చంద్ర కవితలపై ఒక మతింపు

ఫలానా కవిత బాగుంది, లేదా ఫలానా కవిత బాగా లేదు అనడం తేలిక. కానీ ఎవరన్నా నిలదీసి, ఎందుకు బాగుందో చెప్పు, ఎందుకు బాగాలేదో చెప్పు అని అడిగితే సమాధానం చెప్పడం కష్టం. ముఖ్యంగా ఎందుకు బాగాలేదో చెప్పడం మరీ కష్టం అనుకుంటాను.

నామటుకు నాకు కవిత చదవగానే, ఆకవితలో మాటల ప్రతిమలు అంతకుపూర్వం హృదయానికి హత్తుకొపోయిన బొమ్మలను గుర్తుచేస్తాయి. వెంటనే ఈ కవిత బాగుంది అనిపిస్తుంది. ఒక్కొక్కసారి కొన్ని కవితలతో వచ్చే అనుభవం వేరుగా వుంటుంది. ఆ పాత ప్రతిబింబాలు విచ్ఛిన్నమై పోయి కొత్త కొత్త ప్రతిబింబశకలాలను ప్రసాదించి సరికొత్త అనుభవం ఇస్తుంది. అప్పుడు కూడా అబ్బ! ఈ కవిత బాగుంది సుమా, అని అనిపిస్తుంది. చెకోవ్‌ ఎక్కడో కొత్తగా కవిత్వం రాద్దామనుకున్న వాడితో అన్నాట్ట! ‘నువ్వు చందమామని వర్ణిద్దామనుకుంటే ఆకాశంలో ఉన్న బింబాన్ని వర్ణించకు; ఆ చందమామ ప్రతిబింబాన్ని నీ పాదాల ముందు విరిగిపడ్డ అద్దంపెంకులో చూపించు. అదీ కవిత్వం,’ అని.

అది కవిత్వానికున్న అద్భుతమైన శక్తి. విస్మయాన్ని కలిగించే శక్తి.

అసహ్య వాతోద్ధత రేణు మండలా
ప్రచండ సూర్యాతపతాపిమహీ
నశక్యతే దృష్ట మపి ప్రవాసిభిః
(ప్రియావియోగానల దగ్ధమానసైః)

ఇది కాళిదాసు రాసిన ఋతుసంహారం లోనిది. ఎండాకాలపు ఎండతీవ్రతని వర్ణిస్తున్నాడు. ప్రచండసూర్యుని వేడికి దుమ్ముకణాలసుడులతో నిండి భరించలేని గాడుపుల మూలాన (ప్రియావియోగజ్వాలచే దగ్ధమైన హృదయాలతో ఉన్న పథికులు) నేలకేసి కూడ చూడలేకున్నారు. మరోచోట కాళిదాసు ‘దిషి దిషి పరిదగ్ధ భూమయాః పావకేన,’ అంటాడు; భూమిలో ప్రతిచిన్నభాగం (సూర్యుడి వేడికి) పూర్తిగా దగ్ధమైపోయింది, అని.

కన్నెగంటి చంద్ర, రాసిన మట్టివాసన కవిత (వాన వెలిసిన సాయంత్రం, కవితల సంకలనం, 2007) ఎండాకాలపు ఎండలకి కనిపించే నేలబొమ్మని చూపిస్తోంది.

సరిహద్దుల కందకాల్లా నెర్రెలు విచ్చుకొని
నేలంతా చిన్న చిన్న దేశాల్లా విడిపోతుంది;
ఒక్కడికి కూడా ఇరుకయ్యే దేశాలు!

ఇది సరికొత్త అనుభవం. కవితానుభవం. నెర్రెలు చూడకకాదు; అందరం చూసేవుంటాము. చిన్నప్పుడు మాతెలుగు మేష్టారు ఛందస్సులోచెప్పిన పద్యం.

నెఱెలు దీసె, భూమి పఱియలుగా, నార
బండు లంక దోసపండు వోలె,
నేలరాలు గింజ పేలమౌనట్లుగా
గాసె నెండ, పోసె గాడ్పు సెగలు.

