కవితల ఇంద్రధనుస్సు

వాన వెలిసిన సాయంత్రంవానా కాలమే కాదు, వాన పడిన సమయం కూడా కవులకు ముఖ్యమౌతుంది. అప్పుడెప్పుడో ఇస్మాయిల్ గారు “రాత్రి వచ్చిన రహస్యపు వాన” గురించి చెప్పారు. గత సంవత్సరం భూషణ్ “వాన వచ్చిన పగలు” వెలువరించాడు. ఇప్పుడు కన్నెగంటి చంద్ర “వాన వెలిసిన సాయంత్రం” మన ముందుకు తీసుకువస్తున్నారు.

శివారెడ్డి గారు “ఒక ప్రవాసి ఆత్మగీతం”గా దీనిని పేర్కొన్నా, ఈ కవితల్లో ప్రవాసజీవితం ప్రధానాంశంకాదు. సార్వజనీనమైన, సాధారణ అనుభవస్పర్శే ఎక్కువ. బాల్య స్మృతులు భార్యా భర్తల వివాదాలు, రుతు శోభ, మానవ వైఫల్యాలపై చింతన వంటివి. ఈ కవి ఊహావైచిత్రి, సున్నిత స్వభావం, అంతర్ దృష్టి అనేక కవితలలో మనల్ని ఆకర్షిస్తాయి.

ఇటీవలి కాలంలో మన కవులు బాల్యం గురించి, మరీ ముఖ్యంగా పల్లెలో గడిపిన బాల్యం గురించి విరివిగా రాస్తున్నారు. వీరిలో ఎక్కువమంది పట్టణాలకు వచ్చి స్థిరపడినవారే. అందువల్లనో ఏమో వీరి కవితల్లో సాధారణంగా పోలికలకంటే, సరిపోల్చటం ఎక్కువగా ఉంటుంది. అప్పటి పరిస్థితికి, తమ ప్రస్తుత పరిస్థితికి ఉన్న భేదాల్ని చూపిస్తూ, తాము ఏం పోగొట్టుకున్నామో చెబుతుంటారు. ఐతే, చంద్ర కవితల్లో అటువంటి ధోరణి లేకుండా, అప్పటి అనుభవాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం, ఒక మంచి జ్ఞాపకంగా నెమరువేసుకోవటానికి మాత్రమే పరిమితం కావటం నాకు నచ్చింది. పుస్తకం శీర్షికతో ఉన్న కవిత ఇందుకు మంచి ఉదాహరణ.

బాల్యంలో వాన కురిసిన ఒక సాయంత్రాన్ని ఈ కవిత అందంగా ఆవిష్కరిస్తుంది. పల్లెటూరి పదచిత్రాలు కవితనిండా పరుచుకొని ఉంటాయి – పిల్లలు కట్టు తాళ్ళు విప్పుకున్న లేగ దూడల్లాగా బయటకురావటం, చెరువు, పెద్ద కాలవ నిండు చూలాళ్ళు కావటం, ఇళ్ళల్లోంచి వచ్చే పొగ బెంగగా ఊరిని చుట్టుకోవటం వంటివి. “ఊరంతా తలస్నాం చేసి, ఎండ తువ్వాలు వెతుక్కున్నట్లుంటుంది” అనటం ఎంతో బాగుంది.

బాల్యానికి సంబంధించిన అనుభవాన్నే, కవి ప్రేక్షకునిగాఉండి వర్ణించిన కవిత “మృత్యువుతో తొలి పరిచయం“. పూర్తిగా కధా పద్ధతిలో సాగిన ఈ కవిత కొంత తాత్వికతతో కూడిఉంది. మరణవేదన పడుతున్న ఒక చిన్న పక్షికి పిల్లలు ప్రేమతో సపర్యలు చెయ్యటం, అంతలో అది చనిపోతే వాళ్ళంతా దుఃఖించటం, దానిని పాతిపెట్టిన చోట మొక్క మొలిస్తే దానిని చూసి సంబరపడటం – ఈ క్రమమంతా కవితలో బాగా చెప్పారు. పిల్లల్లో సహజంగా ఉండే కరుణ, కుతూహలం, ఆశా భావం ఈ కవితలో సమర్థవంతంగా వ్యక్తమయ్యాయి.

