మా ఫ్రాన్స్ అనుభవాలు

సిలికాన్ సెమీకండక్టర్ పై సాంకేతిక పరిశోధన నా వృత్తి. 2002 సంవత్సరంలో, ఆస్టిన్, టెక్సస్‌లో నేను పని చేస్తున్న మోటరోలా కంపెనీ, యూరప్‌లో రెండు పెద్ద కంపెనీలయిన ఫిలిప్స్ సెమీకండక్టర్, ఎస్. టి. మైక్రోఎలెక్ట్రానిక్స్ లతో పొత్తు కుదుర్చుకొని, అత్యాధునికమైన సిలికాన్ చిప్స్ తయారీ కోసం ఫ్రాన్స్‌లో ఒక పెద్ద రిసెర్చి భవనాన్ని నిర్మించింది! మోటరోలా తరఫున ఒక అరవై మందిని ఎంపికచేసి నన్నూ అందులో ఒకడిగా అక్కడకి కుటుంబంతో సహా పంపించారు. ఫ్రాన్స్ వెళ్ళే విషయంలో నా భార్య (కల్యాణి) ఉత్సాహం చూపించటంతో, మా పిల్లలు రమ్య (12 ఏళ్ళు), అనూజ్ (8 ఏళ్ళు) వాళ్ళ, వాళ్ళ స్నేహితులని విడిచిపెట్టి వెళ్ళటానికి వీలుకాదని కొంచెం గొడవపెడుతున్నా, మూడేళ్లపాటు ఫ్రాన్స్‌లో ఉండటానికే నిశ్చయించుకున్నాం! కుటుంబంతో సహా ఒక దేశాన్నించి మరొక దేశానికి బదిలీ అవ్వటం చాలా కష్టమైన పని! అయితే, కంపెనీ పనిమీద వెళ్ళటం కాబట్టి, అన్ని విషయాల్లోనూ మోటరోలా సహకారం అందించింది. ఆస్టిన్‌లో మా ఇల్లు మోటరోలా కి అమ్మేసి, అందరం అక్టోబర్ 2002లో ఫ్రాన్స్‌కి బదిలీ అయ్యాము. అక్కడి మా జీవితంలోని కొన్ని అనుభవాలను “ఈమాట” పాఠకులతో పంచుకోవాలని ఈ వ్యాసం రాస్తున్నాను. ఇవి రాయటానికి రెండు కారణాలున్నాయి. మొదటిది, ఈమాట వంటి అంతర్జాతీయ వెబ్ పత్రిక నడపటంలో ఒక ముఖ్య ఉద్దేశ్యం – ప్రవాసాంధ్రుల అనుభవాలు అందరితోటీ పంచుకోటం కాబట్టి, ఈమాటను ఒక వేదికగా తీసుకొని మా అనుభవాలు పంచుకోవాలని. రెండవది, మేము ఫ్రాన్స్ నుంచి అమెరికా తిరిగి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అవుతోంది. మా జ్ఞాపకాలు, అనుభవాలు మరిచి పోకముందే వాటిని రాతపూర్వకంగా పొందుపరచాలని!

