ఈమాట » నాకు నచ్చిన పద్యం - మనుచరిత్రలో సాయంకాల వర్ణన

Expand to right
Expand to left

నాకు నచ్చిన పద్యం - మనుచరిత్రలో సాయంకాల వర్ణన

శా. శ్రేణుల్ గట్టి నభోంతరాళమునఁ బాఱెన్ బక్షు; లుష్ణాంశుపా
    షాణ వ్రాతము కోష్ణమయ్యె; మృగతృష్ణావార్ధు లింకెన్; జపా
    శోణం బయ్యెఁ బతంగ బింబము; దిశా స్తోమంబు శోభాదరి
    ద్రాణం బయ్యె, సరోజషండములు నిద్రాణంబు లయ్యెం గడున్

ఆంధ్ర కవితా పితామహుడిగా పేరుపొందిన అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్రము లోని తృతీయాశ్వాసం లోనిది ఈ పద్యం. ఇందులో కవి సాయంకాలాన్ని వర్ణిస్తున్నాడు.

తెలుగు సాహిత్యంలో ఎప్పటికీ చెరిగిపోని పేర్లలో అల్లసాని పెద్దన పేరు చాలా ముఖ్యమైంది. కృష్ణదేవ రాయని ఆస్థానం లోని అష్టదిగ్గజాలనే తెలుగు కవుల్లో పెద్దన అగ్రగణ్యుడు. రాయలవారికి ఈయనంటే మహా గౌరవం. ఆ మహాకవి కూర్చున్న పల్లకీని తన చేతులతో స్వయంగా పట్టి ఎత్తించాడట. సత్కార పూర్వకంగా ఇచ్చే గండపెండేరాన్ని తానే స్వయంగా కవి కాలికి తొడిగాడట. అదీ ఆ రాజప్రభువు సంస్కారం. అలాగే, పెద్దనకి రాయల వారంటే ప్రాణం. రాయలు మరణించినప్పుడు ఆయనతో తనూ పోలేక జీవచ్చవంలా బ్రతుకుతున్నానే అని వాపోయాడట.

‘మను చరిత్రము’ పెద్దన రచించిన ఒకే ఒక ప్రబంధ కావ్యం. దీనికే స్వారోచిష మనుసంభవమనే పేరు కూడా ఉంది. మార్కండేయ పురాణం లోని ఒక చిన్న కథను తీసుకొని, దాన్ని విస్తరించీ ప్రస్తరించీ ఒక అపూర్వ కళాఖండాన్ని శిల్పించాడు పెద్దన. ఇది నిజంగా అపూర్వమే. పెద్దనకు పూర్వం తెలుగులో అంత ఖచ్చితమైన ప్రమాణాలతో రచింపబడిన కావ్యం లేదు. పెద్దన తర్వాత కవుల్లో కూడా మనుచరిత్రమును అనుకరించి రాయబడిన కావ్యాలే ఎక్కువ. తిమ్మన, ధూర్జటి లాంటి ఒకరిద్దరు కవులు సమగ్రమైన కావ్యాలు వ్రాసినా, వారంతా పెద్దన తర్వాత పేర్కొనవలసిన వారే. మనుచరిత్రమును పెద్దన గారి “సకలోహ వైభవ సనాధము” అనవల్సిందే. కొద్దో గొప్పో సాహిత్యజ్ఞానం ఉన్నవారికి మనుచరిత్రం లోని చాలా పద్యాలు కంఠతా ఉంటాయనేది అతిశయోక్తి కాదు.

