అరణ్య కవితలు
ఎంతదారి తప్పి
ఎక్కడెక్కడో తిరిగినా
ఎట్టకేలకు నీటి జాడ
అడవిలో మరొక సారి
తప్పిపోవాలనుంది
దట్టమైన అడవి
ఆకుల్లోంచి దూరి
లోయల్లోకి ప్రాకి
కిరణాలు తమని
ముద్దాడుతుంటే
గలగలలాడే
సెలయేటి
అలలన్నీ
వెలిగిపోతూ…
తనలో మునిగిన
ప్రతి గులకరాయికీ
ఓపిగ్గా సెలయేరు
ఒక రూపాన్నిస్తోంది
చూడ్డానికి ఒకేలా ఉన్నా
దేని అందం దానిదే!
ఏ సెలయేటిని చూసినా
ఆ గలగలలు
నాలోనూ వినిపించేవి.
కొన్నాళ్ళకి నేను
కవిత్వం మొదలు పెట్టాను
ఒకరితో
నిమిత్తం లేదు
పూస్తాయి
రాలిపోతాయి
అడవిలో పూలు.

రచయిత మూలా సుబ్రహ్మణ్యం గురించి: ఐదేళ్ళ క్రితం కవిత్వం రాయడం ప్రారంభించి, యాభైకి పైగా కవితలు, పది కథలు, మరికొన్ని వ్యాసాలురాసారు. "ఏటి ఒడ్డున " అనే కవితా సంకలనం ప్రచురించారు. ... పూర్తిగా »
chavakiran అభిప్రాయం:
September 5, 2007 12:33 am
చాలా బాగుంది.
ఇంకా ఉంటే చదవాలనుంది.
krishna అభిప్రాయం:
September 5, 2007 2:05 pm
నాకు ఈ కవిత అర్ధం కాలేదో లేక అసలు ఈ మధ్య కవిత అనే పేరుతో వచ్చేవి ఇలా ఉంటున్నాయో తెలీదు. అసలు ఏముంది ఈ కవితలో? బాగుందో బాలేదో తర్వాత ఆలోచిద్దాం. ఎవరైనా కాస్త వివరించే పుణ్యం కట్టుకోరూ దయచేసి.
వాక్యాలన్నిటినీ ఒకే పేరాలో వ్రాయకుండా విరిచేసి నాలుగో ఐదో పంక్తుల కట్టలు కొన్ని చదవడానికి పడేశారు. అలా నింపడమేనా కవిత్వం అంటే? అడవి అనేది అందంగా ఉంటుంది కాబట్టి ఏం రాసినా చెల్లిపోతుందనే భావన మాత్రమే ఉంది ఈ కవితలో. మనసును హత్తుకునే భావమ్ ఒక్కటి లేదు, ఒక అందమైన భావాన్ని అందంగా వివరించడం లేదు, చదివాక మనల్ని అలోచింపచేసేదిగా లేదు. మొత్తానికి అసలు కవిత అంటే ఏమిటో నేర్చుకోవాల్సిన పరిస్థితి కనపడుతోంది.
ఇందువల్లే మన భాషకి అధోగతి పడుతోంది. కవులూ కాస్త చదవడం కూడా చేయండి. లేకపోతే అరిగిపోయిన భావాలే చర్విత చర్వణం అవుతాయి. శేషేంద్ర శర్మ గారి గురించి వారి శిష్యులు ఒకాయన వ్రాస్తూ అరిగిపోయిన భావాలు నింపిన ఒక అనువాదాన్ని చూపిస్తే ఆయనేమన్నారటో తెలుసా? “కిళ్ళీ బాగా నమిలి నమిలి నమిలీ రసమంతా అయిపోయాక థుపుక్కున ఉమ్మిన పిప్పిలా ఉంది” అని. కొత్త భావాల్లేని కవితలు చదివితే అలానే అనిపిస్తుంది. అందుకే కాస్త చదవండీ దయచేసి.
రచయిత నొచ్చుకుంటారని తెలుసు. అయినా ఇంత ఘాటుగా వ్రాయడానికి కారణం, ఈ మధ్య కవితలు వ్రాసే వారు జాగ్రత్తలు తీసుకోవట్లేదన్న బాధే. అలాంటి కవితలే వస్తే ఇక సంపాదకులూ ఏం చేస్తారు? వచ్చిన వాటిల్లో ఏదో ఒకటి వేయడం తప్ప.. ఈ మధ్య ఆన్ లైన్ పత్రికలన్నిటిలో కవితలు ఇలానే ఉంటున్నాయి. కవులు జాగ్రత్త తీసుకోకపోతే కవిత్వం మీద ఆసక్తి చచ్చిపోయి భాష చచ్చిపోతుందన్నదే నా బాధ.
Subrahmanyam Mula అభిప్రాయం:
September 5, 2007 9:07 pm
కృష్ణ గారు…
జీవితమైనా , కవిత్వమైనా ఒక అరణ్యం అనుకుంటే అందులోని అసలు సారాన్ని (నీటి జాడ) గ్రహించలేక , అందరం ఒకానొక దశలో దారి తప్పి తిరిగే వాళ్ళమే. ఐతే ఆ నీటి జాడని కనుగొన్నప్పుడు కలిగే ఆనందం మాటల్లో వ్యక్తం చెయ్యలేం. ఆ ఆనందం కోసం ఎన్ని సార్లైనా అడవిలో తప్పిపోవాలనిపిస్తుంది. అదే మొదటి కవిత.
కవితా సారాన్ని వచనంలో వివరించడం కవిత్వాన్ని అవమానించడంగానే భావిస్తాను. ఐనా మీ విమర్శ వల్ల తప్పలేదు. మీకు కనబడనంత మాత్రాన అసలు నీరే లేదనేంత అవివేకులు కారని, ఇదే కోణంలో మిగతా కవితల్లోని నీటి జాడ కోసం వెతుక్కునే సత్తా మీకు ఉందనే నమ్ముతాను.
“నమిలి మింగిన పిప్పి” లాంటి పదాలు వాడే ముందు, ఇలాంటి కవితలు ఇంతకు ముందు ఏ కవి ఎలా వ్యక్తపరిచాడో చెప్పి ఉంటే మీ విమర్శలో కాస్త పస ఉండేది. మాబోటి కవులకి కాస్త ఉపయోగపడేది.
ఏమైనా మీ విమర్శ కి ధన్యవాదాలు.
శెలవు.
chavakiran అభిప్రాయం:
September 5, 2007 9:29 pm
ఆర్యా!
కృష్ణాజీ,
ఓ నాలుగు మంచి కవితలు చెపితే చదివి ఆనందించాలనుంది.
ఇహ పోతే (ఎవరు అని అడగరు అని ఆశిస్తూ :) )
నాకు ఈ కవిత చదవగానే అర్జంటుగా అడవిలో తప్పిపోవాలనిపించింది (ఇంతకు ముందు చాలా సార్లు అలా జరిగిందిలేండి)
అందుకనే నచ్చినది.
అందుకు కాకపొయినా ఈ కవితలో పాజిటివ్ నెస్ చాలా ఎక్కువ ఉన్నది. ఆశావాదం వైపు నడిపిస్తుంది.
—
మీ విమర్శ బాగుంది, ఇలాగే కొనసాగించండి మీ దాడి.
Alok అభిప్రాయం:
September 5, 2007 11:09 pm
ఇంక్విలాబు జిందాబాదు, నేను మాదిగనురా బాపనోడా అని పొలికేకలెట్టడవే కవిత్వమా కృష్ణాజీ? అక్కడెక్కడో కట్టే డాము మీద, ఫ్లై వోవర్ మీదా రాసే జాగ్రఫీనా కవిత్వం? తమ కడుపులో చల్ల కదలకండా వుంచుకొని ఫుట్ పాత్ జీవుల గురించి పేజీలెక్కన, కేజీలెక్కన మోజుకొద్దీ రాయడమేనా కదిలించే కవిత?
గుంటూరు శేషేంద్ర శర్మ గారి అభిప్రాయం రాసారు. బానే వుంది. మరి మిగతా కవులు మరీ ముఖ్యంగా ఇస్మాయిలు గారు ఏం చెప్పారో చదవలేదా? చదవకపొతే చదవండి.
జయప్రభగారి పబ్ ఆఫ్ వైజాగపట్నమ్ చదివారా? చదవకపోతే ఎంటనే చదవండి. గుత్తొంకాయ ఎలా వొండాలి, తద్దినాలప్పుడు ఏమేం తినొచ్చు అన్నీ తెలుస్తాయి. అట్లా తెల్సుకొని తెలుగు భాషని కవిత్వాన్ని పొయ్యిల్లోకి, గుండిగల్లోకి తోసి సంతోషిద్దాం.