ఆస్టిన్ వదలి ఫ్రాన్స్ వెళ్లబోతుంటే, స్నేహితులందరూ, “అమెరికా వదలి ఫ్రాన్స్ వెళ్లటం మీకు సరదాగా ఉందా?” అని అడిగారు. ఒక పక్క ఫ్రాన్స్‌లో జీవితం గడపబోతున్నామనే ఉత్సాహం ( అంతకు మూడు వారాల ముందే, నన్ను, కల్యాణిని ఒక వారం రోజులపాటు, నేను ఫ్రాన్స్‌లో పనిచెయ్యబోయే ఊరికి మా కంపెనీ పంపింది. “మీకు అక్కడి వాతావరణం నచ్చితేనే వెళ్ళండి” అని నచ్చచెప్పాలని మా కంపెనీ వారి ఆలోచన. ఆ ప్రయాణంలో నాకూ, కల్యాణికి ఫ్రాన్స్ చాలా బాగా నచ్చింది!), స్నేహితుల్ని, తెలిసిన ఊరు, ఇల్లు, అన్నీ వదలి వెళ్ళటం వల్ల కొంత దిగులు, రాబోయే మూడు సంవత్సరాల్లో ఎటువంటి అనుభవాలు ఉంటాయో అని ఒక భయం – ఇలా రకరకాలైన ఆలోచనలతో ఆస్టిన్ వదిలాం. ఇలా మా కుటుంబం అంతా కలసి అమెరికా వదలి ఇంకో దేశంలో మూడేళ్ళు గడపటం, ( ఎప్పుడన్నా ఇండియా వెళ్ళినా, మూడు, నాలుగు వారాల మించి ఉండలేదు) ఇంతకు ముందు ఎప్పుడూ చెయ్యకపోటం వల్ల, ఉన్న దిగుల్ని పోగొట్టుకోటానికి, వెడుతూ, వెడుతూ నా కవల సోదరుడు రామన్న కుటుంబంతో, డెట్‌రాయిట్‌లో ఒక పది రోజులు గడిపి, ఫ్రాన్స్ చేరుకున్నాం! కొన్ని ముఖ్యమైన సామాన్లు మా వెంట తీసుకెళ్ళినా, ఇంటి సామానుల్లో ఎక్కువభాగం sea shipment ద్వారా పంపాము. అవి ఫ్రాన్స్ చేరటానికి ఆరు నుంచి ఎనిమిది వారాలు పడుతుందని తెలిసి, కంపెనీ వాళ్ళిచ్చిన అపార్ట్‌మెంట్‌లో మూడు వారాలు ఆస్టిన్‌లో మరో మూడు వారాలు ఫ్రాన్స్‌లో అపార్ట్మెంట్‌లో ఉన్నాం! ఫ్రాన్స్‌లో ఇళ్ళన్నీ చిన్నవని ముందే తెలియటం వల్ల, మా మాష్టర్ బెడ్ లాంటివి హ్యూష్టన్‌లో స్టోరేజీ లో పెట్టి వెళ్ళాం.

టెక్సస్‌లో ఆస్టిన్ చాలా అందమైన నగరం. అంతకన్నా అందంగా అనిపించింది, ఫ్రాన్స్‌లో గ్రెనోబుల్ అన్న చిన్న పట్టణం!ఈ ఊరి జనాభా అంతా లక్షన్నరకి మించదు. ఇది ఫ్రాన్స్ ముఖ్య పట్టణమైన పారిస్ నగరానికి దాదాపు 600 కిలోమీటర్లు దక్షిణ – తూర్పు దిశలో ఉంది. యూరప్‌లో అతి పెద్ద పర్వతశ్రేణి అయిన ఆల్ప్స్ పర్వతాలు ఫ్రాన్స్‌లో మొదలయ్యేది గ్రెనోబుల్ ఊరి దగ్గరే! వెళ్ళిన మొదటి వారంలో పిల్లల్ని స్కూళ్ళల్లో చేర్పించటం, ఇంట్లోకి కావలసిన సామాన్లు కొనుక్కోటం, ఊరులో ఎక్కడెక్కడికి వెళ్ళి ఏమేం కొనుక్కొవచ్చో తెలుసుకోటం లాంటి పనులతో సరిపోయింది. మొదటి రెండు వారాలు, పనికి కూడా వెళ్ళలేదు.