బాల్య స్మృతులతో నిండినదే మరొక కవిత “జ్ఞాపకం చాలు నాకు” రెండు బలమైన వాక్యాల్తో మొదలౌతుంది.

“జ్ఞాపకాలెప్పుడూ ఒంటరిగా రావు
ఒకదాన్నొకటి తరుముకొంటూ వస్తాయి సముద్రపు కెరటాల్లాగా!”

కవిత ముగింపు కూడా ప్రారంభ వాక్యాలకి పరిపూరకమైన వాక్యాలతో ఉంటుంది:

“జ్ఞాపకాలెప్పుడూ ఒంటరిగా పోవు
నా జీవితం సగాన్ని తీసుకునే పోతాయి”

కాని ఎందువల్లనో కవితలో మిగతాభాగం ఆద్యంతాలకు తగిన బిగువుని సాధించలేకపోయింది. కేవలం కొన్ని అనుభవాలు, ఆటలను జాబితాగా చెప్పటం, “పుస్తకం కాగితాల మధ్య దాచుకున్న నెమలి పించం” వంటి పాతబడిన పదచిత్రాలను వాడటం దీనికి కారణం కావచ్చు. ఇలా జాబితా లాగా చెప్పటం పాటల్లో బాగా రాణిస్తుంది.( “స్నేహంలో మైలు రాళ్ళు”,”గుర్తుకొస్తున్నాయి” వంటి పాటలు) కవిత్వం దగ్గరికి వచ్చేసరికి భిన్నమైన అభివ్యక్తి అవసరమనుకుంటాను.

వానే కాదు, వసంత రుతువు గురించి, మంచు కురిసే రాత్రి గురించి కూడా ఇందులో కవితలున్నాయి. వీటిలో “మళ్ళీ ఇంకో వసంతం” చాలా మంచి కవిత.

“మంచు మళ్ళీ ఏడు రంగులుగా విడిపోతుంది
తెలుపు నలుపుల లోకమంతా
వర్ణ చిత్రాల్లోకి అనువదించబడుతుంది.”

అంటూ మొదలయ్యే ఈ కవిత శీతాకాలం ముగిసి వసంతం ప్రారంభమయ్యే పరిణామాన్ని అత్యంత హృద్యంగా చెబుతుంది. కవితకు తలమానికమైన పదచిత్రం కవిత మొదటి వాక్యంలోనే రావటంవల్ల కవితలో ఒక స్పాంటేనిటీ కనిపిస్తుంది. దానికి తగినట్లుగా కవిత మిగతా భాగమంతా నిర్వహించటంవల్ల ఇది మంచి కవితగా రూపొందింది.

కవిత్వ సృజనలో చంద్ర ఏవో కొన్ని అనుభవాలకో, అభిప్రాయాలకో పరిమితం కాలేదు. ఆలు మగల మధ్య వివాదం ముగిసాక రాజీ పడటానికి చేసే ప్రయత్నం, ఎప్పుడైనా ఒకరోజు అదే పనిగా వెంటాడే పాట, evening walk, నిద్ర పట్టని రాత్రి – ఇలా అనేక సజీవమైన, సహజమైన జీవితానుభవాలకి సున్నితంగా, నిజాయితీగా స్పందించారు. మళ్ళీ మళ్ళీ చదివి, మనల్ని మనం అద్దంలో చూసుకోగలిగే కవితలనేకం ఇందులో ఉన్నాయి.

అప్పుడప్పుడూ అకారణంగా కలిగే మెలాంకలీ, నిరాసక్తత గురించి రాసిన “అబ్బ పోనిద్దూ” వంటి కవితలు కూడా బాగున్నాయి. దుఃఖం రెండు కారణాల వల్ల కలుగుతుంది. ఒకటి పోగొట్టుకోవటం, రెండవది పోందలేకపోవటం. ఇందులో రెండవ రకానికి చెందిన దుఃఖం “బొంగురు గొంతు పాట“, “అట్లాగని పెద్ద బాధాఉండదు” వంటి కవితల్లో వ్యక్తమౌతుంది.