కవిత్వం మాథమేటిక్సు గాదు లాజికల్ గా ఆలోచించి చదువర్లని అలోచింపచేడానికి. కవిత్వం పొలికేకలు గాదు. కవిత్వం జాగ్రఫీ, తిండియావ గాదు.
కవిత్వం గురించి చదవండని పక్కవాళ్ళకి సలహా ఇచ్చేముందు మనమెంత చదవేసామో చూసుకోవడం మంచిది.
మాబాపదిగనోడు అభిప్రాయం:
September 6, 2007 5:15 am
సుబ్రహ్మణ్యం గారు,
“కవితా సారాన్ని వచనంలో వివరించడం కవిత్వాన్ని అవమానించడంగానే భావిస్తాను.” అని అన్నారు బాగుంది. కానీ, అసంపూర్తిగా వదిలేసిన వాక్యం వచనం కాకుండా, కవిత్వం అయిపోతుందా?
“ఎంతదారి తప్పి
ఎక్కడెక్కడో తిరిగినా
ఎట్టకేలకు నీటి జాడ”
పైది వచనం కాదా?
“గలగలలాడే
సెలయేటి
అలలన్నీ
వెలిగిపోతూ…”
సెలయేట్లో అలలు ఎక్కడుంటాయండీ? గలగల పారే సెలయేరులో అలలా?…… ఏదో తేడాగా ఉంది. ఇకపోతే, మీరు వాడిన శైలి శేషేంద్ర శర్మ గారి శైలి లాగానే ఉంది. కాకపోతే, మీ రచనలో మీరు పాఠకుల బుర్రకి మరీ పని పెడదామన్న తాపత్రయంలో కొంచం దారి తప్పారు అనిపించింది.
@అలోక్,
మాదిగలు, బాపనోడు ఎక్కడి నుంచి పట్టుకొచ్చావ్? ఇక్కడ జరుగుతున్నదేమిటి, మీరు మాట్లాడేదేమిటి? ఓ గద్దర్ జనపదంలో పాటలు కట్టి పాడాడంటే అర్థం ఉంది. కనీసం ఆయన వాళ్ళ కర్థమయ్యే భాషలో పాడతాడు. తమరు వక్కాణించిన పెద్దవాళ్ళ కవిత్వం పెద్దవాళ్ళు చదువుకోటానికి , విమర్శించుకోటానికి, పీ.హెచ్.డి లకి పనికొస్తుందంతే. అందులో ఒక్క అక్షరం ముక్క నువ్వు అన్న ఆ పేద జనానికి అర్థం కాదు. అయినా, ఇదేం జబ్బో! దళితుల్ని పొగిడి, బ్రాహ్మణున్ని తిడితే గొప్పవాడైపోతామనుకుంటారెందుకో?
KS Kiran Kumar అభిప్రాయం:
September 6, 2007 6:34 am
కృష్ణ గారు
అసలు ఈ కవిత కన్నా కూడా, మీ విమర్శ మాత్రం అర్ధం కావడంలేదు. ఒకవైపు మనసును హత్తుకునే భావం లేదంటూ.. ఇందువల్లే మన భాషకి అధోగతిపడుతున్నదని ప్రకటించేసారు.
ఈ కవితలోని భావం మీకు అర్ధం కాలేదంటే, ఏవో కవితా సంకలనాలు చదివి పదును పెంచుకోమని మీకూ ఓ ఉచితసలహా పారేయొచ్చు. కానీ, ఈ కవితలోని ఏ భాష మీకు అర్ధం కాక, మన భాష అధోగతి పడుతోందని బాధపడుతున్నారో!!
సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్లు, ఈ భావనతో వచ్చిన ఇతరత్రా కవితలని మీరు ఇక్కడ ఉదహరించితే, విమర్శ మరింత సూటిగా ఉండగలిగేది.
‘యదుకులభూషణ్ గారు వ్రాసిన ‘నేటికాలం కవిత్వం తీరుతెన్నులు’ మీరోసారి చదివి, విమర్శలు ఎలా పదునుగా ఉండాలి అనేది నేర్చుకుంటే బాగుంటుంది.
అలానే మరోసారి అలోక్ గారు వ్రాసిన విషయం ప్రశాంతంగా చదవండి. ఆయన ఏం చెబుతున్నది అర్ధం అవుతుంది.
Subrahmanyam Mula అభిప్రాయం:
September 6, 2007 7:42 am
మాబాపదిగనోడు గారు,
“కవిత్వాన్నీ, వచనాన్నీ విడదీసే ప్రాథమిక అంశాలేవి?” , “పాఠకుడు కవి స్థాయికి ఎదగాలా , కవే పాఠకుడి స్థాయికి దిగాలా” వంటి మౌలిక ప్రశ్నల దిశగా చర్చ సాగుతోంది. వీటి మీద ఇప్పటికే లెక్కలేనన్ని వాదనలు జరిగాయి. మీరు , నేను కొత్తగా చర్చించేదేమీ లేదు. కిరణ్ గారు చెప్పినట్టు యదుకుల భూషణ్ గారి “నేటికాలపు కవిత్వం — తీరు తెన్నులు” పుస్తకం చదవండి. ఆయన అభిప్రాయాలతో మీరు ఏకీభవించకపోయినా ఒక కొత్త కోణాన్ని చూసినవారవుతారు. ఈ సైటులోనే ఉన్న ఇస్మాయిల్ గారి “కరుణ ముఖ్యం” పుస్తకం కూడా చదవండి వీలైతే.
కొత్తపాళీ అభిప్రాయం:
September 6, 2007 5:56 pm
మీరంతా ఏదో కృష్ణగారికేవీ తెలీనట్టు సలహాలివ్వొచ్చారే?
శేషేంద్రశర్మని తెలిసినవారికి ఈ మాత్రం తెలీదనుకున్నారా? ఐనాఎంత అమాయకులండీ … అది చదవండీ ఇది చదవండీ అని సలహాలు చెప్పినంత మాత్రాన వినెయ్యడానికి ఆయనేం వెర్రివాడా? పద్యం రాసి దానిమీద సంజాయిషీ ఇవ్వాల్సి రావడం జోకుని వివరించడం కన్న ఘోరం. అరణ్యకవితలకి ఆ దుస్థితి పట్టలేదనే నేననుకుంటున్నా.
కొత్త రవికిరణ్ అభిప్రాయం:
September 6, 2007 6:08 pm
వావ్.. నాకైతే మళ్ళీ అడవుల కెళ్ళి వచ్చినట్టే అనిపించింది. బాగా వ్రాశారు సుబ్బూ..
కొత్త రవికిరణ్
Hanumantu అభిప్రాయం:
September 6, 2007 8:37 pm
చాలాకాలానికి మంచి కవిత్వం చదవటం తటస్థించింది.
ఈ కవిత గుంటూరు శేషేంద్రశర్మ గారి శైలిలా ఉన్నదనటం ఆశ్చర్యం.
కృష్ణగారి విమర్శ ఏమాత్రం సహేతుకంగా లేదు. ఇందులోని భావం అర్ధంకాలేదని భాషను ఎద్దేవా చేయటంలోని ఔచిత్యం ఏమిటో?
‘అడవి అందంగా ఉన్నదని ఏం రాసినా చెల్లుబాటౌతుందా?’ అని అడిగారు. ఈ కవితలో మీకు అడవి అందమే కనిపించి, భావం అర్ధంకాకపోవటం, విమర్శకుడుగా మీరు సాధించిన / సాధించని పరిణితి మాత్రం స్పష్టంగా తెలుస్తున్నది.
బహుశా ఆయావాద కవిత్వాలు తలకెక్కించుకొని , అదే కవిత్వం అనుకునే ధోరణితో రాసిన విమర్శే కానీ, సహేతుకమైన విషయం ఒక్కటీ లేదు.
Alok అభిప్రాయం:
September 6, 2007 9:53 pm
“చదివాక మనల్ని అలోచింపచేసేదిగా లేదు” అని మీరే గదా అన్నది. అందుకనే ఈరోజుల్లో “ఆలోచింప”జేస్తున్న కవితల వరైటీల్ని చెప్పా. అందులో భాగమే వాళ్ళని పట్టుకొచ్చా. నేను దళితుల్ని పొగిడినట్టు బాపనలని తిట్టినట్టు మీకెలా, ఎందుకు, ఎక్కడ కనిపించిదో నాకర్ధమ్ కాలేదు. ఇది చాలు మీకు చదవడం రాదని. చదివినా అరకొరగానే చదూతారని తెల్సుకోడానికి. ముందు మీరు “సరిగ్గా”చదవడం నేర్వండి సార్
“అసంపూర్తిగా వదిలేసిన వాక్యం వచనం కాకుండా, కవిత్వం అయిపోతుందా?”
