లింఫోమా – ఒక ‘నిసి షామల్’ కథ

ఎలివేటర్ లో కిందికి దిగి వస్తూ 5,4,3,2 అలా లెక్కిస్తూ ఎప్పుడు లాబీ లెవెల్ వస్తుందా అని ఆత్రుతగా ఉంది నిసీ షామల్. ఎలివేటర్ ఆగగానే, తలుపు తెరుచుకుంటూనే బైటికి దూకింది.

ఓవ్! ఓవ్! అంటూ ఆమెను పట్టుకుని ఆపాడు లాస్లో బేకస్. ఆమె తల అప్పటికే టంగుమని అతని గడ్డానికి తగలటం అతనికి నక్షత్రాలు కనిపించటం జరిగిపోయాయి. ఐనా నిసికి నెత్తి మీద ఒత్తుగా జుట్టు, అతనికి ఇంతో అంతో పిల్లి గడ్డం ఉండటంతో అతనికి పెద్ద ఆపద ఏం కలగ లేదు.

“నిసి! ఏమిటా దూకుడు! ఎవరికీ ఉపద్రవం” అని ఎలివేటర్ ముందునుంచీ వేరే వాళ్ళకు అడ్డం లేకుండా నిసిని గోడ పక్కకు లాగాడు. కాసేపు ఆమెతో కబుర్లాడ్డానికి.

“లాస్లో! నీతో సొల్లు చెప్పటానికి నాకు టైమ్ లేదు. అదిగో ఆ ఇరాన్ పెద్దాయనని చూడ్డానికి నాకు కబురొచ్చింది.” అంది

పెద్దగా నవ్వాడు. “ఏ ఇరాన్ పెద్దాయనోయ్?”

“అబ్బా! ఏం చెప్పమంటావు. మా డిపార్ట్‌మెంట్ కబుర్లు, మీ మెడికల్ ఆంకాలజీ దాకా రానట్లు.” అంది నిసి. “ఈ మధ్య మాకు ఓ మెగా మెగా సెలెబ్రిటీ పేషెంట్ వచ్చాడు. నేను లింఫోమా సర్వీసులో రొటేషన్ తీసుకుంటున్నాను తెలుసుగా?”

“తెలుసు. తెలుసు. జగద్విఖ్యాతి కాంచిన, ఒళ్ళంతా ఒక్కసారే ఎలెక్ట్రాన్ రేడియేషన్ ట్రీట్మెంట్ మొదలెట్టిన మహిళామణి. నీ పేరు లాంటి పేరుగలిగిన ‘డాక్టర్ లార్డెస్ నీసీ’ దగ్గరేగా. పూసాన్, గోల్డ్ బర్గ్, ఇంకా ఎవరెవరున్నారక్కడ?”

“ఆ, అదే, ఆమె దగ్గరే. కాని నే చెప్పేది ఇంకో మరియా క్యూరీ. అదేనోయ్ నా బ్రెస్ట్ గురువు -’ఫ్లారెన్స్ చూ’ ఆమెగారు షా ఆఫ్ ఇరాన్ ని ట్రీట్ చేస్తున్నది. ఆమె గదా మరి డిపార్ట్మెంట్ చెయిర్మన్”

“వ్హాట్! ”

“ఇష్ ! ఇష్! అతి రహస్యం. ఎవరికీ చెప్పక నాయనా! నీకు దండం . సీక్రెట్ సర్వీసు వాళ్ళు నా దుంప తెంపుతారు.”

“ఇరేనియన్ రివల్యూషన్ తర్వాత రాజ్యం పోయి షా అక్కడా ఇక్కడా తల దాచుకుంటున్నాడు కదా”

“నిజమేనోయ్! ఆయన ఇక్కడే ఉన్నట్లు ఇంకా మీచెవుల దాకా రాలేదా. ఖుమేనీ నీకు కబురు పెట్టడం మర్చి పోయి ఉంటాడులే. లింఫోమా వైద్యం కోసం వచ్చాడు. ఖీమో మీ వాళ్ళు కాదులే. ఆ వైద్యం లేదు ప్రస్తుతం .” పెదవి విరుస్తూ చెయ్యి అడ్డంగా తిప్పుతూ అంది. “న్యూయార్క్ హాస్పిటల్లో డాక్టర్లు చూస్తున్నారు. అక్కణ్ణించి రాత్రిపూట టన్నెల్లో మెమోరియల్ కి తీసుకొచ్చి రేడియేషన్ ఇచ్చి పంపిస్తున్నాం. అంతా సీక్రెట్. ప్రతి రోజూ వేరే వేరే టైం లో వస్తాడు. బైటి ప్రపంచంలో ఎవరికీ తెలియదు. ”

“ఓ! మై గాడ్! ఓ మైగాడ్!” కొంచెం సేపు నిర్ఘాంత పోయి నిలబడి పోయాడు. నిసి నవ్వుకుంటూ, కొంచెం ఆదుర్దాతో ఎవరన్నా వింటున్నారేమో అని చుట్టూ చూస్తూ ఉంది.