పూర్వం, కాశీ దగ్గర ఒక ఊళ్ళో ప్రవరుడనే నైష్టిక బ్రాహ్మణుడు ఉంటుండే వాడు. ఒకరోజు అతని ఇంటికి విచ్చేసిన ఒక సిద్ధుడు ఇచ్చిన పసరు కాళ్ళకు పూసుకొని, దాని ప్రభావంతో తాను చూడాలనుకున్న హిమాలయ పర్వతాలకు పోతాడు. చూడదలచుకున్న ప్రదేశాలన్నీ చూశాక, తిరిగి ఇంటికి పోదలచుకునేటప్పటికి పసరు కరిగిపోయి ఉంటుంది. ఇక చేసేది లేక అక్కడే కొండల్లో తిరుగాడుతున్న ప్రవరుడికి వరూధిని అనే అప్సరస కంపిస్తుంది. వరూధిని అతణ్ణి మోహించినా, ప్రవరుడు ఆమెను తిరస్కరించి వెళ్ళిపోతాడు. దిగులుతో ఉన్న వరూధినిని ఒక గంధర్వుడు ప్రవరుని వేషంలో సమీపించి తన కోరిక తీర్చుకుంటాడు. అలా పుట్టిన స్వరోచి, ఒక దేశానికి రాజు కావడమూ, వేట కెళ్ళినపుడు మనోరమ అనే యువతిని రక్షించి పెళ్ళాడడమూ, వారికి పుట్టిన కొడుకు స్వారోచిష మనువుగా పేరు పొందటమూ - ఇదీ, టూకీగా మనుచరిత్రము లేదా స్వారోచిష మనుసంభవం కథ.

కథా సంవిధానంలో గానీ, పాత్రల చిత్రణలో గానీ, సన్నివేశాలు కల్పించి సంభాషణలు నిర్వహించడంలో గానీ, పద్య నిర్వహణంలో గానీ దీనికి సాటి ఐన గ్రంధం నభూతో నభవిష్యతి అనీ అనిపించుకున్న కావ్యం ఈ మను చరిత్రము. అరుణాస్పదపురంలో ప్రవరుని గైహిక జీవనం, హిమాలయ ప్రాంతాల ప్రకృతి వర్ణన, వరూధినీ ప్రవరుల వాదోపవాదాలు గానీ, ఆమె దిగులు, ఆ తర్వాత ప్రకృతి వర్ణనా, స్వరోచి మృగయా వినోదం గానీ, ఎవరు ఎంతగా వర్ణించి చెప్పినా, రసజ్ఞుడైన పాఠకుడు, స్వయంగా చదివి అనుభవించే ఆనందం ముందు దిగదుడుపే.

ప్రవరుడు నిరాకరించి వెళ్ళిపోయిన తర్వాత, వరూధిని దిగులు పడుతూ వుండగా సాయంకాల మవుతుంది. ఆ సాయంసమయాన్ని వర్ణిస్తూ కొన్ని పద్యాలూ, తరువాత చీకటిని వర్ణిస్తూ కొన్ని పద్యాలూ వున్నాయి. ఒక పద్యంలో - తనను కోరివచ్చిన ‘అనన్య కాంత’ను అహంకారంతో నిరాకరించి వెళ్ళిపోయిన దుష్ట బ్రాహ్మణుడి మీద సూర్యుడికి కూడా కోపమొచ్చిందేమో అన్నట్లు - సూర్య బింబం కాషాయవర్ణం దాల్చిందట (చూశారా, పెద్దన గారికి కూడా వరూధిని మీదే సానుభూతి). నిజానికి, వరూధిని ప్రవరుడిని మోహించి, వాదోపవాదాలు చేసి, ఆఖరున మీద పడబోయిన ఆమెను చూసి, ఏమిరా, ఎంత నిస్సిగ్గుగా ప్రవర్తించిందీ దేవకన్య! అన్న జుగుప్స కలగదు. పైగా, ఆమె చతురత, వాదనా పటిమ, హొయలూ, పాఠకుణ్ణి మెప్పిస్తాయి కూడానూ. అదీ పెద్దన నిర్వహణ తీరు!