విమర్శకుడు ఇంత పేలవంగా మాట్టాడ్డం అవమానకరం. అసంపూరి వాక్యం వచనం అనెవరన్నారో రెఫెరెన్స్ చూపండి. మీరుదహరించిన వాక్యాలు మీకు అర్థం కాకపోడమే కవి చేసిన తప్పా?
మళ్ళీమళ్ళీ శేషేంద్రశర్మ గారి పేరెత్తుతున్నారంటే మీకు వారు తప్ప ఇంకొహరు తెలీదన్న మాట. తప్పు సార్. విమర్శకుడిగా అవతారమెత్తాక కూపస్థమండూకావతారాన్ని విడిచితీరాలి.
చివరగా ఒక సలహా…క్రిష్న అన్న పేరు బావులేదనా డుండుండిగాడిగా టైపు పేరుతో వొచ్చారు. ఊరుమారినా ఉనికి మారునా అన్న తీరున మీరు జేసే జ్ణానోపదేశానికి మళ్ళీ మళ్ళీ నామకరణాలు జేసుకొనే అవసరం లేదులేండి.
Raghothama Rao C అభిప్రాయం:
September 6, 2007 11:22 pm
కృష్ణ గారూ,
మీ వాదనలోను, విమర్శ లోనూ లోపాలు ఉన్నాయి. యదుకులభూషణ్ గారు వ్రాసిన “నేటి కాలపు కవిత్వం, తీరుతెన్నులు” తప్పక చదవాల్సిన పుస్తకం. మీరు అది చదివి అర్థం చేసుకునే వరకూ వాదనలు అనవసరం.
నమస్తే
రఘు
తెలుగుఅభిమాని అభిప్రాయం:
September 7, 2007 12:01 am
అడివిమనుషులంమనము.( కుంచెం వేరే రకమైన అడవిలో
తప్పిపోయి ఉన్నాముకదా.) అందుకే అడివి కవితలు
తొందరగా ఇష్టపడలేము.అలాగే కృష్ణగారి విమర్శ
కూడా స్వాగతించదగ్గదే. నాలుగు మినీ కవితలను కలిపి
ఒకేచోట వేసినట్టుంది. ఎక్కడో చదివిన భావంకలిగినా
మంచిపాటను మళ్ళీ మళ్ళీ విన్నట్టుగా తప్పులేదు కదా.
Alok అభిప్రాయం:
September 7, 2007 12:07 am
హనుమంతుజీ చక్కగా అడిగినారు.
sree Rama Murthy అభిప్రాయం:
September 7, 2007 4:29 am
కృష్ణ గారి అభిప్రాయంతో ఏకీభవిస్తాను.
J K Mohana Rao అభిప్రాయం:
September 7, 2007 7:01 am
చూడ్డానికి ఒకేలా ఉన్నా
దేని అందం దానిదే!
అని కవితలోనే వ్రాయబడినది కదా!
ఎందుకో ఇంత తర్జన-భర్జనలు?
అన్ని కవితలు ఛందోబద్ధముగా నుండ నవసరము లేదు.
అన్ని కవితలు ఒక ప్రత్యేక కవి వ్రాసినట్లు ఉండవలసిన
అవసరము లేదు. లోకో భిన్నరుచిః
ఎవరికివారే యమునాతీరే! కవితాభావము ఉంటే
చాలు కవిత్వానికి. దానిని జూవాలజీ విద్యార్థి కోసే
ఒక కప్ప కళేవరములా కోయ నవసరము లేదు.
నచ్చితే మఱొక సారి చదవండి.
- మోహన
మాబాపదిగనోడు అభిప్రాయం:
September 7, 2007 9:33 am
“కవిత్వం మాథమేటిక్సు గాదు లాజికల్ గా ఆలోచించి చదువర్లని అలోచింపచేడానికి. కవిత్వం పొలికేకలు గాదు. కవిత్వం జాగ్రఫీ, తిండియావ గాదు.”
అయ్యా అలోకు,
మొదటగా నేను కృష్ణ ను కాదు. కవిత్వం ఏది కాదో చెప్పినంత తేలిక కాదు, కవిత్వం ఏదో చెప్పటానికి. నేను ఓ పాఠకుణ్ణి, అంతే. కృష్ణ అన్న వ్యక్తి ఏమన్నాడో నాకనవసరం. కవిత్వానికి లాజిక్కు అక్కరలేదా? ధన్యోస్మి. గుడ్డిలో మెల్ల, ఇంకా నయం, లాజిక్కు లేనిదంతా కవిత్వమే అనలేదు. నా అభిప్రాయం నేను చెప్పాను, అంతే. అయినా, రచయిత కున్నపాటి సహనం తమరికి లేకపోయింది. ఇంతచెప్పి మరి, సెలయేటి అలల గురించి (రచయిత గారిని అవమానించే ఉద్ధేశ్యంతో కాదు సుమా) మాట్లాడలేదే మరి?
“నేను మాదిగనురా బాపనోడా అని పొలికేకలెట్టడవే కవిత్వమా కృష్ణాజీ? ”
పై వాక్యానికి, ప్రస్తుత చర్చ కి ఏ విధంగా సంబంధం ?
సుబ్రహ్మణ్యం గారు,
మిమ్మల్నేదో విమర్శించ్చేద్దామని చదవలేదు. నా అభిప్రాయం చెప్పా.
“యదుకుల భూషణ్ గారి “నేటికాలపు కవిత్వం — తీరు తెన్నులు” పుస్తకం చదవండి. ఆయన అభిప్రాయాలతో మీరు ఏకీభవించకపోయినా ఒక కొత్త కోణాన్ని చూసినవారవుతారు.” అన్నారు. త్వరలో తప్పక చదువుతాను.
కానీ ముందుగా ఒక పుస్తకాన్ని చదివి, దాని ఆధారంగా కవిత్వాన్ని అర్థం చేసుకోండి, అని అనటం భావ్యమా? రాగాలు తెలుసుకొనే, సంగీతాన్ని ఆస్వాదిస్తామా?
chavakiran అభిప్రాయం:
September 7, 2007 9:33 pm
అయితే మీరెవరూ సెలయేటిలో అలలు చూడలేదన్న మాట!
KS Kiran Kumar అభిప్రాయం:
September 7, 2007 9:35 pm
మాబాపదిగనోడు గారు కొంపదీసి కవిత్వానికి లాజిక్ అవసరమని, లాజికల్ గా వ్రాసిన ప్రతీది కవిత్వమని తీర్మానిస్తున్నారా ఏమిటి? కొద్దిగా వివరించమని మనవి.
:)
Alok అభిప్రాయం:
September 7, 2007 10:42 pm
ఓహో మీరు క్రిష్న గారు కాదా? కానీ మీరిద్దరూ గుంటూరు శేషేంద్రశర్మ గారినే ఉటంకిస్తారా? “వాక్యాలన్నిటినీ ఒకే పేరాలో వ్రాయకుండా విరిచేసి నాలుగో ఐదో పంక్తుల కట్టలు కొన్ని చదవడానికి పడేశారు. అలా నింపడమేనా కవిత్వం అంటే? ” అని క్రిష్న గారంటే “అసంపూర్తిగా వదిలేసిన వాక్యం వచనం కాకుండా, కవిత్వం అయిపోతుందా” అని మీరడిగారు. ఇద్దరి వాదనలూ అర్ధరూపాయి గాదు రెండు పావలాలన్నట్టే వుంది !! సర్లేండి మీరిద్దరూ ఒకటా వేరా అన్నది దండగమారి విషయం.
“కవిత్వానికి లాజిక్కు అక్కరలేదా? ”
మీలాంటి లోతైన అధ్యయనశీలి కం పాఠకుడు ఇట్టాంటి ఉబుసుపోని ప్రశ్న వెయ్యడం విచారకరం. లాజిక్కు లేనిదంతా కవిత్వమా అన్న ప్రశ్నలో మీ భోళాతనం, నేటి తెలుగు సాహిత్య పాఠకుని దివాలాతనం కనపడుతోంది. సంతా సింగు బంతాసింగు జోకుల్ని కూడా అద్భుతమైన కవిత్వం అనే మరో తరం త్వరలోనే పుట్టుకొచ్చే సూచనలు కనపడుతున్నాయ్.