“ఓహోహో! ఐతే ఇప్పుడు పగలు ఈ పరుగులేమిటి?“

“ఏముంది లాస్లో! ఈ షాలు, రాజాలు, రాణీలందరికీ నామీద వల్లమాలిన అభిమానం కలుగుతుంది. వాళ్ళకు జబ్బుగా ఉన్నన్నాళ్ళేలే. ఆ తర్వాత నేనెవరో, వాళ్ళెవరో. ఇప్పుడు మొత్తం పొట్టకంతా రేడియేషన్ ఇస్తున్నాం. దాంతో నాసియా, వాంతులు. మందులిస్తాం. ఐనా కాని అయనకు నేను అప్పుడప్పుడు వెళ్ళి పక్కన కూర్చుని చెయ్యి పట్టుకుని ఆ కబుర్లూ ఈ కబుర్లూ చెప్పాలోయ్. నాకు తురకం మాట్లాడ్డం కూడా వచ్చేసరికి, ఈ రాయల్ బేబీ సిట్టింగ్ కూడా నా పనుల్లో ఒకటి ఐపోయింది.”

లాస్లో అప్పటికి కోలుకుని విరగబడి నవ్వాడు. “రెండు వజ్రాలు కొట్టుకు రా. ఇద్దరం పంచుకుందాం.”

“నువ్వేం చేశావనీ?”

“నీ స్నేహితుణ్ణా కాదా?”

“పోవోయ్! షా దగ్గిరకొచ్చేసరికి అందరూ స్నేహితులే, ” అని రొమ్ము మీద చెయ్యి పెట్టి ఒక్క తోపు తోసి వెళ్ళి పోయింది నిసి.

లాస్లో నవ్వుకుంటూ తన ఆఫీసు కేసి వెళ్ళాడు. అంతకు ముందు మౌంట్ సైనాయ్ హాస్పిటల్లో పనిచేసినప్పుడు వాళ్ళకు స్నేహం కలిసింది. ఇద్దరూ ఫెలోషిప్ మెమోరియల్ హాస్పిటల్లో చెయ్యబోతున్నారని తెలిసినప్పుడు వాళ్ళు చాలా ఆనందపడ్డారు. రోజూ ఏదో ఒక మిష మీద కాసేపు మాట్లాడుకుంటే వాళ్ళ ప్రాణానికి తృప్తిగా ఉంటుంది. ఇద్దరూ పనిలో మంచి హుషారు, తెలివితేటలు చూపిస్తారు.

నిసి చెప్పిన వార్త లాటివి ఆ హాస్పిటల్లో తరచూ వినిపించేవే. వేరే వేరే దేశాలనుండి అథిక ధనవంతులు, ప్రసిద్ధులు, రాజులు, ప్రధాన మంత్రులు, ప్రెసిడెంట్లు వైద్యానికి వచ్చిపోతుండే కేన్సర్ హాస్పిటల్ అది.

ఇండియా ప్రెసిడెంట్ సంజీవరెడ్డికి లంగ్ కేన్సర్ వచ్చినప్పుడు వైద్యం అక్కడే జరిగింది. ఎడ్వర్డ్ బీట్టీ అప్పుడు హాస్పిటల్ ప్రెసిడెంటు, పేరు పడిన థొరాసిక్ సర్జన్. ఆయనకు ఆపరేషన్ చేసి స్వస్తత చేకూర్చి పంపాడు. అక్కడి డాక్టర్లు మాత్రం అందులో మంజిత్ సింగ్ బైన్ చెయ్యి చాలా ఉందంటారు. పేరుగొన్న ఆ ఇండియన్ థొరాసిక్ సర్జన్ అంటే చాలామందికి ప్రాణం. హాస్పిటల్ ప్రెసిడెంట్ బీటీ, రెసిడేంట్లూ, ఫెలోస్ కి ఒక రాత్రి అతని మేడ టెర్రేస్ మీద విందు ఇస్తూ, ఇండియన్ విద్యార్ధులకు ప్రత్యేకంగా తనకు, తన భార్యకు సంజీవ రెడ్డి ఇచ్చిన బహుమతులు – అశోక చక్రము, బుద్దుడి కాంస్య విగ్రహము – ఎంతో గర్వంగా చూపించడం, స్లోన్ కెటరింగ్ హాస్పిటల్ బైటికి నడుస్తున్న నిసి మనసులో మెదిలింది. తల ఎత్తి ఉత్సాహంతో ఆ భవనాల వంక చూసింది. ఎంత గొప్ప వైద్య శాల! ఏమి గొప్ప చదువుల కేంద్రమది. ఎన్ని కాన్ఫరెన్స్ హాల్స్ లో నిరంతరం అనేక రకాల కేన్సర్ వ్యాధుల మీద తర్జన భర్జనలు జరుగుతుంటాయి! ఎంతమంది ప్రాణ రక్షణ! అంతకన్న ఉత్తమ వ్యాపకం ఉన్నదా అనుకుందామె నడుస్తూ.