కన్యాశుల్కానికి వెల్చేరు అనువాదం, వ్యాఖ్యానం

నూరేళ్ల సమగ్ర పరిశోధనల తర్వాత కూడా కన్యాశుల్కం గురించి మనకింకా తెలియని విషయాలున్నాయా?


A Play from Colonial India,
Gurajada Apparao
Indiana University Press (July 2007)
Paperback: 280 pages
List Price: $21.95
Translated from Telugu
By Velcheru Narayana Rao

అది సంఘ సంస్కరణకు ఉద్దేశించిన నాటకం అని మనకు తెలుసు. ముఖ్యంగా కన్యాశుల్క దురాచారాన్ని రూపుమాపటానికే గురజాడ దాన్ని రాశాడని మనకు తెలుసు. తెలుగు సాహిత్యానికి గురజాడతో ఒక కొత్త యుగం మొదలైందని మనకు తెలుసు. ఆ యుగధర్మం ఆధునికత అని, పాత మూఢ వైదికభావాల్ని తోసిపుచ్చి కొత్త పాశ్చాత్య భావజాలానికి పెద్దపీట వెయ్యటం అని మనకు తెలుసు. దేశభక్తి, ప్రకృతి ఆరాధన, అడుగు వర్గాలూ స్త్రీల సమస్యల మీద అవగాహనా సానుభూతీ, హేతువాద దృక్పథం, ఇలా అనేక నూతన భావాలకు గురజాడ రచనలు పునాది వేశాయని మనకు తెలుసు. అందుకే ఆ మధ్య మనం నూరేళ్ల కన్యాశుల్క పరామర్శల సమాహారంగా ఒక లావుపాటి ఉద్గ్రంథాన్ని వెలువరించాం. “హమ్మయ్య, ఈ సమగ్రప్రచురణతో ఇహ ‘కన్యాశుల్కం’ పీడ విరగడయ్యింది కదా !” అని సంతోషించాం.

ఇప్పటివరకు తెలుగులో సాహిత్య విమర్శకులుగా తమని తాము భావించుకున్న ప్రతివారూ కన్యాశుల్కం గురించి ఎంతోకొంత రాశారు, ఉపన్యాసాలు చేశారు, చేస్తున్నారు. దాన్ని చదవని వాళ్లు కూడ దాన్ని ఔపోశన పట్టిన వాళ్లలా సాధికారంగా చర్చించారు, విమర్శించారు. అపరిశోధనలో ఉపరిశోధనలో కుపరిశోధనలో చేశారు, చేసినట్టు ప్రకటించారు. మొత్తం మీద ‘కన్యాశుల్కా’న్ని మనం కాచివడపోశామని, ఇంక దాన్లో మిగిలింది పిప్పి తప్ప మనకు తెలియంది మరేమీ లేదనీ తేల్చిపారేశాం, తూంచిపారేశాం. ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యంలో కన్యాశుల్కం గురించి వచ్చినన్ని ప్రచురణలు మరే రచన గురించీ రాకుండా చూశాం, చేశాం.

మరిప్పుడిదేమిటి?

ముప్పై ఐదేళ్ల నుంచి అమెరికాలో కూర్చుని ఎవరూ పనికిరావని పారేసిన ఏవో పాతపుస్తకాలని పట్టుకుని తెలుగు ఏమాత్రం బొత్తిగా రాని ఎవరికోసమో అనువాదాలు చేసుకుంటూ ఏవేవో సిద్ధాంతాలూ రాద్ధాంతాలూ రాసుకుంటూ ఎవరికీ అడ్డురాకుండా ఉన్న ఈ వెల్చేరు నారాయాణరావు ఇప్పుడు ‘కన్యాశుల్కం’ మీద చెయ్యిచేసుకోవటమా? చేసుకొనెనుపో, ఇన్నేళ్ల విద్వత్తునీ, విమర్శల్నీ ,నిగ్గునీ, నిజాన్నీ ఒప్పుకోవకపోవటమా? ఒప్పుకోకపోయెనుపో, అదంతా చెత్త అని కొట్టిపారవెయ్యటమా? పారవేసెనుపో, ఒక కొత్త ఆలోచనావిధానాన్ని ప్రతిపాదించటమా? ప్రతిపాదించెనుపో, అది కన్యాశుల్క నాటకాన్ని సరికొత్త దృష్టికోణాన్నుంచి చూపించటమా? చూపించెనుపో, ఈ కొత్తచూపుతో చూస్తే దాన్లో ఇదివరకు ఎప్పుడూ కనపడని సొగసులు, అర్థాలు, అంతరార్థాలు కనపడటమా? హతవిధీ, ఎంత ఘోరం జరిగిపోయిందీ !