కవిత్వానికి లాజిక్కు బద్ధశతృవు. సృజనాత్మకతకు లాజిక్కే పునాదైతే క్రిష్న గారు ఇక్కడే వున్న రవిశంకర్ గారి కవితలో “అద్భుతమైన చిత్రా”న్ని ఎట్లా చూడగలిగారో లాజికల్ గా చెప్పమనండి. పూలదోసిళ్లతో చెట్లు నీళ్ళు పట్టుకోడమేవిటి? చలిగాలి మనసుని కోయడమేవిటని కవిగారు వచ్చి లాజికల్ గా వివరించనివ్వండి. ఇంత లాజికల్ సర్కసూ జరిగాక కవిలోనూ, పాఠకునిలోనూ సున్నితత్త్వం, సృజన బతికుంటుందో లేదో మీరొచ్చి చెప్పండి.
“ఇందువల్లే మన భాషకి అధోగతి పడుతోంది” అని క్రిష్న గారు అసంబధ్ధంగా బాధ పడగాలేంది నేనేసిన ప్రస్న ఎట్లా అసంబద్ధం మాబా గారూ? ఈ కవితలో కవెక్కడా భాషని చట్టుబండలు కానివ్వలేదే? ఇక్కడెవరో “అల్లాష్టకం” అని రాస్తే గౌ. సంపాదకులు గారు దాన్ని కవిత్వం కింద జమకట్టారు. ఆ అల్లాష్టకం కంటే ఈ కవితేమీ ఘోరంగా లేదే? మరి క్రిష్న గారు సడెన్ గా భాష గురించి కిందా మీదా పడ్డం అవసరమేనా? సంబద్ధమేనా?
ముందు వీటికి సూటిగా ఇద్దరూ కూడబలుక్కుని సమాధానాలివ్వండి. సెలయేటి అలల గురించి చెప్పడం ఆనక….
చివరగా, రాగాల గురించి తెల్సుకొన్నవారు సంగీతాన్ని ఇంకా ఎక్కువగా ఆస్వాదించగలరు. పాడాలని వుంది కార్యక్రమంలో పాల్గొన్న 10 ఏండ్ల పాపకు కూడా ఈ సంగతి తెల్సును.
Subrahmanyam Mula అభిప్రాయం:
September 8, 2007 12:03 am
మాబాపదిగనోడు గారు,
సంగీతాన్ని ఆస్వాదించడానికి రాగాలు తెలియక్కరలేకపోయినా , అందులోని లోటుపాట్లు తెలుసుకోడానికి తెలియాలి కదా! భూషణ్ గారి పుస్తకం చదువుతామన్నారు. చాలా సంతోషం. ఇండియాలో ఉంటే మీ అడ్రసు subrahmanyam.mula@gmail.com కి మెయిల్ చెయ్యండి. పుస్తకం పంపే ఏర్పాటు చేస్తాను.
ఇస్మాయిల్ గారి కరుణ ముఖ్యం కింది లింకులో ఉంది. చదవండి వీలైతే.
http://eemaata.com/em/category/library/karunamukhyam/
అలాగే కింది వ్యాసం కూడా చదవండి. మీకు ఉపయోగపడొచ్చు.
http://www.telugupeople.com/discussion/multiPageArticle.asp?id=32265&page=1
ఇక కవిత్వంలో తర్కం ఎందుకుండకూడదో అన్న విషయం మీద నాగరాజు గారు చక్కని వ్యాసం రాసారు. కింది లింకు చూడండి.
http://canopusconsulting.com/salabanjhikalu/?p=53
C.S.Rao అభిప్రాయం:
September 8, 2007 10:05 pm
I have been following the ongoing debate over Sri.Mula Subramanyam’s poem “Aranya Kavitalu” .
Though it is not easy to define poetry leaving no room for controversy ,I think it is fairly established that a poem should communicate at least a measure of the poet’s creative imagination of which it has been born even on the first reading.It is useful to recall what T.S.Eliot said of poetry in this context,and that is,that poetry isenjoyed even before it is understood.This enjoyment results from the suggestive power of the mataphorical language used in the poem ,the pleasing pictures it evokes,the captivating rhythms it generates,and above all,the haunting feeling it engenders.To what extent has this function been fulfilled by a poem should only be a matter of concern in a literary debate,and nothing else.
I should say in all good faith that all those who have so far participated in the present debate seem to be well read ,capable of a logical and sustained argument.But it is to be remembered by all of us we can disagree without being disagreeable.The tenor and texture and force of an argument in a literary debate should only be,yes,should only be literary in character.We can make it a very pleasant ,infornative and memorable debate by avoiding saying personal things which tend to hurt the feelings of any of the participants.
krishna అభిప్రాయం:
September 9, 2007 3:26 pm
నా అభిప్రాయాన్ని తెలుపుకునే అవకాశం ఉన్నది కనుక ఇక్కడ చెప్పటం జరిగింది. అదేదో తేనెతుట్టె కదల్చడం అని ఊహించలేదు. సరే! మీ సలహాననుసరించి మీరు సూచించిన పుస్తకాలలో చదవనివి చదవటానికి ప్రయత్నిస్తాను. కానీ నేను చేసినది కేవలం అభిప్రాయమం తెలుపడమే! పూర్తి స్థాయి విమర్శ కాదు. అలా విమర్శ చేసి ఉంటే సవివరంగా అన్నీ విడమర్చి ఉండేవాడిని. అభిప్రాయ విస్తరణ భీతి వల్ల కొద్దిగానే చెప్పవల్సి వచ్చింది.
నేను మీ ఇంటికి వచ్చినపుడు మీరేదో తెలుగువాడని మీ ఇంట్లో ఆవకాయ వేసి భోజనం పెట్టారు.. ఎందుకనో అది నాకు నచ్చలేదు. నా అభిప్రాయం తెల్సుకుందామని మీరు ఎలా ఉంది అని అడిగితే నిర్మొహమాటంగా బాలేదని చెప్పాను. అయితే అక్కడితో ఆగకుండా నాకు కనిపించిన లోపాలూ చెప్పాను. పాతగా ఉందనో, నూనె ఎండిపోయిందనో, కారం లేదనో, ఇంకేదో లేదనో చెప్పాను. దానికి మీరు, నేను ఏమీ చేయలేం. మీకు నచ్చినా అది నా జిహ్వకు నచ్చలేదు. ఇప్పుడు అర్గెంటుగా ‘ఆవకాయ చేయడం ఎలా?’, “నేటికాలంలో ఆవకాయ తీరుతెన్నులూ” అన్న పుస్తకాలిచ్చి చదవమంటే అవి చదివినా నా నోటికి రుచి కొత్తగా పుట్టి మీ ఆవకాయను ఓహో అనలేం కదా. (ఆ పుస్తక రచయితల్ని అవహేళన చేయడం నా ఉద్దేశ్యం కాదు. నా భావాన్ని వివరించడమే నేను చేస్తున్నది.) నేను ఎంతో ఇష్టంతో కొన్ని యేళ్ళుగా ఆవకాయ తింటున్న నా అనుభవం మీరు కాదనలేనిది.
ఒక కవిగా విమర్శో అభిప్రాయమో యుక్తం అనుకుంటే స్వీకరించండి. లేదంటే మీ ఇష్టం. ఇక కొంత మంది అభిప్రాయాల్లో చెప్పినట్లు వారు సూచించినవన్నీ నేను చదవాక కానీ అభిప్రాయాలు వ్రాయకూడదంటే మీకు విమర్శకులు దొరకడం కష్టమే మరి!
ఇక ఈ కవిత(ల)లో నేను వెతికింది లాజిక్కు కాదు. ఒక అందమైన భావ చిత్రణ, దాన్ని నూతనంగా ఆవిష్కరించడం. అదేమంత గొంతెమ్మ కోరిక కాదనుకుంటా. ఇక్కడే ఉన్న రవిశంకర్ గారి కవితలో నాకు కనిపించింది అదే. అదే, మనసును స్పందింపజేసి ఒక క్షణ కాలమన్నా ఆహా అనిపించేట్టు చేసింది. అలా చేయనిది కూడా కవిత్వమే అనమంటే, నేను అనలేను. భావ చిత్రణలో లాజిక్కు ఉందా అంటే భౌతిక శాస్త్ర రీత్యా లేదు. చెట్టుకు పూలదోసిళ్ళు అంటే ఏ బయాలజీ ఒప్పుకోదు. కానీ దానికి స్పందించే మనసు, సృజనాత్మకత పెద్ద పీట వేస్తాయి. దానికి కవిత్వం అని పేరు పెడుతుంటాయి. కవిత్వం అంటే ఇది అని నిర్దిష్టంగా ఎవరూ చెప్పలేకపోయినా రసజ్ఞత కలిగిన మనసనే హంస రాసిన దాంట్లో కవిత్వాన్ని వేరు చేసి చూసి ఆనందిస్తుంది. అది నాలుగు పాదాల్లో ఉందా? ఛందస్సులో ఉందా? మాదిగనో బ్రాహ్మణుడినో తిట్టిందా అనో మన వాదానికి సరిపోయిందా అనే అసంబధ్ధపు శషభిషల రంగు కళ్ళ్జోళ్ళలో చూడటం స్పందించే మనసుకు అనవసరం.
