిల్లల కోసమనీ, కానీ, వీటిని పెద్దలు చదువుతున్నారనీ ఆయనే అన్నారు. అలా చదివిన చాలామంది – “మీ కథలు ’స్పైసీ’ గా ఉండవనీ, అలా తయారుచేయమని” కూడా ఉత్తరాలు రాసేవారట. కానీ, తన మొదటి పాఠకులు పిల్లలు కనుక, వారి కోసమే తాను రాస్తున్నా కనుక అలాంటి కోరికలు తాను అంగీకరించలేదని రాయ్ సతీమణి బిజొయ రాయ్ రాసిన ముందుమాట లో ఉంది. ఇదే విషయం ఫెలూదా పాత్ర ద్వారా The Mystery of Nayan (మూల నామం: నయన్ రహస్య) లో చెప్పించారు సత్యజిత్ రాయ్ . తనకున్న పరిధుల్లో, తాను విధించుకున్న పరిమితుల్లో ఈ నవలలు ప్రతిసారి రాస్తూ పోవడం చాలా కష్టంగా ఉందని, “ఇంక నా వల్ల కాదు..ఆపేస్తాను” అని రాయ్ అనుకున్న సంధర్భాలు ఎన్నో ఉన్నాయని బిజొయా రాయ్ (విజయ రాయ్ కాబోలు) అన్నారు. నిజానికి, ఇదే విషయం ఫెలూదా కథల్ని వరుసగా చదివితే గమనించవచ్చు. ఒకటే తరహా పాత్రలు చాలా వరకు అన్ని నవలల్లోనూ. దాదాపు సగం కథల్లో కథ అంతా – ఏదో ఓ పురాతన మైన వస్తువు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది ఔరంగజేబు ఉంగరమైనా, నెపోలియన్ ఉత్తరమైనా, ఈజిప్ట్ విగ్రహమైనా. మరో రెండు మూడు కథలేమో అతీత శక్తులున్న మనుషుల గురించి. మొత్తానికి ఈ నవలల్లో వస్తు వైవిధ్యం తక్కువనే చెప్పాలి. సత్యజిత్ రాయ్ వస్తువులు దొరక్క ఎంత కష్టపడ్డారో The Disappearance of Amber sen నవల చదివితే అర్థమౌతుంది. అందులో ఫెలుదా క్లయంట్స్ అతన్ని పరీక్షించడానికి లేని కేసుని సృష్టిస్తారు! ఇది చదవగానే కాస్త రాయ్ రచనల్ని పరిశీలిస్తూ వచ్చిన ఎవరికన్నా అర్థమైపోతుంది ఆయనకి ప్లాట్ దొరక్క అది రాసాడని! ఫెలూదా తిరిగిన ప్రదేశాలే మళ్ళీ మళ్ళీ తిరగడం మరో సంగతి. ఉదాహరణ కి పూరీ లో పరిష్కరించిన కేసుల సంఖ్య ఎక్కువే. ఇన్ని లోపాలతో కూడా ఇంకా ఫెలూదా కథలు ప్రింటులో ఉండటం, విరివిగా అమ్ముడవడం, డెబ్భై పేజీల నవల వంద రూపాయలకమ్మినా సేల్స్ ఉండటం చూస్తూ ఉంటే ఒకే కారణం కనిపిస్తుంది – అదే ఇందాక కథల విషయం లో కూడా అన్న శైలి. ఆ శైలి ఏ విధమైన హంగులూ గట్రా లేకుండా, మామూలు పదాలతో పొందిగ్గా రాయబడి, ఎప్పుడు పుస్తకం తెరిచినా చివరికంటా చదివించే శైలి అని చెప్పొచ్చు. ఇవి ప్రస్తుతం నాకు దొరికి నేను చదివిన రాయ్ రచనల వరకే పరిమితమైన అభిప్రాయాలు.

ఫెలూదా కాక సత్యజిత్ రాయ్ సృష్టించిన మరో పాత్ర Professor Shonku. ఈ పాత్ర తో సైన్స్ ఫిక్షన్ రాసాడు సత్యజిత్ రాయ్ . ఫెలూదా కంటే ముందే పుట్టిన పాత్ర ఇది. శంకు నవల్లకి ఆంగ్లానువాదాలు వచ్చినట్లు లేవు. ఏ షాపు లోనూ కనబళ్ళేదు. ఇవి కూడా దాదాపు 25 ఏళ్ళ పాటు తరుచుగా విడులైన పిల్లల నవలలు. తరిణి ఖురో కథలు అంటూ కొన్ని హారర్ కథలు రాసారని చదివాను. Our films, their films అన్న పుస్తకం సత్యజిత్ రాయ్ సినిమా విమర్శల సంకలనం. ఒక సారి సత్యజిత్ రాయ్ మెమోరియల్ లెక్చర్ ఇచ్చిన ఆమర్త్య సేన్ దానికి పెట్టుకున్న పేరు – Our culture, their culture. ఎందుకో గానీ…ఈ పుస్తకం పేరు తలుచుకోగానే ఆ విషయం గుర్తు వచ్చింది. ఇవి కాక, నీతి కథలు, నసీరుద్దీన్ కథలు, తన స్వీయ అనుభవాలు కూడా రాసారు. ఈ జాబితా ని బట్టే సత్యజిత్ రాయ్ ఎన్ని వైవిధ్యభరితమైన రచనలు చేసారో అర్థమౌతోంది. ఈ సందర్భం లో జావెద్ అక్తర్ ఒక ఇంటర్వ్యూ లో అన్న ఒక వాక్యం గుర్తు వస్తోంది – “All forms of creativity are an exercise in schizophrenia because you need to be more than one person within you to be creative.” – సత్యజిత్ రాయ్ ని దృష్టి లో పెట్టుకుని ఈ వాక్యాన్ని మరో సారి చదివితే ఈ వాక్యం లో ఉన్న నిజం మరింత బాగా అర్థమౌతుంది.