ఐతే ఈ నాటకంలో గురజాడ చూపిస్తున్నది సంఘసంస్కరణ ఎలా చెయ్యాలో కాదా – ఎలా చెయ్యకూడదోనా? సాంఘిక దురాచారాల్ని నిర్మూలించటానికి ఎలాటి సంఘసంస్కర్తలు కావాలో చిత్రించటం కాదా – ఎలాటివారి వల్ల కాదో చూపించటమా? అప్పట్లో తెలుగు మేధావుల మెదళ్లని సమూలంగా వశపర్చుకున్న టాగోర్, బంకిం లాటి బెంగాలీ క్రాంతదర్శుల భావాలకి రూపకల్పన కాదా – వాటి విమర్శా? డామిట్, కథ అడ్డం తిరిగిందే !

ఇన్నాళ్లూ పెద్దల మాటల్ని బుద్ధిగా ఒప్పేసుకుని “తమరి మాటే వేదం సార్, కన్యాశుల్కం సంఘసంస్కరణ ప్రధానమైన హాస్యనాటకం” అని పదేపదే మననం చేసుకుని లోపల్లోపల ఎక్కడన్నా ఎప్పుడన్నా అనుమానాలున్నా బయటకు పొక్కామా? కథ కన్యాశుల్కం గురించైతే మధ్యలో ఈ గిరీశం పాత్ర ఎందుకుందీ, చివరికి వాడు బుచ్చమ్మని ఎగరేసుకుపోకుండా అది అడ్దం ఎందుకు తిరిగిందీ, అసలు ఈ దురాచారానికి పాల్పడ్డ అగ్నిహోత్రావధాన్లు గాని లుబ్ధావధాన్లు గాని రామప్పంతులు గాని సిద్ధాంతి గాని ఎవరికీ ఏమీ హాని జరక్కుండా అంతా హాయిగా ఎందుకున్నారూ, మధురవాణి సాని కదా ఏ “చింతామణి” లాటి నాటకంలోనో ఉండక ఈ కన్యాశుల్క కథలోకి చొరబడ్డమే కాకుండా ఇంత ప్రముఖ పాత్ర ఎలా చిక్కించుకుందీ – అని ఇలా లోపల్లోపలే సందేహపడ్డం తప్ప బయటికి మాట్లాడామా?

ఇప్పుడీయన ఏమిటి ఇలా మీ సందేహాలకు సమాధానంగా నేనో కొత్త ప్రతిపాదన చేస్తున్నాను, వినండి, ఆలోచించండి, ఈ దృష్టితో చూస్తే కన్యాశుల్క నాటకం ఇంకా రసవత్తరంగా కనిపిస్తుంది, ఆనందం కలిగిస్తుంది – అంటాడేమిటి? బుర్రలో గుజ్జు వున్నవాళ్లెవరైనా ఈ మాయలో పడతారా? హాయిగా ప్రశాంతంగా పనిలేకుండా ఉన్న బుద్ధికి ఆలోచించే పని పెడతారా?

గురజాడ పుట్టి పెరిగిన వాతావరణాన్ని, ఆయన వృత్తినీ ప్రవృత్తినీ, ఆయన పరిసరాల్నీ ప్రభావాల్నీ, ఆయనకు తన గురించి తనకున్న అభిప్రాయాల్నీ ఆత్మవిశ్వాసాన్నీ – వీటన్నిటినీ సమన్వయ పరచి తయారుచేసిన ప్రతిపాదన ఐతే మాత్రం – ఏవిషిష అంతగొప్ప? గురజాడ తన కవితల్ని పైకి ఒకలా కనిపిస్తూ వినిపిస్తూ లోపల మరోలా వుండేలా ఎలా పటిష్టంగా నిర్మించాడో విశ్లేషిస్తూ ముప్పై ఏళ్ల క్రితమే రాసివుంటే మాత్రం – ఆ విశ్లేషణ ఎంతమంది చదివారుష?

ఏమైనాగాని, ఈ పుస్తకం చదవకూడదు కాక కూడదు. కొత్త ఆలోచనా విధానాలా? ఇప్పటివరకూ వున్న సంప్రదాయ విశ్లేషణలకు భిన్నంగా వుండే దృష్టికోణమా? గురజాడ గురించిన ఎన్నో కొత్త విశేషాలా? ఎవరిక్కావాలండీ ఇవన్నీ?

“మన వాళ్లొఠ్ఠి వెధవాయిలోయ్!” అన్నవాడెవడో అక్షరసత్యం చెప్పాడు. లేకపోతే ఏమిటీ విపరీతం?