కవిగారూ, మీ కవితలో కొత్తగా చెప్పింది ఏమిటి? కిరణాలు అలల మీద పడడమా? ‘ఆకుల్లో దూరి… ‘ ఆ వాక్యంలో కొత్తదనం ఏది? ఆ వాడుక ఎన్నో సార్లు వాడబడిందే కదా. మీరు కొత్త విషయాన్నీ చెప్పలేదు, కొత్తగనూ చెప్పలేదు. అలాగే గులకరాళ్ళు. ఎంత పాతబడిపోయింది. మీరు ఒక విషయం మాత్రమే చెప్పారు. అడవిలో నీళ్ళు కనపడ్డాయి అన్నారు. అందులోకొత్తదనం ఏముంది? అందరికీ తెలిసినదే కదా. తప్పిపోవాలనుంది అన్నారు. ఆ భావాన్ని మీ అంతగా పాఠకుడు స్పందిస్తూ అనుకునేలా మీరు ఏం చేశారు? మొదటగా చదివినపుడు ఆ వాక్యాల ముందుభాగం పొరపాటున పడలేదేమో అని అనుకున్నాను. ఇక పూలు అన్నారు. పూస్తాయి, రాలిపోతాయి. నిజమే! మిరు చెప్పిన కవితలో అక్షరాలా నిజం ఉంది. కవిత్వం ఏది? ఏతావాతా మీ ‘కవిత’లో చాలా( information) విషయాలున్నాయి. (సీరియెస్ చర్చలో కాస్త సరదగా మాత్రమే వాడాను. వాతావరణం చల్లబరచడానికి)
మిగిలినవారిలో ఒకొక్కరూ ఎవరికి తోచింది వారికి వ్రాశారు. అది వారిష్టం. కానీ నేను వ్రాసిమనది పూర్తిగా చదివితే భాష కు అధోగతి ఎందుకు పడుతోందో నేను వ్రాసింది స్పష్టమయ్యేది. ఈనాడు కవిత్వం చదివేవాళ్ళు మన యువతరంలో ఎంతమందుంటారు? అందుకు కారణాలెన్నో ఉన్నా.. కవిత్వం అద్భుతంగా ఉంటుందని 80 శాతం మంది అనుకోకపోవడం కాదూ ఒక ముఖ్య కారణం? బెంగాలీ వంటి భాషలు ఆయా ప్రాంతాల్లో నిత్య నూతనంగా ఉండటానికి జనులు పుస్తకాలు, కవితలూ చదవటం కాదూ ముఖ్య కారణం? మన భాషలో కవిత్వం వ్రాస్తే చదివేవాళ్ళు ఎంతమందో మనకు తెలియదూ. అందుకు కవిత్వం మీద ఆసక్తి ఉన్నవాళ్ళు అందరూ మంచి కవిత్వం రావడానికి తలో చెయ్యి వేయాలన్నదే నా భావన. విమర్శకులు, కవులు ఇలా అందరూ. అది తప్పని అనేవారు ఉండరనుకుంటా.
అనవసరంగా నాకు లేని భావాలను ఆపాదించి మరీ కొంతమంది మాట్లాడినా.. నాకు లేనప్పుడు ఉలకను. అయితే, సహృదయంతో ఆలోచించి, మంచి కవిత్వం వ్రాస్తూ తద్వారా మన భాషా గౌరవాన్ని ఇనుమడించుదాం. సుబ్రహ్మణ్యం గారూ కొత్త ఆవకాయ పెట్టండి. క్షణాల్లో మీ ఇంటికి వస్తా! తిండి గురించి వ్రాసేదే కవిత్వం అని నా భావన కాదని వేరే చెప్పక్కరలేదనుకుంటా. ‘కవితాత్మకత’ ఉన్న వచనం కూడా ఆనందంగానే చదువుతా. కవి గారికి నాఆక్రందన అర్ధం అవుతుందని ఆశిస్తా..
కవిత్వానికి తర్కం అవసరం లేదా? « వికటకవి అభిప్రాయం:
September 10, 2007 12:58 pm
[…]అగ్నికి ఆజ్యం తోడైనట్లు, చావా కిరణ్ గారిచ్చిన ఈ లంకె చూసి ఆ కవితలు, చర్చ చదివాక ఇక లాభం లేదురా అబ్బాయ్, నీ బాధని, నీ సంశయాన్ని బయటికి కక్కేయ్ అని ఆత్మ ఘోషిస్తూంటే, ఇదిగో ఇలా బయటకి చెప్పేసుకుంటున్నా!
కవిత్వానికి తర్కం అవసరం లేదా? […]
J K Mohana Rao అభిప్రాయం:
September 10, 2007 4:55 pm
ఈ కవితను చదవగానే, ప్రత్యేకముగా చివరి పంక్తులను,
ఎందుకో నాకు విల్లియం వర్డ్స్‌వర్త్ వ్రాసిన క్రింది పద్యము
జ్ఞాపకానికి వచ్చింది. చాల మంది ఈ పద్యాన్ని బడిలో
చదివే ఉంటారు. ఆ పద్యము -
She dwelt among the untrodden ways
Beside the springs of Dove,
A Maid whom there were none to praise
And very few to love:
A violet by a mossy stone
Half hidden from the eye!
Fair as a star, when only one
Is shining in the sky.
She lived unknown, and few could know
When Lucy ceased to be;
But she is in her grave, and, oh,
The difference to me!
మోహన
ప్రవీణ్ కుమార్ అభిప్రాయం:
September 10, 2007 10:07 pm
కృష్ణ గారు,
మొదటగా మీకు నా అభినందనలు. ఎందుకంటారా…? తేనెతుట్టెను కదిపి, తేనెటీగల బారిన పడ్డ వారికి తేనె పూసే ప్రయత్నం చేసినందుకు. (అయ్యయ్యో ఇది విమర్శ కాదు.) ఇక నాకు ఇంకా బాగా నచ్చిన విషయం మీ స్పాంటేనిటి(అంటే అర్థం సమయస్పూర్తి అనే కదా !?). మీ ఊరగాయ ఉదాహరణ చాలా చాలా ‘లాజికల్’గా ఉందండి. కానీ మీకులాగ తేనెతుట్టే కదిపే సాహసం చేయలెకపొతున్నను….ఎందుకంటే నాకు తేనెటీగలంటే చచ్చేంతభయం.
..
చివరగా నాకు నచ్చిన వాఖ్యం(దీని అవసరం ఎంతైనా ఉందిక్కడ!):
“నొప్పించక తానొప్పక తప్పించుకు తిరుగువాడే నేర్పరి సుమతీ”.
ఉంటాను..
మీ భాగ్యనగరం బ్యాచిలర్ ‘నంద
girinandini అభిప్రాయం:
September 11, 2007 7:29 am
బ్రహ్మాండమైన వ్యాసాలు, సమీక్షలు, కథలు చదివిన
తరువాత అందరూ ఎందుకు ఈ కవితపైన మాత్రమే
అభిప్రాయాలను ఇస్తున్నారు? అవి కూడా ఎంతో
బాగున్నాయి. వాటిపైన రాయరేం ఎవరూ.
- నందిని
నవీన్ గార్ల అభిప్రాయం:
September 11, 2007 7:32 am
కుక్క పిల్ల
అగ్గి పుల్ల
సబ్బు బిళ్ళ
ఆడ పిల్ల
……..కవితకేవి రెశ్ట్రిక్షెన్సు!!!!!
Sriram అభిప్రాయం:
September 12, 2007 8:23 am
అరణ్య కవితలు అనే కన్నా అడవి కవితలనో అరణ్యకవిత్వమనో అంటే బాగుండేది.
సంస్కృత పదమూ తెలుగు పదమూ కలిపి దుష్టసమాసం చేసారని కాదు. ఈరోజుల్లో కవిత్వానికి తర్కమే కాదు వ్యాకరణం కూడా అఖ్ఖల్లేదు కదా.
“అరణ్య కవితలు” అన్నది ఏంటో నాకు వినడానికే అన్ పొయెటిక్ గా ఉంది.
కేవలం నా అభిప్రాయం.
