చిలక – గోరింక

“చిన్నప్పట్నుంచీ చిలకాగోరింకల్లా పెరిగారు. అనుకున్నసంబంధం…మనముందు పెరిగిన కుర్రాడూ మంచి వాడూ అనుకుంటే… చివరి నిమిషంలో ఇలాంటి పేచీపెట్టాడు…” నిష్ఠూరంగా అంటున్న అమ్మ మాటలని మధ్యలో అడ్డుతూ కల్యాణి అంది, “ఊరుకో అమ్మా. ఐనా ఇందులో బావ తప్పేముంది. తన మనసులో మాట సూటిగా చెప్పాడు, అంతే కదా! మనకి నచ్చితే సరే అనాలి, లేదంటే కాదనాలి. అంతే కానీ ఇలా తన్నాడిపోసుకోడం దేనికి?” “బావమీద చిన్న మాట పడనివ్వవు కదా. నీకున్న ప్రేమలో నూరోవంతైనా వాడికుందిటే?” మళ్ళీ మొదలుపెట్టింది శకుంతల. ఇక అమ్మని ఆపడం తనవల్ల కాదని ఊరుకుంది కల్యాణి.

తనకి బావంటే ప్రేమా? ఆ మాటకి తనలో తనే నవ్వుకుంది. అమ్మ చాదస్తం కానీ, నాకు బావమీద ప్రేమేంటి! చిన్నప్పటి నుంచీ ఒకే ఊళ్ళో పెరగడంతో కాస్త చనువుంది, అంతే. అసలు బావా తనూ ఎప్పుడన్నా ఒంటరిగా గడిపారా? చిన్నప్పుడు ఇద్దరూ కలిసి కాగితప్పడవల్ని చేసి వాన నీట్లో వదలడమే తమ మధ్యనున్న మధుర స్మృతులు. పెద్దయ్యాక ఎవరి చదువులు వాళ్ళవీ. ఇప్పుడెవరి ఉద్యోగాలు వాళ్ళవీ! చిన్నప్పట్నుంచీ తెలుసున్న మనిషీ, తెలిసినంతలో మంచివాడూ అని పెళ్ళికి సరే అంది. అసలీ గొడవంతా మొన్నపెళ్ళిచూపుల్లో మొదలయ్యింది. ఇదీ ఒకందుకు తనకి మంచిదే అయ్యింది కూడా! ఆ రోజు జరిగిన విషయాలు కల్యాణి కళ్ళముందు తిరిగాయి…

పెళ్ళిచూపులేర్పాటుకి ముఖ్య కారణం శశాంక్. “చిన్న నాటినుండి ఒకర్నొకరు ఎరిగున్న వాళ్ళు. బావా మరదళ్ళ మధ్య పెళ్ళిచూపులేమి”టని పెద్దవాళ్ళు ముందొప్పుకో లేదు. అయినా సరే ససేమిరా శశాంక్ పట్టుపట్టడంతో, అదో ముచ్చటగా ఉంటుందని సరే అన్నారు. తను మాత్రం పాతకాలం పెళ్ళికూతుర్లా తలొంచుకుని కిందని కూర్చోనని కచ్చితంగా చెప్పింది కల్యాణి. దానికెవరూ అభ్యంతరం చెప్పకపోవడంతో పెళ్ళిచూపులేర్పాటయ్యాయి. శశాంక్ ఓ ఐదు రోజులు సెలవు పెట్టుకొని వచ్చాడు. అందరూ కలిసి కల్యాణీ వాళ్ళింటికి వెళ్ళారు. ఎవరికెవరూ కొత్తకాదు కాబట్టి అందరూ కూచుని హాయిగా పిచ్చాపాటీ మొదలుపెట్టారు. ఆఖరికి కొంతసేపయ్యాక శశాంక్ అన్నాడు, “నేను కల్యాణితో ఒంటరిగా మాట్లాడాలి”. కల్యాణికి కూడా మనసులో అదే ఉండడంతో తనూ అలాగే అంది. పెద్దవాళ్ళు మాత్రం ఆశ్చర్యపోయారు. సరే ఇదీ ముచ్చటలో భాగమే అని ముసిముసిగా నవ్వుతూ “అలాగే కానీండి” అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. శశాంక్ కల్యాణీ డాబా మీదకి వెళ్ళారు. పెళ్ళెప్పుడు పెట్టుకుంటే బాగుంటుందన్న విషయమ్మీద పెద్దవాళ్ళ మధ్య చర్చ మొదలయ్యింది. కొంత సేపటికి శశాంక్, కల్యాణీ డాబా దిగి వచ్చారు. వాళ్ళ మొహాలు చూసి పెద్దవాళ్ళకి అనుమానం వచ్చింది. వాళ్ళిద్దరూ కొంచెం ముభావంగా వచ్చి కూచున్నారు. రెండు నిమిషాలక్కడ మౌనం కాలాన్ని పట్టి ఆపింది. “ఏంటర్రా అలా ఉన్నారు, ఎంటయ్యింది?” మౌనాన్ని చీలుస్తూ విశ్వనాథం గొంతు ఖంగుమంది. సమాధానం రాకపోవడంతో కొడుకు వైపో క్షణం చూసి, మేనకోడలివైపు తిరిగి మళ్ళీ అన్నాడు, “వీడెలాగూ చెప్పడుకానీ, నువ్వు చెప్పమ్మా ఏమైందో”. “బావకి నేనుద్యోగం చెయ్యడం ఇష్టం లేదుట మావయ్యా”, మెల్లగా గొంతు విప్పి చెప్పింది కల్యాణి. కల్యాణి చెప్పింది విని అక్కడ వాళ్ళెవరికీ నోట మాట రాలేదు.