సాయంకాల వర్ణన చేసిన పద్యం అని కదా చెప్పుకున్నాం. సాయంసమయాన్ని వర్ణిస్తూ అనేకమైన పద్యాలు ఉన్నా, ఇంత సహజ సుందరంగా, స్వభావోక్తిగా చేసిన పద్యం -దీనిని మించినది ఇంకొకటి లేదు. గొప్ప భావనా బలంతో, గొప్ప గొప్ప ఉత్ప్రేక్షలు గుప్పించిన పద్యాలున్నాయి గానీ, ఇంత నిసర్గమైన అందం గలిగిన పద్యం మరొకటి లేదు. ఇంతెందుకు? పెద్దనే, ఈ సందర్భంలోనే, చేసిన వర్ణన ఇంకొకటి ఉంది - “రవిబింబ పతన దీర్ణత పయోధీ గర్భ నిర్గత శేష ఫణి ఫణా రత్న రుచియొ…” - అని. సూర్యుడు పడమటి సముద్రంలో గ్రుంకగానే, ఆ దిక్కు ఆకాశపు కావి రంగు, కలగుండు పడగానే సముద్రపు అడుగునుంచి తల పైకెత్తిన ఆదిశేషుడి పడగల మీది మణుల మెరుపు లాగా, ఉందట. భావన చాలా దూరం పోయింది, వాస్తవం నుంచి దూరంగా. మరి, పైన చెప్పుకున్న పద్యం చూడండి.

సాయంకాలం అయ్యేసరికి ఆకాశంలో బారులు బారులుగా ఇంటిముఖం పట్టిన పక్షులూ, పగటి వేడి తగ్గగానే చల్లబడిన సూర్యకాంత శిలలూ, ఎండతో పాటే మాయమైపోయిన ఎండమావులూ, కాషాయ వర్ణం నింపుకున్న సూర్య బింబమూ, కాంతిని కోల్పోయిన దిక్కులూ, కొలనులో ముడుచుకొని పోతున్న తామరలూ - ఎంత సహజ సుందరమైన సంధ్యా సమయ వర్ణనో చూడండి. సాయంకాలాన్ని ఒక అద్భుతమైన చిత్రపటంలా మన కళ్ళ ముందు నిలిపాడు గదా, కవి.

కేవలం వర్ణనే కాదు, పద్యం నిర్వహించిన తీరు మాత్రం! ‘ణ’ ప్రాసను ఎంచుకొని, గొప్ప ధారను సాధించడానికి ‘ణ’కార పునరావృత్తిగా ఉష్ణాంశు, కోష్ణము, మృగతృష్ణ, నిద్రాణము, దరిద్రాణము, లాంటి పదాలను దట్టించి చెవులకు ఇంపైన సంగీత ధోరణి కల్పించాడు. అను నాసికా వర్ణాల పౌనః పుణ్యంతో, హాయిగా సాగే ధారతో, కండ్ల ఎదుట దృశ్యమానమయే నైసర్గిక సౌందర్యంతో, ఒక మరిచిపోలేని పద్యంగా నిలిచిపోయింది, ఈ పద్యం. వస్తు సౌందర్యమూ, వర్ణనా సౌందర్యమూ రెండూ కలిసిపోయి పుట్టిన ఇంకో సౌందర్యం - ఈ పద్యం. అందుకే, ఇది నాకు నచ్చిన పద్యం.

 

(5 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. J K Mohana Rao అభిప్రాయం:

    September 4, 2007 10:54 am

    వ్యాసం బాగుంది. ఇట్టి పద్యాలు నెమరువేయడము ఎంతో మంచిది.
    రచయితకు ధన్యవాదాలు.

    మనుచరిత్రనుండి ప్రబంధాలు ఎక్కువగా వ్రాయబడినా అదియే
    మొదటి ప్రబంధము, అంతకు పూర్వము తెలుగులో
    అంత ఖచ్చితమైన ప్రమాణాలతో వ్రాయబడిన కావ్యము లేదని
    చెప్పడానికి వీలులేదు. ఎఱ్ఱాప్రెగడకుగల బిరుదులలో ఒకటి
    ప్రబంధపరమేశ్వరుడని. ఇక పోతే అంతకు ముందే నన్నెచోడుడు
    కుమారసంభవము అనే కావ్యమును వ్రాసినాడు. దీనిని తెలుగులో
    మొట్టమొదటి ప్రబంధముగా భావిస్తారు. ఇందులో ఒక క్రొత్త కథతో
    బాటు కావ్యమునకుండవలసిన వర్ణనలు ఇత్యాదులు కూడ ఉన్నాయి. నన్నెచోడుడు నన్నయ తిక్కనల కాలమునకు
    మధ్యలో ఉన్నాడని చరిత్రకారుల భావన, అంటే పెద్దనకన్న
    సుమారు మూడు నాలుగు శతాబ్దులకుపై ముందు వాడన్నమాట.