మా ఇంటి నుంచి కనపడే మంచు కప్పిన ఆల్ప్స్ పర్వతాలు

నెమ్మదిగా మా కుటుంబం అంతా మేం ఎటువంటి మార్పులకి సిద్ధపడ్డామో తెలియటం మొదలయింది. కల్యాణి, మా పిల్లలు — వాళ్ళ, వాళ్ళ ఆస్టిన్ స్నేహితుల్ని ఎక్కువగా గుర్తు తెచ్చుకుంటూ బాధపడ్డారు. దానికి తోడు ఫ్రెంచి భాష రాకపోటం మరింతగా బాధపెట్టింది. ఫ్రెంచి వారికి, వారి భాష మీద చాలా అభిమానం అని తెలుసుగాని, మరీ అంత “వీరాభిమానం” అని మేం ఫ్రాన్స్ వెళ్ళే దాకా తెలియలేదు. నాకు అక్కడి వాతావరణం కొత్తల్లో ఇబ్బంది పెట్టినా, నేను కూడా బాధ చూపిస్తే, కల్యాణి, పిల్లలు మరీ బెంబేలు పడతారని తెచ్చిపెట్టుకున్న ఉత్సాహంతో ఉండేవాణ్ణి. కల్యాణి నన్ను ” మీకు ఎటువంటి ఫీలింగ్సు ఉండవేమిటండీ? మీరు ఇంత నిబ్బరంగా ఎలా ఉంటున్నారు?” అని దెప్పేది! మా ఇంట్లో అందర్లోకి ఎక్కువగా ఇబ్బంది పడ్డది మా అబ్బాయి అనూజ్. రోజూ స్కూల్ నుంచి వచ్చి, మర్నాడు స్కూల్‌కి పోనని ఏడ్చేవాడు. అనూజ్ చదువుతున్న ఎలిమెంటరీ స్కూల్‌లో అంతా అనూజ్‌తో ఫ్రెంచ్‌లోనే మాట్లడేవారు. అనూజ్ నుంచి ఫ్రెంచిలో సమాధానం రాకపోయేసరికి, ఫ్రెంచి రాదని స్కూలు పిల్లలు ఏడిపించేవారు! నాకు, కల్యాణికి మా సమయం అంతా అనూజ్‌ని వోదార్చడానికే సరిపోయేది. ఒక్కొక్కప్పుడు, ఎందుకు చక్కని ఆస్టిన్ జీవితాన్ని వదిలి ఈ ఫ్రాన్స్ వచ్చామా అని బాధపడేవాళ్ళం. రమ్య హైస్కూల్‌లో ఉండటం, పైగా ఆ స్కూల్లో ఇంగ్లండ్, జర్మనీ, మొదలైన యూరోపియన్ దేశాల పిల్లలే కాక, ఆసియా, అమెరికా, ఆఫ్రికా ఖండాలలోని దేశాల పిల్లలు కూడా చదువుతుండటం వల్ల, ఫ్రెంచ్ భాష రాకపోటం మరీ అంతగా రమ్యను బాధపెట్టలేదు.

ప్రపంచంలో ఇలా ఒక దేశాన్నుంచి మరో దేశానికి పని కోసం వెళ్ళే కుటుంబాలకి, ఆ పై దేశంలో రాబోయే సవాళ్ళను ఎదుర్కొనడానికి, పెద్ద పెద్ద కంపెనీలు ఆ కుటుంబం అంతటికీ, ఆ కొత్త సంస్కృతికి అలవాటుపడే శిక్షణ (“Cultural Training”) పేరిట ఒక ట్రైనింగ్ ఇస్తారు. మోటరోలా కూడా మాకు అదే ఏర్పాటు చేసింది! ఇందులో భాగంగా, ఫ్రెంచి భాష నేర్చుకోటం, కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఎలా నడుచుకోవాలో, అక్కడ ఎదురయ్యే సమస్యలు ఎలా ఉంటాయో అన్న విషయాల మీద మాకు శిక్షణ ఇచ్చారు. అది కొంత వరకు ఉపయోగపడింది కుడా! మాకు ఈ శిక్షణలో ముందే చెప్పినట్టు, వెళ్ళిన మూడు నుంచి ఆరు నెలల్లో అతి ఎక్కువ స్తబ్ధత (డిప్రెషన్) కి మేమందరం గురి అయ్యాం. ముఖ్యంగా కల్యాణికి స్నేహితులూ, వాళ్ళతో సరదా కబుర్లూ చాలా ఇష్టం. ఒక్కసారిగా, ఫ్రాన్స్ రావడంతో, కల్యాణి ఈ కొత్త వాతావరణం లో ఇమడలేక ఉక్కిరిబిక్కిరి అయింది. దీన్ని తట్టుకోడానికి రోజూ ఒక 45 నిమషాలు విష్ణు సహస్ర నామం చదివేది (ఎం. ఎస్. సుబ్బులక్ష్మి టేప్ వింటూ). ఇందువల్ల జరిగిన మంచి ఏమిటంటే, రమ్య, అనూజ్ ఇద్దరికీ మొత్తం విష్ణు సహస్ర నామం కంఠతా వచ్చింది.