షరా: నేను స్వతహాగా ఛాందసుడినే కానీ, ఇది మాత్రం నా సహాధ్యాయి ప్రభావం.
girinandini అభిప్రాయం:
September 12, 2007 1:04 pm
కవితా అంటే కవిత్వము అని అర్థము.
తెలుగులోకి వచ్చేటప్పటికి దీర్ఘము
హ్రస్వము అవుతుంది. అరణ్యకవిత
దుష్టసమాసము కాదు. ఇక పోతే అది
వినడానికి పొయెటిక్ గా ఉందో లేదో అన్నది
వ్యక్తిగతమైన అభిప్రాయము. - మోహన
Sriram అభిప్రాయం:
September 12, 2007 9:43 pm
అరణ్యకవిత దుష్టసమాసం కాకపోవచ్చు. కానీ కవితలు అనేప్పటికి డు,ము,వు,లు ప్రధమావిభక్తి గుర్తొచ్చి తెలుగు పదం అనిపించేస్తోంది. మరి అరణ్యకవితలు కూడా దుష్టసమాసం కాదా?
నిజానికి, అరణ్యకవిత అంటే నాకు బానే ఉంది కానీ అరణ్యకవితలు అంటే మాత్రం అందంగా అనిపించట్లేదు.
సురేశ్ కొలిచాల అభిప్రాయం:
September 16, 2007 7:18 am
డు,ము,వు,లు వంటి తెలుగు ప్రత్యయాలు లేకుండా సంస్కృత పదాలను తెలుగు వాక్యంలో రాయడం దాదాపు అసంభవం. కవిత అన్న పదాన్ని “poem” (ఒక కవితా ఖండిక) అన్న అర్థంలో ప్రయోగించడం అర్వాచీనమైనంత మాత్రాన “అరణ్యకవితలు”, “విప్లవ కవితలు”, “వచన కవితలు”- ఇవేవి దుష్టసమాసాలు అయిపోవు. ఇక సమాసం అందంగా అనిపించడంలేదన్న అభ్యంతరం మోహనరావు గారు చెప్పినట్టుగా వ్యక్తిగతం. నా మట్టుకు నాకు అంత ఎబ్బెట్టుగా లేదు. - సురేశ్.
ravikiran timmireddy అభిప్రాయం:
September 16, 2007 12:35 pm
కవిత్వం గురించి ఫలాని, ఫలాన వాళ్ళు ఏం చెప్పేరో, విమర్శ గురించి, విశ్లేషణ గురించి ఏఏ పెద్ద తలకాయలు ఏం చెప్పెయో తెలుసుకున్న వాళ్ళే విమర్శ చేయదగ్గ వాళ్ళనే స్వరం వొకటి ఈ కవిత మీద వచ్చిన అభిప్రయాల్లో వినిపిస్తుంది. ఐతే వాళ్ళు చెప్పిన కవిత్వ లక్షణాలు కానీ, వాళ్ళు కవిత్వానికిచ్చిన నిర్వచనాలుగానీ, వాళ్ళు స్థిరీకరించిన విష్లేషణా పద్దతులు కానీ తెలీకుండానే, తెలుసుకోవాల్సిన అవసరంలేకుండానే, తెలుగొచ్చిన ప్రతివాడికీ, ఫలాని కవిత తనకు నచ్చిందో, నచ్చలేదో, నచ్చితే ఎందుకు నచ్చిందో, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో చెప్పగలీగే ఙ్ఞానం వుందని నా నమ్మకం.
కృష్ణ గారి అభిప్రాయంతో మొదలైన ఈ చర్చ, మూలా సుబ్రహ్మణ్యం గారి జవాబుతో దారి తప్పిపోయి, అలోక్ గారి అభిప్రాయంతో అసభ్యత వైపు జారిపోయిందేవో అనిపిస్తుంది. “మీకు కనబడనంత మాత్రాన అసలు నీరే లేదనేంత అవివేకులు కారని,” కృష్ణ గారికి మూలా గారు జవాబియ్యటంతోనే అసంబద్దవైన వాదం మొదలైందనిపిస్తుంది. ఒక కవితలో వుండేటటువంటి అందాన్ని, అర్థాన్ని, అనుభవాన్ని, అనుభూతిని కష్టపడి తవ్వితీయవలసిన అగత్యం, అవసరం పాఠకుడికి లేదనే నేను భావిస్తాను. రచయిత తన అనుభవాన్ని, తనలోని ఉద్వేగాన్నీ కవిత ద్వారా పాఠకుడికి ట్రాన్ఫర్ చేయలేకపోవటం ఆ రచన బలహీనతని సూచిస్తుందే తప్ప పాఠకుడి అవివేకాన్ని కాదు. ఉదాహరణల కోసం ఎక్కడకో పోవాల్సిన అవసరం లేదు, ఇదే సంచికలో ప్రచురించబడినట్టి విన్నకోట రవిశంకర్ గారి “వాన-పాట” నే ఉదాహరించ వచ్చు. అందం, భావుకతా రెంటిలోనూ వుండొచ్చు, కానీ వాన-పాటలో వున్నటువంటి కవితకి ఆత్మలాంటి ఆ సూపర్కండక్టివిటి, రచయిత ఎమోషన్ ని పాఠకుడి మనసులోకి ట్రాన్ఫర్ చేసి, కవిత చదివేసిన తర్వాత కూడా, మనసుని వదలిపోని వొక ఉద్వేగాన్ని సృష్టించగలిగే ఆ శక్తి మూలా గారి కవితలో లేదు. కొందరు మూలా గారి కవిత చదివి అడవికి పోయినంత అనుభూతి పొందగలిగేరని తెలుస్తుంది. అంత అద్రుష్టం నా బోటి సామాన్య పాఠకులకి లేదేవోనని నా అభిప్రాయం. దళిత కవిత్వం, లేక అయావాద కవిత్వాలని తలకెక్కించుకోని ఈ అభిప్రాయం చెబుతున్నానని, లేక ఫలాని వారి విమర్శనాత్మక పుస్తకం చదవకపోవటం వలననో, లేకపోతే నా సహజవైన అవివేకంవలననో ఈ కవితమీద ఈ అభిప్రాయానికి వచ్చానని ఎవరైనా భావిస్తే వారి వివేకానికి సంతోషిస్తాను. కొంచం భావుకత, నాలుగు సున్నితవైన, అందవైన పదాలు కవిత కాలేవని అరణ్య కవితల ద్వారా మూలా గారు నిరూపించారనే నేననుకుంటునాను.
Hanumantu అభిప్రాయం:
September 17, 2007 3:06 am
బాగు బాగు. అయ్యా తిమ్మారెడ్డి రవికిరణ్ గారు….
ఈ చర్చలో అసంబద్ధత ఎక్కడ మొదలయ్యిందనే విషయంలో మీరు కావాలనే పప్పులో కాలు వేసినట్లు అగుపిస్తున్నది.
పెద్ద తలకాయలో, పిన్న తలకాయలో కవిత్వం గురించి ఇచ్చిన నిర్వచనాలు, విశ్లేషించే పద్ధతులు సామాన్య పాఠకునికి అనవసరం. ఇవేవీ లేకుండానే కవిత బాగున్నదో లేదో అభిప్రాయం చెప్పగలిగే జ్ణానం సామాన్యపాఠకునికి ఉంటుంది.
కాకపోతే, ఎవరో ఒకరిద్దరు ‘భుజకీర్తులు’ తొడిగారన్న ‘ఘనకీర్తి’తో అసలు విశ్లేషించకుండానే ‘దాడి’ చేయటం విమర్శకునికి తగదు.
ముందస్తుగా అసలు కవితే అర్ధంకాలేదన్నారు కృష్ణ గారు. ఆపైన అరిగిపోయిన భావాలే అని తేల్చేసారు. ఆ భావాలతో భాషను అధోగతి పట్టించారనీ అపవాదు వేసారు. కవులూ కాస్త చదవటం కూడా చేయండనే సలహానూ పడేసారు.
అరిగిపోయిన భావాలతో వచ్చిన మునుపటి కవితలను మాత్రం ఉదహరించలేదు. భాషలో ఏ లోపం ఉన్నదో ఎక్కడా విశ్లేషణా లేదు. కవులే కాదు, విమర్శకులకూ చదవటం అవసరమే అన్న విషయాన్ని ‘వివేకంగా’ మరచిపోవటంలోని ఔచిత్యం నాలాటి ‘అవివేకులు’ అర్ధం చేసుకోలేరేమో!
‘విస్తరణభీతి’ వలన అభిప్రాయం మాత్రమే తెలియబరచానని కృష్ణగారు ప్రకటించి మరీ, దాదాపు యాభలైనుల పైబడి ‘అభిప్రాయం’ మాత్రమే వ్రాసారనుకుంటాను కానీ, విశ్లేషణ మాత్రం ఎందుకో వ్రాయలేదు.