    - మోహన

  2. Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    September 4, 2007 12:41 pm

    ఈ మధ్యనే తి.తి.దే వారు పోతన భాగవతాన్ని ప్రతి పదార్థ సహితంగా
    ప్రచురించారు. ఎవరికైనా కావల్సి వస్తే ఈ క్రింది లింకు ని క్లిక్ చేయండి.

    http://www.avkf.org/BookLink/view_new_releases.php?cat_id=6653

  3. swarupkrishna అభిప్రాయం:

    September 18, 2007 4:14 am

    చాలా బాగుంది. విషయాన్ని చక్కగా విశ్లేషించారు. పెద్దన కవితలోని పెద్దతనం ఇదే కాబోలు.
    స్వరూప కృష్ణ

  4. rama bharadwaj అభిప్రాయం:

    March 9, 2008 11:26 pm

    అయ్యా, బృందావన రావు గారు,

    పెద్దన ఏనాటికీ కవులకి పెద్దనే సుమండీ ! నాకు కూడా మీకు మల్లెనే అల్లసాని భలే ఇష్టం. అయితే మీరు వుదహరించిన పద్యమే కాకుండా పెద్దన సుర్యాస్తమయం గురించి, చంద్రోదయం గురించి కూడా చేసిన మహాద్భుతమైన వర్ణనలు ఇంకావున్నాయి. చంద్రుడిని “దంతపు దువ్వెన” లాగ వున్నదని వుత్ప్రేక్షించ గలిగిన ఊహాచతురుడు పెద్దన. “తరణి ఇదే గ్రుంకుచున్నడరుదెమ్మని చంద్రుబిలువ నరిగెడు రజనీ తరుణీ మణి దూతికలన అరిగెను తూర్పునకు నీడలతి దీర్ఘములై” అన్నవాడు పెద్దనే. చీకటికి నీడలు చెలికత్తెలని వూహ చెసిన వాడు పెద్దన. పెద్దన వూహ ఎంత విశిష్ట మైనదో చెప్పడానికి మనుచరిత్ర లో ఎన్నో పద్యాలు వుదాహరణ కి దొరుకుతాయి.

    మీరు మరిన్ని రుచి కలిగిన పద్యాలని పరిచయం చెయ్యండి. మీకు నా అభినందనలు.

  5. rama bharadwaj అభిప్రాయం:

    March 25, 2008 7:26 am

    సాహితీ మిత్రులకి ఒక సమాచారం.

    అన్నమాచార్యుని పద సాహిత్యాన్ని ప్రముఖ కవయిత్రి జయప్రభ గారు, “వలపారగించవమ్మ వనిత_నీ యలుక చిత్తమున కాకలివేసినది” అన్న టైటిల్‌తో ఒక మూడు వందల పై చిలుకు పేజీలతొ ప్రచురించారు. అన్నమయ్య పదములని , అందులోని కవిత్వాన్ని ఆవిడ తనదైన శైలి లో చాలా అద్భుతంగా వ్యాఖ్యానించారు. అన్నమాచార్యుని పదాలని అమె వ్యాఖ్యానించిన పద్ధతి, చాలా ఆసక్తికరం గానూ, చదివించే ఉత్కంఠభరిత శైలి లోనూ వుంది. ఆసక్తి వున్న పాఠకులు తప్పక చదవ వలసిన పుస్తకం.

    రమ.

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a