మేము మూడేళ్ళు సెంటిమియే (Saint-Ismier) అన్న పల్లెటూరులో ఉన్నాం! ఈ ఊరు గ్రెనోబుల్‌కి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. సెంటెమియే ఊరుకు, చిన్నప్పుడు ఆంధ్రాలో నా బాల్యం, హైస్కూలు చదువు వరకూ గడిపిన పశ్చిమ గోదావరి జిల్లాలోని “సరిపల్లె” అన్న చిన్న పల్లెటూరుకూ చాలా దగ్గర పోలికలున్నాయి. సెంటెమియేలో మా ఇంటి ముందు రోడ్డు ఎంత చిన్నది అంటే, రెండు కార్లు ఎదురెదురుగా వస్తూ ఒకదాన్ని దాటి మరొకటి వెళ్ళాలంటే, చాలా కష్టపడాలి. అంత ఇరుకైన రోడ్లు! మా ఇల్లు చిన్నదైనా, ఇంటి వెనకనున్న జాగా చాలా పెద్దది. మా ఇంటి నుంచి తూర్పు దిశగా చూస్తే, మంచుతో కప్పబడిన ఆల్ప్స్ పర్వతాలు కనపడతాయి. ఈ పర్వతాలు దాదాపు రెండు కిలోమీటర్లు ఎత్తుగా ఉంటాయి. జూన్ నెలలో, పర్వతాల పైనున్న మంచు కరగటం మొదలై, ఆగస్టు నెలాఖరకి, ఉన్న మంచంతా కరిగి పోతుంది. మళ్ళీ, అక్టోబర్ చివర్లో, ఈ కొండల మీద మంచు కురవటం మొదలవుతుంది! మేం ఉన్న ఇల్లు, ఆల్ప్స్ పర్వతాలకి పశ్చిమ దిశగా ఉన్న ఒక కొండ వాలులో కట్టారు. పొద్దున్నే సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఆల్ప్స్ కొండల వెనకాల నుంచి వచ్చే కిరణాలు లోయ అంతా నెమ్మదిగా పరుచుకొని ఒక వింత అందాన్నిస్తుంది. మా ఇంటి నుంచి కొంచెం దిగువగా చూస్తే, కొండల మధ్య ఉన్న లోయ ప్రాంతం అంతా చక్కగా కనపడుతుంది. మార్చి రెండో వారం నుంచి మొదలయ్యే వసంత కాలానికి, మొత్తం ఈ లోయలో ఉన్న మంచంతా కరగిపోయి, రకరకాలైన రంగులతో పూల మొక్కలు చిగురించి, ఏప్రెల్ నెలకల్లా, లోయ అంతా రకరకాలైన రంగులున్న తివాసీలా కనిపిస్తుంది. అప్పటికి చలి కొంచెం తగ్గటంతో, చాల మంది ఫ్రెంచి వాళ్ళు రోడ్ల మీద సైకిళ్ళతో కనిపిస్తారు. అన్నట్టు, ఫ్రాన్స్‌లో కార్లలో ప్రయాణించే వాళ్ళు, చిన్న చిన్న ఊర్ల గుండా వెడుతున్నప్పుడు, సైకిళ్లపై ప్రయాణిస్తున్న వారితో జాగర్తగా ఉండాలి! ఈ సైకిల్‌వాలాలకు రోడ్లపై ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు. రోడ్డు ప్రమాదంలో, కారు వెళ్ళి, ఒక సైకిల్‌వాలాకు కొడితే, అది అతి పెద్ద ప్రమాదంగా ఫ్రెంచి వారు చూస్తారు! అలాంటి సందర్భాలలో, కారు డ్రైవర్‌కి అతి పెద్ద శిక్షపడుతుంది!