నాకు నచ్చిన పద్యం: తిక్కన భారతంలో ద్రౌపది కోపవర్ణన

సీ. ఈ వెండ్రుకలు వట్టి యీడ్చిన యా చేయి
     దొలుతగాఁ బోరిలో, దుస్ససేను
తను వింత లింతలు తునియలై చెదరి రూ
    పఱి యున్నఁ గని ఉడుకాఱుఁ గాక
యలుపాలఁ బొనుపడునట్టి చిచ్చే యిది
    పెనుగద వట్టిన భీమసేను
బాహుబలంబునుఁ బాటించి గాండీవ
    మను నొక విల్లెప్పుడును వహించు

ఆ.వె. కఱ్ఱి విక్రమంబుఁ గాల్పనే యిట్లు
బన్నములు వడిన ధర్మనందనుడును
నేను రాజరాజు పీనుంగుఁ గన్నారఁ
గానఁ బడయమైతి మేనిఁ గృష్ణ!

ఇది తిక్కన సోమయాజి పద్యం, భారతం ఉద్యోగపర్వం తృతీయాశ్వాసం లోనిది. ద్రౌపది కోపం అనేది తెలుస్తూనే ఉన్నది. కానీ ఇది కేవలం కోపమేనా, లేక కోపమూ,శోకమూ, ఆక్రోశమూ – విస్ఫులింగాల లాగా ఆమె హృదయంలో విజృంభించిన సర్వావేశాల సమాహారమా!నెమ్మదిగా చర్చించుకుందాం.

తిక్కన మహాభారత రచనను అసిధారావ్రతంగా నిర్వహించాడని పెద్దలు చెబుతారు. పదిహేను పర్వాలుగా ప్రవహించిన ఆ కవితా ధార లోని ప్రతి పద్యమూ అందుకు సాక్ష్యమే. నిర్వచనోత్తర రామాయణం రాసిన తరువాత, యజ్ఙం చేసి సోమయాజియై, ఆ తర్వాతనే తిక్కన భారత రచనకు ఉపక్రమించాడని అంటారు. దీనినిబట్టి అర్ధమవుతుంది, తిక్కన భారత రచనను ఎంత పవిత్రకార్యం గా భావించాడో అని. కవిత్రయం లో ద్వితీయుడైన తిక్కన కవిత్వంలో మాత్రం అద్వితీయుడు. తెలుగు పదాలను బహుళంగా వాడి కావ్యాల్లో సంస్కృతానికి సమానమైన ప్రతిపత్తిని తెలుగుకు కట్టబెట్టిన మహనీయుడు తిక్కన. కవిత్వంలో నాటకీయతకు తిక్కననే చెబుతారు. పై పద్యం దానికి సాక్ష్యం! చక్కనైన, వినగానే ప్రాణం లేచొచ్చే తెలుగు పదాలు ధారాళంగా వాడినవాడు తిక్కన. పై పద్యమే సాక్ష్యం! గుండెల్లోంచి దూసుకువచ్చే ఆవేశానికి, చిన్న చిన్న తెలుగు పదాల పలుకుబళ్ళతో ప్రవాహ వేగాన్ని సాధించిన అద్భుత శిల్పి తిక్కన. పై పద్యమే సాక్ష్యం! “తను గావించిన సృష్టి తక్కొరుల చేతంగాదు” అని తిక్కనను గూర్చి ఎర్రన ఇచ్చిన తీర్పు – ఏ అప్పీలు లేని తీర్పు.