శశాంక్ ఇలా అంటాడని అక్కడవాళ్ళెవరూ ఊహించినట్టు లేదు. ఆ షాక్ నుంచి మొదటగా తేరుకున్నది విశ్వనాథమే. కానీ దానికతనికి చాలా కోపం వచ్చింది. “నీకేమైనా మతిపోయిందేవిట్రా! నిక్షేపంగా ఉద్యోగం చేస్తున్నదాన్ని పట్టుకొని ఉద్యోగం మానెయ్యమంటావా! ఇంత చదువూ చదివి నీకబ్బిన సంస్కారం ఇదేనా? అసలీ కాలంలో ఉద్యోగం చేస్తున్న పిల్ల కావాలో కావాలో అని వెతికి మరీ చేసుకుంటారు, తేరగా దొరికిన పిల్లనా నీకీ పోత్రం” మండిపడ్డాడు విశ్వనాథం. విశ్వనాథానికి కల్యాణంటే చాలా ఇష్టం. అవడానికి విశ్వనాథం భార్యే కల్యాణికి సొంత మేనత్తయినా, కల్యాణికి కూడా మామయ్య దగ్గరే చనువెక్కువ. చిన్నప్పట్నుంచీ చక్కగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తున్నందుకు తన కాబోయే కోడల్ని చూసి ఎంతో మురిసిపోయేవాడు విశ్వనాథం. అలాటిది కొడుకిలా అడ్డుపుల్ల వెయ్యడంతో అరికాలి మంట నెత్తికెక్కిందతనికి. తండ్రి మాటలకి మౌనంగా ఉండిపోయాడు శశాంక్. అందరి మొహాల్లోని నిరాశ స్పష్టంగానే అలముకుంది, ఎవరూ దాచడానికి ప్రయత్నించ లేదు కూడా. ఇక అప్పటికి చేసేదేమీ లేదని విశ్వనాథం వాళ్ళూ బయలుదేరారు. వెళ్తూ వెళ్తూ కల్యాణిని రహస్యంగా పిలిచి చెప్పాడు విశ్వనాథం, “నువ్వు బావ మాటలేం పట్టించుకోకు. వాడెందుకొప్పుకోడో నేను చూస్తాను కదా!”