చంద్ర కవితలో, నేలంతా చిన్న చిన్న దేశాల్లా విడిపోయి ఒక్కడికూడా ఇరుకయ్యే దేశాలు అన్నది సరికొత్త అనుభవం అంటాను. కన్నెగంటిని కాళిదాసుతోనో, మా మేష్టారితోనో పోలుస్తున్నానని భ్రమ పడకండి; తూలనాడకండి. ముందుగానే చెప్పానుగా; మనకి పూర్వానుభవంలో ఉన్న ప్రతిబింబాలు ఒక్క ఉదుటున విచ్ఛిన్నం అవటం…

ఆ తరువాత ఆ కవిత లోనే,

పైన ఎండ, ఒకటే దాహం!
వొళ్ళంతా నోళ్ళే! నోళ్ళంతా ఆవిరైన నాలుకలే
!

అంటాడు. పుస్తకం తెప్పించుకొని, ఈ కవిత పూర్తిగా చదవండి. బిగ్గరగా చదవండి. కవిత చివరలో తొలకరి వానలో తడిసిన నేల వాసనల ఘుమఘుమలు, అన్నిదిక్కుల్లో ఒకే రంగు జెండాలు, ఆకుపచ్చ సామ్రాజ్యంలా!’ ఉన్న భూమికి పాదాలని గట్టిగా పట్టుకునేట్టు చేస్తుంది.

కవులు, సాధారణంగా అందరు కవులూ, వాళ్ళ అనుభవాలూ వాళ్ళ ఆనందం, వాళ్ళ తృప్తి కోసం రాసుకుంటారు! మంచి కవులు రాసేది చదువరులకు కూడా ఆనందం, తృప్తి, ఇస్తుంది.

చంద్ర రాసిన మరోకవిత వాన వెలిసిన సాయంత్రం నుంచి:

వాన నీళ్ళన్నీ మాకందకండా పారిపోవాలని చూస్తుంటాయి
పాడుకుంటూ పారిపోతూ
చిట్టిచిట్టి పాయలై, కలిసి చిన్నకాలువలై
మట్టిని కోసుకుంటూ, రాళ్ళను మీటుకుంటూ …
చెరువూ, పెద్దకాలువా నిండుచూలాళ్ళవుతాయి.

చిన్నప్పటి అనుభవం. మనందరి అనుభవం. కాగితప్పడవలు గుర్తుకు రావటల్లేదూ? ఎండా వానా ఆటల్లో దొరికిన దొంగల్లా చిన్నా పెద్దా ముద్దగ తడిసి ఇళ్ళకు చేరడం గుర్తుకు లేదూ??

పైకవితలో మాటల బొమ్మలు ఈ క్రింది కవితతో కాంట్రాస్ట్ చేసి చూడండి: ఇదీ ఋతుసంహారం నుంచే…

విపాండురం కీటరజస్తృ ణాన్వితమ్‌
భుజంగవద్వక్రగతి ప్రసర్పితమ్‌
ససాధ్వ సైర్భేక కులై నిరీక్షితమ్‌
ప్రయాతి నిమ్నాభి ముఖం నవోదకమ్‌

కొత్త వర్షపునీరు పల్లానికి ప్రవహిస్తూన్నది. పురుగులు, గడ్డి, దుమ్ము, పోగుచేసుకోని, ఆ నీరు పాలిపోయిన పసుపు (ఊదా) రంగులో ఉంది. ఆ ప్రవాహం కప్పలగుంపుకి చూడటానికి మెలికలుమెలికలు తిరుగుతూ పోతున్న పాములా ఉన్నది.

రెండు కవితల్లో బొమ్మలూ, చిన్నప్పటి జ్ఞాపకాలే! అయితే, చంద్రవేసిన వర్షపునీరు బొమ్మలు నా (మన) అనుభవానికి చాలా దగ్గిర. మంచి కవి చిన్నచిన్న మాట లకు చిత్రిక పట్టి పాత బొమ్మలని కొత్త బొమ్మలుగాచేసి చూపిస్తాడు.

మబ్బుల్లో బొమ్మలు అనే కవిత చూడండి: మీ పెరట్లోకో, డాబా మీదికో తీసుకో పోతున్నాడు, ఆకాశం చూడటానికి.

