జూలై 2007 సంచిక విడుదల

గుంటూరు శేషేంద్ర శర్మ (వికీపీడియా సౌజన్యంతో)
గుంటూరు శేషేంద్ర శర్మ
(అక్టోబర్ 20, 1927- మే 31, 2007)

ఈమాట పాఠక శ్రోతలకు, రచయితలకు స్వాగతం! సరికొత్త కథలు, కవితలు, వ్యాసాలతో ఈమాట జూలై 2007 సంచిక విడుదల! ఈ సంచికలో విశేషాలు:

ఇటీవలే మరణించిన ప్రముఖ కవి, సాహిత్య అకాడెమీ బహుమతి గ్రహీత శ్రీ గుంటురు శేషేంద్ర శర్మకి నివాళిగా ఆయన రాసిన చివరి కవిత “పువ్వులు.. పువ్వులు.. పువ్వులు ..” , ఆయన ఇచ్చిన చివరి ఇంటర్వ్యూ.

ఈ వారాంతంలో జరగబోయే 16వ తానా సభలలో తానా వారి Lifetime Achievement Award అందుకోబోతున్న ఆచార్య వెల్చేరు నారాయణ రావుగారి గురించి వేలూరి వేంకటేశ్వర రావు ప్రత్యేక వ్యాసం: “నారాయణ రావు గారి గురించి నాలుగు మాటలు

ప్రఖ్యాత హిందుస్తానీ గాయకుడు స్వర్గీయ ఉస్తాద్ అమీర్‌ఖాన్ గురించి కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ సచిత్ర వ్యాసం “గాయక గంభీరుడు ఉస్తాద్ అమీర్‌ఖాన్“, దానితోబాటు ఆయన అరుదైన ఆడియో రికార్డింగులు.

సంప్రదాయ సాహిత్యం శీర్షికలో కొత్త వ్యాస పరంపర — చీమలమర్రి బృందావనరావు వ్యాసం “నాకు నచ్చిన పద్యం

ఆది శంకారాచార్యులు గొప్ప జ్ఞాని మాత్రమే కాక కవి, పండితుడు కూడా. అనేకమంది దేవతలపై శంకరులు అసంఖ్యాకమైన స్తోత్రాలను రాసారు. ఆయన ఉపయోగించిన 20 రకాల ఛందస్సులను సోదాహరణంగా అనువాదాలతో సహా పరిచయం చేసే జెజ్జాల కృష్ణ మోహనరావు వ్యాసం “శంకరాచార్యుల రచనలో ఛందస్సు వైభవము

ప్రఖ్యాత గాయని, నృత్య కళాకారిణి, స్వర్గీయ టంగుటూరి సూర్య కుమారి గారిపై విదేశాంధ్ర ప్రచురణలవారు విడుదల చేయబోయే పుస్తకం వివరాలు

రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి నవల “అల్పజీవి” ని విశ్లేషించే వ్యాసం

భైరవభట్ల కామేశ్వర రావు, సౌమ్య బాలకృష్ణ, సాయి బ్రహ్మానందం గొర్తి ల కథలు

నిడుదవోలు మాలతి, మూలా సుబ్రహ్మణ్యం, సీ.యస్ రావు, జే. కే. మోహన రావు ల కవితలు

తెలుగు కి ప్రాచీన భాష హోదా కలిగించాలన్న నినాదం సద్దు మణగకముందే తెలుగుని అంతర్జాతీయ భాషగా గుర్తించాలనే మరొక నినాదం మొదలయింది. ఈ నినాదాలు, వివాదాలలో విలువెంత? వేలూరి వేంకటేశ్వర రావు సంపాదకీయం.

ఈ సంచికలో మరొక ముఖ్యమైన విశేషం, శంఖవరం పాణిని గారు ఈ సంచికనుంచీ ఈమాట సంపాదక వర్గంలో భాగస్వామి అయ్యారు. పాణిని వృత్తి రీత్యా బయోకెమిస్ట్. ఎమరీ యూనివర్సిటీ మెడికల్ స్కూల్ లో ప్రొఫెసర్. ప్రవృత్తి రీత్యా, తెలుగు సాహిత్యం, సంగీతం, — రెండింటిలోనూ ద్రష్టే అని చెప్పచ్చు. యాహూ గ్రూపు “రచ్చబండ” మోడరేటర్లలో ఒకరుగా, అంతకు ముందు తెలుసా (తెలుగు సాహిత్యం) గ్రూపు లో క్రియాశీలక సభ్యులుగా, “ghantasAla.info” వ్యవస్థాపకులలలో ఒకరిగా ఇంటర్నెట్టులో చిరపరిచితులు. పాణినిగారు ఈమాటలో భాగస్వామి కావడం మాకెంతో సంతోషం కలిగిస్తోంది, వారికి ఈమాట స్వాగతం పలుకుతోంది.

ఈ సంచిక నిర్మాణంలో సహాయపడ్డ సమీక్షకులు, రచయితలందరికి మా కృతజ్ఞతలు. ఎప్పటిలాగే మీ నిర్మాణాత్మకమైన అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తూ
–సంపాదకులు