మావయ్య మాటవిని బావ మనసు మార్చుకుంటాడన్న నమ్మకం తనకి లేదు. ఇటు ఉద్యోగం మానెయ్యడం తనకి సుతరామూ ఇష్టం లేదు. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఇల్లూ, వాకిలీ, వంటిల్లూ వీటికి పరిమితమయ్యే జీవితం… అమ్మో! ఊహించడానికే కష్టంగా ఉంది. చదివిన చదువుకాని, మారిన కాలం కానీ – ఏవీ మగవాళ్ళల్లో పూర్తిగా మార్పు తేలేకపోతున్నాయ్. బావలాంటి వాళ్ళు ఇంకా చాలా మందే ఉన్నారివాళ్టికీను. వీళ్ళ మనస్తత్వంలో మార్పనేదే రాదా? ఆడది ఏదైనా సాధించాలనుకుంటే, అడుగడుగునా ఇలాంటి అవాంతరాలే… ఒక్క సారి తన ఆలోచనలు తనకే వింతగా తోచాయి కల్యాణికి. తనెందుకింతలా ఆలోచిస్తోంది? బావ తనని ఉద్యోగం మానెయ్యమన్నాడు, తను మాననంది. అంతే. మళ్ళీ దాని గురించి ఇంత ఆలోచనెందుకు? బావ తనకి అన్ని విధాలా నచ్చాడు, బావకీ తను నచ్చినట్టే ఉంది. ఈ ఉద్యోగం విషయమొక్కటే ఇలా పాలల్లో ఉప్పు గడ్డలా తయారయ్యింది. అందుకే తనింతలా ఆలోచించడం. “ఏమిటమ్మా అలా ఉన్నావు? పెళ్ళి గురించేనా ఆలోచన?” మెల్లగా వచ్చిన నాన్న గొంతు విని ఆలోచనలనుంచి బయటపడింది కల్యాణి. మౌనంగా ఉన్న కూతురు కళ్ళల్లోని సందిగ్ధం గుర్తుపట్టాడు నరేంద్ర. “చూడమ్మా. ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం. ఏదైనా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అన్ని విధాలా మంచి సంబంధం. బావ చెడ్డవాడేం కాదు. మీరొకరికొకరు ఎరిగున్న వాళ్ళు. వీటన్నిటికన్నా నీకు ఉద్యోగమే ముఖ్యమా? ఆలోచించుకో…”, నాన్న ఏం చెప్పదల్చుకున్నాడో అర్థమయ్యింది కల్యాణికి. కానీ తనకిష్టం లేని పని ఎలా చేస్తుంది? భర్త మాటలు వింటున్న శకుంతల అంతెత్తున లేచింది, “కన్న కూతురికి మీరిచ్చే సలహా ఇదా? నిక్షేపంగా ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్న దాన్ని ఉద్యోగం మానేసి ఇంటిపట్టున కూచో మంటారా! శశాంక్ అంటే అన్నాడు, దానికి మీ వంత పాట కూడానా? అసలు శశాంక్ కి వేరే ఏదో ప్రేమ వ్యవహారం ఉండుంటుంది. అందుకే దీన్ని తప్పించుకోడానికి ఇలాంటి పేచీ తెచ్చి పెట్టాడు. లేకపోతే వాడికి వాళ్ళ నాన్నకున్నంత ఇంగితమైనా లేకుండా పోయిందా? వదినగారు ఉద్యోగం చేస్తానంటే అన్నయ్యగారెప్పుడైనా కాదన్నారా? పైగా చెయ్యమని ఎంత ప్రోత్సహం ఇచ్చారూ! ఆవిడ స్టైలుగా ఉద్యోగానికి వెళ్తూ ఉండడం, నేనిలా ఇంట్లో పడుండడం, నాకెంత నామోషీగా ఉండేదో. నా కూతురైనా ఆ లోటు తీరుస్తుందనుకున్నాను. దాన్ని కూడా మీ చాదస్తంతో నీరుగార్చకండి. ఈ సంబంధం కాకపోతే వేరే సంబంధం. దేశవేమీ గొడ్డుపోలేదు కదా. పైగా ఉద్యోగం చేస్తున్న పిల్లంటే కళ్ళకద్దుకుని మరీ చేసుకుంటారు.”