రెక్కలు విప్పికొన్న దూది కొండల్లో
చెట్లూ, ఏనుగులూ, కొండశిలవలూ, ఇంకా ఏవో
వాటికింద … …
దేన్నీ పట్టించుకోకండా
రెక్కలాడిస్తూపోతున్న పిట్టలూ…

చంద్రకి కవితతో బొమ్మలు గీయడానికి, మనల్ని ధ్యాన మగ్నుల్ని చేయటానికీ, అతిశయమయిన, గంభీరమయిన మాటలు అక్కరలేదు.

ఆకాశానికి రంగురంగుల నిప్పంటుకుంటుంది
మబ్బులు కాస్త రంగుపుంజుకొని
సాయంత్రపు షికారుకు బయల్దేరుతాయి

అంటూ హఠాత్తుగా మనల్ని తన ప్రపంచంలోకి తీసుకోపోతాడు. ఎజ్రా పౌండ్ ఎక్కడో అన్నాడు: తన ప్రపంచాన్ని మనకోసం నిర్మిచడం కవికి అత్యవసరం, అని.

ఎంతకొత్తగా రంగులద్దుకున్నా
బొమ్మ బాగా కుదర్లేదని
ఇంకో పడమటి పొద్దుని
చెరిపేస్తుంది రాత్రి
చీకటి తెరలు దించేస్తూ!

ఇది ఊహా ప్రపంచం కాదు. తన భౌతిక ప్రపంచం. సాయంత్రం అయ్యింది. నక్షత్రాలు మిలమిల మెరుస్తున్నాయి.

ఆరుబయట వెలకింతలా పడుకొని
మిలమిలమెరిసే చుక్కలని
చూపుడివేలి గీతలతో కలిపితే
బొమ్మలే బొమ్మలు కలల్లోకి జారుతూ…

ఆఖరి మాటలు, ‘కలల్లోకి జారుతూ,’ అని అనకపోతే ఇది కవితకాదు. ఇక సన్నగా చినుకులు పడుతున్నాయ్. మంచాలను ఆరుబయటినుంచి చరండాలోకి తెచ్చుకుంటాం.

ఇప్పుడు నీడకోసమో, వానకోసమో వెతికే కళ్ళకు
మబ్బుల్లో బొమ్మలు కనబడవు
వెలుతురు కోసమే వేచేవాళ్ళకు
చుక్కల మిణుగురులు అక్కరలేదు.

మరో కవిత ‘గాలి రొద’ గురించి రెండు మాటలు చెప్పి ముగిస్తాను. ఇందులో మాటలు పాతవే; అయితే కవితకు అర్హమైనవేనా అన్న అనుమానం వస్తుంది. వీటితో వేసిన బొమ్మలు చూడండి :

ఆ దుర్గంధానికి ఊపిరాడక
గాలి ఉక్కిరిబిక్కిరై అల్లాడుతుంది
పారిపోవాలని ఒకటే ప్రయాస.

ఎక్కడికి పోతుంది, ఊపిరాడని గాలి?

పొగచూరిన ఊపిరితిత్తుల గుప్పిట్నుంచి
గింజుకొని బయట పడి
పొగగొట్టాలనుంచి కళ్ళుమూసికు జారి
పచ్చటిపైరుమీద వాలి
నువాక్రాన్‌ ఘాటు వొళ్ళంతా పట్టుకొ్ని
……..
పారబోసిన చమురు మడ్డిలో
చచ్చి చేపై తేలింది!

తీవ్రమైన ఈ కరుకు బొమ్మలు మనగొంతులోకి అతిత్వరితంగాపోయి మనకి ఊపిరాడనియ్యవు!

మోయలేని శబ్దాలు మోసుకొని
భరించలేక ఫటిల్లుమని
పేలుతుంది చావుకేకై!

అని కవిత ముగుస్తుంది.

కాస్త చదువు, కాస్త అభ్యాసం వుంటే ఎవరైనా మాటలు పేర్చి పద్యం రాయగలరు. అది పద్యం అవచ్చుగాని, కవిత కాదు.

చంద్రకి తన చెకోవ్‌ తెలుసు.