కురుసభకు రాయబారానికి పోయేముందు కృష్ణుడు పాండవుల అభిప్రాయాన్ని తెలుసుకుంటాడు. ఆ సందర్భంలో తన అభిప్రాయాన్ని పై విధంగా చెప్పింది ద్రౌపది. దుశ్శాసనుడంటే ఎంత కోపం ఆమెకు! “ఈ వెండ్రుకలు బట్టి యీడ్చిన యా చేయి” అని, ఆ తర్వాత, కాదు, చేయి మాత్రమే కాదు “తనువు ఇంతలింతలు తునియలై చెదరి రూపఱి యున్న” అప్పుడు, వాటిని చూసిన తర్వాత “ఉడుకు ఆరును” గానీ, ఈ కసి, ఈ “చిచ్చు” – “అలుపాల పొనుపడునట్టి చిచ్చేయిది”? అల్పకార్యాలతో ఆరిపోయే నిప్పా యిది? పెద్ద గద నొకటి పట్టుకున్న భీముడి బాహుబలమూ, గాండీవమనే గొప్ప విల్లొకటి పట్టుకుని తిరిగే “కఱ్ఱి విక్రమంబు” – ఎందుకివి? కాల్చనా? కఱ్ఱి అనేది క్రీడి అన్న పదానికి తిక్కన సృష్టించుకున్న తెలుగు మాట. కఱ్ఱి – నల్లని వాడు. ఆర్జునుడు నల్లని వాడు. ఇప్పటికైనా, ఇన్ని కష్టాలు పడ్డ ధర్మరాజూ, నేనూ “రాజరాజు పీనుంగు”ను “కన్నార” కానబడయమైతిమేని, కృష్ణా! – అని అంటున్నది ద్రౌపది. ఏమి ఆక్రోశం! ఎంత అద్భుతంగా దానిని రూపుకట్టిందీ పద్యం!

అసలు పద్యం ఎత్తుకోవడమే చూడండి. ద్రౌపదికి కౌరవులు అనగానే దుశ్శాసనుడి చెయ్యే గుర్తుకు రావడం సహజం. ఈ వెంట్రుకలు పట్టి ఈడ్చిన ఆ చేయి అని, అంతలోనే, కాదు కాదు, అన్నిటికన్నా ముందే, శరీరమంతా చిన్న చిన్న ముక్కలై చెదిరి రూపు మాసి పడివుంటే, చూసిన తర్వాత గానీ ఆరిపోని చిచ్చు ఇది, అనడంలో ఎంత దహించుకుపోయే ఆవేశం కనుపడుతోంది! అంతే కాదు దుర్యోధనుడి పీనుగను తనూ ధర్మరాజూ చూడలేక పోయినట్లైతే, భీముడి గదా, అర్జునుడి విల్లూ – ఇవి ఎందుకు, కాల్పనా? ఎంత తీసిపారేసినట్లు మాట్లాడిందో చూడండి, భీమార్జునులను గురించి.భయంకరమైన అవమానానికి గురైన ఒక కులసతి గుండెకోతకు ఎక్స్-రే చిత్రం కదా, ఈ పద్యం.

పై పద్యం రాసేటప్పుడు గణాలూ, యతులూ, వీటిని గూర్చి ఆలేచించే వుండడు, తిక్కన కవి. సాధారణ కవులు గణాలూ, యతులూ సరిచూసుకుంటూ, పదమూ, పదమూ పట్టి చూసుకుంటూ రాస్తారు. మంచి కవులు ఛందస్సు పరిధి లోనే తమ ఉపజ్ఞను వినియోగించుకుంటూ అద్భుతమైన పద్యాలు సృష్టిస్తారు. మహాకవులు ఛందస్సు ను లెక్క చేయరు, ఛందస్సే వారి నోటినుంచి వచ్చే మాట కోసం ఎదురుచూసి, ఊడిగం చేసిపోతుంది. కోపమూ, శోకమూ, ఆక్రోశమూ ముప్పిరిగొన్న ద్రౌపది సంభాషణా ప్రవాహానికి సూర్యుడూ, చంద్రుడు, మహర్షులూ తలకాయలు వొంచుకుని నిలబడ్డారు. సూర్య, ఇంద్ర, చంద్ర గణాలూ, యతులూ ఈ పద్యంలో ఎంత అద్భుతంగా ఒదిగిపోయాయో మీరే చూడండి! ఔను, ఇది స్వచ్ఛమైన సీస పద్యమే! మహాకవికి ఛందస్సు విధేయంగా ఉంటుందంటారు. తిక్కన మహాకవి. అత్యంత సామాన్యమైన చిన్న చిన్న తెలుగు పదాల్లోంచి ఎంత గరిష్ఠమైన శబ్దశక్తిని విస్ఫోటింప చేశాడో గమనించండి. పరమాణువు లోనుంచి ప్రళయాత్మకమైన శక్తిని విడుదల చేసే ఒక శబ్ద శాస్త్రవేత్తలా కనిపిస్తాడు నాకు, తిక్కన కవి.

తెలుగు సాహిత్యం మొత్తంలోనే నాకు అత్యంత ప్రియమైన పద్యం ఇది.