శకుంతల ధాటికి నరేంద్ర కల్యాణీ నోరుమెదపకుండా ఉండిపోయారు. కానీ తల్లి మాటలు మెదడులో పనిచెయ్యసాగాయి కల్యాణికి. అవును నిజమే కదా, అత్తయ్యకూడా ఉద్యోగస్తురాలే. మామయ్య అభ్యంతరం పెట్టుంటే ఆవిడ ఉద్యోగం చేసేదా? కనీసం తల్లి మాటలైనా బావ వింటాడన్న ఆశ కలిగింది. వెంటనే అత్తయ్యతో మాట్లాడి బావని ఒప్పించే ప్రయత్నం చెయ్యాలి. మర్నాడే అత్తయ్య వాళ్ళింటికి బయల్దేరింది.

వంటపనికి సిద్ధమౌతున్న కావేరి, బెల్లు చప్పుడుకి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా కల్యాణి. “నువ్వా కల్యాణీ. రా రా…”, అంటూ అప్యాయంగా లోపలకి తీసుకువెళ్ళింది. “ఎంటత్తా, ఎవైనా పనిలో ఉన్నావా? ఇంట్లో ఎవరూ ఉన్నట్టు లేదు?”, కుశల ప్రశ్నలు వేసింది కల్యాణి. “ఆ… ఎప్పుడూ ఉండే పనే, ఇప్పుడే వంట మొదలెడుతున్నాను. మీ మావయ్యకి సాయంత్రం షికారు మామూలేగా. శశాంక్ స్నేహితుల్ని కలిసొస్తానని వెళ్ళాడు.”, కూర తరగడం ప్రారంభించింది కావేరి. తనూ ఒక చెయ్యివేస్తూ, ఎలా మొదలుపెట్టాలో తెలీక ఆలోచిస్తోంది కల్యాణి. “ఏంటి సంగతి, అంతలా ఆలోచిస్తున్నావ్?”, కల్యాణి ఆలోచన పెళ్ళిగురించని తెలిసినా ఇప్పుడిలా రాడానికి కారణమేమిటో తెలుసుకోవాలని అడిగింది కావేరి. “బావ అలా అంటాడని అస్సలూహించలేదత్తా”, మెల్లగా అంది కల్యాణి. “అవునమ్మా అది విని నేనూ ఆశ్చర్యపోయాను.” “తనలా అనడం బావుందంటావా అత్తా”, అత్త మనసు తెలుసుకోవాలని అడిగింది కల్యాణి. “ఏమోనమ్మా! వాడి అభిప్రాయాలు వాడివి. నేనేవిటి చెప్తాను. బహుశా తన భార్య ఉద్యోగం చేసి కష్టపడకూడదని అనుకుంటున్నాడేమో”. “అదేంటత్తా, ఉద్యోగం కష్టమనుకుంటే ఎలా. తను మాత్రం చెయ్యటంలా”. “నువ్వటు ఆఫీసుపనీ, ఇటు ఇంటిపనీ చేసుకోవలంటే కొంచెం కష్టమే కదా కల్యాణీ! ఇప్పుడు నన్నే చూడు. పొద్దున్నంతా ఆఫీసు పని చేసొచ్చి, కాఫీలు టీలు కలపడం తర్వాత ఇదిగో ఈ వంటపని!”. అత్త మాటలకి ఆశ్చర్యపోయింది కల్యాణి. “అదేంటత్తా, నువ్వీ పనులన్నీ ఇష్టమై చెయ్యటం లేదా!”, ఈ సారి ఆశ్చర్యపోడం కావేరి వంతయ్యింది. “ఇందులో ఇష్టాయిష్టాల కేవుంది? వంట చెయ్యకపోతే తిండెలా తింటాం!” జవాబిచ్చింది. “అది కాదత్తా. నీకింటిపనిలో మావయ్య సాయంచెయ్యడా?”, ఈ సారి కల్యాణి గొంతులో సందేహం ధ్వనించింది. “ఇంటి పని మీ మావయ్యెందుకు చేస్తారు చెప్పూ. ఐనా అప్పుడప్పుడు ఉప్మా లాంటివి చేస్తూ ఉంటారు, సరదాగా!”, అపురూపంగా చెప్పింది కావేరి. “ఆడవాళ్ళకైతే బాధ్యతా, మగాళ్ళకైతా సరదా అన్నమాట! చాలాబావుంది”, కల్యాణికి పరిస్థితి పూర్తిగా అర్థమయ్యింది. ఇక అత్తయ్యచేత బావని ఒప్పించడం సాధ్యమయ్యే పని కాదని, కొంత సేపు అత్తతో గడిపి బయలుదేరింది.