సరదా సుబ్బారావు అభిప్రాయం:
September 18, 2007 6:06 pm
ఎంత ఆకలేసి
దిక్కులంతా కలియతిరిగినా
ఎట్టకేలకు ఆవకాయ జాడీ
ఆకలితో మరొక సారి
అలమటించాలనుంది
_____________
చిక్కనైన కమ్మనైన ఆవకాయ జాడీ
పిండిలో దూరి
కారంతో మమేకమై
కమ్మని నూనె తమని
ముద్దాడుతుంటే
పుల్ల్లనైన
ఆవకాయ
ముక్కలన్నీ
నోరూరిస్తూ…
_________________
తనలో మునిగిన
ప్రతీ మామిడి ముక్కకీ
దీక్షగా కారపు ఘుమఘుమల నూనె
ఒక రుచినిస్తోంది
చూడ్డానికి ఒకేలా ఉన్నా
దేని రుచి దానిదే!
_______________________
ఏ ఊరి ఆవకాయని చూసినా
ఆ ఘుమఘుమలు
నా ఆకలిలో ప్రతిఫలిస్తున్నాయి
కొన్నాళ్ళకి నేను
ఆవకాయి వేయడం మొదలు పెట్టాను
______________________
ఒకరితో
నిమిత్తం లేదు
ఆవకాయ పెడతారు
ఖాళీ అయ్యాక కడిగేస్తారు
మా మంచి బామ్మలు.
********************************
అయ్యా! సరదగా నేను వ్రాసినా అందులో ఉద్దేశ్యం కనిపెట్టలేనివారు కాదు. ఈ ఆవకాయ కవితలా మాత్రం కవితలు ఉండకూడదన్నదే కృష్ణ గారు చెబుతున్నారు. కాస్త నిదానించి అర్ధం చేసుకోండి.
కొత్త విషయమో లేక కొత్తగానో చెప్పమని అడిగితే ఎక్కడ చూశారో చూపండీ అంటుంటే నవ్వు వస్తోంది. ఏనాడో రామాయణం నుంచి ఈ మధ్య నాటి ఎంకి పాటలు.. దాక ఎన్ని వేల సార్లు అడవి నీటిపై కిరణాలు ప్రతిఫలించడం ఎన్ని వేల రకాలుగా మనం చదవలేదు? అవేవీ ఎవరూ చదవలేదా ఏమిటి కొంపదీసి? ఎన్నో ప్రబంధ కావ్యాలున్నయి కదా.. వాటి నిండా ఈ గొడవే కదా (నాకు అవి నచ్చాయి అన్నది వేరే విషయం!) కొత్తగా కూడా ఎంతో మంది భావకులు వచనంలోనే ఎంతో అందంగా ఈ విషయాన్నే కొత్తగా చెప్పారు.
chavakiran అభిప్రాయం:
September 19, 2007 2:01 am
సిగ్గు లేకుండా చెప్తున్నా
ఈ ఆవకాయ కవిత కూడా బాగుంది, నోరూరుతుంది.
Alok అభిప్రాయం:
September 19, 2007 4:04 am
అయ్యా తిమ్మిరెడ్డిగారు…అసలు విషయాని మీరిట్టా బమ్మిని చెయ్యడం సమయోచితంగాలేదు. మీలెక్కన రారా, చేరా వగైరాల్ని తోసవతల పారేద్దాం. ప్రతి దద్దమ్మనీ కవిత్వం గురించి రాసేయమనేద్దాం. కత్తెర పట్టుకొన్నాడుగదాని దర్జీని కూడా ఆపరేషను ధియేటర్లోకి వొదిలేద్దాం.
పాఠకుడిగా విఫలమైన క్రిష్న గారు విమర్శకుడిగా అవతరించడంతోనే సిసలైన అసంబద్ధత బయలుదేరింది. సదరు అసంబద్ధత మాబాదిగ గారితో పరుగులెట్టడం మొదలెట్టింది. చివరకు క్రిష్నగారు ఆవకాయ గురించి అనర్గళంగా ప్రసంగించడంతో శిఖరాగ్రం చేరింది. హమ్మయ్య అక్కడితో అసంబద్ధం శాంతించిందని సంతోషించేలోగా మీతో మళ్ళీ మొదలైంది. ఈ విపరీత అసంబద్ధత ముందు మీరు నాకు ఆపాదించిన “అసభ్యత” యేపాటి?
//కొందరు మూలా గారి కవిత చదివి అడవికి పోయినంత అనుభూతి పొందగలిగేరని తెలుస్తుంది. అంత అద్రుష్టం నా బోటి సామాన్య పాఠకులకి లేదేవోనని నా అభిప్రాయం// అని అనడం మీ సభ్యతేవో !! కానివ్వండి.
రవిశంకర్ గారి కవితలో విస్తరణ దోషముంది. సాగతీత వుంది. మీరన్నట్టు సూపర్ కండక్టివిటీ, రేడియోయాక్టివిటీ గట్రా యేవీ లేవు. మీరుత్తినే ఆపాదించేస్తే సరిపోదు. మీమాటల్లోనే చెప్పాలంటే “కొంచం భావుకత, నాలుగు సున్నితవైన, అందవైన పదాలు కవిత కాలేవని వానపాట ద్వారా రవిశంకర్ గారు నిరూపించారనే నేననుకుంటునాను”
మఠాధిపతులు, పీఠాధిపతులు,ముఠాధిపతులు వీరంగం జేస్తున్న వర్తమాన తెలుగు సాహిత్య ప్రపంచంలో స్వచ్ఛమైన అక్షరం కోసం తపించడం నేరం.భుజకీర్తులు భజనబృందాలు లేకపోవడం లోపం.వాదాలు బూజులు దులుపుకోవడం ద్రోహం.
Subrahmanyam Mula అభిప్రాయం:
September 19, 2007 5:10 am
గుడి గంటలు
మౌనంలోకి జారుకుంటాయి
చంద్ర కిరణాలు
కోనేటిని చేరుకుంటాయి
చిరుగాలి సైతం అలసిపోతుంది
ఆకుల శబ్దం ఆగిపోతుంది
వెన్నెలని నిండా కప్పుకుని
గన్నేరు చెట్టు నిద్రపోతుంది
గాయాలన్నీ మానిపోతాయి
సమస్యలన్నీ సమసిపోతాయి
నక్షత్రాల్లా మెరిసిపోతూ
అక్షరాలొక్కటే మిగిలిపోతాయి!
అరణ్య కవితల్ని తెగిడినవాళ్ళకీ, పొగిడినవాళ్ళకీ, పేరడీలు రాసినవాళ్ళకీ అందరికీ కృతజ్ఞతలు.ఇక ఈ చర్చని, వాదనల్ని ఇంతటితో ఆపేస్తే బావుంటుందని నా అభిప్రాయం. లేదు ఇంకా లాగీ, పీకుతామంటే మీ ఇష్టం.
Viswa K అభిప్రాయం:
September 19, 2007 9:19 pm
చాలా సరళంగా, సూటిగా ఉన్న కవిత ఇది.
అసలు ఇక్కడ అభిప్రాయాలు వ్రాసే వారికి, ఇతరుల అభిప్రాయం చదవటం, చదివినా అర్ధం చేసుకోవటం చేతనౌనా?
ముందుగా అలోక్ వాస్తవ్ వ్రాసిన మొదటి అభిప్రాయంలో అసభ్యకరమైనదేదీ నాకైతే కనిపించటంలేదు. ఒకే విషయాన్ని ఒకటికి పదిసార్లు చెప్పి లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నాలే ప్రస్ఫుటంగా అవగతమౌతున్నాయి.
అలాగే కృష్ణగారు చెప్పిందేమిటి? ఇక్కడ అర్ధం చేసుకుంటున్నదేమిటి? ఒక వాక్యానికి ఖండన ముండన సత్కారాలు చేసినంతమాత్రాన కవిత ఎలా అవుతుందని ఆయన ప్రశ్న. అంతేకాదు, ఆ సత్కారాల వలన భాషే చచ్చిపోతున్నదని ఆయన అభిప్రాయం.
ఆ ఘనసత్కారాలన్నీ విన్నకోటవారి వానపాటలోనూ కనిపిస్తున్నాయి కదా, మరి అది ఏవిధంగా కవిత అయ్యిందనేది కూడా చర్చించాలి. అలోక్ వాస్తవ్ చెప్పినట్లు, వానపాటలో అతివిస్తరణ దోషం ఉన్నదనేది నిస్సందేహం.