ఆకట్టుకొనే పదచిత్రాల్ని అలవోకగా కట్టగల నేర్పు, ఊహా శక్తి చంద్ర కున్నాయి. “ద్వంద్వం” అనే ఈ కవిత చూడండి:

“పచ్చటి వల పన్ని
పగలంతా ఎదురు చూసింది
ఒంటికాలి మీద కొంగజపంతో చెట్టు
మాపటేళకు వచ్చి వాలి ఇరుక్కుపోయింది పిట్టలగుంపు-
ఒకటే గలలలు

కాటుక పిట్టల దండు
వలై వచ్చి విసురుగా పడింది
పారిపోలేని పిచ్చి చెట్టు చిక్కుకుపోయింది
వొళ్ళంతా రెక్కలుండీ ఎంత విసిరీ ఎగరలేదు-
ఒకటే కువకువలు”

పిట్టల గుంపును వలగా ఊహించటంలో మంచి వైచిత్రి ఉంది. అలాగే ఉదయాన్నే బాట పక్కన గడ్డిపూలు విరిసిన దృశ్యాన్ని :

“రాత్రంతా వసంతోత్సవం ఎవరాడారో
ఎటుచూసినా రోడ్ల పక్కన చెదిరిన రంగులు”

అని చెప్పటం, చెరువు గట్టున చెట్టుని “ఒంగి కడవతో నీళ్ళు ముంచుకుంటూ నీళ్ళల్లో నీడ చూసుకునే పడుచులాఉందని” ఊహించటం కూడా కొత్తగా ఉంది.

ఐతే, పోలికలు చెప్పేటప్పుడు నాకు నచ్చని ఒక ప్రయోగం “ఔతుంది” , “ఔతాయి” వంటి పదాలు. కొందరు వచన కవులు తరచు ఇవి వాడుతూ ఉంటారు. చంద్ర కవితల్లో అక్కకక్కడ ఈ వాడకం గమనించాను. వ్యక్తిగతంగా నాకవి రుచించవు. పోలికను అచ్చమైన ఉపమానంగానో, లేదా రూపకం గానో చెబితేనే అందంగా ఉంతుందని నాకనిపిస్తుంది.

నిర్మాణపరంగా చూస్తే, కవిత మొత్తాన్ని ఒకే స్థాయిలో నిర్వహించటంలో అక్కడక్కడ అసంతృప్తి కలుగుతుంది. ఇంతకు ముందుచెప్పిన ఉదాహరణే (“జ్ఞాపకం చాలు నాకు”) కాకుండా, “చెరువు గట్టు మీద చెట్టు” కవితలో కూడా ఇటువంటి ఇబ్బంది ఉంది. “వేసంగి రాత్రుల్లో .. తల్లిలా అనిపిస్తుంది” అన్నంత వరకు అనుసరించిన వ్యూహానికీ, ఆ తరువాత కవిత నడిచిన పద్ధతికి చాలా తేడాఉంది. కవిత నిడివి తక్కువైనా ఫరవాలేదుగాని, అది మొదలుపెట్టిన తీరులోనే చివరివరకూ సాగిఉంటే బాగుండేదనిపిస్తుంది.

చంద్ర కవితలను విడివిడిగా అనేక సంవత్సరాలుగా చూస్తూనేఉన్నా, అన్నిటినీ కలిపి ఒకచోట చదవటం మంచి అనుభవం. కవితల ఎంపికలో శ్రద్ధ కనబరిచారు. కాకపోతే, మరీ బలహీనంగాఉన్న ఒకటి రెండు కవితలు (One…Two…Three…Action!, ఉద్రేకాలు,ఉన్మాదాలు వంటివి) చేర్చకుండాఉంటే మరింత బాగుండేది. అలాగే, కవితల క్రమాన్ని నిర్ణయించేటప్పుడు, వీటిలో బలమైన కవితల్ని ముందు వరుసలో అమర్చిఉండవలసింది. ఏ కారణం వల్లనో ప్రతి పేజీలో footer మీద “ఒక పరిచయం” అని ఉంటుంది. బహుశ, పుస్తకం లోపలి భాగం అచ్చయాక పేరు మార్పు జరిగిందేమో.

వాన వెలిసాక విరిసిన ఇంద్రదనుస్సులా వివిధ వర్ణాలతో, వైవిధ్యంతో నిండిన ఈ కవితాసంకలనం పాఠకులను తప్పక అలరిస్తుందని ఆశిస్తాను. చంద్రకు అభినందనలు.