అవుతుందనుకున్న పని జరక్కపోయినందుకు ఒక పక్క నిరాశ ఉన్నా, మరో పక్క ఆనందంగానూ ఉంది. బావ పట్టుదల వెనక అసలు రహస్యం ఇదన్న మాట! అత్త పడుతున్న శ్రమని చూసే బావ ఇలా అంటున్నాడు. తన కాబోయే భార్య మీద ఎంత ప్రేమ! కాకపోతే, తనూ ఇంటిపనిలో పాలుపంచుకుంటే ఈ సమస్య ఉండదన్న ఆలోచన బావకి రాలేదు. ఆ విషయం బావకెలాగైన తెలిసేట్టు చెయ్యాలి. అప్పుడు The problem is solved! ఉత్సాహంతో ఇంటిదారి పట్టింది కల్యాణి.

ఇంటికి వెళ్ళిన కల్యాణి వెంటనే బావకి ఫోన్ చేద్దామనుకుంది. వెంటనే బావని కలిసి మాట్లాడాలి. ఏం మాట్లాడుతుంది? ఎలా మాట్లాడుతుంది? తను చెప్పింది సరిగా అర్థం చేసుకుంటాడా? ఒక వేళ తన ఇష్టాన్ని బావమీద రుద్దడానికలా వాదిస్తున్నాననుకుంటే? అమ్మో! ఇక ఆ తర్వాత బావతో మాట్లాడి ఒప్పించడానికి అస్సలు వీలుపడదు. బావతో తను నేరుగా మాట్లాడ్డం ఆఖరి ప్రయత్నంగానే చెయ్యాలి. ముందు మరేదైనా మార్గం ఆలోచించాలి. ఆలోచనల్లో మునిగిన కల్యాణికి హఠాత్తుగా ఆకాశవాణి చెప్పినట్టుగా ఒక ఐడియా వచ్చింది! వెంటనే ఫోనందుకొని డయల్ చేసింది.