ప్రస్తుత కవితలోని సూటిదనం, సరళత్వం కృష్ణగారి దృష్టిలో కొద్దిగా మితిమీరి పేలవంగా కనిపించి ఉండవచ్చు. అంతమాత్రాన అది కవితే కాదనటం ఔచిత్యాన్ని మించి చేసిన విమర్శనా ప్రయత్నం.
m s naidu అభిప్రాయం:
September 25, 2007 1:25 am
As I am unable to type in telugu, i am writing this with my known English. After reading the above poem and the views on that and after it, i am thrilled and shocked. If this sort of criticism happens in newspapers, regularly, for example, can you analyze the situation and its repercussions. My intention is not to point out any body and the aftermath of a poem. Do we need a guide/mentor to appreciate a poem too?
Sivasankar అభిప్రాయం:
September 26, 2007 1:12 am
ఒక్కో మనిషి ఒక్కో రకముగా ఆలోచిస్తారు, వాళ్ళ వాళ్ళ పరిస్తితులను బట్టి వాళ్ళ మనసు స్పందిస్తూ ఉంటుంది.
ప్రపంచము లొ దేనికీ ఒక నిర్దిష్టమైన ప్రమాణాలు గాని కొలతలు గాని లేవు,యేదీ తప్పు కాదు యేదీ ఒప్పు కాదు.
అలాగే కవిత్వం కూడాను, మనస్సు లోని భావాలకు అక్షరాలు జత కూర్చి చెప్పినదే కవిత్వం.
సుబ్బు గారి కవిత్వం చాలా బాగుంది.
rudra అభిప్రాయం:
October 2, 2007 10:34 pm
నాకైతే చాలా రోజుల తర్వాత ఒక మంచి పంక్తి భోజనం చేసినట్టుంది నా తెలుగు సోదరులతో……కవిత రాసిన వారికి విమర్శ చేసిన వారికి, నా వందనాలు. చూస్తుంటే అందరూ కవనంలో బాగా పండిన కవుల్లాగున్నారు
మీరందరూ ఇలాగే తెలుగును ఆ భాషయొక్క తీయదనాన్ని అందరికీ పంచుతారనే భావిస్తాను….(కులాల ప్రసక్తి తేకుండా…..)
రానారె అభిప్రాయం:
October 23, 2007 9:04 am
ఆధునిక తెలుగు కవిత్వం మీద రసవత్తరమైన చర్చ జరుగుతోందని తెలిసి ఇలా వచ్చాను. కవితను ఠపీమని చదివేశాను. అభిప్రాయాలుగా మొదలైన వాదప్రతివాదాలనబడే చర్చను కూడా చదివాక నా అభిప్రాయాన్ని చెబితే దానికున్న విలువేపాటిదనే ప్రశ్నలొస్తాయేమోనని, అందుకు సాహసించలేకపోయినా ఒక్కటిమాత్రం చెప్పాలనిపిస్తోంది. సరదా సుబ్బారావుగారి పేరడీ దాని మూలంకన్నా నాకెంతో నచ్చింది. మూలంలో భావుకతను తెలిసినవైరికీ వెతికేవారందరికీ కూడా పేరడీలోనూ అంతే భావుకత కనిపించే వుంటుందని నా అంచనా. మూలం మీద ఆధారపడినదైనా పేరడీలో వున్న కొన్ని విలువలు నాలాంటి పామరుణ్ణికూడా రంజింపజేస్తాయి. అందుకే సరదా సుబ్బారావు జిందాబాద్!! చర్చ రచ్చగా మారేటప్పుడు C.S.Rao గారి ప్రవేశం అక్కడ ఆయన చెప్పిన సంగతులు ఏ చర్చలో పాల్గొనేవారైనా సరే ఒకసారి చదివి గుర్తుంచుకోదగినవనిపించాయి. జై తెలుగు తల్లి!
A. KISHORE BABU అభిప్రాయం:
November 5, 2008 1:07 am
సుబ్రహ్మణ్యం గారు
మీకు మొదట నా అభినంధనలు.
మీ కవితలు చాలా ఆలస్యంగా చదివాను.నేను కవితలు రాయను కానీ బాగా చదువుతాను. ఎక్కడైనా ఒక మంచి కవిత చూసినా హాయిగా చదువుకొని హృదయంలొ దాచుకొంటాను. ఇక్కడ కొంతమంది చేసిన విమర్శల గురించి ఎమీ పట్టించుకోకండి.అసలు ఏ కవి కూడా కవిత్వం కేవలం తనకోసం రాసుకొంటాడనేది నా అభిప్రాయము. ఆ సమయంలో కవి తాను పొందిన అనుభూతిని అక్షరాల్లో ఆవిష్కరించుకొంటాడు. అది మీరైనా, ఎవరైనా కావొచ్చు. మీ కవితల్లో ఎంతో అనుభూతివుంది.
“ఎంత దారి తప్పి
ఎక్కడెక్కడో తిరిగినా
ఎట్టకేలకు నీటి జాడ
అడవిలో మరొకసారి
తప్పి పోవాలని ఉంది”
ఎంత గొప్ప అనుభూతి. ఇది అనుభవించినవారికే తెలుస్తుంది. మరి కొన్ని కవితల్లో మీరు..
“సముద్రం నుంచి
పల్చటి నీటి పొర
రెక్కలు కట్టుకొని
రెప్పల కిందకి చేరుతుంటే
మౌనంగా
ఆ తీరాన ఆమె
ఈ తీరాన నేను”
…
“….
ప్రకృతి రంగులన్నిటిని
దోచెసుకొని రాత్రి
తూరుపు కొండ చాటున
మాటు వేసిన సూర్యుడు
రాత్రి మీద దాడి చేసి
వేటి రంగుల్ని తిరిగి
వాటికే ప్రసాదిస్తాడు”
ఆదునికత కబంధ హస్తాల్లో ఇరుక్కుని ఇప్పుడెలాగు ఆ ప్రకృతి రమణీయతకు దూరమవుతున్నాము.పచ్చటి పైర్లు, పల్లె లోగిళ్ళ అందాలు ఎక్కడా. ఆ ప్రకృతి వొడిలో తిరిగి తిరిగి అలసి సొలసి, సేదతీరి తమని తామె మైమరచిపోయే అదృష్టాన్ని కోల్పోతున్న కాంక్రీట్ జంగిల్ పక్షులం. కనీసం ఇలాంటి కవితలు చదివినప్పుడైనా మళ్ళి ఒకింత సేపు మనసు ఆ ప్రకృతి వొడిని ఊహించుకొని సేద తీరుంది. ఇక్కడ విమర్శకులను నేనేమీ అనడం లేదు. కాకుంటే ఒక మనవి..
నేడు తెలుగు అంతరించి పోతోందని, ముఖ్యంగా ఇంగ్లీషు మోజులో నేటి తరం తెలుగు భాషా సౌందర్యాన్ని మరచి పోతున్నారని బాధపడుతున్న తెలుగు లోకం ఒకసారి ఇలాంటి యువ కవులను వెన్ను తట్టి ప్రోత్సహించండి.ఇది మరికొంతమంది నవ కవులు పుట్టుకు రావడానికి దోహదపడుతుంది. కవులు కాక పోయినా ఫరవాలేదు, కనీసం తెలుగులో తమ భావావేశాన్ని అక్షరాలుగా మార్చే వారైనా పుట్టుకొస్తారు.
ఈ స్పూర్థితో మరికొంత మంది నవ కవులు (మీ దృష్టిలొ కవులు కకున్నా ఫరవాలేదు) కనీసం తెలుగులో తమ భావావేశాన్ని అక్షరాలుగా మర్చే వారైనా పుట్టుకొస్తారు..
“నేను బతకటానికి ఏమి కావాలి
ఒక్క చిరునవ్వు చాలు
ఆమె నవ్వింది
నేను బతికాను”
ఎప్పుడో కొన్నేళ్ళ క్రితం దారిలొ దొరికిన కాగితంలో కవి ఆశారాజు రాసిన కవితలో చివరి వాక్యలు ఇవి..
ఎంత తృప్తి కలిగించే కవితా ప్రయోగం, (వచనా ప్రయోగం అని కూడా అనుకోండి ఇబ్బంది లేదు).
“తెలుగు బతకడానికి ఏమి కావాలి
చక్కటి భావాన్ని వొలికే
నాలుగు కమ్మని
పదాలు తప్ప”
మంచి కవిత రాశారు
తెలుగు తల్లి నవ్వింది
అమృతంలాంటి తెలుగు
కవితా లోకానికి
మీకు ఇదే
నా చిరునవ్వుల స్వాగతం.
కవితాభినందనలతో
మీ
కిషోర్ బాబు