శశాంక్ కల్యాణీ కలిసి ఆటోలో హొటల్ దసపల్లాకి బయల్దేరారు. వాళ్ళిద్దరికీ చిన్ననాటి స్నేహితులైన దివ్య, దీపక్ అమెరికా నుంచి మొదటిసారి సెలవలకి వచ్చారు. అందరం కలిసి డిన్నర్ చేద్దామని కల్యాణిని, శశాంక్ని ఆహ్వానించారు. ఆటో దిగి ముందుగానే రిజర్వ్ చేసిన టేబిల్ వైపు నడిచారిద్దరూ. అప్పటికే అమెరికా జంట అక్కడ కూర్చునున్నారు. “వాళ్ళిద్దరిదీ ముచ్చటైన జంట. అవదూ మరి, ఒకర్నొకరు కోరి మరీ చేసుకున్నారాయె!” అనుకుంది కల్యాణి. పలకరింపులయ్యాక మెనూ నిర్ణయించే కార్యక్రమం మొదలయ్యింది. కాంటినెంటలు, చైనీసు వగైరాలుకాక ఇండియన్ వంటకాలే ఆర్డర్ చేద్దామని అందరూ అనుకున్నారు. తనకి మాత్రం బైంగన్ సబ్జీ, భిండీ ఫ్రై వద్దంది దివ్య. “అదేం, నీకవి ఇష్టం లేదా?” అడిగింది కల్యాణి. “చాలా ఇష్టం… దీపక్ చేస్తే! సో అవి బయటెక్కడ తిన్నా నాకు నచ్చవు, ఆఖరికి నేను చేసుకున్నా!” నవ్వుతూ చెప్పింది దివ్య. ఆర్డర్లివ్వడం అయ్యాక దివ్య అడిగింది, “శశాంక్, Do you know cooking?”. “చదువుకున్నన్ని నాళ్ళు నేర్చుకోలేదు. ఇప్పుడుద్యోగంలో చేరాక ఇంటికి దూరమై ఒంటిగాణ్ణయ్యాను కదా. అప్పుడప్పుడైనా చెయ్యికాల్చుకోక తప్పటం లేదు.” జవాబిచ్చాడు శశాంక్. “మంచిదేలే. ఈ కాలంలో మగాళ్ళక్కూడా ఇంటిపనీ వంటపనీ వచ్చుండడం అవసరం.”, అనుభవంతో చెప్తున్నట్టుగా అన్నాడు దీపక్. “ఏం, ఆడవాళ్ళకి చేత కావటం లేదు కాబట్టా!”, దివ్య వంక చూసి నవ్వుతూ అడిగాడు శశాంక్. “చేతకాక కాదు, అవసరమయ్యి. ఇద్దరం వర్క్ చేసొస్తామా. We will be very tired. ఒక్కళ్ళే ఎప్పుడూ చెయ్యాలంటే చాలా కష్టం. అందుకే ఇద్దరం workని share చేసుకుంటాం. లేదా turns తీసుకొని చేస్తాం. పెళ్ళామ్మీద ప్రేమున్న మొగాడెవడైనా అలాగే చేస్తాడు”. దివ్య సమాధానానికి శశాంక్ ఇంకేం మాట్లాడలేదు. అతడా విషయం అర్థం చేసుకున్నాడో, ఆలోచిస్తున్నాడో తెలీలేదు. ఆర్డరిచ్చిన ఐటంస్ వచ్చాయి. అందరూ తినడానికుపక్రమించారు. “దివ్యా! నువ్వుద్యోగం ఎందుకు చేస్తున్నావ్?” సడన్ గా అడిగిన శశాంక్ ప్రశ్నకి పొలమారింది కల్యాణికి. దివ్యకి కూడా అది కొత్త ప్రశ్నే, ఐనా తమాయించుకుంది. “ఇది ఇండియా కాబట్టి సరిపోయింది. ఇదే అమెరికాలో ఐతే ఇలా అడిగినందుకు నీ మీద case పెట్టొచ్చు తెలుసా!” నవ్వుతూ అంది. “ఇది అమెరికా కాదు కదా! నీకు జావాబు తెలిస్తే, చెప్పాలనుకుంటే చెప్పు.” “ఇదే ప్రశ్న నిన్ను వేస్తే?” “ఏవుంది, జీవనాధారం కోసం డబ్బు సంపాదించడానికి”. శశాంక్ జవాబుకి కల్యాణి కొంచెం ఆశ్చర్యపోయింది. “అంటే నువ్వు interest ఉండి చెయ్యటంలేదా నీ job” అడిగింది. “ఇందులో interest అనేవుంది. ఉద్యోగం చెయ్యకపోతే తిండికెలాగ?”, ఇలాంటి సమాధానమే ఇంతకు ముందెక్కడో వింది తను. గుర్తుకొచ్చింది కల్యాణికి. “నేనూ అందికే చేస్తున్నాను.” అంది దివ్య. “ఏం, దీపక్ ఒక్కడి సంపాదనతో జీవితం సుఖంగా గడవదా?” ఎదురు ప్రశ్న వేసాడు శశాంక్. “ఎందుగ్గడవదూ. కానీ ఇద్దరం ఉద్యోగం చేస్తే, ఎక్కువ డబ్బు ఎక్కువ సుఖం”, ఈ మాత్రం తెలీదా అన్నట్టు చెప్పింది దివ్య. “అంతే కాదు శశాంక్. దివ్య ఉద్యోగం చెస్తూ తన కాళ్ళమీద తను నిలబడి, తన individualityని నిలబెట్టుకుంటోంది. She is not dependent on me.” గర్వంగా చెప్పాడు దీపక్. “ఒకరి మీదొకరు ఆధారపడకుంటే వాళ్ళు భార్యాభర్తలవ్వడమెందుకు? పైగా ఇంటిపని చేసినంత మాత్రాన దివ్య individuality కొచ్చిన నష్టమేమిటో నాకు తెలీటం లేదు”, వాదన పెరిగింది. “Oh! Come on Sasank! తను ఉద్యోగం చేస్తేనే కదా, she will have economic freedom and security” “ఏం? నీతో కలిసి జీవించడంలో దివ్యకి security లేదా?”. శశాంక్ వితండ వాదానికి దిగుతున్నాడనిపించింది అక్కడున్న అందరికీ. “లేదు. ఎలా ఉంటుంది? ఒక వేళ మాటా మాట పెరిగి అది divorce దాకా వస్తే?”, మొండిగా జవాబిచ్చింది దివ్య.

ఆ సమాధానానికి కల్యాణీ, దీపక్ ఇద్దరూ ఆశ్చర్యపోయారు. “Cool down divya! అసలు దీనికింత వాదనెందుకు? శశాంక్, దివ్యకి job చెయ్యడం సరదా. తన ఇష్టాన్ని నేను గౌరవించాను. Thats all!” ఇక ఈ విషయం ఇంతటితో ఆపెయ్యడం మంచిదన్నట్టు ముగించాడు దీపక్. అక్కడున్న అందరూ అదే అనుకున్నారు. మరి దాని గురించి ఎవ్వరూ ఎత్తలేదు. అందరూ డిన్నర్ ముగించి Good bye చెప్పుకొని బయటపడ్డారు. కల్యాణి శశాంక్ మళ్ళీ ఆటోలో బయలుదేరారు.

రాత్రి తొమ్మిది దాటుతూండడంతో మెల్లగా రోడ్లమీద రద్దీ తగ్గుతోంది. ఇక లాభం లేదు, తనే బావతో ఈ విషయమై అటో ఇటో తేల్చెయ్యాలి – నిశ్చయించుకుంది కల్యాణి. “ఐతే బావా, ఆడవాళ్ళెవరూ ఉద్యోగాలు చెయ్యకూడదనా నీ ఉద్దేశం?” శశాంక్ కల్యాణివైపు తిరిగి చిన్నగా నవ్వాడు.

“ఆడవాళ్ళందరి సంగతీ నాకు తెలీదు. నా భార్య ఉద్యోగం చెయ్యడం నాకిష్టం లేదు. నా ఇష్టాన్ని గౌరవించే భార్య కావాలనుకుంటున్నాను” కచ్చితంగా చెప్పాడు. “అదే ఎందుకిష్టం లేదు?”, కల్యాణి సూటిగా అడిగేసింది. “అటు ఆఫీసు పనీ, ఇటు వంటపనీ రెండూ చేసుకోవడం చాలా స్ట్రెస్ తో కూడుకున్నది. ఇద్దరూ అలా చేస్తే ఇద్దరూ స్ట్రెస్ ని పంచుకోడమే అవుతుంది. ఒకొక్కళ్ళు ఒకోటి చేస్తే పనిని మాత్రమే పంచుకుంటారు. డబ్బు కోసం అవసరమై చెయ్యడం వేరు. తృప్తంటూ ఉంటే నా సంపాదనతో ఇద్దరం హాయిగా బతకొచ్చు. నా భార్య ఏ అభద్రతకీ లోనవ్వకూండా నేను నడుచుకుంటాననే నమ్మకం నాకుంది. నా మీద అదే నమ్మకుముండే భార్యనే నేను కోరుకుంటున్నాను.” బావ సమాధానం సూటిగా గుచ్చుకుంది. అంతా అయిపోయింది. ఇక చెప్పగలిగిందీ, చెయ్యగలిగిందీ ఏదీ లేదు. బావ మారడు. తను మూడు రోజుల్నించీ పడ్డ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరయ్యింది. కల్యాణి నిరాశ కళ్ళల్లో నీళ్ళగా తిరిగింది. “నీలాగే అందరు మగాళ్ళూ అనుకుంటే ఇంక మా ఆడవాళ్ళ బతుకులింతే. ప్రతి ఆడదీ వంటింటి కుందేలై పడి ఉండాలనే మీరు కోరుకొనేది. ఆడదానికి కూడా ఓ మనసుంటుందనీ, అందులో వాళ్ళకీ ఇష్టాయిష్టాలుంటాయనీ మీరెందుకు తెలుసుకోరూ”, కళ్ళల్లోని నిరాశ దుఃఖంగా మారి చెంపలపైకి చిన్నగా జారింది. ఇద్దరి మధ్యా మౌనమై పరచుకుంది.

“చిట్టీ!”. ఒక్కసారి ఆ పిలుపు వినేసరికి కల్యాణికి మనసు తేలికైనట్టనిపించింది. తననందరూ చిన్నప్పుడలాగే పిలిచే వారు. పెద్దతనం వస్తున్న కొత్త రోజుల్లో అందరి చేతా బలవంతాన ఆ పిలుపు మానిపించింది. ఒక్క బావ చేత మాత్రం మానిపించ లేక పోయింది. ఇప్పుడా పిలుపు చిన్న్ననాటి పరిమళాల్ని మోసుకొచ్చింది. బావవైపు మెల్లగా తలెత్తి చూసింది. “పోనీ నేనొకటి చెప్తాను వింటావా?” అన్న బావ ప్రశ్నకి “ఏవి?”టని కళ్ళతోనే అడిగింది. “నువ్వుద్యోగం చెయ్యి. నేను నా ఉద్యోగం మానేసి ఇంట్లో ఉంటాను.” బావ నవ్వులాటకి అంటున్నాడనుకుంది కానీ అతని కళ్ళల్లో అలాటి సూచనలేవీ కనబడ లేదు. తనని పరీక్షించడానికి కాని అంటున్నాడా? ఏమో! “నీకు నన్ను పెళ్ళి చేసుకోడం ఇష్టం లేకపోతే, సూటిగా చెప్పొచ్చుకదా. ఇలా ఏవేవో అర్థం లేని మాటలు మాట్లాడ్డం దేనికి?” మొన్నటి తల్లి నిష్ఠూరం ఇప్పుడు కూతురు గొంతుకలో ధ్వనించింది. “లేదు, నేను నిజంగానే అడుగుతున్నాను”, శశాంక్ గొంతులో మళ్ళీ అదే నిక్కచ్చితనం. “నాకది ఇష్టం లేదు” చెప్పింది కల్యాణి. “చూసావా చిట్టీ. ఇక్కడ సమస్యంతా, ఇంటి పని చెయ్యడం నామోషీ అనే ఆలోచన వల్ల వస్తోంది. Dignity of Labour ఉంటే, ఆడవాళ్ళైనా మొగవాళ్ళైనా, ఎవరికిష్టమైతే వాళ్ళు, ఇంటిపనీ వంటపనీ చేసుకోవచ్చు. రెండో వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళొచ్చు. ఇద్దరూ రెండిట్లో వేళ్ళు పెట్టి కష్టపడక్కర్లేదు.” తన సిద్ధాంతానికి Q.E.D చెప్పాడు శశాంక్.

అంతా విన్న కల్యాణి రెండు నిమిషాలు మౌనంగా కూర్చుంది. కల్యాణీవాళ్ళింటి సందు చివరకి వచ్చేసింది ఆటో. మెల్లిగా గొంతు విప్పింది కల్యాణి. ఆ గొంతులో ఇంతకు ముందున్న తొట్రుపాటు కానీ ఉద్వేగం కానీ లేవు. “నువ్వు చెప్పింది నిజమే బావా. ఐతే ఒక మనిషికి బయటకి వెళ్ళి నలుగురితో కలిసి పనిచేస్తే కలిగే గుర్తింపు ఇంటిపని చూసుకుంటే రాదు. ఈలాంటి వ్యవస్థ ఇప్పుడేదో కొత్తగా వచ్చిపడింది కాదు. తరతరాలుగా ఉన్నదే. నువ్వన్న ఆ Dignity of Labourని సమాజం గుర్తించే వరకూ, నాలాటి ఆడవాళ్ళకి ఉద్యోగం చెయ్యడం తప్పదు. కాబట్టి మన దార్లు ఒకటి కాలేవు. Good Bye!” ఆటో ఇంటి ముందు ఆగింది. దిగి ఇంటిలోకి నడుచుకుంటూ వెళ్ళిపోయింది కల్యాణి. ఆటో శశాంక్ ఇంటిదారి పట్టింది.

ఎవరి గూళ్ళకు వారు చేరుకున్నారు కల్యాణీ, శశాంక్ – నిజమైన చిలకా గోరింకల్లాగా!